రెండు మ్యాచ్‌లు... నాలుగు ఇన్నింగ్స్... 24 ఏళ్ల కెరీర్‌కు ముగింపు పలికేందుకు క్రికెట్ ‘దేవుడు’ వేయనున్న ఈ రెండు అడుగుల కోసం ప్రపంచం యావత్తూ ఆసక్తిగా ఎదురుచూస్తోంది. ఒకటా, రెండా, వందల కొద్ది మ్యాచ్‌లు ఆడినా... ఒంటిచేత్తో గెలిపించినా... ఎన్నడూ లేని ఉత్కంఠ ప్రస్తుతం రాజ్యమేలుతోంది. కోట్లాది మంది అభిమానులతో పాటు... ప్రపంచ క్రీడాలోకం మొత్తం ఓ దిగ్గజ ఆటగాడి ఆటలో చివరి అంకాన్ని తిలకించేందుకు సిద్ధమయింది. కోల్‌కతా: ఏ గల్లీ చూసినా ఒకటే మాట... ఏ వీధిలోకెళ్లినా ఒకటే బొమ్మ... ఎవర్ని పలకరించినా ఒకటే పేరు... ఒక్క ఈడెన్‌లోనే కాదు... కోల్‌కతా మొత్తం భారీ కటౌట్లు... దుర్గామాత పూజకు సమయం కాకపోయినా... దీపావళి టపాసుల చప్పుళ్లు ఆగిపోయినా....నగరం నలుమూలలా ఒకటే సందడి. ప్రస్తుతం నగరం అంతా ‘సచిన్’ నామ స్మరణతో మారుమోగుతోంది. ఇక్కడి అభిమానులకు ఆట సెకండరీగా మారింది. మరో వైపు క్రికెట్ ప్రపంచం మొత్తం ఈ నగరంపైనే దృష్టిసారించింది. ఇంత ఆసక్తికర క్షణాలు రానే వచ్చాయి. క్రికెట్‌ను తన అడ్రసుగా మార్చుకున్న మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ 199వ టెస్టుకు రంగం సిద్ధమైంది. రెండు టెస్టుల సిరీస్‌లో భాగంగా నేటి (బుధవారం) నుంచి విండీస్‌తో జరగబోయే తొలి టెస్టులో భారత్ అమీతుమీ తేల్చుకోనుంది. మ్యాచ్ కంటే సచిన్ వీడ్కోలు ప్రధానం కావడంతో అటూ నిర్వాహకులు.. ఇటూ అభిమానులు భావోద్వేగ స్థితిలో ఉన్నారు. సచిన్‌కు ఆఖరి సిరీస్ కావడంతో దీని క్రేజ్ కూడా అమాంతం పెరిగిపోయింది. ఫేవరెట్ భారత్ సచిన్ ఫేర్‌వెల్‌ను పక్కనబెడితే ఈ సిరీస్‌లో భారత్ ఫేవరెట్‌గా బరిలోకి దిగుతోంది. సీనియర్ ఆటగాడికి ఘనమైన వీడ్కోలు ఇచ్చేందుకు యువ ఆటగాళ్లు ఉవ్విళ్లూరుతున్నారు. త్వరలో జరగబోయే దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా పర్యటనలకు ముందు ఈ సిరీస్ యువ క్రికెటర్లందరికీ కీలకం. తన ఆఖరి రంజీ మ్యాచ్‌లో ముంబైకి విజయాన్ని అందించిన సచిన్ మరో భారీ ఇన్నింగ్స్‌పైనే దృష్టిపెట్టాడు. అది వాస్తవరూపం దాల్చితే భారత్‌కు ఎలాంటి సమస్య ఉండదు. మరో 163 పరుగులు చేస్తే టెస్టుల్లో 16వేల పరుగులు పూర్తి చేసుకుంటాడు. కెప్టెన్, ధోని, విరాట్ కోహ్లి సూపర్ ఫామ్‌లో ఉండటం కలిసొచ్చే అంశం. శిఖర్ ధావన్‌తో పాటు ఓపెనర్‌గా రోహిత్ శర్మ బరిలోకి దిగుతాడా..? లేక రోహిత్ మిడిలార్డర్‌కు వెళతాడా? అనేది పెద్ద ప్రశ్న. అయితే ఈ మ్యాచ్ ద్వారా వన్డే డబుల్ సెంచరీ హీరో టెస్టుల్లో అరంగేట్రం చేయడం దాదాపుగా ఖాయమే. ఒకవేళ రోహిత్ మిడిలార్డర్‌కు వెళితే విజయ్‌కు ఓపెనర్‌గా అవకాశం రావచ్చు. ఇక ఫస్ట్‌డౌన్‌లో పుజారా ఇన్నింగ్స్‌కు వెన్నుముకగా నిలబడగల సమర్ధుడు. బ్యాటింగ్‌తో పోలిస్తే బౌలింగ్ మాత్రం బలహీనంగా కనబడుతోంది.భువనేశ్వర్‌కు జతగా బరిలోకి దిగే పేసర్ ఎవరనేది పెద్ద చర్చ. వన్డేల్లో ఘోరంగా విఫలమైన ఇషాంత్‌కు అవకాశం ఇస్తారా..? లేక తిరిగి జట్టులోకి వచ్చిన ఉమేశ్‌ను తీసుకుంటారా? అనేది చూడాలి. ఇక ఇద్దరు స్పిన్నర్లుగా అశ్విన్, ఓజా తుది జట్టులో ఉండటం ఖాయమే. ఐదుగురు బౌలర్లు కావాలనుకున్నా... లేక ముగ్గురు స్పిన్నర్లు అవసరమనుకున్నా అమిత్ మిశ్రాకు అవకాశం దొరకొచ్చు. పేస్ బౌలింగే ఆయుధం మరోవైపు హేమాహేమీలు బరిలో లేకపోయినా... సచిన్ చివరి సిరీస్ పార్టీని పాడు చేయాలని విండీస్ ప్రణాళికలు సిద్ధం చేసుకుంటోంది. పేస్ బౌలింగ్‌తోనే భారత్‌ను దెబ్బకొట్టాలని భావిస్తోంది. రోచ్, బెస్ట్, కొట్రెల్ ప్రాక్టీస్ మ్యాచ్‌లో సత్తా చాటకపోయినా తనదైన రోజు ఒంటిచేత్తో మ్యాచ్‌ను మలుపుతిప్పగల సమర్థులు. వీళ్లకు తోడు స్యామీ తన వంతు పాత్రను సమర్థంగా పోషించేందుకు సిద్ధమవుతున్నాడు. మిస్టరీ స్పిన్నర్ నరైన్ లోటును భర్తీ చేసేందుకు షిల్లాంగ్‌ఫోర్డ్, పెరుమాల్ ప్రయత్నాలు మొదలుపెట్టారు. వికెట్ మీద టర్న్ ఉంటే వీళ్లు కాస్త ప్రభావం చూపించొచ్చు. విండీస్ మ్యాచ్‌లో నిలవాలంటే ధావన్, కోహ్లి, రోహిత్‌లను నిలువరించాలి. ఇక బ్యాటింగ్‌లో చందర్‌పాల్ క్రీజులో నిలదొక్కుకుంటే భారత బౌలర్లకు కష్టాలు తప్పవు. ఎడ్వర్డ్స్, దేవ్‌నారాయణ్, గేల్, శామ్యూల్స్ బ్యాట్లు ఝుళిపిస్తే పరుగుల వరద ఖాయం. 2011లో 0-2తో సిరీస్ కోల్పోయిన స్యామీసేన ఈసారైనా పరువు నిలుపుకోవాలని తీవ్రంగా కృషి చేస్తోంది. గౌరవంగా భావిస్తున్నాం: స్యామీ సచిన్ ఆఖరి సిరీస్‌లో భాగం కావడాన్ని గొప్ప గౌరవంగా భావిస్తున్నామని వెస్టిండీస్ కెప్టెన్ స్యామీ అన్నాడు. అయితే మొత్తం భారత జట్టుపై తాము దృష్టిపెట్టామన్నాడు. మాస్టర్ వీడ్కోలు హంగామాను పాడు చేసేందుకు ప్రయత్నిస్తామన్నాడు. ‘మా వరకైతే దాన్ని సమర్థంగా అడ్డుకోవాలి. క్రికెట్ ఆడేందుకే వచ్చాం. మీడియాలో, ప్రత్యర్థి డ్రెస్సింగ్ రూమ్‌లో ఏం జరుగుతుందో మాకు అవసరం లేదు. క్రికెట్‌కు సచిన్ ఏం చేశాడో ప్రపంచం మొత్తానికి తెలుసు’ అని స్యామీ వ్యాఖ్యానించాడు. 138 సచిన్ మరో 138 పరుగులు చేస్తే ఈడెన్‌లో 1000 పరుగులు పూర్తవుతాయి. ఈ వేదికపై వెయ్యి చేసిన ఒకే ఒక్క క్రికెటర్ లక్ష్మణ్ (1217 పరుగులు). కెరీర్‌లో సచిన్ ఏ ఒక్క వేదికలోనూ వెయ్యి పరుగులు చేయలేదు.
Published Wed, Nov 6 2013 8:12 AM | Last Updated on Thu, Mar 21 2024 6:35 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement