చిత్రం! భళారే విచిత్రం!! | Gollapudi Maruthi rao writes on sex and cenemas | Sakshi
Sakshi News home page

చిత్రం! భళారే విచిత్రం!!

Published Thu, Nov 16 2017 3:33 AM | Last Updated on Thu, Nov 16 2017 3:33 AM

Gollapudi Maruthi rao writes on sex and cenemas - Sakshi

పశు ప్రవృత్తితో కూడిన సెక్స్‌కి జాతి పరిణతితో, సంస్కారంతో అద్భుతమైన విలువల్ని మన పెద్దలు సంతరించి పెట్టారు. పరాయి స్త్రీని ‘అమ్మా’ అనడానికి కొన్ని శతాబ్దాల మానసిక విప్లవాన్ని ఈ జాతి కొనసాగించింది.

మనకి సెక్స్‌ చాలా పవిత్ర మైనది –ఇప్పుడు కాకపో యినా– కనీసం ముందు తరం వరకు. మనకి సెక్స్‌ వంశోద్ధరణకి, బీజోత్పత్తికి, బలమైన వారసత్వానికీ ముడి. అందుకనే పెళ్లిలోనే గర్భదానానికి ముహూర్తం పెట్టారు – పెద్దలు. చక్కటి ముహూర్తంలో, చక్కని మనస్తిమితంతో, జీవితంలో మొదటిసారిగా సెక్స్‌కి ఉపక్రమించే భార్యాభర్తలు– ఆరోగ్యకరమైన, పాజిటివ్‌ దృక్పథంతో బిడ్డని ఈ జాతికి అందిస్తారని వారి ఆలోచన. ఇప్పుడివన్నీ బూతు మాటలు. మన సంస్కృతిలో వివాహాన్ని ‘రేప్‌’తో ముడిపెట్టారని ఆ రోజుల్లోనే దుయ్యబట్టారు చలం.
విదేశీయులకి ఇంత గొడవలేదు. వారికి సెక్స్‌ ఓ ఆట విడుపు. విసుగుదల నుంచి అప్పటికి విముక్తి, నరాల ఆకలి, ఆకర్షణ, బలహీనత, ఆయుధం, అవ కాశం, అవసరం– ఏదయినా. సెక్స్‌తో ఎంగిలి పడినందుకు అక్కడెవరూ జుత్తు పీక్కోరు. పక్కవాడి జుత్తు పీకరు.
ఏతావాతా మనకి జరిగిన నష్టం ఏమిటి? ఓ 50 సంవత్సరాల ‘తెలుగు సినీమా’ కథ అటకెక్కిపో యింది. ఇప్పుడు ఇద్దరు ప్రేమికులు, రెండు పెళ్లిళ్లు, మగాడితో పెళ్లి, పెళ్లి కాకుండా కాపురాలు వంటి కొత్త కథలు వచ్చాయి. వీటికి విదేశీ వాసన ఉందా? మన జీవితాలకే విదేశీ ‘కంపు’ పట్టేసింది. కథలకి ఏమొచ్చింది?

కెవిన్‌ స్పేసీ చాలా చక్కని హాలీవుడ్‌ నటుడు. అందగాడు. ఆయన నాలుగు కోట్ల డాలర్ల సినీమా ‘ఆల్‌ ది మనీ ఇన్‌ ది వరల్డ్‌’లో నటించాడు. సినీమా పూర్తయిపోయింది. ఇందులో 800 మంది నటులు, రచయితలు, కళాకారులు, నిపుణులు పనిచేశారు. డిసెంబర్‌ 22న రిలీజు తేదీని కూడా ప్రకటించారు. ఇప్పుడు ఉన్నట్టుండి కనీసం ఓ డజనుమంది మగా ళ్లతో ఈ నటుడి లీలలు బయటపడ్డాయి. 2016లో తన 18 ఏళ్ల కొడుకుతో ఈ స్పేసీ సెక్స్‌ నడిపారని ఓ బోస్టన్‌ టెలివిజన్‌ జర్నలిస్టు కథ బయటపెట్టింది. 9 కోట్ల సినీమాకి ఇది పెద్ద దెబ్బ కదా? మరి ఏంచేయాలి? రిడ్లీ స్కాట్‌ అనే ప్రఖ్యాత దర్శకుడు–నిర్మాణం పూర్త యిన ఈ చిత్రంలోంచి స్పేసీ సీన్లన్నీ తీసేయడానికి సిద్ధపడ్డాడు. ఈ పాత్రని లోగడ చరిత్రని సృష్టించిన ‘సౌండ్‌ ఆఫ్‌ మ్యూజిక్‌’ హీరో క్రిస్టొఫర్‌ ప్లమ్మర్‌ని పెట్టి మళ్లీ షూటింగు చేస్తారు. అపకీర్తి నుంచి సినీమాని కాపాడి ఇంతవరకెన్నడూ జరగని పని చేసి–దాన్ని చరిత్రగా మార్చడం ఒక్క హాలీవుడ్‌కే చెల్లును.

