
సినారె జ్ఞాపకాలు
సినారె గొప్ప వక్త. అనితర సాధ్యంగా సభా నిర్వహణ చేసేవారు. ఆయన ప్రసంగం కవితాపఠనంలాగ సాగేది. చివరి రోజుల్లో ఆరోగ్యం దెబ్బతింది. కాని ప్రతి సాయంకాలం–సాహితీ ప్రసంగాల రుచిని వదులుకోలేకపోయేవారు.
దాదాపు 47 సంవత్సరాల కిందటి మాట. మద్రాసు టి.నగర్‌లో సుధారా హోటల్‌లో సినారెది 12వ నెంబర్ గది. నాది పదకొండు. రోజంతా నేను కథా చర్చలు, సంభాషణల రచనా చూసుకుని గదికి చేరేవాడిని. ఆయనది పాటల పరిశ్రమ. నా గది తలుపు చప్పుడు కాగానే వచ్చేవారు. ఇద్దరం ఆనాటి కార్యకలాపాలను పంచుకుంటూ రాత్రి పన్నెండున్నర దాకా కాలక్షేపం చేసేవాళ్లం. ఆ రోజుల్లోనే –నేను రేడియోకు శలవు పెట్టి సినీ పరిశ్రమలో అడుగుపెట్టాలని రెచ్చగొట్టే మిత్రులలో సినారె ఒకరు–ఆయనా అటు విద్యారంగంలో ఉంటూ అలాంటి పని చేస్తున్నారు కనుక.
కరీంనగర్ రోజుల్లో –అంటే ఆయన చిన్నతనంలో మా మామగారు ఆయనకి ఇంగ్లిష్ గ్రామరు నేర్పేవారు. మా ఆవిడని ’గురుపుత్రి’ అనే పిలిచేవారు ఎప్పుడు కలిసినా. చిన్నతనంలో మా రెండో అబ్బాయి రామకృష్ణ (మా మామగారి పేరు) ఆయనకి నమస్కారం పెట్టేవాడు కాడు– మా ఆవిడ ఎంత చెప్పినా. ఆయన నవ్వి: ఎందుకు పెడతాడు? నా గురువు కదా? అనేవారాయన. ఒకసారి కరీంనగర్ కాలేజీలో సాంస్కృతిక సభకి నాకూ ఆయనకీ ఆహ్వానం వచ్చింది. మూడు కారణాలకి అది నాకు ముచ్చట. మా ఆవిడ చదువుకున్న ఊరు. విశ్వనాథ ప్రిన్సిపాల్‌గా పనిచేసిన కాలేజీ.
మా మామగారూ అక్కడ హైస్కూలు హెడ్ మాస్టరుగా చేశారు. ఇద్దరం వెళ్లాం. రాత్రి పదిగంటలకి భోజనం చేసి ఇద్దరం కారులో కూర్చున్నాం. డ్రైవరు ఈడిగిలపడుతూ కారు నడుపుతున్నాడు. కారణం అడిగాం. అది ఎన్నికల టైము. చెన్నారెడ్డిగారూ, వందేమాతరం రామచంద్రరావుగారూ పోటీ చేస్తున్న ఆ నియోజక వర్గంలో గత నాలుగు రోజులుగా నిద్ర లేకుండా కారు నడుపుతున్నాడట. మేమిద్దరం గతుక్కుమన్నాం. అక్కడి నుంచి హైదరాబాద్‌కి నాలుగు గంటల ప్రయాణం. డ్రైవర్ నిద్రని ఆపేదెలా? ఇద్దరం పాటలూ, పద్యాలూ లంకించుకు న్నాం. నోటికి వచ్చిన పాటలు, పద్యాలు–కేకల స్థాయి లో. హైదరాబాద్ 2 గంటలకు చేరాం. ఇద్దరం అలసటతో కూలిపోయాం. అదొక మరుపురాని సంఘటన.
