వాట్సాప్‌లో దేవులపల్లిపై దుష్ప్రచారం | gollapudi maruthi rao condemns Whatsapp rumours about Devulapalli krishnasastri | Sakshi
Sakshi News home page

వాట్సాప్‌లో దేవులపల్లిపై దుష్ప్రచారం

Published Sat, Oct 29 2016 9:26 AM | Last Updated on Fri, Jul 27 2018 2:01 PM

వాట్సాప్‌లో దేవులపల్లిపై దుష్ప్రచారం - Sakshi

వాట్సాప్‌లో దేవులపల్లిపై దుష్ప్రచారం

  • కృష్ణశాస్త్రి నన్ను అప్పు అడగడం ఎంతమాత్రం వాస్తవం కాదు
  • వివరణ ఇచ్చిన రచయిత గొల్లపూడి మారుతీరావు

  • విశాఖ: ప్రముఖ కవి, సినీ గేయ రచయిత దివంగత దేవులపల్లి కృష్ణశాస్త్రిపై వాట్సాప్‌లో జరుగుతున్న ప్రచారం వాస్తవం కాదని, పాఠకులు, ఆయన అభిమానులు ఇది నమ్మవద్దని ప్రముఖ రచయిత గొల్లపూడి మారుతీరావు తెలిపారు. దేవులపల్లి తన ఇంటికి వచ్చి బ్రేక్‌ఫాస్ట్‌ చేసి, కళ్లనీళ్లు పెట్టుకొని కారు కొనుక్కునేందుకు అప్పు అడిగారని, ఆయనకు తాను ఇచ్చానని.. కట్టుకథలా రాసి వాట్సాప్‌లో పోస్టు చేయడం విచారకరమన్నారు. ఈ సందేశాన్ని చాలామంది తనకు పంపించారని.. దీనిని చదివి, తాను ‘సాక్షి’ ద్వారా వివరణ ఇచ్చేందుకు ముందుకు వచ్చానన్నారు.

    సంపన్నుడైన కృష్ణశాస్త్రి తనను అప్పు అడగడం నిజం కాదని మారుతీరావు అన్నారు. వాట్సాప్‌ సందేశంలో చాలా తప్పులున్నాయని, దేవులపల్లి ఎప్పుడూ ఫియట్‌ కారులో పయనించలేదని, ఆయన అంబాసిడర్‌ కారు వాడేవారని చెప్పారు. గొంతు మూగబోయిన తర్వాత పలక మీద సుద్ద, బలపంతో రాసేవారని ప్రచారం చేస్తున్నారని, కృష్ణశాస్త్రి ఎప్పుడూ పుస్తకాల మీద రాసే వారని వివరణ ఇచ్చారు. ఇప్పటికీ ఆ పుస్తకాలు వారి కుమారుడు బుజ్జాయి దగ్గర ఉన్నాయని తెలిపారు. తనకంటే 45 ఏళ్లు పెద్దవాడైన శాస్త్రిగారితో కలసి పనిచేయడం తనలాంటి వారికి ఎంతో అదృష్టమని చెప్పారు. దేవులపల్లి ఏనాడూ తన ఇంట్లో బ్రేక్‌ఫాస్ట్‌ చేయలేదని, ఆయన తన ఇంటికే ఎన్నడూ రాలేదన్నారు.

    వాట్సాప్‌ ప్రచారంలో ఎనిమిదేళ్ల కింద ఆత్మకథలో తాను రాసుకున్న కొన్ని విషయాలను వక్రీకరించారన్నారు. తాను దేవులపల్లి గురించి పేర్కొన్నది 246వ పేజీలో స్పష్టంగా ఉందన్నారు. మద్రాసు ఆలిండియా రేడియోకు వచ్చి, తిరిగి వెళుతున్నప్పుడు ఆయనను సాగనంపడానికి వెళ్లిన తనకు.. ‘డబ్బులేదు..  కారు అమ్మేయాలనుకుంటున్నాను’ అని రాసి చూపించారన్నారు.

    ‘అదేం వద్దు. పాటలు రాయండ’ని తాను సూచించానని, ‘ఎవరూ రావడం లేద’ని ఆయన పేర్కొనడంతో.. ‘మీరు రాస్తానంటే నేను తీసుకువస్తాన’ని చెప్పానన్నారు. అలా అమెరికా అమ్మాయి సినిమా తీస్తున్న నవత కృష్ణంరాజు గారికి పరిచయం చేశానని.. ఆ సినిమాకు శాస్త్రి గారు రాసిన ‘పాడనా తెలుగుపాట.. పరవశనై నీ ఎదుట నా పాట’ మకుటాయమానంగా నిలిచిందన్నారు. 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement