లక్ష భిక్ష
జీవన కాలమ్
కన్యాశుల్కంలో గిరీశం బండీవాడికి నేషనల్ కాంగ్రెసు విషయమై రెండు ఘంటలు లెక్చెరిచ్చాక గిరీశం మాటల్లోనే, ‘‘ఆ గాడిదకొడుకు వాళ్ల ఊరు హెడ్కానిస్టేబుల్ని కాంగ్రెస్వారు ఎప్పుడు బదిలీ చేస్తారు’’ అని అడిగాడు.
బడ్జెట్ విషయంలో నాకూ మా ఊరు బండీవాడికీ పెద్ద తేడా లేదు. బడ్జెట్ని పార్లమెంటులో ప్రవేశపెట్టాక- పన్ను రాయితీకి తలసరి సంవత్సర ఆదాయ పరిమితిని పెంచారా లేదా అని చూసుకోవడం, జర్దా వేసే రోజుల్లో జర్దా మీద పన్ను పెంచారో లేదో చూడడమే అలవాటు. బడ్జెట్ మీద ఆర్థికవేత్తలు అద్భుతంగా చేసే విశ్లేషణని- వాళ్ల అవగాహనకీ, విజ్ఞతకీ మురిసిపోతూ వినడం తప్ప-నాకు ఏమీ బోధపడి చావదు- ఇప్పటికీ. కాపిటలైజేషన్ ఆఫ్ పీబీఎస్, వెల్ఫేర్ సెస్, ఫిస్కల్ డిసిప్లీన్ వంటి మాటలు వింటున్నప్పుడు ముచ్చటగా ఉంటాయి కాని చెవుల్ని దాటి మీదకి ప్రయాణం చెయ్యవు- నా మట్టుకు. కాగా, కొందరు ఆర్థికశాఖ మంత్రులు- నాలాంటివారికి కితకితలు పెట్టడానికి మధ్య మధ్య చిన్న చిన్న జోక్లు జతచేస్తారు. ఇందులో ప్రముఖులు ఆనాటి టి.టి. కృష్ణమాచారి, మొరార్జీ దేశాయ్ వంటివారు.
అయితే వీరికి ప్రస్తుత మంత్రి అరుణ్ జైట్లీ ఏమాత్రం తీసిపోరని బల్లగుద్ది చెప్పగలను. అలాంటి సరదా అయిన జోక్ విశాఖపట్నం మెట్రో రైలుకి వారు కేటాయించిన మొత్తం. మెట్రో రైలుకి లక్ష రూపాయలు కేటాయించారు. టీవీ చానల్ పొరపాటు పడుతోందేమోనని పదిసార్లు చూశాను. సందేహం లేదు. అక్షరాలా లక్ష సమర్పించారు. వెంటనే ఒక సీనియర్ పాత్రికేయుడికి ఫోన్ చేశాను. ఆయనకీ, 1959 నుంచి పత్రికల్లో పని చేసిన నాకూ లోగడ ఏ కేంద్ర బడ్జెట్లోనూ, ఏ పద్దుకీ లక్ష రూపాయలు కేటాయించిన సందర్భం లేదు. ఇది కొత్త రికార్డు.
విశాఖపట్నం ఈ మధ్య అంతర్జాతీయంగా పేరుని సంపాదించుకుంది. ఏభై దేశాల నావికా దళాలు పాల్గొనగా ఈ దేశపు రాష్ర్టపతి, ప్రధాని నాలుగు రోజులు నౌకా శాఖ విన్యాసాలని కన్నుల పండువగా దర్శించారు. ఈ మధ్య విడిపోయిన రాష్ట్రంలో ఇప్పటికీ ఒకే ఒక పెద్ద నగరం విశాఖ. ఇక్కడ మెట్రోకి కేవలం 13,488 కోట్లు ఖర్చు అవుతుందని అంచనా. ఈ ప్రాజెక్టుకి ప్రాథమిక ప్రణాళిక సిద్ధం చేయడానికి కనీసం 10 కోట్లు ఖర్చవుతుంది. అయితే ఇలా కాగితాల ఖర్చుకీ, ప్రారంభోత్సవ సమయంలో కొబ్బరికాయలు, కర్పూరం, పప్పుబెల్లాలకీ మన ఆర్థికమంత్రి ఒక లక్షని విదిలించారు. ‘‘అయ్యా! మా ఎరికలో ఈ ప్రాజెక్టు ఉంది సుమా!’’ అని చెప్పడానికి ఇది లాంఛనం- అని ఈ సీనియర్ పాత్రికేయులు చెప్పారు. ఇందుకు మనం కేంద్రానికి ఎంతయినా కృతజ్ఞతలు తెలపాలి.
