cricket world
-
శ్రీమతి అండ్ శ్రీవారిగా!
బాలీవుడ్ నటి దీపికా పదుకోన్‌కి వృత్తిపరంగా, వ్యక్తిగతంగా 2018 ది బెస్ట్ ఇయర్ అనొచ్చు. గతేడాది ‘పద్మావత్’తో సూపర్ హిట్ అందుకుని, కొన్నేళ్లుగా ప్రేమలో ఉన్న రణ్వీర్ సింగ్‌ను పెళ్లాడి కొత్త ఏడాదిని హ్యాపీగా ఆరంభించారు. అంతేకాదు గతేడాది ఫోర్బ్ మేగజీన్‌లో అత్యధికంగా సంపాదించే హీరోయిన్గా టాప్ 5లోను, ఐయండీబీ మోస్ట్ పాపులర్ స్టార్‌గా టాప్ చైర్లోను కూర్చున్నారు. 2019 కూడా బెస్ట్‌గా ఉండాలనుకుం టున్నారామె. ఈ ఏడాది నిర్మాతగా ఎంట్రీ ఇవ్వనున్నారు. జనవరి 5న దీపిక బర్త్‌డే. ఈ సందర్భంగా తన పేరు మీద ‘డబ్ల్యూడబ్ల్యూదీపికాపదుకోన్డాట్కామ్’ అనే వెబ్‌సైట్‌ను ఓపెన్ చేశారు. ప్రస్తుతం యాసిడ్ బాధితురాలు లక్ష్మీ జీవితం ఆధారంగా ‘చప్పక్’ అనే సినిమాలో నటిస్తున్నారు దీపిక. రణ్వీర్ సంకల్పం బలమైనది ‘రామ్‌లీల, భాజీరావ్ మస్తానీ’ సినిమాల్లో రణ్వీర్ సింగ్, దీపికాల కెమిస్ట్రీ గురించి ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. తాజాగా మరోసారి జంటగా స్క్రీన్ పంచుకోవాలనుందంటున్నారు ఆమె భర్త రణ్వీర్. ‘‘దీపికాతో కలసి యాక్ట్ చేయడాన్ని ఎంజాయ్ చేస్తాను. నటిగా తన సామర్థ్యాన్ని ఇంకా పూర్తి స్థాయిలో ఉపయోగించలేదనుకుంటున్నాను. దీపిక ఎమోషనల్‌గా ఇంకా బాగా నటించగలదు. మేమిద్దరం మళ్లీ ఎప్పుడు సినిమా చేస్తామో అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నా’’ అని పేర్కొన్నారాయన. రణ్వీర్ అలా సంకల్పించుకున్నారో లేదో దర్శకుడు కబీర్ ఖాన్ తథాస్తు అన్నారని బాలీవుడ్ మీడియా టాక్. ప్రస్తుతం1983 క్రికెట్ ప్రపంచ కప్ ఆధారంగా కబీర్ ఖాన్ ‘83’ పేరుతో ఓ చిత్రాన్ని రూపొందించనున్న సంగతి తెలిసిందే. ఇందులో కపిల్ దేవ్ పాత్రను రణ్వీర్ సింగ్ పోషించనున్నారు. కపిల్ భార్య రోమీ భాటియా పాత్ర కోసం దీపికను సంప్రదించినట్టు సమాచారం. ఇండియా ఓడిపోతుందని భావించి రోమీ భాటియా స్టేడియంను విడిచి బయటకు వెళ్లిపోవడం, మళ్లీ తిరిగొచ్చే సమయానికి ఇండియా గెలిచే స్టేజ్‌లో ఉండటం వంటి సన్నివేశాలు ఈ చిత్రంలో హైలైట్‌గా ఉండబోతాయట. చిన్న పాత్ర అయినప్పటికీ ఎమోషనల్‌గా ఉంటుంది కాబట్టి దీపిక అయితే బావుంటుందని టీమ్ భావించిందట. -
