criticizing
-
అరచేతిలో స్వర్గం చూపిస్తున్న బాబు
సాక్షి,చల్లపల్లి(అమరావతి) : ఊసరవెల్లి కంటే వేగంగా రంగులు మార్చే చంద్రబాబును నమ్మితే అరచేతిలో స్వర్గం చూపిస్తాడని వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి కొలుసు పార్థసారథి అన్నారు. శుక్రవారం మండల పరిధిలోని కొత్తమాజేరు ప్రధాన కూడలిలో వైఎస్సార్సీపీ జెండా దిమ్మను పార్థసారథి, మచిలీపట్నం పార్లమెంటు నియోజకవర్గ ఇన్చార్జి వల్లభనేని బాలశౌరి, అవనిగడ్డ నియోజకవర్గ సమన్వయకర్త సింహాద్రి రమేష్‌బాబు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పార్థసారధి మాట్లాడుతూ నాలుగేళ్ల పాలనలో రాష్ట్రాన్ని లక్షన్నర కోట్ల అప్పుల్లో ముంచిన చంద్రబాబు, ఎంతసేపూ తన కొడుక్కి కోట్లు కూడబెట్టే పనిలో లీనమయ్యారని విమర్శించారు. ఎన్నికల ముందు వెయ్యి రూపాయలిచ్చి అన్నదాత సుఖీభవ అంటున్న చంద్రబాబు రైతు రుణమాఫీ 4, 5 విడతల బకాయిలు ఎప్పుడిస్తారో చెప్పాలని ప్రశ్నించారు. రైతులకు గిట్టుబాటు ధర, సాగునీరు ఇవ్వని చంద్రబాబును రైతులు నమ్మే పరిస్థితి లేదన్నారు. జగన్ ప్రకటించిన నవరత్నాలు, బీసీ డిక్లరేషన్ బడుగు బలహీన వర్గాలు అన్ని రకాలుగా అభివృద్ధి సాధించేందుకు తోడ్పడతాయన్నారు. బాలశౌరి మాట్లాడుతూ నాడు తల్లి కాంగ్రెస్–పిల్ల కాంగ్రెస్ అన్న చంద్రబాబు ఇప్పుడు రాహుల్‌తో బాబాయ్–అబ్బాయ్‌లా తిరుగుతున్నాడని ఎద్దేవా చేశారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి కడవకొల్లు నరసింహారావు, బాలకోటేశ్వరరావు, అన్నపరెడ్డి వెంకటస్వామి, మండల పార్టీ అధ్యక్షుడు వేమూరి గోవర్థనరావు, జిల్లా కార్యదర్శులు బొందలపాటి లక్ష్మి, షేక్ దిల్షాద్ నజరానా, అబ్దుల్కరీం, మేడూరి శ్రీనివాసరావు, అరజా శివశంకర్, వడుగు నందులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. -
ఈ వక్రీకరణలు ఎందుకు?
మార్క్స్ 200వ జయంతి నాడు భారత కమ్యూనిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శి సుధాకర రెడ్డి గారు ఓ వ్యాసం రాశారు. దానిలో ప్రతి వాక్యమూ ఒక ఆణి ముత్యమే. నేనిక్కడ కొన్ని ముత్యాలకే పరిమితమవుతాను. ‘‘సోవియట్ యూనియన్ విచ్ఛిన్నమైన తరువాత’’ సామ్రాజ్యవాదులు అనేక వక్రీకరణలకు పాల్పడ్డారు అంటారు రచయిత. అంతకుముందు మార్క్సిజం వక్రీకరణలకే గురి కాలేదా? వక్రీకరించినవాళ్లంతా సామ్రాజ్యవాదులేనా? కమ్యూనిస్టు పేరు తగిలించుకొన్నవాళ్లు వక్రీకరించనే లేదా? ‘‘మార్క్స్ ప్రతిపాదించిన సిద్ధాంతం వైఫల్యం చెందిందని ... సామ్రాజ్యవాదులు విస్తృత ప్రచారం’’ చేశారంటారు రచయిత. నిజమే. మార్క్సిజం అజేయం అనడానికి సోవియట్ యూనియనే తార్కాణం అని మీరు లక్ష సార్లు చెప్పారు. అందుకే ఆ తార్కాణం కూలిపోగానే మార్క్సిజమే కూలిపోయిందని జనం అనుకొన్నారు. అదే శత్రువులు ప్రచా రం చేశారు. ‘‘సామ్రాజ్యవాదులకు ... విమర్శించే హక్కు లేదు’’ అని ఆయన ఒక ఫర్మానా జారీ చేశారు. అది సరే. కాని విమర్శించేవాళ్లందరూ సామ్రాజ్యవాదులేనా? ఒకరడిగినా అడగకపోయినా వివరణ ఇవ్వాల్సిన బాధ్యత కమ్యూనిస్టు నాయకులకు ఉండనే ఉండదా? తమ సొంత స్పష్టత కోసమైనా పొరపాటు ఎక్కడ జరిగిందో శోధించాల్సిన పనిలేదా? మార్క్స్‌నీ జయాపజయాల చరిత్రనీ క్షుణ్ణంగా అధ్యయనం చేశారా? పోనీ ఆ దిశగా మీరు రెండడుగులయినా వేశారా, చెప్పండి. ‘‘1978 తదనంతరం మావో వారసుడు డెంగ్‌జియావో పింగ్ నాయకత్వంలో అనేక సంస్కరణలను తీసుకురావడం జరిగింది. తత్ఫలితంగా 80 కోట్ల ప్రజలు పేదరికం నుంచి విముక్తి పొందారు.’’ అంటారు సుధాకర్జీ. ప్రపంచంలో నయా ఉదారవాదాన్ని సంస్కరణలనే పేరుతో అధికారికంగా ప్రారంభించిన ముగ్గురిలో థాచర్, రీగన్లతో పాటు డెంగ్ ఒకడు. సుధాకర్జీ, మీరూ మీ పార్టీ సంస్కరణలనబడే వాటిని వ్యతిరేకించారు. అదే పనిచేసిన డెంగ్‌ని ఎలా పొగుడుతారు? ‘‘సోవియట్ ప్రభుత్వం... బ్యాంకులను పరి శ్రమలను జాతీయం చేసి అనేక విజయాలను సాధించింది.’’ అన్నారు సుధాకర్జీ. కాని రష్యాలో చైనాలో జాతీయం చేయడానికీ మార్క్స్ ప్రేరణ, చైనాలో ప్రభుత్వ ఆస్తులను సొంత ఆస్తులుగా మార్చిన డెంగ్కీ మార్క్స్ ప్రేరణ అంటే ఎలా సుధాకర్జీ. ‘‘దక్షిణ అమెరికాలో వెనిజులా బొలీవియా నికరాగువా మరికొన్ని దేశాలు ప్రపంచ బ్యాంకు, అంతర్జాతీయ ద్రవ్య సంస్థల... ఒత్తిడులకు లొంగకుండా స్వంత బ్యాంకులను నిర్మించుకొన్నాయి’’ అన్నారు రచయిత. కాని ఆ దేశాలు బ్యాంక్‌లో ఇంతవరకూ డిపాజిట్లు కట్టనేలేదనీ అసలు పని మొదలే కాలేదనీ ఈ నాయకునికి తెలుసా? ఇంకో ఆణిముత్యం ‘ఈ నేపథ్యంలోనే రష్యాతో సహా అనేక తూర్పు యూరప్ దేశాల్లో కమ్యూనిస్టులు ముందుకు సాగుతూనే ఉన్నారు’. ఏమిటీ, అక్కడ కమ్యూనిస్టులు ముందుకు సాగుతున్నారా ఈ అభినవ రిప్ వాన్ వింకిల్ నిద్ర లేచి ఎంత కాలమైంది? ‘తింటానికి తిండి, కట్టుకోవడానికి బట్ట, ఉండడానికి ఇల్లు, చేయడానికి ఒక గౌరవప్రదమైన ఉద్యోగం’’ ఇచ్చే సోషలిస్టు సమాజమట! సోషలిజం అంటే ఇదేనా? కార్మికోద్యమ లక్ష్యం వేతన వ్యవస్థని రద్దు చేయడమే అన్న మార్క్స్ ఈ రచయితకు తెలుసా? అంటే ఆ వ్యవస్థలో యజమానీ ఉండడు. కూలీ ఉండడు. పని చేసేవాడే యజమాని. పనిచేసేవాళ్లదే అధికారం. అటువంటి వ్యవస్థ సోవియట్‌లో గాని చైనాలో గాని ఇంక ఎక్కడా గాని ఏర్పడనేలేదు. ఎందుకో సమీక్షించుకోవాల్సిన ‘అధికార’ కమ్యూనిస్టులు మాత్రం గానుగెద్దుని ఆదర్శంగా తీసుకొన్నారు. ఆర్థిక సంక్షోభాలు వచ్చిన ప్రతిసారీ పెట్టుబడిదారీ ప్రపంచంలో దూరం చూడగలిగినవారంతా మార్క్స్‌ని తలుచుకొంటున్నారు. ఉలిక్కిపడుతున్నారు. అక్కడ మార్క్స్ సజీవంగా ఉన్నాడు. అధికార కమ్యూనిస్టులు మాత్రం మార్క్స్ విగ్రహాలను పూజిస్తున్నారు. ఆ పూజకు అర్థం లేదు. ఆ విగ్రహంలో ప్రాణం లేదు. అదే విడ్డూరం. అదే విషాదం. (మే 5న సాక్షిలో వచ్చిన సురవరం సుధాకర రెడ్డి ‘‘గమ్యం గమనం మార్క్సిజమే’’ వ్యాసంపై స్పందన. దీని పూర్తి పాఠం ఈ లింకులో చూడండి : https://bit.ly/2jLIhg3) – వ్యాసకర్త: ఎ. గాంధీ, సంపాదకుడు, పీకాక్ క్లాసిక్స్ మొబైల్ : 91605 20830 -
ఎకాఎకీ - ముఖాముఖీ
నాకెప్పుడూ మన ఎన్నికలలో తీరని కోరిక ఒకటి ఉండిపోయింది. ఆయా నాయకులు– ప్రత్యర్థులు– వేర్వేరు వేదికలమీద ఒకరినొకరిని విమర్శించుకుంటారుగానీ– చక్కగా అమెరికాలోలాగ– హిల్లరీ క్లింటన్, ట్రంప్ దొరగారిని– ఒకే వేదిక ఎక్కించి– ప్రపంచమంతా చోద్యం చూస్తుండగా భవిష్యత్తులో ఆ దేశాన్ని పాలించే నాయకుని ఘనతను గ్రహిం చడం ఎంత ముచ్చటగా ఉంటుంది? అది ఈ మధ్య కర్ణాటకలో కొంతలో కొంత ప్రారంభమయిందని నాకనిపిస్తుంది. ఆ మధ్య ఒక సభలో ప్రధాని మోదీ ఓ మాట అన్నారు: 15 నిమిషాలు చేతిలో ఏ కాగితం లేకుండా రాహుల్ గాంధీ కర్ణాటక, ముఖ్యంగా విశ్వేశ్వరయ్య గొప్పతనాన్ని గురించి చెప్పగలరా? అంటూ. ఇది చాలా కత్తిలాంటి సవాలు. మరి మన రాహుల్ తక్కువ తినలేదు. ‘‘ఏదీ? కేవలం 5 నిమిషాలు– తాము ఈ ఎన్నికలలో నిలిపిన అభ్యర్థులు– ముఖ్యంగా యడ్యూరప్పమీద అవినీతి, క్రిమినల్ కేసులను సమర్థించమనండి. అలాగే టికెట్లు పొందిన జనార్ధనరెడ్డి హితులు 8 మంది ఘనతని ఉటంకించమనండి’’– అని రాహుల్ సవాలు విసిరారు. అయితే ఇది మరో వేదికమీద– బాగా ఆలోచించాక చెప్పిన మాటలు. కానీ వీటిని వెంట వెంటనే చెప్పగలిగితే ఎంత బాగుంటుందని నాకు ముచ్చట. ఈ విధంగా రెండు గొప్ప సవాళ్లు– రెండు విభిన్నమయిన వేదికలమీద వృథా అయిపోయాయని నా బాధ. ఇదేగానీ అమెరికాలో లాగా ఇద్దరు ప్రత్యర్థులనూ ఒకే వేదిక మీద నిలిపి– ఒకరినొకరు ప్రశ్నిం చుకుంటే– కథ ఎంత