మరి మొన్ననే మాడు పగిలి, బొత్తిగా ఆర్థిక వనరులు లేక, ఉండడానికి రాజధాని కూడా లేని పరిస్థితిలో ఈ రాష్ట్రం ఘనత వహించిన ప్రధాని గారి చేత ఆ మధ్య అమరావతిలో భూమిపూజ చేయించింది కదా! మరి లాంఛనంగా దానిని ఎందుకు గుర్తుంచుకోలేదు? ఈ బడ్జెట్కి అనుబంధ బడ్జెట్ రావడం ఒక ఆనవాయితీ ఉంది. ఆర్థికమంత్రిగారు ఆ అనుబంధ బడ్జెట్లో అమరావతికి కనీసం 5 వేలు కేటాయించాలని నా వినతి. అలాగే ఓ గొప్ప అంతర్జాతీయ విమానాశ్రయం భోగాపురంలో రాబోతోందని మన ఆర్థికమంత్రిగారికి గుర్తుండకపోదు. దానికి కనీసం ఓ 2 వేలు కేటాయించాలి. రాజాపులోవ ప్రాంతంలో ట్రిపుల్ ఐటీని ఏర్పరుస్తామని వాక్రుచ్చారు. దానికి ఎంత లేదన్నా ఓ 5 వందలు కేటాయిస్తే ఆంధ్రులకు కేంద్రం తమను మరిచిపోలేదని ధైర్యం కలుగుతుంది. తొంభైవేల కోట్లు, పందొమ్మిది వేల కోట్ల కేటాయింపుల మధ్య మనని మరిచిపోకుండా ఈ దేశానికే తలమానికమని మొన్ననే రాష్ట్రపతి, ప్రధాని అభివర్ణించిన విశాఖపట్నానికి లక్ష రూపాయలు కేటాయింపు దక్కడం అపూర్వం.
ఒక ప్రభుత్వం మన ఏడుపు మనని ఏడవమని ఈ రాష్ట్రాన్ని రెండు చెక్కలు చేసి చేతులు కడుక్కుంది. మరో ప్రభుత్వం మిమ్మల్ని మరిచిపోలేదు బాబూ -అంటూ బుగ్గలు నిమిరి‘మురియిలు’ తినిపిస్తోంది.
వెనుకటికి ఓ బందిపోటు దొంగ దారి కాసి అటు పోయేవాళ్లని బెదిరించేవాడట- హుంకరిస్తూ, ‘‘నేను లేస్తే మనిషిని కాను’’ అంటూ. యాత్రీకులు భయపడి ముడుపులు చెల్లించేవారట. తీరా అతన్ని ఒకాయన ఎదిరించి ‘‘ఏదీ లేచి నిలబడు చూద్దాం!’’ అన్నాడట. అప్పుడు తెలిసింది- ఆ దొంగకి కాళ్లు లేవని, నిలబడే అవకాశం లేదని. నిలబడకుండా నిలదీసే దొంగవీరుడు. తీరా గుట్టు విడిపోయాక- అంతా జారుడు. మన ఆర్థికమంత్రిగారు లక్ష ఇవ్వకుండా ‘‘విశాఖపట్నంలో మెట్రో, అమరావతి మా మనస్సులో ఉంది. ఏదో చేస్తాం’’ అంటే- ఏం చేస్తారోనన్న ఆశయినా మిగిలేది. ప్రస్తుతం ఇచ్చిన లక్ష భిక్ష- ఇకముందు ఏమీ ఇవ్వరన్న విషయాన్ని గుట్టు విప్పేసింది. మాడు పగలగొట్టింది.
గొల్లపూడి మారుతీరావు