కర్ణాటక ఎన్నికల హోరులో నేతలు..
నాకెప్పుడూ మన ఎన్నికలలో తీరని కోరిక ఒకటి ఉండిపోయింది. ఆయా నాయకులు– ప్రత్యర్థులు– వేర్వేరు వేదికలమీద ఒకరినొకరిని విమర్శించుకుంటారుగానీ– చక్కగా అమెరికాలోలాగ– హిల్లరీ క్లింటన్, ట్రంప్ దొరగారిని– ఒకే వేదిక ఎక్కించి– ప్రపంచమంతా చోద్యం చూస్తుండగా భవిష్యత్తులో ఆ దేశాన్ని పాలించే నాయకుని ఘనతను గ్రహిం చడం ఎంత ముచ్చటగా ఉంటుంది? అది ఈ మధ్య కర్ణాటకలో కొంతలో కొంత ప్రారంభమయిందని నాకనిపిస్తుంది. ఆ మధ్య ఒక సభలో ప్రధాని మోదీ ఓ మాట అన్నారు: 15 నిమిషాలు చేతిలో ఏ కాగితం లేకుండా రాహుల్ గాంధీ కర్ణాటక, ముఖ్యంగా విశ్వేశ్వరయ్య గొప్పతనాన్ని గురించి చెప్పగలరా? అంటూ. ఇది చాలా కత్తిలాంటి సవాలు.
మరి మన రాహుల్ తక్కువ తినలేదు. ‘‘ఏదీ? కేవలం 5 నిమిషాలు– తాము ఈ ఎన్నికలలో నిలిపిన అభ్యర్థులు– ముఖ్యంగా యడ్యూరప్పమీద అవినీతి, క్రిమినల్ కేసులను సమర్థించమనండి. అలాగే టికెట్లు పొందిన జనార్ధనరెడ్డి హితులు 8 మంది ఘనతని ఉటంకించమనండి’’– అని రాహుల్ సవాలు విసిరారు. అయితే ఇది మరో వేదికమీద– బాగా ఆలోచించాక చెప్పిన మాటలు. కానీ వీటిని వెంట వెంటనే చెప్పగలిగితే ఎంత బాగుంటుందని నాకు ముచ్చట.
ఈ విధంగా రెండు గొప్ప సవాళ్లు– రెండు విభిన్నమయిన వేదికలమీద వృథా అయిపోయాయని నా బాధ. ఇదేగానీ అమెరికాలో లాగా ఇద్దరు ప్రత్యర్థులనూ ఒకే వేదిక మీద నిలిపి– ఒకరినొకరు ప్రశ్నిం చుకుంటే– కథ ఎంత రమ్యంగా ఉంటుంది? ఏతా వాతా అలాంటి పోటీ జరిగితే రాహుల్ తేలికగా పది మార్కులు ఎక్కువ కొట్టేస్తారు. చక్కటి ముఖ వర్చస్సు, గీసిన గెడ్డం, సొట్టలుపడే బుగ్గలు– ఇవన్నీ ప్రత్యేకమైన ఆకర్షణలు. మాసిన గెడ్డం, తెల్లటి జుత్తు, ఖరీదైన వాచీ– ఇలాంటివి మోదీ ఆకర్షణ. బొత్తిగా ముసిలి రూపు. నాకేమో– చూడగానే మొదటి రౌండు విజయం రాహల్‌ది.
ఈ తర్వాత విన్యాసాలలో రాహుల్ కొన్ని ప్రయత్నాలు చెయ్యాలి. అవసరమయితే– అటు మోదీ వెనుక యడ్యూరప్ప, మన రాహుల్ వెనుక సిద్ధరామయ్య ఉండవచ్చు. ఉదా‘‘కి కర్ణాటకలో ఓడిపోతే కాంగ్రెస్ ‘పంజాబు, పుదుచ్చేరీ, పరివార్’ పార్టీగా మిగిలిపోతుందని ఒక విసురు మోదీ విసిరారు. వెంటనే సిద్ధరామయ్య ‘అయ్యా, మాది సరే. రేపు మీరు రాష్ట్రంలో గెలవకపోతే మొదట ఇంగ్లిష్‌లో చెప్తాను. ‘ప్రిజన్, ప్రైస్ రైజ్, పకోడా’ పార్టీగా మిగిలి పోతుంది అని వాక్రుచ్చారు. నాకేమో ‘పకోడా’ కంటే ‘పరోటా’, ‘పాలకోవా’, ‘పరవాన్నం’ వంటివి వాడవచ్చుననిపించింది.
ఇంకా ఇలాంటివి మరిన్ని. ఉన్నట్టుండి రాహుల్ ఒక దొంగ ప్రశ్న అడగొచ్చు: ‘‘ఒడయార్ మేనత్త ముక్కు నత్తు బరువు ఎంత? మీకు 4 నిమిషాలు టైము’’ అనవచ్చు. తప్పనిసరిగా మోదీ తెల్లమొహం వేస్తారు. అప్పుడు రాహుల్ చిరునవ్వు నవ్వి ‘అసలు ఒడయార్కి మేనత్తే లేదని’ ఉటంకించవచ్చు. తద్వారా 3,479 జనానా ఓట్లు కాంగ్రెస్కి పడిపోతాయి. తరువాత కొన్ని జీకే ప్రశ్నలు అడగవచ్చు. ‘తమిళనాడు సరి హద్దు దాటగానే– అంటే హోసూరు దాటగానే– వచ్చే మొదటి గ్రామం పేరేమిటి?’ అని రాహుల్ అడిగారనుకోండి. మోదీ తక్కువ తిన్నారా? ‘తుంకూర్లోకి ప్రవేశించగానే కుడివేపు కనిపించే మొదటి సైన్ బోర్డు ఏమిటి?’ అని అడగవచ్చు.
ఇక లెక్కలవేపు వెళ్తే– గాలి జనార్ధనరెడ్డిని మనస్సులో పెట్టుకుని ‘35 వేల కోట్లలోంచి– ప్రస్తుతం ఎన్నికలకి 1,800 కోట్లు తీసేయగా ఎంత మిగులును?’ అని అడగవచ్చు. ‘ఖత్రోచీ ఇటలీ చేర్చిన సొమ్ములో 50 మిలియన్ల కోట్లకు ఎన్ని యూరోలు?’ అని మోదీ ప్రశ్నించవచ్చు. 2011లో గోవా కాంగ్రెస్ పాలనలో ఉన్నప్పుడు సోనియా ఎన్నికల ఉపన్యాసాలు చేస్తూ ‘అక్కడి మహాదయీ నది నీరు అచ్చంగా వారిదేనని హామీ ఇచ్చారు.
ఇప్పుడు గోవా చెయ్యి జారిపోయింది కనుక మహాదయీ నది ప్రసక్తి లేదు’ అంటూ దీన్ని కాంగ్రెస్ ‘అట్కానా, భట్కానా, లట్కానా’ అన్నారు. ఇలాంటి మాటలు మన రాహుల్కి దొరక్కపోవచ్చు, అయితే వారు అప్పుడప్పుడూ వారి మాతృభాష అయిన ‘ఇటలీ’ని వాడే అవకాశాన్ని కల్పించుకోవచ్చు. ఏమైనా మోదీ, రాహుల్ సవాల్ చేసినందుకే సగం ఆనందిస్తూ– అలాంటి అమెరికా పోటీల రోజులు మనకీ త్వరలో వస్తాయని ఆశిద్దాం.
గొల్లపూడి మారుతీరావు
Comments
Please login to add a commentAdd a comment