
అమ్మ... అమ్మో!
మేధావి అయిన రాజకీయ నాయకుడు ప్రజల ‘రేపు’ని ఉజ్వలంగా తీర్చిదిద్దాలని ప్రయత్నిస్తాడు. బతకనేర్చిన తెలివైన నాయకుడు ఆ రోజు ప్రజల అవసరాల్ని తీర్చడానికి సిద్ధపడతాడు.
మొన్న అయిదు రాష్ట్రాల ఎన్నికల ఫలితా లను విశ్లేషిస్తూ చాలా మంది మేధావులు తమ తమ అభిప్రాయాలను వెల్లడించారు. కాని వారంతా పప్పులో కాలే శారని సవినయంగా మనవి చేస్తున్నాను. అస లయిన విశ్లేషణ చిత్తగించండి.
లోకంలో ఏ విప్లవమయినా వంటగదిలోంచే ప్రారంభం కావాలి. ఎప్పుడూ అన్నం కంచానిదే విజయం. ఎలాంటి అభ్యుదయమైనా ఆకలి దగ్గర పర్యవసిస్తుంది. కనుక- అన్ని రంగాలలోనూ అమ్మదే పై చెయ్యి. ఈ విషయంలో నరేంద్రమోదీ గారినీ వెనుక సీటులో నిలుపుతాను నేను. పదవిలోకి వచ్చినప్పట్నుంచీ మోదీగారు మాట్లాడని రోజు లేదు. మాట్లాడని విషయం లేదు. వెళ్లని దేశం లేదు. గత అయిదేళ్లలో పట్టుమని పది నిమిషాలు జయలలిత అమ్మగారు మాట్లాడిన దాఖలాలు ఉన్నాయా? ఆవిడ ముక్తసరిగా మూడేముక్కలు మాట్లాడతారు. ఏం చెయ్యాలో చేసి చూపిస్తారు. చెప్పరు.
నేను 45 సంవత్సరాలుగా చెన్నైలో ఉంటున్నాను. 32 సంవత్సరాలు రెండు ద్రవిడ పార్టీలూ ప్రతి ఎన్నికలలో ఆడిన దోబూచుల్లో నేనూ ఓటు వేసి పాల్గొంటున్నాను. 32 సంవత్సరాల తర్వాత పదవిలో ఉన్న పార్టీ గెలిచే గొప్ప విజయాన్ని అమ్మ సాధించారు. అందుకు కారణం నాకు తెలుసు. మీరు క్షమిస్తే నాకే తెలుసు.
రహస్యం ఇది. మోదీగారు స్వచ్ఛ భారత్ అని కేకలు వేస్తారు. అమ్మ పది చీపుళ్లు పంచుతారు. మోదీగారు ధరల అదుపు అంటూ ఉపన్యాసం దంచుతారు. అమ్మ దంపుడు బియ్యాన్ని- కాదు- వండిన అన్నాన్ని పంచుతారు. మోదీగారు ‘మేడిన్ ఇండియా’ అంటారు. అమ్మ ‘మేడిన్ వంటగది’ అంటుంది.
తమరు గమనించారో లేదో- అన్నాడీఎంకే విజయాన్ని రోడ్డు మీదికి వచ్చి హాహాకారాలతో పండుగ చేసుకున్నవారు ఎవరు? కాలేజీ ప్రొఫెసర్ కాదు. కంపెనీ ఉద్యోగి కాదు. ఆఫీసులో గుమస్తా కాదు. వీరిలో ఒక్కరయినా- మచ్చుకు- ఒక్కర యినా రోడ్డుమీద కనిపించారా? అలాగని రిక్షా కూలీ కాదు. ఫ్యాక్టరీ కార్మికుడు కాదు. రైతు కాదు. బైతు కాదు. అందరూ ఆడవారు- 40-70 వయ సున్న ఆడవారు. కెమెరాల ముందు ఆనంద తాండవం చేశారు. డ్యాన్సులు చేశారు. కారణం- చేతుల్లోనే కంచం ఉంది. వారి చేతుల్లోనే లక్షలాది వోట్లున్నాయి.