రమ్యంగా ఉంటుంది? ఏతా వాతా అలాంటి పోటీ జరిగితే రాహుల్ తేలికగా పది మార్కులు ఎక్కువ కొట్టేస్తారు. చక్కటి ముఖ వర్చస్సు, గీసిన గెడ్డం, సొట్టలుపడే బుగ్గలు– ఇవన్నీ ప్రత్యేకమైన ఆకర్షణలు. మాసిన గెడ్డం, తెల్లటి జుత్తు, ఖరీదైన వాచీ– ఇలాంటివి మోదీ ఆకర్షణ. బొత్తిగా ముసిలి రూపు. నాకేమో– చూడగానే మొదటి రౌండు విజయం రాహల్ది. ఈ తర్వాత విన్యాసాలలో రాహుల్ కొన్ని ప్రయత్నాలు చెయ్యాలి. అవసరమయితే– అటు మోదీ వెనుక యడ్యూరప్ప, మన రాహుల్ వెనుక సిద్ధరామయ్య ఉండవచ్చు. ఉదా‘‘కి కర్ణాటకలో ఓడిపోతే కాంగ్రెస్ ‘పంజాబు, పుదుచ్చేరీ, పరివార్’ పార్టీగా మిగిలిపోతుందని ఒక విసురు మోదీ విసిరారు. వెంటనే సిద్ధరామయ్య ‘అయ్యా, మాది సరే. రేపు మీరు రాష్ట్రంలో గెలవకపోతే మొదట ఇంగ్లిష్‌లో చెప్తాను. ‘ప్రిజన్, ప్రైస్ రైజ్, పకోడా’ పార్టీగా మిగిలి పోతుంది అని వాక్రుచ్చారు. నాకేమో ‘పకోడా’ కంటే ‘పరోటా’, ‘పాలకోవా’, ‘పరవాన్నం’ వంటివి వాడవచ్చుననిపించింది. ఇంకా ఇలాంటివి మరిన్ని. ఉన్నట్టుండి రాహుల్ ఒక దొంగ ప్రశ్న అడగొచ్చు: ‘‘ఒడయార్ మేనత్త ముక్కు నత్తు బరువు ఎంత? మీకు 4 నిమిషాలు టైము’’ అనవచ్చు. తప్పనిసరిగా మోదీ తెల్లమొహం వేస్తారు. అప్పుడు రాహుల్ చిరునవ్వు నవ్వి ‘అసలు ఒడయార్కి మేనత్తే లేదని’ ఉటంకించవచ్చు. తద్వారా 3,479 జనానా ఓట్లు కాంగ్రెస్‌కి పడిపోతాయి. తరువాత కొన్ని జీకే ప్రశ్నలు అడగవచ్చు. ‘తమిళనాడు సరి హద్దు దాటగానే– అంటే హోసూరు దాటగానే– వచ్చే మొదటి గ్రామం పేరేమిటి?’ అని రాహుల్ అడిగారనుకోండి. మోదీ తక్కువ తిన్నారా? ‘తుంకూర్లోకి ప్రవేశించగానే కుడివేపు కనిపించే మొదటి సైన్ బోర్డు ఏమిటి?’ అని అడగవచ్చు. ఇక లెక్కలవేపు వెళ్తే– గాలి జనార్ధనరెడ్డిని మనస్సులో పెట్టుకుని ‘35 వేల కోట్లలోంచి– ప్రస్తుతం ఎన్నికలకి 1,800 కోట్లు తీసేయగా ఎంత మిగులును?’ అని అడగవచ్చు. ‘ఖత్రోచీ ఇటలీ చేర్చిన సొమ్ములో 50 మిలియన్ల కోట్లకు ఎన్ని యూరోలు?’ అని మోదీ ప్రశ్నించవచ్చు. 2011లో గోవా కాంగ్రెస్ పాలనలో ఉన్నప్పుడు సోనియా ఎన్నికల ఉపన్యాసాలు చేస్తూ ‘అక్కడి మహాదయీ నది నీరు అచ్చంగా వారిదేనని హామీ ఇచ్చారు. ఇప్పుడు గోవా చెయ్యి జారిపోయింది కనుక మహాదయీ నది ప్రసక్తి లేదు’ అంటూ దీన్ని కాంగ్రెస్ ‘అట్కానా, భట్కానా, లట్కానా’ అన్నారు. ఇలాంటి మాటలు మన రాహుల్‌కి దొరక్కపోవచ్చు, అయితే వారు అప్పుడప్పుడూ వారి మాతృభాష అయిన ‘ఇటలీ’ని వాడే అవకాశాన్ని కల్పించుకోవచ్చు. ఏమైనా మోదీ, రాహుల్ సవాల్ చేసినందుకే సగం ఆనందిస్తూ– అలాంటి అమెరికా పోటీల రోజులు మనకీ త్వరలో వస్తాయని ఆశిద్దాం. గొల్లపూడి మారుతీరావు -