మా ఇద్దరి జీవితాలు ఆసాంతమూ పడుగు పేకల్లా సాగాయి. నేను రాసిన ఎన్నో చిత్రాలకు ఆయన పాటలు రాశారు. నేను నటుడినయ్యాక ఆయన రాసిన ఎన్నో పాటల్ని నటించాను. నా రెండో రోజు షూటింగులోనే ‘ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య’లో ‘స్వామి శరణం అయ్యప్పా’ పాట! నేను ఎప్పుడూ అనేవాడిని. ‘నేను పది సీన్లలో చెప్పిన విషయాన్ని మీరు పదిమాటల్లో లేపుకుపోతారు’ అని. అది పాటకి ఉన్న ఒడుపు.
కర్నాటకలో హంపీ దగ్గర కమలాపురం గెస్టు హౌస్‌లో ఉంటూ పుండరీకాక్షయ్య గారి ‘మావారి మంచి తనం’ సినీమాకి ఆయన పాటలూ, నేను మాటలూ పూర్తి చేశాం. రోజూ ఉదయమే సినారె నిద్రలేపేవారు. అలాగే మారిషస్ ప్రపంచ తెలుగు మహాసభలకు వెళ్లినప్పుడు. మా ఉదయపు నడకల్లో ఎన్నో పాటలు రూపుదిద్దుకోవడం నాకు తెలుసు. హేరంబ చిత్ర మందిర్ ‘మాంగల్యానికి మరోముడి’ పాటల కంపోజింగు. విశ్వనాథ్, సినారె నేనూ కూర్చున్నాం. ఉన్నట్టుండి సినారె అన్నారు:
‘వచ్చేసిం దయ్యా పల్లవి’ అని. ఇదీ ఆయన చెప్పిన పల్లవి:
గొల్లపూడి చిన్నవాడి అల్లరి నవ్వు
పట్టపగలు విరబూసే పున్నమి పువ్వు
జీవితంలో ఎన్ని జ్ఞాపకాలు! ఆయన జ్ఞానపీఠ పురస్కారానికి అభినందన సభ మద్రాసు సవేరాలో. దేవులపల్లి, ఇచ్చాపురపు జగన్నాధరావు ప్రభృతులంతా ఉన్నారు. నేను వక్తని. 1988లో రాజాలక్ష్మి ఫౌండేషన్ పురస్కార సభకి నేను ప్రధాన వక్తని. నా షష్టిపూర్తికి వచ్చిన నలుగురు ఆత్మీయులు– సినారె, అక్కినేని, గుమ్మడి, ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం. అదొక మధురానుభూతి. ఆయన చేతుల మీదుగా వంగూరి ఫౌండేషన్ జీవిత సాఫల్య పురస్కారాన్ని అందుకున్నాను. ఇలా రాస్తూ పోతే పెద్ద జాబితా.
ఆయన ముందునుంచీ నా రచనలకు అభిమాని. 1969లో ఎమెస్కోవారు ప్రచురించిన నా ‘పిడికెడు ఆకాశం’ నవల చదివి ఉత్తరం రాశారు. ‘నవల పోను పోను గంభీరంగా ఉంది. గమకం ఆద్యంతమూ ఉందనుకోండి. ముగింపు అద్భుతం. వస్తువును స్వీకరించడంలో మీకున్న దమ్ము రుజువయింది’.
ఆయన గొప్ప వక్త. అనితర సాధ్యంగా సభా నిర్వహణ చేసేవారు. ఆయన ప్రసంగం కవితాపఠనంలాగ సాగేది. చివరి రోజుల్లో ఆరోగ్యం దెబ్బతింది. కాని ప్రతి సాయంకాలం– సాహితీ ప్రసంగాల రుచిని వదులుకోలేకపోయేవారు. ఇద్దరు మనుషులు, ఒక తలగడ, క్లుప్తంగా రెండు మాటలూ– ఒక మహావక్త గతాన్ని తలుచుకుని మనస్సులో కలతగా ఉండేది. అయితే ఆ కాస్త participation ఏ ఆయనకు ఆటవిడుపు. వయస్సు, ఆరోగ్యం ఎదురుతిరుగుతున్నా– కవితలు మానలేదు. ఎప్పడూ ఏవో పత్రికల్లో కనిపిస్తూండేవి. అది సినారె ‘ప్రాణవాయువు’గా అస్మదాదులం గుర్తుపట్టేవాళ్లం. సినారె ఒక ప్రభంజనం. ఈ తరం సంతకం.
- గొల్లపూడి మారుతీరావు