అమ్మ పొద్దుట లేస్తే పదిరూపాయలకి రెండు ఇడ్లీ పెడతారు. పొంగళ్, ఉప్మా తినిపిస్తారు. వంటకి బియ్యం ఇస్తారు. సరసంగా బజార్లో అమ్ముకుని డబ్బు చేసుకోడానికి కలర్ టీవీలు, సైకిళ్లు ఇస్తారు. అమ్మ కాంటీన్లు ఉన్నాయి. అమ్మ తాగునీరు ఉంది. అమ్మ మందులు, అమ్మ బస్సులు, అమ్మ సిమెంట్, అమ్మ గ్రైండర్లు, ఉచిత మేకలు, ఆవులు. చాలామంది నాయకులు అభి వృద్ధిని ఆకాశంలో చూపిస్తారు. అమ్మ ఆదర్శాల్ని వంటగదికి, ఇంటి వసారాలోకి దింపి మిమ్మల్ని పలకరిస్తుంది.
దిగ్విజయ్ సింగ్‌గారు కాంగ్రెసు అడుక్కు తినడానికి కారణాలు వివరించారు. కళ్ల ముందు తమ సంస్థ కూలిపోతున్నా- గాంధీ కుటుంబానికి పెద్ద పీట వేస్తూ ఆత్మవంచన చేసుకునే ప్రముఖ నాయకుడు దిగ్విజయ్ సింగ్‌గారు ఏదో ‘సర్జరీ’ గురించి మాట్లాడి, అంతలో నాలిక కొరుక్కుని ‘నేను సర్జరీ అన్నది పైవాళ్లని- సర్జన్లని కాదు’ అన్నారు. నా సలహా ఒక్కటే. రాహుల్ గాంధీ గారికి వెంటనే తమిళనాడులో మెట్టుపాళియం అరులాంబాళ్‌కో, తమిళరిసికో ఇచ్చి పెళ్లి చేయండి.
సోనియాగాంధీ గారి అరవ కోడల్ని ‘అమ్మ’ దగ్గర అయిదేళ్లు తర్ఫీదుకు ఉంచండి. 2019లో ‘ఇళవరసి రాహుల్’ తన బావగారు రాబర్ట్ వాద్రా సహాయంతో బీజేపీ ఆదర్శాలకు దీటుగా -ప్రజలకి- ముఖ్యంగా మహిళలకు- బెనారస్ హల్వా, 5 కిలోల గోధుమపిండి, 10 కిలోల బంగాళాదుంపలు, బస్తా ఉల్లిపాయలు, రొట్టెలు కాల్చుకునే పెనం, మురుగన్ విబూది, పాన్‌పరాగ్ డబ్బా, చిన్న చిన్న స్కూటర్లు, మొబైల్ ఫోన్లు- ఇలాంటివి పంచి దేశాన్ని ఒక తాటిమీద నిలప గలదని నా హామీ.
మేధావి అయిన రాజకీయ నాయకుడు ప్రజల ‘రేపు’ని ఉజ్వలంగా తీర్చిదిద్దాలని ప్రయత్నిస్తాడు. బతకనేర్చిన తెలివైన నాయకుడు- ఆ రోజు ప్రజల అవసరాల్ని తీర్చడానికి సిద్ధపడతాడు. ఆదర్శం ఆకాశం. అది ఆలోచనల్లో- సుదీర్ఘమైన కృషితో పదికాలాలపాటు కలిసి వచ్చే బంగారు భవిష్యత్తు. అది ఎవడిక్కావాలి? ఆకలిని తీర్చడానికి వేసే పథకం కంటే ఎదురుగా కనిపించే మేక రుచికర మైన పరిష్కారం.
ఈ దేశంలో మరొక చోట మరో ‘అమ్మ’ అదే పనిచేసిందని మరిచిపోవద్దు. ఆ అమ్మ మమతా బెనర్జీ. ఏతావాతా కాంగ్రెస్ పతనానికి సత్వర పరిష్కారం నాకు తెలుసు. దిగ్విజయ్ సింగ్ గారూ, తమ ‘సర్జరీ’ కత్తుల్ని సొరుగులో పెట్టి మంచి అరవ పిల్లని రాహుల్ గాంధీగారి కోసం వెదికి పెళ్లి చేసి పుణ్యం కట్టుకోండి.
గొల్లపూడి మారుతీరావు
జీవన్ కాలమ్