
అంత్యక్రియలు 3న
సిడ్నీ: రాకాసి బౌన్సర్‌కు తీవ్రంగా గాయపడి మృతి చెందిన క్రికెటర్ ఫిలిప్ హ్యూస్ అంత్యక్రియలు బుధవారం (డిసెంబర్ 3న) జరగనున్నాయి. ఈ మేరకు నార్తర్న్ న్యూసౌత్ వేల్స్‌లోని తమ సొంతూరు మాక్స్‌విలేలో ఏర్పాట్లు చేస్తున్నామని కుటుంబ సభ్యులు తెలిపారు. ఫిల్ చదువుకున్న పాఠశాలలోని స్పోర్ట్స్ హాల్‌లో మధ్యాహ్నం 2 గంటలకు క్రికెటర్‌కు అంతిమ సంస్కారాలను నిర్వహించనున్నారు.
ఈ కార్యక్రమాన్ని చానెల్ నైన్‌తో పాటు ఇతర టీవీ, రేడియో ప్రసార సంస్థలు ప్రత్యక్ష ప్రసారం చేయనున్నాయి. క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) వెబ్‌సైట్, యాప్‌లో కూడా ఇది అందుబాటులో ఉండనుంది. అన్ని వైపుల నుంచి హ్యూస్ కుటుంబానికి మద్దతిచ్చేందుకు ఈ కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారం చేస్తున్నామని సీఏ సీఈఓ జేమ్స్ సదర్లాండ్ తెలిపారు. ‘ఫిల్ ఆత్మకు శాంతి కలగాలని ప్రజలందరూ కోరుకుంటున్నారు.
అంతిమ సంస్కారాలకు ఎక్కువ మంది హాజరుకావడానికి హాల్‌లో స్థలం సరిపోదు. కాబట్టి దేశం మొత్తం అంతిమ సంస్కారాలను చూసేందుకు ఈ లైవ్ ఉపయోగపడుతుంది’ అని సదర్లాండ్ వ్యాఖ్యానించారు. అంత్యక్రియల్లో హ్యూస్ కుటుంబాన్ని ఏకాంతంగా వదిలేయాలని సీఏ కోరింది. సిడ్నీ క్రికెట్ గ్రౌండ్, అడిలైడ్, ఓవల్ మైదానాల్లోని బిగ్ స్క్రీన్లపై కూడా కార్యక్రమం ప్రత్యక్ష ప్రసారం కానుంది.
అంత్యక్రియలకు హాజరుకావాలనుకునే అభిమానుల కోసం సిడ్నీ, కోఫ్స్ హార్బర్‌ల మధ్య ‘క్వాంటాస్' అదనంగా రెండు ప్రత్యేక విమానాలను నడపనుంది. హార్బర్ నుంచి మాక్స్‌విలేకు కారులో 45 నిమిషాల ప్రయాణం.
ఆసీస్ జట్టు ఘన నివాళి
చెంపలపై చెరగని చిరునవ్వు... కళ్లలో ఓ రకమైన మెరుపు.. పక్కనుంటే అదోరకమైన ఆహ్లాదం... అంటూ సహచరుడు హ్యూస్‌కు ఆసీస్ కెప్టెన్ మైకేల్ క్లార్క్ జట్టు తరఫున ఘనంగా నివాళులు అర్పించాడు. ఇక నుంచి ఆసీస్ డ్రెస్సింగ్ రూమ్ మునుపటిలా ఉండదని వ్యాఖ్యానించిన కెప్టెన్ ఓ దశలో భావోద్వేగాన్ని అణుచుకోలేక కన్నీళ్ల పర్యంతమయ్యాడు.
‘మేం కోల్పోయిన దాన్ని మాటల్లో చెప్పలేం. హ్యూస్‌కు క్రికెట్ అంటే పిచ్చి. ఇంటి దగ్గర ఉన్నప్పుడు పశువులను బాగా ఇష్టపడేవాడు. సహచరులతో కలిసి దేశం తరఫున ఆడటాన్ని ఆస్వాదించేవాడు. ప్రస్తుతం మేం అతని చిరునవ్వును, మెరుపును కోల్పోతున్నాం. హ్యూస్ మరణంతో ప్రపంచ క్రికెట్ నిరాశలో కూరుకుపోయింది, క్రికెటర్ అత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నాం’ అని కెప్టెన్ పేర్కొన్నాడు. వన్డేల్లో హ్యూస్ ధరించే 46వ నంబర్ జెర్సీకి రిటైర్మెంట్ ప్రకటించేందుకు సీఏ అంగీకరించిందన్నాడు.