
అమెరికా.. భూతాల స్వర్గం
జీవన కాలమ్
ట్రంప్ మాటల్లో ఆయన తన జాతిపట్ల అభిమానాన్నే చాటుకున్నాననుకున్నారు. కానీ కొందరు ఇతర జాతులపట్ల తమ దురభిమానంగా దాన్ని తర్జుమా చేసు కున్నారు. ఇందుకు భారతీయులే ‘ఎర’ కావడం ఇంకా దురదృష్టకరం.
వైష్ణవ స్వాముల ప్రవచనాలు జరిగినప్పుడు–ప్రత్యేకంగా కార్యకర్తలు అందరూ నామాలు పెట్టుకుని కనిపి స్తారు–పవిత్రంగా. అంతే కాదు. ప్రవచనానికి వచ్చేవా రందరికీ నామాలు పెడుతుం టారు. ఈ ప్రవచనానికి ముందూ ఆ తర్వాతా వీరు నామాలతో కనిపించరు. కానీ ఆ ప్రవచనాలు జరిగే నాలుగు రోజులూ వైష్ణవ భక్తులైపోతారు. ఎందుకని? ప్రవచనం చెప్పే స్వామి మార్గదర్శకత్వం అది. ఆ నాలుగు రోజులూ ‘వైష్ణవ తత్వం’ వారిలో విరా జిల్లుతుంది. ఇది ఓ ప్రముఖ వ్యక్తి సమాజం మీద చెయ్యగల ప్రభావం. ఆ నాలుగు రోజులూ ఆ స్వామి సమక్షం భూతద్దం. వారి సముఖంలో ఓ సదాచారం సుసంపన్నమవుతుంది.
అప్పుడప్పుడు ఈ ప్రవచన కర్తలు–‘రేపు శ్రీరామ నవమి. భక్తులకు వడపప్పు ప్రసాదంగా ఇవ్వడానికి తలో పావుసేరు పెసరపప్పు తెమ్మంటార’నుకోండి. మర్నాడు తేలికగా 100 కిలోల పెసరపప్పు పోగవు తుంది. ఒక ప్రముఖుని సత్సంకల్పం భూతద్దం. ఆ సత్యార్యం వారి ఉద్దేశాన్ని సంపన్నం చేస్తుంది. సామూ హికమైన విశ్వాసానికీ, సామూహికమైన వితరణకీ ఓ పెద్దరికం పెట్టుబడి. మరో విధంగా చెప్పాలంటే– వ్యక్తి గత స్వభావాన్ని ఒక ‘ప్రముఖ వ్యక్తి’ భూతద్దంలో నిలు పుతాడు. ఆ వితరణ విశ్వరూపం దాలుస్తుంది.
ముస్లింలలో ఎందరో మహానుభావులున్నారు. అద్భుతమైన గాయకులున్నారు. కవులున్నారు. కళాకారు లున్నారు, ప్రవక్తలున్నారు, సౌందర్యవంతులైన నటులు న్నారు, నటీమణులున్నారు. ఇది ఒక పార్శ్వం. కానీ కొందరినయినా తప్పుదారి పట్టించే ఛాందసులైన మత పెద్దలున్నారు. ప్రపంచమంతటా ఉగ్రవాదాన్ని రెచ్చ గొట్టే ఐసిస్ సంస్థ అధినేతక అల్ బాగ్దాదీ ఇరాక్‌లో చేయగలిగినంత విధ్వంసాన్ని సృష్టించి ఎట్టకేలకు చేతు లెత్తేసి ‘‘ఇరాక్‌లో మనం పతనమయ్యాం. ఘోర పరా జయం తప్పదు. పారిపోండి లేదా పేల్చుకుని చచ్చి పోండి’’ అని నిన్ననే పిలుపునిచ్చారు. వ్యవస్థని నడి పించే నాయకత్వంలో ఇలాంటి ‘నెగటివ్’ ధోరణి ఎంత భయంకరమో చెప్పడానికి ఇది నిదర్శనం.
ఒక నాయకుని వాచాలత్వం, బాధ్యతారహితమైన ధోరణి, అకారణమైన అసహిష్ణుత, ఆలోచనారహిత మైన ఆవేశం ఎంతటి దుష్పరిణామాలకు దారితీయగ లదో గత 43 రోజులుగా అమెరికాలో మనం చూస్తు న్నాం. నాయకుడు మాట తూలితే–అంతగా ఆలోచించ లేని సామాన్యపౌరుడు–దాన్ని ‘ఊతం’ చేసుకుంటాడు.
‘‘నాకు నావాళ్లే ముఖ్యం. మిగతావాళ్ల సంగతి నాకనవసరం’’ అనడం బాగానే ఉంటుంది. అది తన దేశీయులపట్ల ‘అభిమానం’ అనిపించవచ్చు. కానీ నాయకుడు ఈ మాట అంటున్నప్పుడు–ఎక్కువమంది పార్శా్వన్ని చూస్తారని ట్రంప్ వంటివారు గుర్తించక పోవటం దురదృష్టమేకాదు–అనర్థదాయకం. ట్రంప్ గారు ‘‘నాకు నావాళ్లే ముఖ్యం’’ అన్నాడు. రెచ్చిన కొందరు ‘‘మాకు మిగతావాళ్లు ముఖ్యం కాదు’’ అని అనడం లేదు. అని ఊరుకోవడం లేదు. ‘‘వాళ్లని దుర్మార్గంగా ఎదిరించే పని చేస్తున్నారు. ఇది–ఆలోచనని సరిగ్గా నియంత్రించుకోలేని నాయకుడు–ఆలోచన ప్రమేయం లేని ఆవేశపరులకు ‘చురకత్తి’ని చేతికి ఇచ్చి నట్టు. గత వారం రోజుల్లో అతి దారుణంగా కాన్సాస్‌లో కూచిభొట్ల శ్రీనివాస్‌ను ‘‘నా దేశాన్ని వదిలిపో’’ అంటూ ఒకరు కాల్చి చంపారు. దక్షిణ కెరొలినాలో హర్నీష్ పటేల్ అనే వ్యాపారిని కాల్చారు. తాజాగా వాషింగ్టన్ (కెంట్)లో దీప్‌రాయ్ అనే వ్యక్తిమీద మొహానికి గుడ్డ కట్టుకున్న అమెరికన్ కాల్చాడు. నిన్ననే సియాటిల్‌లో జస్మిత్ సింగ్‌ని కాల్చారు. ఏక్తాదేశాయ్ అనే అమ్మాయిని న్యూయార్క్ సమీపంలో ఒక అమెరికన్ ఆఫ్రికన్ అవమానించాడు–అందరిముందూ. ఇది విచక్షణ తెలి యని పెద్దల మాటకు– పెద్దరికం చాలని వ్యక్తులు పట్టిన ‘భూతద్దం’. చాలా ప్రమాదకరమైన భూతద్దం. కొత్త వారిని రానివ్వని చట్టాలు కొంతవరకూ బాధపెట్టేవే. కానీ ఉన్నవారిని దారుణంగా హత్యలు చేసే ఆలోచనా ధోరణికి అమెరికా అధ్యక్షుడు కారణం కావడం చాలా చాలా ప్రమాదకరమైన పరిణామం.
భూతద్దానికి ఒక దుర్మార్గం ఉంది. దానికింద ఉంచిన ఏ వస్తువునయినా ప్రస్ఫుటంగా చూపిస్తుంది– అది మంచయినా, చెడయినా. బాధ్యతగల అధికారంలో ఉన్న పెద్దల మాట విచక్షణ లేని భూతద్దం లాంటిది. ట్రంప్ మాటల్లో ఆయన తన జాతిపట్ల అభిమానాన్నే చాటుకున్నాననుకున్నారు. కానీ కొందరు ఇతర జాతు లపట్ల తమ దురభిమానంగా దాన్ని తర్జుమా చేసుకు న్నారు. ప్రమాదకరంగా చాటుకున్నారు. ప్రాణాలు తీస్తు న్నారు. ఇందుకు భారతీయులే ‘ఎర’ కావడం ఇంకా దురదృష్టకరం. డల్లస్ నుంచి మా మిత్రుడు ఒక సందేశం పంపాడు: ‘‘ఇకముందు అమెరికాలో జీవనం ‘భూతల స్వర్గం’ కాదు. ‘భూతాల’ స్వర్గం అని.
- గొల్లపూడి మారుతీరావు