'క్రికెట్ వరల్డ్ పాక్ కు అండగా నిలవాలి'
కరాచీ: క్రికెట్ ప్రపంచం పాకిస్థాన్ కు అండగా నిలవాల్సిన అవసరముందని పాక్ క్రికెట్ టెస్టు కెప్టెన్ మిస్బా-వుల్-హక్ అన్నాడు. జింబాబ్వే జట్టుతో తాము ఆడిన సిరీస్ విజయవంతంగా ముగిసిందన్నారు. ఈ సిరీస్ ద్వారా మిగతా క్రికెట్ ప్రపంచానికి గట్టి సందేశం వెళ్లిందన్నాడు. ఈ నేపథ్యంలో పాకిస్థాన్ లో అంతర్జాతీయ మ్యాచ్ లు నిర్వహించేందుకు క్రికెట్ వరల్డ్ ముందుకు రావాలని విజ్ఞప్తి చేశాడు. బయటి పరిణామాల గురించి పట్టించుకోకుండా అభిమానులు క్రికెట్ ను మునుపటిలా ఆదరించడం తనను ఆశ్చర్యానికి గురిచేసిందని మిస్బా పేర్కొన్నాడు. ఆరేళ్ల తర్వాత పాకిస్థాన్ లో ఇంటర్నేషనల్ క్రికెట్ మ్యాచ్ లు నిర్వహించారు. పాక్, జింబాబ్వే జట్లు ఒక టెస్టు, రెండు వన్డే మ్యాచ్ లు ఆడాయి. మూడే వన్డే వర్షం కారణంగా రద్దయింది. -
దిగ్భ్రాంతి... విషాదం...
హ్యూస్ మృతికి సంతాపాల వెల్లువ అడిలైడ్ / న్యూఢిల్లీ: ఆస్ట్రేలియా ఆటగాడు ఫిలిప్ హ్యూస్ మృతితో ప్రపంచ క్రీడా ప్రేమికులతో పాటు క్రికెట్ ప్రపంచం ఒక్కసారిగా షాక్‌కు గురైంది. ఎంతో భవిష్యత్ ఉన్న ఆటగాడిగా పేరు తెచ్చుకుంటున్న క్రమంలో పాతికేళ్ల వయస్సులోనే అనూహ్య పరిస్థితిలో ప్రాణాలు వదిలిన హ్యూస్‌పై విశ్వవ్యాప్తంగా సానుభూతి వ్యక్తమైంది. ఇది క్రికెట్‌కే దారుణమైన రోజుగా పలువురు అభివర్ణించారు. కొందరు తమ ఆవేదనను ట్విట్టర్, ఫేస్‌బుక్‌లలో పంచుకున్నారు. ఆస్ట్రేలియా ప్రధాని టోనీ ఎబాట్, ఐసీసీ, క్రికెట్ ఆస్ట్రేలియా, బీసీసీఐలతో పాటు ఇతర బోర్డులు, బ్యాటింగ్ దిగ్గజం సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లి, భారత్, ఆసీస్ ఆటగాళ్లు, ఇతర జట్ల ఆటగాళ్లు, మాజీ ఆటగాళ్లు, బాలీవుడ్ నటులు ఇలా ప్రతీ ఒక్కరు తమ సంతాపాన్ని వ్యక్తం చేశారు. మరోవైపు తమ ఆటగాడి మృతికి నివాళి ఘటిస్తూ ప్రఖ్యాత సిడ్నీ క్రికెట్ మైదానంలో ఆసీస్ జాతీయ పతాకాన్ని అవనతం చేశారు. ‘ఫిలిప్ మరణంతో మేమంతా షాక్‌కు గురయ్యాం. మొత్తం క్రికెట్ ప్రపంచం తరఫున అతడి కుటుంబం, స్నేహితులకు నా ప్రగాఢ సానుభూతిని తెలుపుతున్నాను’ - ఐసీసీ చైర్మన్ ఎన్.