అయితే ఇలాంటి చరిత్రలు హాలీవుడ్‌కి కొత్త కాదు. రొమాన్‌ పొలాన్‌స్కీ అనే పోలెండు దర్శకుడిని నేను బెంగళూరు చిత్రోత్సవంలో చూశాను. చాలా అందగాడు. కొన్ని సినీమాల్లో నటించాడు. ఆయన పత్రికా సమావేశంలో నేనున్నాను. ‘‘మా దేశపు ఫిలిం టెక్నిక్‌ గురించి మీ అభిప్రాయం ఏమిటి?’’ అని ఆయన్ని ఎవరో అడిగారు. సమాధానంగా ఆయన ఎవరో కార్యకర్తని పిలిచి ‘‘వెనుక వెలుగుతున్న స్పాట్‌ని ఆపుతారా? నా జుత్తు కాలుతోంది’’ అన్నారు. అప్పటికే విదేశాల్లో back light ధోరణి వెనుకపడుతోంది.

1978లో ఈ అందగాడు 13 ఏళ్ల అమ్మాయితో – ఒక పార్టీలో స్విమ్మింగ్‌ ఫూల్‌ పక్కన రొమాన్స్‌ జరిపి– పట్టుబడకుండా, చట్టాన్ని తప్పించుకుని స్విట్జర్లాండు పారిపోయాడు. తరువాత చాలా ఏళ్లకి ‘ది పియానిస్ట్‌’  (2002) అనే అద్భుతమైన చిత్రానికి ఆయనకి ఆస్కార్‌ బహుమతి వచ్చింది. అయితే చట్టానికి భయపడి ఈయన అమెరికా రాలేదు. అంతకు ఆరేళ్ల ముందు ఈయన ఓ 15 సంవత్సరాల జర్మన్‌ తార రెనేట్‌ లాంగ ర్‌ని రేప్‌ చేశాడట. ఈవిడ ఈ మధ్యనే బయట పెట్టింది. ఇంతకాలం ఎందుకు ఆగింది? ఈ మధ్యనే మరొక మహిళ – తన తల్లిదండ్రులు పోయినందున –ఇక ఇబ్బంది లేదనుకొని తనపై జరిగిన అత్యాచా రాన్ని బయటపెట్టింది కనుక. మరో నలుగురు కన్నె వయసు పిల్లలపై ఈ దర్శకుడు అత్యాచారం జరి పాడట. 1978లో ఈయన జరిపిన అమెరికా నేరానికి 2009లో స్విట్జర్లాండు అధికారులు ఈయన్ని అరెస్టు చేశారు. అయితే ఇప్పుడీయన వయస్సు 84. బొత్తిగా ముసలివాడయిపోయాడని ప్రాసిక్యూషన్‌ తమ అభియోగాన్ని ఉపసంహరించుకుంది.

సరే. హాలీవుడ్‌ నిర్మాత హార్వీ వీన్‌స్టీన్‌ రుచి కరమైన లీలల్ని ఈ మధ్య విరివిగా చదువుకుంటున్నాం. డీ లా హురితా అనే తారని ఈయన 2010 లో రెండుసార్లు రేప్‌ చేశాడట. ఇలా హాలీవుడ్‌లో కేవలం 80 మంది మాత్రమే ఈయన సెక్స్‌ విన్యాసాల గురించి బయటపెట్టారు.

సెక్స్‌ ప్రాథమికంగా పశు ప్రవృత్తి. ఆ క్షణంలో పశువుకీ, మనిషికీ పెద్ద వ్యత్యాసం లేదు. దానికి జాతి పరిణతితో, సంప్రదాయ వైభవంతో, సంస్కారంతో అద్భుతమైన విలువల్ని మన పెద్దలు సంతరించి పెట్టారు. పరాయి స్త్రీని ‘అమ్మా’ అనడానికి కొన్ని శతా బ్దాల మానసిక విప్లవాన్ని ఈ జాతి కొనసాగించింది. మొన్నటిదాకా కొనసాగిస్తోంది. అక్కడ–మేధస్సు ఆకా శంలో విహరిస్తున్నా–సంస్కారాన్ని అధఃపాతాళంలో మరిచిపోయిన ముగ్గురు చిత్ర ప్రముఖుల కథలివి.


- గొల్లపూడి మారుతీరావు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement