ఆప్ఘనిస్థాన్ పార్లమెంట్ భవనంపై ఆత్మాహుతి దాడి
కాబూల్ : ఆఫ్ఘనిస్తాన్‌లో ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. ఏకంగా పార్లమెంట్‌పైనే దాడికి తెగబడ్డారు. కాబూల్‌లో పార్లమెంట్ భవనంపై సోమవారం ముష్కరులు దాడికి పాల్పడ్డారు. బాంబులు, తుపాకులతో విరుచుకుపడిన ఉగ్రవాదులు.. పార్లమెంట్ పరిసరాల్లో స్వైర విహారం చేశారు.
బాంబు పేలుళ్ల శబ్దాలు, తుపాకుల మోతతో పార్లమెంట్ పరిసరాలు దద్దరిల్లిపోయాయి. ఆరు సార్లు బాంబు పేలుళ్ల శబ్దాలు వినిపించాయని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. అటు సాయుధ ఉగ్రవాదులు పార్లమెంట్ దిగువ సభలోకి చొరబడి కాల్పులు మొదలు పెట్టినట్లు తెలుస్తోంది. ఈ కాల్పుల్లో పలువురు గాయపడినట్లు సమాచారం. మరోవైపు ఈ ఘాతుకానికి పాల్పడింది తామేనని తాలిబాన్లు వెల్లడించారు. అయితే ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.