శ్రీనివాసన్ ‘మరో రెండు రోజుల్లో పుట్టిన రోజును జరుపుకోవాల్సిన హ్యూస్ మృతి ఆవేదన కలిగించింది. క్రికెట్ సమాజంలో చెరగని ముద్ర వేస్తూ వెళ్లిపోయిన అతడి కుటుంబానికి మా సానుభూతి’ - బీసీసీఐ కార్యదర్శి సంజయ్ పటేల్ ‘ఫిలిప్ మరణ వార్త విని షాకయ్యాను. క్రికెట్‌కు ఇది విచారకరమైన రోజు. అతడి కుటుంబం, స్నేహితులు, శ్రేయోభిలాషులకు నా సంతాపం తెలుపుతున్నాను’ - సచిన్ టెండూల్కర్ ‘తొలి టెస్టును రద్దు చేస్తే బావుంటుంది’ ‘హ్యూస్ మరణంతో భారత్, ఆస్ట్రేలియా ఆటగాళ్లు ఆటపై వంద శాతం మనస్సును పెట్టలేరనేది నా అభిప్రాయం. ఇది నిజంగా చాలా కష్టకాలం. ఇరు జట్ల మధ్య తొలి టెస్టుకు కేవలం వారం రోజుల సమయం ఉంది. అయితే ఎవరూ కూడా ఇప్పుడు ఆడే స్థితిలో లేరనిపిస్తోంది. అందుకే ఈ మ్యాచ్‌ను రద్దు చేయాలా? లేదా? అనే విషయాన్ని ఇరు బోర్డులు ఓసారి పరిశీలించాల్సి ఉంది’ - సునీల్ గవాస్కర్ ‘క్రీడలో విషాదం అనే మాట తరచుగా వాడుతున్నా ఇది మాత్రం నిజ జీవిత విషాదం. క్రికెట్ ఆస్ట్రేలియాకు ఇది ఊహించని దెబ్బ. అతడి తల్లిదండ్రులు, తోబుట్టువులకు మా మద్దతు ఎల్లవేళలా ఉంటుంది’ - సీఏ సీఈవో జేమ్స్ సదర్లాండ్ -
ఆ ఇద్దరి తప్పేమీ లేదు
జడేజా, అండర్సన్ నిర్దోషులే తేల్చిన జ్యుడీషియల్ కమిషనర్ సౌతాంప్టన్: ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజాపై మ్యాచ్ ఫీజులో 50 శాతం కోత... ఇక ఇంగ్లండ్ పేసర్ జేమ్స్ అండర్సన్‌పై రెండు టెస్టుల వేటు ఖాయమని... ఈ ఇద్దరు ఆటగాళ్ల మధ్య జరిగిన గొడవపై ఇప్పటిదాకా క్రికెట్ ప్రపంచం ఊహించింది. అయితే తొలి టెస్టులో జరిగిన ఈ ఘటనపై విచారణ కోసం ఏర్పడిన జ్యుడీషియల్ కమిషనర్ గార్డన్ లూయిస్ ఈ వివాదంలో ఇద్దరూ నిర్దోషులే అని తేల్చారు. ఈ విషయాన్ని ఐసీసీ ఓ ప్రకటనలో తెలిపింది. జడేజా, అండర్సన్ క్రమశిక్షణ చర్యలు ఉల్లంఘించలేదని కమిషనర్ పేర్కొన్నట్టు స్పష్టం చేసింది. దీంతో జడేజాపై విధించిన మ్యాచ్ ఫీజులో 50 శాతం కోత కూడా ఉపసంహరించుకున్నట్టయ్యింది. శుక్రవారం ఆరు గంటల పాటు ధోని బృందం బస చేసిన గ్రాండ్ హార్బర్ హోటళ్లో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ విచారణ జరిగింది. కెప్టెన్ ధోని, కోచ్ ఫ్లెచర్, జడేజా, గంభీర్ (సాక్షి) పాల్గొన్నారు. అటు అండర్సన్ తరఫున సాక్షులుగా ప్రయర్, బ్రాడ్ హాజరయ్యారు. అలాగే ఈసీబీ టీమ్ మేనేజర్ పాల్ డౌన్టన్, బీసీసీఐ తరఫున సుందర్ రామన్, ఎంవీ శ్రీధర్ హాజరయ్యారు. భారత వన్డే జట్టు ఎంపిక 7న ముంబై: ఇంగ్లండ్‌తో ఐదు మ్యాచ్‌ల వన్డే సిరీస్ కోసం భారత జట్టును ఎంపిక చేసేందుకు సందీప్ పాటిల్ నేతృత్వంలోని సెలక్టర్లు 7న సమావేశం కానున్నారు. ఐదు టెస్టుల సిరీస్ ముగిసిన తరువాత భారత్, ఇంగ్లండ్‌లు వన్డే సిరీస్‌తోపాటు ఏకైక టి20 మ్యాచ్ కూడా ఆడనున్నాయి. -
ఐసీసీ C/oబీసీసీఐ
దుబాయ్: క్రికెట్ ప్రపంచం అంతా ఆసక్తిగా ఎదురుచూసిన ఐసీసీ ఎగ్జిక్యూటివ్ కమిటీ సమావేశం బుధవారం ముగిసింది. భారత్, ఇంగ్లండ్, ఆస్ట్రేలియా కలిసి ప్రతిపాదించిన కొత్త విధానాలను సమావేశం ఏకగ్రీవంగా ఆమోదించిందని ఐసీసీ ప్రకటించింది. అయితే వీటిని పూర్తి స్థాయిలో అమలు చేయడానికి మరో నెల రోజులు సమయం పడుతుంది. కానీ ఐసీసీ ప్రకటనను దక్షిణాఫ్రికా, పాకిస్థాన్ బోర్డులు ఖండించాయి. సమావేశంలో కొత్త ప్రతిపాదనలపై వాదన జరిగిందని, వాటికి పూర్తిగా ఆమోదం లభించలేదని ఈ బోర్డులు అంటున్నాయి. గది లోపల ఏం చర్చ జరిగిందనేది ప్రపంచానికి పూర్తిగా తెలియదు. కానీ ఐసీసీ అడ్రస్ ఇక నుంచి బీసీసీఐ అని మాత్రం ప్రపంచానికి స్పష్టమైంది. ఇన్నాళ్లూ ఐసీసీలో ఏ నిర్ణయం తీసుకున్నా... దాని వెనక బీసీసీఐ ఉందనేది వాస్తవం. ఇకపై బీసీసీఐ నేరుగా తమ అభిప్రాయాన్నే ఐసీసీ అభిప్రాయంగా చెప్పొచ్చు. ఇకపై క్రికెట్ పాలన కేవలం మూడు దేశాల చేతుల్లోనే ఉంటుంది. భారత్, ఇంగ్లండ్, ఆస్ట్రేలియాలకు చెందిన వ్యక్తులు మాత్రమే అత్యున్నత పదవి ‘ఐసీసీ చైర్మన్’ను అలంకరిస్తారు. ఆదాయంలోనూ అగ్రతాంబూలం భారత్‌కే. ఆటగాళ్లు ఒప్పుకోవడం లేదు ఈ మూడు దేశాలకు వెస్టిండీస్, న్యూజిలాండ్ బహిరంగంగా మద్దతు తెలిపాయి. జింబాబ్వే ఏ ప్రకటన చేయకపోయినా... భారత్‌తో శత్రుత్వం కోరుకోవడం లేదని స్పష్టం చేసింది. అయితే ఈ ప్రతిపాదనల వల్ల అందరికంటే ఎక్కువగా నష్టపోతామని భావిస్తున్న దేశాలు దక్షిణాఫ్రికా, పాకిస్థాన్. ఈ రెండు దేశాల బోర్డుల పెద్దలు శ్రీలంక, బంగ్లాదేశ్ బోర్డులను కూడా తమవైపు తిప్పుకునే ప్రయత్నం చేశాయి. ప్రస్తుతం ఐసీసీ వైస్ ప్రెసిడెంట్ పదవిలో ఉన్న బంగ్లాదేశ్ వీళ్లకు బహిరంగంగా మద్దతు ఇచ్చింది. కానీ బుధవారం సాయంత్రానికి బీసీసీఐకి మద్దతు తెలిపింది. అయితే శ్రీలంక మాత్రం ఆచితూచి వ్యవహరిస్తోంది. నెల రోజుల సమయం ఈ ప్రతిపాదనల్ని ఆయా దేశాలు తమ బోర్డు సమావేశాల్లో చర్చించుకోవడానికి నెల రోజులు సమయం ఇచ్చారు. ఆ తర్వాత మళ్లీ ఐసీసీ ఎగ్జిక్యూటివ్ కమిటీ సమావేశం జరుగుతుంది. ఒకవేళ అప్పుడు ఓటింగ్ జరగాల్సి వస్తే... కొత్త ప్రతిపాదనల ఆమోదం కోసం ఎనిమిది ఓట్లు కావాలి. ఇప్పుడు ఏడు ఓట్లు ఉన్నాయి. కాబట్టి ఈ నెల రోజుల్లో తటస్థంగా ఉన్న శ్రీలంక లాంటి బోర్డును ఒప్పించుకుంటే సరిపోతుంది. మామూలు మార్పులకు ఏడు ఓట్లు సరిపోతాయి. ఇప్పుడు ఏడు ఉన్నాయి. కానీ ఐసీసీ రాజ్యాంగ సవరణ జరగాలంటే ఎనిమిది ఓట్లు కావాలి. ‘త్రయం’ తాయిలాలు తమతో కలిసి వచ్చే దేశాలతో క్రికెట్ ఆడతారు. కాదంటే వాళ్లతో అసలు క్రికెట్ ఆడరు. ‘టెస్టు మ్యాచ్ నిధి’లో అందరికీ సమానంగా భాగం ఇస్తారు. అగ్రస్థానంలో ఉన్న జట్టుకు ఎక్కువ డబ్బు ఇవ్వాలని దక్షిణాఫ్రికా చేసిన డిమాండ్‌ను అంగీకరించరు. దీనివల్ల వెస్టిండీస్, న్యూజిలాండ్ దేశాలు సంతోషిస్తున్నాయి. ఒప్పుకోకపోతే..? ఐసీసీ సమావేశాలకు ముందు ఈ త్రయం పరోక్షంగా అందరికీ హెచ్చరిక జారీచేసింది. ఒకవేళ మిగిలిన దేశాలన్నీ ఒక్కతాటిపైకి వచ్చి కొత్త ప్రతిపాదనలు తిరస్కరిస్తే... కేవలం భారత్, ఇంగ్లండ్, ఆస్ట్రేలియా కలిసి క్రికెట్ ఆడతామనే సందేశాన్ని పంపాయి. క్రికెట్లో 90 శాతం ఆదాయం వచ్చే ఈ మూడు దేశాలు లేకపోతే... అసలు క్రికెట్ ఉండదు. కాబట్టి మిగిలిన వాళ్లు కాదనలేని పరిస్థితి. భారత్ 3 కొత్త ప్రతిపాదనలు తెచ్చింది. ఆస్ట్రేలియా, ఇంగ్లండ్‌లనూ కలుపుకుంది. ఐసీసీలో అధిక ఆధిపత్యం భారత్‌దే. ఆస్ట్రేలియా 3 భారత్ ప్రతిపాదనలను అంగీకరించేలా న్యూజిలాండ్‌ను ఒప్పించింది. తాను కూడా ఆమోదం తెలిపింది. ఇంగ్లండ్3 భారత్, ఆస్ట్రేలియాలను కాదని ఏమీ చేయలేదు. తనకూ పెత్తనం ఉంటుందని భావించింది. వెస్టిండీస్3 భారత్, ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ లేకపోతే తమ దగ్గర క్రికెట్ లేదని తెలుసు. కాబట్టి ఒప్పుకుంది. న్యూజిలాండ్3 ఇప్పటికే ఆదాయం అంతంత