‘కేసీఆర్‌ను విమర్శిస్తే సహించం’
బోధన్ టౌన్, న్యూస్‌లైన్ : తెలంగాణ పోరాట యోధుడు, టీఆర్ఎస్ అధినేత కె.చంద్రశేఖరరావును విమర్శిస్తే సహించబోమని తెలంగాణ జాగృతి మండల కన్వీనర్ మీర్జాపూర్ హరిశంకర్ సీమాంధ్ర నాయకులను హెచ్చరించారు. కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ, కేసీఆర్ చిత్రపటాలకు పెళ్లి చేసిన సీమాంధ్రుల చేష్టలను నిరసిస్తూ ఆదివారం బోధన్ పాత పోస్టాఫీసు వద్ద కేసీఆర్ ఫ్లెక్సీకి పాలాభిషేకం, పుష్పాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజల ఆకాంక్ష మేరకు ప్రత్యేక రాష్ట్రం కోసం పోరాడిన యోధుడు కేసీఆర్ అన్నారు. హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఆస్తులున్నవారే సీమాంధ్రులను రెచ్చగొట్టి సమైక్యాంధ్ర ఉద్యమాన్ని నడిపిస్తున్నారని ఆరోపించారు. తెలంగాణ ఉద్యమకారులను అవమానించొద్దని హితవు పలికారు. కార్యక్రమంలో నాయకులు రవిశంకర్, సురేశ్, వినయ్, రవి, సాయిలు, కోక రవి, మల్లెపూల శంకర్, గణేశ్, ప్రకాశ్‌గుప్తా, సిద్దూ తదితరులు పాల్గొన్నారు. కుట్రలు మానండి ఆర్మూర్, న్యూస్‌లైన్ : తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు అనుకూలమని చెప్పినవారే ప్రస్తుతం మాటమార్చి కృత్రిమ సమైక్యాంధ్ర ఉద్యమాన్ని నడిపిస్తున్నారని ఉద్యోగ సంఘాల జేఏసీ చైర్మన్ గైని గంగారాం ఆరోపించారు. తెలంగాణకు వ్యతిరేకంగా పెట్టుబడిదారు లు, సీమాంధ్ర పాలకులు చేస్తున్న కుట్రలను ఖండిం చారు. ఆదివారం ఆర్మూర్‌లో సీమాంధ్ర నాయకుల దిష్టిబొమ్మను దహనం చేశారు. కార్యక్రమంలో ఆయ న మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు అనుకూలమని, అడ్డుకోబోమని చెప్పిన పార్టీలు.. ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు ప్రకటనను జీర్ణించుకోలేక యూ టర్న్ తీసుకున్నాయని విమర్శించారు. దీంతో వారి అసలు స్వరూపం బయటపడిందన్నారు. కుట్రలు మానాల ని సీమాంధ్ర నేతలకు సూచించారు. అన్నదమ్ములు గా విడిపోయి ప్రాంతాలుగా కలిసి ఉందామన్నారు. కార్యక్రమంలో జేఏసీ మండల చైర్మన్ దేవరాం, ఉద్యోగ సంఘాల ఉమ్మడి జేఏసీ చైర్మన్ పెంట జలంధర్, జేఏసీ నాయకులు నరేందర్ నాయక్, సత్తెక్క, మచ్చేందర్, సురేశ్, నర్సయ్య, కిషన్, రాజేశ్వర్, రాచర్ల దశరథ్ తదితరులు పాల్గొన్నారు.