ఓ గొప్ప చరిత్ర | Great history of books | Sakshi
Sakshi News home page

ఓ గొప్ప చరిత్ర

Published Thu, May 5 2016 8:28 AM | Last Updated on Sun, Sep 3 2017 11:24 PM

ఓ గొప్ప చరిత్ర

ఓ గొప్ప చరిత్ర

ఓప్రా విన్ఫ్రేకి ఒక ఉత్తరం రాస్తూ, ‘75 ఏళ్ల తర్వాత ప్రజలు లాప్‌టాపులూ, సెల్‌ఫోన్లూ, ఐపాడ్‌లలో మునిగి తేలుతున్నారు - తమ మెదడుల్ని ఖాళీగదుల్ని చేసుకుని. కానీ నేనింకా పుస్తకాల మధ్యనే ఉన్నాను’ అన్నారు. కాలం మానవ మనోఫలకం మీద చేసిన సంతకం చరిత్ర. ఈ సంతకాలు అనేకం. అపూర్వం. అనూహ్యం. విచిత్రం. విడ్డూరం. మరొకప్పుడు అసంబద్ధమైన విపర్యయం. కొందరు రచయితలు జీవితమంతా పుంఖానుపుంఖాలుగా రచనలు చేస్తారు. చేస్తూనే ఉంటారు. వాళ్లతో పాటే వారి జ్ఞాపకాలూ కాల గర్భంలో కలసి పోతాయి. కొందరు ఇబ్బందిగా, ముక్తసరిగా, క్లుప్తంగా తమ మనసుని పేజీల్లో విప్పుతారు. చరిత్ర వారిని గుండెల్లో పొదువుకుంటుంది. రాసికాదు, వాసి- అన్నది పాత నానుడి.
 
 ఒకావిడ 89 సంవత్సరాల కింద పుట్టింది. 35 సంవత్సరాలు ఏమీ రాయాలనుకోలేదు. రాసినా ఏవేవో రాసింది. తన 35వ యేట - తన అనుభవాలు, జ్ఞాప కాలలో నుంచి - ఇద్దరు పసివారి మనసుల్లో ఆలోచనల రూపంగా ఒక నవల పుట్టింది. ఆ నవల ఆమెకే కాదు, ఆమె దేశానికీ, నవలా సాహిత్యానికీ, ఈ దశాబ్దపు రచనలకీ మకుటాయమానమైంది. ఆ రచయిత్రి పేరు హార్పర్ లీ. ఆమె ఇటీవలే కన్నుమూసింది. నల్లవారి పట్ల వివక్ష ఎక్కువగా ఉన్న ఆనాటి అలబామాలో మన్రోవిల్లీ ప్రాంతంలో ఒక నల్లజాతీయుడు తెల్ల జాతి అమ్మాయిని మానభంగం చేశాడన్న తప్పుడు కేసును నల్లవాని తరఫున వాదించిన తెల్ల లాయరు కథ ఇతివృత్తం.

అసలు లీ నవలే రాయాలనుకోలేదు. ఎలా రాయాలో తెలీదు. తన 31వ యేట మొదట ఒక నమూనా ప్రతిని రాసింది. ఆమె అదృష్టవశాత్తు ఆ స్క్రిప్ట్ హోహోఫ్‌ టోర్నీ అనే ఆవిడ చేతిలో పడింది. ఆ రచనలో మంచి నవల లేదు. కాని మంచి నవలకి ప్రాతిపదికను గుర్తు పట్టింది. తర్వాత కేవలం రెండు సంవత్సరాలు లీతో చర్చలు జరిపి సంఘటనలను కుదించి, కత్తిరించి, కుట్టి, సవరణలు చేసి, మళ్లీ మళ్లీ తిప్పి రాయడం సాగుతూ వచ్చింది. ఓసారి విసుగెత్తి తన రచన మీద తనకే తృప్తి లేక ఓ శీతాకాలం రాత్రి చేతిలోని రచనని కిటికీలోంచి బయటకు మంచులో పారేసింది.

ఇది తెలిసిన హోహోఫ్ నచ్చ చెప్పి వెంటనే ఆ కాగితాలను వెనక్కు తీసుకురమ్మని ఒత్తిడి చేసింది. ఎట్టకేలకు ఒక నవల రూపుదిద్దుకుంది. ఆ నవల పేరు ‘టు కిల్ ఎ మాకింగ్‌బర్డ్’. ఆ పుస్తకం కేవలం 4 కోట్ల కాపీలు అమ్ముడుపోయింది. అమెరికాలో 74 శాతం స్కూళ్లలో పాఠ్య పుస్తకమయింది. పులిట్జర్ బహుమతిని దక్కించుకుంది. 1999లో లైబ్రరీ జర్నల్ ఈ నవలని ఈ శతాబ్దపు గొప్ప నవలగా అభివర్ణించింది. తర్వాత 54 సంవత్స రాలు ఏమీ రాయలేదు.
 