మాత్రంగా ఉంది. ఇక ఈ మూడు దేశాలనూ కాదనలేని పరిస్థితి. జింబాబ్వే 3 బీసీసీఐ దయ లేకపోతే తమ దేశంలో క్రికెట్‌కు మనుగడ ఉండదని భావించింది. శ్రీలంక (?) భారత్‌తో సంబంధాలు కావాలి. అదే సమయంలో తమ ప్రతిష్ట దెబ్బతింటుం దనే భయం. ప్రస్తుతానికి తటస్థం. దక్షిణాఫ్రికా 6 ఎక్కువ నష్టం తమకే అని భావిస్తోంది. ఎలాగైనా ఈ ప్రతిపాదనలను ఆపాలంటూ లాబీయింగ్ చేస్తోంది. పాకిస్థాన్ 6 భారత్‌ను పూర్తిగా వ్యతిరేకిస్తోంది. కానీ బలం సరిపోవడం లేదు. మొదటికే మోసం వస్తుందనే భయమూ ఉంది. -
సచిన్ 199వ టెస్టుకు రంగం సిద్ధం
-
సచిన్ 199వ టెస్టుకు రంగం సిద్ధం
రెండు మ్యాచ్‌లు... నాలుగు ఇన్నింగ్స్... 24 ఏళ్ల కెరీర్‌కు ముగింపు పలికేందుకు క్రికెట్ ‘దేవుడు’ వేయనున్న ఈ రెండు అడుగుల కోసం ప్రపంచం యావత్తూ ఆసక్తిగా ఎదురుచూస్తోంది. ఒకటా, రెండా, వందల కొద్ది మ్యాచ్‌లు ఆడినా... ఒంటిచేత్తో గెలిపించినా... ఎన్నడూ లేని ఉత్కంఠ ప్రస్తుతం రాజ్యమేలుతోంది. కోట్లాది మంది అభిమానులతో పాటు... ప్రపంచ క్రీడాలోకం మొత్తం ఓ దిగ్గజ ఆటగాడి ఆటలో చివరి అంకాన్ని తిలకించేందుకు సిద్ధమయింది. కోల్‌కతా: ఏ గల్లీ చూసినా ఒకటే మాట... ఏ వీధిలోకెళ్లినా ఒకటే బొమ్మ... ఎవర్ని పలకరించినా ఒకటే పేరు... ఒక్క ఈడెన్‌లోనే కాదు... కోల్‌కతా మొత్తం భారీ కటౌట్లు... దుర్గామాత పూజకు సమయం కాకపోయినా... దీపావళి టపాసుల చప్పుళ్లు ఆగిపోయినా....నగరం నలుమూలలా ఒకటే సందడి. ప్రస్తుతం నగరం అంతా ‘సచిన్’ నామ స్మరణతో మారుమోగుతోంది. ఇక్కడి అభిమానులకు ఆట సెకండరీగా మారింది. మరో వైపు క్రికెట్ ప్రపంచం మొత్తం ఈ నగరంపైనే దృష్టిసారించింది. ఇంత ఆసక్తికర క్షణాలు రానే వచ్చాయి. క్రికెట్‌ను తన అడ్రసుగా మార్చుకున్న మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ 199వ టెస్టుకు రంగం సిద్ధమైంది. రెండు టెస్టుల సిరీస్‌లో భాగంగా నేటి (బుధవారం) నుంచి విండీస్‌తో జరగబోయే తొలి టెస్టులో భారత్ అమీతుమీ తేల్చుకోనుంది. మ్యాచ్ కంటే సచిన్ వీడ్కోలు ప్రధానం కావడంతో అటూ నిర్వాహకులు.. ఇటూ అభిమానులు భావోద్వేగ స్థితిలో ఉన్నారు. సచిన్‌కు ఆఖరి సిరీస్ కావడంతో దీని క్రేజ్ కూడా అమాంతం పెరిగిపోయింది. ఫేవరెట్ భారత్ సచిన్ ఫేర్‌వెల్‌ను పక్కనబెడితే ఈ సిరీస్‌లో భారత్ ఫేవరెట్‌గా బరిలోకి దిగుతోంది. సీనియర్ ఆటగాడికి ఘనమైన వీడ్కోలు ఇచ్చేందుకు యువ ఆటగాళ్లు ఉవ్విళ్లూరుతున్నారు. త్వరలో జరగబోయే దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా పర్యటనలకు ముందు ఈ సిరీస్ యువ క్రికెటర్లందరికీ కీలకం. తన ఆఖరి రంజీ మ్యాచ్‌లో ముంబైకి విజయాన్ని అందించిన సచిన్ మరో భారీ ఇన్నింగ్స్‌పైనే దృష్టిపెట్టాడు. అది వాస్తవరూపం దాల్చితే భారత్‌కు ఎలాంటి సమస్య ఉండదు. మరో 163 పరుగులు చేస్తే టెస్టుల్లో 16వేల పరుగులు పూర్తి చేసుకుంటాడు. కెప్టెన్, ధోని, విరాట్ కోహ్లి సూపర్ ఫామ్‌లో ఉండటం కలిసొచ్చే అంశం. శిఖర్ ధావన్‌తో పాటు ఓపెనర్‌గా రోహిత్ శర్మ బరిలోకి దిగుతాడా..? లేక రోహిత్ మిడిలార్డర్‌కు వెళతాడా? అనేది పెద్ద ప్రశ్న. అయితే ఈ మ్యాచ్ ద్వారా వన్డే డబుల్ సెంచరీ హీరో టెస్టుల్లో అరంగేట్రం చేయడం దాదాపుగా ఖాయమే. ఒకవేళ రోహిత్ మిడిలార్డర్‌కు వెళితే విజయ్‌కు ఓపెనర్‌గా అవకాశం రావచ్చు. ఇక ఫస్ట్‌డౌన్‌లో పుజారా ఇన్నింగ్స్‌కు వెన్నుముకగా నిలబడగల సమర్ధుడు. బ్యాటింగ్‌తో పోలిస్తే బౌలింగ్ మాత్రం బలహీనంగా కనబడుతోంది.భువనేశ్వర్‌కు జతగా బరిలోకి దిగే పేసర్ ఎవరనేది పెద్ద చర్చ. వన్డేల్లో ఘోరంగా విఫలమైన ఇషాంత్‌కు అవకాశం ఇస్తారా..? లేక తిరిగి జట్టులోకి వచ్చిన ఉమేశ్‌ను తీసుకుంటారా? అనేది చూడాలి. ఇక ఇద్దరు స్పిన్నర్లుగా అశ్విన్, ఓజా తుది జట్టులో ఉండటం ఖాయమే. ఐదుగురు బౌలర్లు కావాలనుకున్నా... లేక ముగ్గురు స్పిన్నర్లు అవసరమనుకున్నా అమిత్ మిశ్రాకు అవకాశం దొరకొచ్చు. పేస్ బౌలింగే ఆయుధం మరోవైపు హేమాహేమీలు బరిలో లేకపోయినా... సచిన్ చివరి సిరీస్ పార్టీని పాడు చేయాలని విండీస్ ప్రణాళికలు సిద్ధం చేసుకుంటోంది. పేస్ బౌలింగ్‌తోనే భారత్‌ను దెబ్బకొట్టాలని భావిస్తోంది. రోచ్, బెస్ట్, కొట్రెల్ ప్రాక్టీస్ మ్యాచ్‌లో సత్తా చాటకపోయినా తనదైన రోజు ఒంటిచేత్తో మ్యాచ్‌ను మలుపుతిప్పగల సమర్థులు. వీళ్లకు తోడు స్యామీ తన వంతు పాత్రను సమర్థంగా పోషించేందుకు సిద్ధమవుతున్నాడు. మిస్టరీ స్పిన్నర్ నరైన్ లోటును భర్తీ చేసేందుకు షిల్లాంగ్‌ఫోర్డ్, పెరుమాల్ ప్రయత్నాలు మొదలుపెట్టారు. వికెట్ మీద టర్న్ ఉంటే వీళ్లు కాస్త ప్రభావం చూపించొచ్చు. విండీస్ మ్యాచ్‌లో నిలవాలంటే ధావన్, కోహ్లి, రోహిత్‌లను నిలువరించాలి. ఇక బ్యాటింగ్‌లో చందర్‌పాల్ క్రీజులో నిలదొక్కుకుంటే భారత బౌలర్లకు కష్టాలు తప్పవు. ఎడ్వర్డ్స్, దేవ్‌నారాయణ్, గేల్, శామ్యూల్స్ బ్యాట్లు ఝుళిపిస్తే పరుగుల వరద ఖాయం. 2011లో 0-2తో సిరీస్ కోల్పోయిన స్యామీసేన ఈసారైనా పరువు నిలుపుకోవాలని తీవ్రంగా కృషి చేస్తోంది. గౌరవంగా భావిస్తున్నాం: స్యామీ సచిన్ ఆఖరి సిరీస్‌లో భాగం కావడాన్ని గొప్ప గౌరవంగా భావిస్తున్నామని వెస్టిండీస్ కెప్టెన్ స్యామీ అన్నాడు. అయితే మొత్తం భారత జట్టుపై తాము దృష్టిపెట్టామన్నాడు. మాస్టర్ వీడ్కోలు హంగామాను పాడు చేసేందుకు ప్రయత్నిస్తామన్నాడు. ‘మా వరకైతే దాన్ని సమర్థంగా అడ్డుకోవాలి. క్రికెట్ ఆడేందుకే వచ్చాం. మీడియాలో, ప్రత్యర్థి డ్రెస్సింగ్ రూమ్‌లో ఏం జరుగుతుందో మాకు అవసరం లేదు. క్రికెట్‌కు సచిన్ ఏం చేశాడో ప్రపంచం మొత్తానికి తెలుసు’ అని స్యామీ వ్యాఖ్యానించాడు. 138 సచిన్ మరో 138 పరుగులు చేస్తే ఈడెన్‌లో 1000 పరుగులు పూర్తవుతాయి. ఈ వేదికపై వెయ్యి చేసిన ఒకే ఒక్క క్రికెటర్ లక్ష్మణ్ (1217 పరుగులు). కెరీర్లో సచిన్ ఏ ఒక్క వేదికలోనూ వెయ్యి పరుగులు చేయలేదు. -
మా కుక్కపిల్ల బోల్ట్‌లా పరుగెడుతుంది!
న్యూఢిల్లీ: క్రికెట్ ప్రపంచంలోని వేగవంతమైన బౌలర్లలో ఒకడిగా బ్రెట్ లీకి ప్రత్యేక గుర్తింపు ఉంది. అలాంటి ఫాస్ట్ బౌలర్‌ను కూడా ఒక చిన్నజీవి పరుగులు పెట్టిస్తుంది. అదెవరో కాదు...లీ ముద్దుగా పెంచుకుంటున్న కుక్క పిల్ల! ఇంకా చెప్పాలంటే ‘గింగర్’ అనే పేరు గల ఆ కుక్క పిల్ల ప్రపంచ చాంపియన్ ఉసేన్ బోల్ట్‌తో సమానంగా పరుగెత్తుతుందని కూడా బ్రెట్‌లీ చెబుతున్నాడు. శునకాహారం ‘పెడిగ్రీ సీనియర్’ను మార్కెట్లోకి విడుదల చేసిన సందర్భంగా లీ ఈ వ్యాఖ్య చేశాడు. ‘ఆ పప్పీ అంటే మా అబ్బాయికి చాలా ఇష్టం. ఆరు నెలల కుక్క పిల్ల మీ ఇల్లంతా పరుగెడుతుంటే ఉంటే సందడే వేరు. ఇది ఉసేన్ బోల్ట్ అంత వేగంగా పరుగెత్తుతోంది. నా వద్ద కుందేళ్లు, గినియా పందులు, అనేక రకాల పక్షులు కూడా చాలా ఉన్నాయి’ అని లీ వెల్లడించాడు.