
ఆమె ఒక ద్వీపం
జీవన కాలమ్
జయలలితను గురించి కాలమ్ రాయాలనుకోలేదు. నిజానికి ఆమెని నేనెప్పుడూ కలుసుకోలేదు. ఎదురుపడి మాట్లాడలేదు. కానీ ఆమె కన్నుమూసిన దగ్గర్నుంచీ-సమాధివరకూ విజృంభించిన జన ప్రళయం చూశాక-రాత్రి పదిన్నరకి ఆమె గురించి రాయవలసినది చాలా ఉందనిపించింది. ఆవిడ మానాన ఆవిడని వదిలేస్తే-హాయి గా తన ఇంట్లో పెంపుడు జంతువులతో, పుస్తకాలు చదువుకుంటూ గడపాలనే ఏకాంతాన్ని కోరుకునే వ్యక్తి. పదిమందిని కలవడం ఇష్టం లేదు. పదిమందిలో కుంచించుకుపోయే సిగ్గు, బిడియం. మానసికంగా She is a private person. Great introvert. బయటకు వెళ్లగక్కే మనస్తత్వం కాదు.
1965లో సారథీ స్టుడియోలో ‘మను షులు-మమతలు’ షూటింగు జరుగు తున్న సమయం. జయలలితకి అప్పుడు 17 ఏళ్లు. తెలుగులో ఆమె మొదటి సినిమా. దూరంగా కుర్చీలో కూర్చుని జెఫ్రీ ఆర్చర్ బండ నవల చేతపట్టుకుని చదువుకుంటూ ఉండేది. రామారావు చెప్పేవాడు. ఏకసంథాగ్రాహి. ఒక్కసారి డైలాగు చెప్తే అప్పగించేసేది. కానీ ఆమె గొప్ప నటి కాదు. వయస్సులో స్వచ్ఛత, నాజూకుతనం కలిసి ఇచ్చిన అవకాశమది. ఎవరితోనూ కల్పించుకునేది కాదు. కోపమూ, తాపమూ ఏనాడూ ప్రకటించేది కాదు. ఎంత ప్రయత్నించినా ఆమె మనసులోని ఆలోచనని బ్రహ్మ దేవుడు కూడా పెకలించలేడు. ఇవన్నీ రాజకీయ ప్రపంచానికి పెట్టుబడులు. కానీ ఆమెకి ఇష్టంలేని విషయాలు. ఈ సంగతిని అతి స్పష్టంగా సిమి గారేవాల్ (రెండెవో)లో, జెన్నిఫర్ అరుల్‌తో ఇంటర్వ్యూలలో చెప్పింది. తనకి నచ్చని, తన స్వభావానికి భిన్నమైన వాతావరణంలో జీవితాన్ని గడిపింది. నిన్న ఆమె కన్నుమూశాక-రాష్ట్రపతి, ప్రధాని, ఎనిమిది రాష్ట్రాల ముఖ్యమంత్రులు, సినీ పరిశ్రమ, కోట్లాది ప్రజలూ ఏకమై నివాళులర్పించారు. ఎంత విపర్యయం!
చిన్న మాటకు కూడా స్పందించే స్వభావంగల ఒక వ్యక్తి-దూషణలకూ, అవమా నాలకూ, శత్రుత్వాలకూ ఎదురీది-తనది కాని ప్రపంచంలో తనదైన ‘ఉనికి’కి పట్టం కట్టిన చరిత్ర జయలలితది. వందేళ్ల కాలంలో కనీ వినీ ఎరుగని జలప్రళయంలో ఆమె పేద ప్రజల గుడిసెల దగ్గరికి వెళ్లలేదు. వేదికల మీద వారి అవసరాలను తీర్చినప్పుడు తప్ప- ఎన్నడూ వారిని కలవలేదు. పేద ప్రజల్ని గుండెలకి హత్తుకోలేదు. కానీ పేద ప్రజలు సముద్రమై ఆమెకోసం విలపించారు. ఆత్మహత్యలు చేసుకున్నారు. కారణం-వ్యక్తి సహజమైన ఆమె ఔదార్యం, ఆర్ద్రత వారి జీవితాలను స్పృశించింది. ఆమె ఎన్నడూ పత్రికల ముందు ప్రవ చనాలు చేయలేదు. విమర్శలకు ఆవేశంతో సమాధానాలు చెప్పలేదు. ‘నేను బహిరంగంగా నా కోపాన్ని ఎన్నడూ ప్రదర్శించలేదు. పదిమందిలో ఎన్నడూ కన్నీరు పెట్టలేదు’ అని గర్వంగా చెప్పుకున్నారు. తను కోరుకోని, ఎదురుచూడని-సినీ జీవితంలో, రాజకీయ జీవితంలో ఆటు పోటుల్ని తన termsతోనే ఎదిరించారు.
మొన్న సెప్టెంబరు 27న కర్ణాటకలో ఆమెమీద అవినీతి కేసులో తీర్పుని ప్రకటించి నప్పుడు ఆమె న్యాయస్థానంలో ఒక మాట అన్నారు: ‘నేనప్పుడు చిన్నదాన్ని’ అని. ఈ మాటని ఏ రాజకీయ నాయకుడూ కలలో కూడా అనడు. ఆరోజు నేను నవ్వుకున్నాను. కానీ ఆనాడూ జయలలిత అనే రాజకీయ నాయకురాలు ఆమాట అనలేదు. తనదికాని ప్రపం చంలో, తన ధోరణిని అప్పట్లో వెదుక్కుంటున్న ఒక ‘దారి తప్పిన’ నాయకురాలు ఆక్రో శించింది. కానీ అనవగాహనకి న్యాయ స్థానంలో ఓదార్పు లేదు. ఆమె కర్ణాటక జైలులో ఉన్నప్పటినుంచే ఆమె నిర్యాణం ప్రారంభమయిందని ఎవరో రాశారు. అది నిజం. ఆమె dignityకి తగిలిన గాయమది. దాని నుంచి ఆమె కోలుకోలేదు.
కానీ తన ఏకాంతాన్ని నిష్కర్షగా చివరికంటా కాపాడుకున్న ‘వ్యక్తి’ జయలలిత. 74 రోజులు తీవ్ర రుగ్మతతో ఆసుపత్రిలో చికిత్స జరుగుతుండగా-తన నాయకులుగానీ, గవ ర్నర్లుగానీ, కేంద్ర మంత్రులుగానీ ‘నిస్సహాయంగా మంచం పట్టిన’ ఆమెని చూడలేక పోయారు. ఆమె కన్నుమూశాక-ఆమె ప్రమేయంలేని ఆమె శరీరాన్ని మాత్రమే చూడ గలిగారు.
ఇదొక విచిత్రమైన ప్రస్థానం. అనూహ్యమైన ముగింపు. విపర్యయాలను, స్వభావ వ్యతి రేకమైన జీవితాన్ని తన ధోరణిలోనే జీవించి, జయించి, నిష్ర్కమించిన ఓ ఏకాంత జీవి జీవన ప్రస్థానం. ఒక్క మాటలో చెప్పాలంటే-ఆమె ఒక ద్వీపం.
- గొల్లపూడి మారుతీరావు