అవినీతీ! నీవెక్కడ?
♦ జీవన కాలమ్
సమాధానాలు చాలామందికి తెలుసు. అవినీతికి పెట్టుబడి అవసరం మాత్రమే కాదు, చెల్లుబాటు అవుతుందన్న ధైర్యం. అవినీతి వ్యవస్థ బలహీనతకి నిదర్శనం. నాయకత్వ శీలానికి ప్రతిబింబం.
ఒకానొక అధికార సంస్థ 20 రాష్ట్రాలలో జరిపిన సర్వేలో దేశంలో అవినీతి నిలదొక్కుకున్న రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్‌కి రెండవ స్థానం లభించింది. మొదటి స్థానం కర్ణాటకకి దక్కింది. అలనాడు రాజగోపాలాచారి సంయుక్త మద్రాసు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్న రోజులలో ఒకమాటన్నారు. ‘‘అవినీతిలో తమిళ ఇంజనీర్లకీ, తెలుగు ఇంజనీర్లకీ తేడా ఉంది. తమిళ ఇంజనీర్లు పనిచేసి లాభాలలో వాటాల్ని తింటారు. తెలుగు ఇంజనీర్లు కంకరనే తినేస్తారు’’అని. ఆయన అత్యంత కుశాగ్రబుద్ధి కలవారు.
డిపార్టుమెంటు పేరు, పని చెప్పకుండా ఒక తెలుగు ఉదాహరణ. ఒక రిటైరయిన యూనివర్సిటీ ప్రొఫెసరు గారు– ఆయన వయసు 84 సంవత్సరా లు–ఒకానొక డిపార్టుమెంటులో పనికావలసి ఉంది. రెండ్రోజులలో కొడుకు అమెరికా వెళ్లిపోతున్నాడు. ఈలోగా జరగాలి. స్వయంగా ఫలానా ఆఫీసుకి వెళ్లారు– తన హోదాకీ, వయసుకీ మర్యాద దక్కుతుందనే దురభిప్రాయంతో. అతి సాదా ఉద్యోగి ముందు కూర్చున్నారు. అరగంట సేపు ఆ ఉద్యోగి కాగితాలు సవరించుకుంటూ కూర్చున్నారు– ఈయన్ని గమనించక. ఎట్టకేలకు ఆయన కరుణా వీక్షణం ప్రసరించింది. పని చెప్పారు. సదరు ఉద్యోగి టేబిలు మీద ఉన్న కాగితాలను పరామర్శించారు. ‘మీ కాగితం ఇక్కడ లేదండి’అన్నారు.
‘మర్కెడ ఉంటుంది?’
‘అదిగో, ఆ నల్లచొక్కా ఆయన టేబిలు మీద’
నల్లచొక్కా కూడా ఇలాగే పనిలో మునిగిపోయాడు. తీరా వీరి కథ విని ఆయన కాగితాలు కూడా కదపలేదు. ‘నా దగ్గర ఏ కాగితమూ ఉండదండి’అని తేల్చారు.
‘మర్కెడ ఉంటుంది?’
‘అదిగో, ఆ ఎర్రచొక్కా దగ్గర’
అక్కడా మరో 40 నిమిషాలు గడిచాక ఇదే పరిస్థితి. ఈలోగా దూరం నుంచి చూస్తున్న మరో ఉద్యోగి వచ్చాడు. పక్కకి పిలిచాడు. ‘‘అయ్యా, గంటన్నర నుంచి చూస్తున్నాను. తమరు పెద్దవారు. ఇబ్బంది పడుతున్నారని అర్థమవుతోంది. నేనో ఉపాయం చెబుతాను. రెండువేలు ఇవ్వండి. రేపు మీ ఇంటికి కాగితాన్ని నేను తెచ్చి ఇస్తాను’’ అన్నాడు. ఈయన డబ్బిచ్చాడు. కాగితం ఇంటికి ఫలానా ఎర్రచొక్కా దగ్గర్నుంచి వచ్చింది. ఉండబట్టలేక వెళ్లిపోతున్న ‘నిజాయితీ’పరుడైన ‘అవినీతి’పరుడిని ఈ వెర్రి ప్రొఫెసరు అడిగారు, ‘‘ఈ డబ్బులో తమకూ వాటా ఉందా బాబూ!’’అని. చదువుకున్న వెర్రిబాగుల వాడిని చూసి ఆయన నవ్వాడు. ‘‘తమరు పెద్దవారు. అలాంటివి అడక్కూడదు’’ అనేసి వెళ్లిపోయాడు.
ఇదీ కథ. అవినీతిలో మన తర్వాతి స్థానంలో ఉంది తమిళనాడు. తమిళ ఉద్యోగి ‘అవినీతి’లో అతి నిజాయితీపరుడు. మీరు డబ్బు ఇచ్చేదాకా మీ మొహం చూడడు. తీరా ఇచ్చాక– అంత నిజాయితీపరుడైన సేవకుడు మరొకడు ఉండడు. ‘‘తమరు ఇంటికి వెళ్లండి యజమానీ (‘యజమానీ’అన్నమాటను గుర్తించాలి). నేనెందుకు ఉన్నాను యజమానీ! నా ప్రాణం పోయినా తెల్లవారేసరికి మీ కాగితం మీ చేతుల్లో ఉంటుంది’’ అని కళ్లనీళ్ల పర్యంతం అవుతాడు.
తమిళ ‘అవినీతిపరుడి’కి ‘లంచం’ఒక అవకాశం. తెలుగు ‘అవినీతిపరుడి’కి ‘లంచం’ ఒక హక్కు.
‘‘డబ్బు ఇచ్చాను కదండీ!’’అన్నారనుకోండి–
‘‘ఇస్తే? నీ కాగితం నీ దగ్గరికి నడిచి వస్తుందా? నీలాంటి వాళ్లు బోలెడుమంది ఉన్నారు. ముష్టి మూడువందలు ఇచ్చాడట. వెళ్లు. మధ్యాహ్నం కనబడు’’– ఇదీ తెలుగు నమూనా.
‘‘యజమానీ! నీకు సేవ చేయడానికి కాక నేనెందుకు ఉన్నాను, యజమానీ!’’ ఇది తమిళ నమూనా.
సమాధానాలు చాలామందికి తెలుసు. అవి నీతికి పెట్టుబడి అవసరం మాత్రమే కాదు, చెల్లుబాటు అవుతుందన్న ధైర్యం. అవినీతి వ్యవస్థ బలహీనతకి నిదర్శనం. నాయకత్వ శీలానికి ప్రతి బింబం. మరొక అడుగు ముందుకు వేస్తే – పాలకవర్గం చేతులకి గాజులు తళతళా మెరుస్తున్నప్పుడు – సర్వే సర్వత్రా– చెప్పులు గాలిలోకి లేస్తాయి.
చివరిగా– ఒక కొసమెరుపు. విశాఖపట్నం కళాభారతిలో నెలకి 20 రోజులు మంత్రులు, గవర్నర్లు, నాయకులు వచ్చే సభలు జరుగుతాయి. నగరంలో ప్రముఖమయిన ఆడిటోరియం అది. ప్రతీ సోమవారం కొన్ని వందలమంది ఆ వీధిని కమ్మేస్తారు. కారణం– సంత. ప్రతి అంగుళం రోడ్ల మీద వ్యాపారాలు పరుచుకుంటాయి. కార్లు, మనుషులు నడిచే దిక్కులేదు. రాత్రి 10 వరకూ భయంకరమైన గోల, ముమ్మరం. ఇదేమిటి? నగరంలో, ఇంత ప్రముఖమయిన వీధిలో సంతా? అధికారులకి తెలియదా? కార్పొరేషన్ అధికారులు గుర్తించలేదా? పోలీసులు గమనించలేదా? నేను ఎందరికో చెప్పాను. ఉత్తరాలు రాశాను. ఫలితం సున్నా. దక్షిణ భారతంలో స్వచ్ఛ నగరంగా, తలమానికంగా నిలిచిన విశాఖ పట్నానికి కళాభారతి ‘సంత’ మినహాయింపేమో!
అవినీతి పెట్టుబడి. అధికారులకి రాయితీ. అధికారానికి తాయిలం. మన అదృష్టం– అవినీతిలో మనది రెండో స్థానం. అంటే– ‘అవినీతి’ అభివృద్ధికి ఇంకా మరో మెట్టు ఎక్కే ఆస్కారముంది!
(వ్యాసకర్త : గొల్లపూడి మారుతీరావు )