హార్పర్ లీ న్యూయార్క్‌లో ఈస్టర్న్ ఎయిర్‌లైన్స్‌లో రిజర్వేషన్ గుమాస్తాగా పనిచేసింది. అప్పటి ఆమె పాప్యులారిటీకి ఒక్క ఉదాహరణ- 1956లో ఒక అభిమాని ఆమెకి ఒక సంవత్సరం పాటు జీతం కలసి వచ్చే పైకం చెక్కు పంపుతూ, ‘మీరు సంవత్సరం పాటు ఉద్యోగాన్ని వదిలి రచనలు చెయ్యండి. క్రిస్టమస్ శుభాకాంక్షలు’ అన్నాడు. 1962లో అప్పటి ప్రముఖ నటుడు గ్రిగరీ పెక్ లాయరుగా నటించిన చిత్రం అమెరికా సినీరంగంలో మరొక చరిత్రను సృష్టించింది. ఆ చిత్రానికి మూడు ఆస్కార్ బహుమతులు, ఉత్తమ నటనకు గ్రిగరీ పెక్‌కు ఆస్కార్ బహుమతి లభించాయి.
 
విచిత్రం ఏమిటంటే ఆమెకి కీర్తి అన్నా, పరపతి అన్నా, పదిమందిలోకి రావడమన్నా ఇష్టం లేదు. సభల్లో పాల్గొనడం, అవార్డులు, గౌరవాలను స్వీకరించడం ఆమెకి నచ్చదు. ఆమె పెళ్లి చేసుకోలేదు. 2011లో ఒక ఆస్ట్రేలియా పత్రికా సంపాదకుడితో మాట్లాడుతూ, ‘‘ఇక నేనెప్పుడూ రచన చెయ్యను. అందుకు రెండు కారణాలు. 1. ఎంత డబ్బిచ్చినా నా నవల కారణంగా నా మీద వచ్చిన ఒత్తిడి, ప్రచారాన్ని నేను తట్టుకోలేను. 2. నేనేం చెప్పాలనుకున్నానో చెప్పేశాను. దాన్నే మళ్లీ మళ్లీ చెప్పడం నాకిష్టం లేదు’ అన్నారు. 2006 మే 7న ప్రపంచ ప్రఖ్యాత ప్రదర్శకురాలు ఓప్రా విన్ఫ్రేకి ఒక ఉత్తరం రాస్తూ, ‘75 ఏళ్ల తర్వాత ప్రజలు లాప్‌టాపులూ, సెల్‌ఫోన్లూ, ఐపాడ్‌లలో మునిగి తేలుతున్నారు - తమ మెదడుల్ని ఖాళీగదుల్ని చేసుకుని. కానీ నేనింకా పుస్త కాల మధ్యనే ఉన్నాను’ అన్నారు.
 
ముగ్గురు అమెరికా అధ్యక్షులు ఆమెకి తమ దేశపు అత్యున్నత గౌరవంతో సత్కరించారు. చివరి రోజుల్లో చూపు తగ్గి, బొత్తిగా కనిపించక, వినిపించక, జ్ఞాపకాలను మరచిపోతూ, వృద్ధాప్యం మీద పడగా వీల్‌చైర్‌లో తిరుగుతూ ఒక శరణాలయంలో, తను పుట్టిన ఊరు మన్రోవిలీలో నిద్రలో కన్నుమూసింది.
 
కిందటి సంవత్సరమే ‘గో సెట్ ఏ వాచ్‌మేన్’ అనే ఆమె నవల ప్రతి బయటపడింది. కానీ అది మొదటి నవలకి మొదటి రూపమని చాలామంది తేల్చేశారు. అయినా మొదటి రోజుల్లోనే ఆ నవల 2 కోట్ల కాపీలు అమ్ముడుపోయింది. కొందరు చరిత్రను సృష్టిస్తారు. కొందరు తెర వెనుకనే జీవించి, ఏకాకిగా గడిపి, ఒంటరి జీవితాన్నే చరిత్రగా చేసుకుంటారు. కాలం మనోఫలకం మీద చెక్కిన విపర్యయం కూడా చరిత్రే.


 - గొల్లపూడి మారుతీరావు

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement