అందరూ అందరే! | opinion on parliament expenses by gollapudi maruthi rao | Sakshi
Sakshi News home page

అందరూ అందరే!

Published Thu, Dec 31 2015 1:14 AM | Last Updated on Thu, Mar 21 2019 9:05 PM

అందరూ అందరే! - Sakshi

అందరూ అందరే!

జీవన కాలమ్
నేను విశాఖపట్నం ఏవీయన్ కాలేజీలో చదువుకునే రోజుల్లో- లైబ్రరీలో ఒక మంచి పుస్తకం కనిపించింది. దాని చివరి అట్ట మీద ఓ కుర్రాడు రెండు వాక్యాలు రాశాడు. ‘పుస్తకం మంచిది. అందరూ చదివి తీరాలి’ అని. దాని కింద మరో కుర్రాడు రాశాడు, ‘ఇది మంచి పుస్తకం కావచ్చు, కానీ ఇలా దిక్కుమాలిన కామెంట్స్ రాసి పుస్తకాన్ని పాడుచెయ్యొద్దు’ అని. మూడో కుర్రాడు ఇంకా తెలివైనవాడు. చాలా క్లుప్తంగా రెండే మాటలు రాశాడు, ‘అతనికి చెప్పి నువ్వు చేసిందేమిటి ఫూల్!’ అని. నాలుగో కుర్రాడు మరింత తెలివైనవాడు, అతి క్లుప్తంగా రెండే మాటలు రాశాడు, ‘ముగ్గురూ ఫూల్స్’ అని.

మన ప్రజాస్వామ్యం అధ్వానంగా తయారైందనీ, నాయకులు పైన చెప్పిన నలుగురు కుర్రాళ్లకి భిన్నంగా లేరనీ చెప్పడానికి పార్లమెంటును చూసినా, మరే శాసనసభను చూసినా అర్థమవుతుంది. తమ ప్రతినిధులుగా ప్రజలు నాయకుల్ని ఎన్నుకోవడంలో ఉద్దేశం- ‘సుపరిపాలన’. ప్రతిపక్షంలో ఉన్న సభ్యుని కర్తవ్యం కూడా సుపరిపాలనే. పాలకవర్గం తప్పటడుగుల్ని ఎత్తి చూపుతూనే వ్యవస్థ పురోగతికి తప్పనిసరిగా, బేషరతుగా, బాధ్యతగా, విధిగా అడుగులు వెయ్యాల్సిందే.

శాసనసభ ఆయా నాయకుల అవినీతి మీద తీర్పునిచ్చే వేదిక కాదు. తమ తమ అక్కసుల్ని వెళ్లగక్కే రణరంగం కాదు. పాలక వర్గాలను నిలదీయడం వారి బాధ్యతలో ఒక భాగం మాత్రమే. ‘పాలన’ ముఖ్య బాధ్యత- పాలక వర్గానికైనా, ప్రతిపక్షానికైనా. తప్పు పట్టేవాడికి ఎప్పుడూ ఎదుటి వ్యక్తిలో తప్పు దొరుకుతుంది. చెడగొట్టేవాడికి ఎప్పుడూ కారణం దొరుకుతుంది. పాలకవర్గం నాయకులు ప్రతిపక్షానికి శత్రువులు కారు. కానక్కరలేదు. వారు అవినీతిపరులైతే - తీర్పునిచ్చేది- ప్రతిపక్షం కాదు. కాదు కాదు. ఓటరు.
 

లోక్‌సభలో ఒక విడత (సీజన్)లో సభ నడవడానికి 260 కోట్లు ఖర్చవుతుంది. ఒక్కరోజుకి ఒక్కో సభ్యునికి రెండున్నర లక్షలు ఖర్చవుతుంది. ఎవడి బాబు సొమ్ము? వారి కక్షల కోసం (వారూ ఒకప్పుడు అవినీతికి గొడుగు పట్టినవారేనని గుర్తుంచుకుంటే) ప్రజల సొమ్మును దుబారా చేసే హక్కు ఎవరిచ్చారు? ఈ నిర్వాకానికి పార్లమెంటు సభ్యులు తమకు తామే తమ ఆదాయాన్ని పదిరెట్లు పెంచుకున్నారు. కేవలం లాండ్రీ ఖర్చులకి 50 వేలు. సంవత్సరంలో ఉచితంగా 34 సార్లు విమానాల్లో తిరగవచ్చు. 75 వేల రూపాయలతో ఫర్నిచర్ కొనుక్కోవచ్చు. ఇంకా అనూహ్యమైన రాయితీలు, అలవెన్సులు ఉన్నాయి.
 

ఈ పార్టీల పట్ల, వీళ్ల నిర్వాకం పట్ల ప్రజల అసహ్యానికీ, విముఖతకీ పెద్ద, గొప్ప అనూహ్యమైన రుజువు- నిన్నగాక మొన్న అన్ని పార్టీల్ని ముఖం మీద గుద్ది 70 సీట్లలో 67 సీట్లు గెలుచుకున్న ఆమ్ ఆద్మీ పార్టీ విజయం. ఏ చరిత్రా లేని పార్టీని దశాబ్దాలుగా పదవులు వెలగబెడుతున్న ఆయా పార్టీలను కాదని ఓటరు ఎన్నుకున్నాడు.

 మరొక గొప్ప ఉదాహరణ. నాయకుని దక్షతని ఏ కాస్తో పరిణతినిచ్చే చదువు పెంచుతుందని భావించడంలో తప్పులేదు. ఈ మధ్య గొప్ప పోరులో చరిత్రని సృష్టించిన బిహార్ మంత్రివర్గం విద్యార్హతల్ని ఒక నమూనాగా చూద్దాం. ముఖ్యమంత్రి నితీశ్‌కుమార్ ఇంజనీరింగ్ పట్టా పుచ్చుకున్నారు. మిగతా 28 మంది మంత్రుల చరిత్ర... ఉపముఖ్యమంత్రి- 9వ తరగతి ఫెయిల్. రవాణా, నీటి పారుదల మంత్రి-12 ఫెయిల్. ఆరోగ్యమంత్రి -12వ తరగతి ఫెయిల్. విద్యుచ్ఛక్తిమంత్రి -10 ఫెయిల్. మంచినీటి సరఫరా మంత్రి- 8వ తరగతి, సాంఘిక సంక్షేమ మంత్రి -12వ తరగతి, భూవసతి మంత్రి- 7వ తరగతి, ఎరువుల మంత్రి-10వ తరగతి; విద్య, ఐటీ శాఖ మంత్రి-10 వ తరగతి, కార్మిక మంత్రి -5వ తరగతి, పంచాయతీరాజ్ మంత్రి-3వ తరగతి, ఎస్సీఎస్టీ వ్యవహారాల మంత్రి-12వ తరగతి, పథకాల నిర్వహణ మంత్రి-8వ తరగతి, మైనారిటీ సంక్షేమ మంత్రి-10వ తరగతి, పట్టణాభివృద్ధి మంత్రి-12వ తరగతి, పరిశ్రమలు, శాస్త్రసాంకేతిక రంగ మంత్రి 10 వ తరగతి, టూరిజం మంత్రి-12వ తరగతి, పశు సంవర్థక శాఖ మంత్రి-5వ తరగతి, చెరుకు పరిశ్రమ మంత్రి 5వ తరగతి, గ్రామీణాభివృద్ధి మంత్రి- 2వ తరగతి, సహకారశాఖ మంత్రి-3వ తరగతి, కళలు, సాంస్కృతికశాఖ మంత్రి-బొత్తిగా చదువులేదు. ప్రజాస్వామ్యంలో చట్టసభల వికాసానికి ఈ మంత్రివర్గాన్ని తలమానికంగా తీసుకుని గర్వపడవచ్చు.
 

అలనాడు చట్టసభల కార్యక్రమాల్ని టీవీల్లో ప్రసారం చేయడం ద్వారా పారదర్శకత పెరుగుతుందని కొందరు దురభిప్రాయపడ్డారు. కానీ టీవీల ముందు తమ వీరంగాన్ని దేశం చూస్తోందన్న ఆలోచనతో నాయకులు నటులవుతున్నారు. వీరులవుతున్నారు. గొంతు చించుకుంటున్నారు. హాహాకారాలు చేస్తున్నారు. టీవీలలో ఈ ప్రసారాలు ఆపుచేయడం ద్వారా ప్రజలకు కనీసం నిర్వేదం, రక్తపోటును తగ్గించవచ్చునని నా ఉద్దేశం.

ఇప్పుడున్న పార్లమెంట్ ఇంత అధ్వానస్థితిలో ఉండగా, కొత్త పార్లమెంట్ భవనాన్ని ఇండియా గేట్ ప్రాంతంలో నిర్మించి రెండింటినీ సొరంగ మార్గం ద్వారా కలపాలని సూచన. ఇది తుగ్లక్ వ్యవహారమని ఓ చానల్ వెక్కిరించింది.

(వ్యాసకర్త : గొల్లపూడి మారుతీరావు)

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement