గొల్లపూడి 80 ఏళ్ల ఉత్సవంలో పాల్గొన్న గిరిజామనోహర్‌బాబు (ఫైల్)
సాక్షి, హన్మకొండ : కవి, నాటక, నవలా రచయిత, నటుడు, జర్నలిస్టు ఇలా బహుముఖ ప్రజ్ఞాశాలి అయిన గొల్లపూడి మారుతీరావు ఇక లేరన్న విషయం తెలిసి ఓరుగల్లు సాహితీవేత్తలు దిగ్భ్రాంతికి లోనయ్యారు. ఆయనకు వరంగల్‌లో ఎనలేని అనుబంధం ఉండడం.. పలు కార్యక్రమాలకు హాజరైన సందర్భాలను గుర్తు చేసుకున్నారు.. ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విజయనగరంలో జన్మించిన గొల్లపూడి మారుతిరావు అత్తగారి ఊరు వరంగల్ కావడం విశేషం. ఇక్కడ విద్యాశాఖాధికారిగా పనిచేసిన శ్రీపాద రామకిషన్‌రావు కుమార్తె సుందరిని ఆయన వివాహం చేసుకున్నారు. ఈవిధంగా మారుతీరావు వరంగల్ అల్లుడయ్యాడు.
అలాగే కాళోజీ నారాయణరావు, కాళోజీ రామేశ్వరరావుతో గొల్లపూడి మారుతీరావుకు అనుబంధం ఉండేది. 1966లో తిలక్, అద్దెపల్లి రాంమోహన్‌రావు, ఆవత్స సోమసుందర్, కుందుర్తితో కలిసి మిత్రమండలి సమావేశాల్లో ఆయన పాల్గొన్నారు. జిల్లాకు చెందిన సహృదయ సాహితీ సంస్థ ఏటా ఒద్దిరాజు సోదరకవుల స్మృత్యంగా అందించే సాహితీపురస్కారానికి గొల్లపూడి మారుతీరావు రాసిన ‘సాయంకాలం అయింది’ నవలను ఎంపికైంది. ఈ మేరకు 2001లో జరిగిన పురస్కార ప్రదానంలో గొల్లపూడి పాల్గొని చేసిన ఆత్మీయ ప్రసంగం అందరికీ గుర్తుండి పోతుంది. ఆదేవిధంగా 21 జనవరి 2012న హన్మకొండలోని నందనా గార్డెన్స్‌లో జరిగిన గిరిజా మనోహర్‌బాబు షష్టిపూర్తి అభినందనసభలోనూ ఆయన పాల్గొన్నారు. కాగా, గొల్లపూడి గురువారం కన్నుమూసినట్లు తెలియడంతో ఓరుగల్లు సాహితీలోకం దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
తరచూ ఫోన్‌లో మాట్లాడేవాళ్లం..
గొల్లపూడి మారుతిరావు ఇకలేరని తెలిసి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత అంపశయ్య నవీన్ విచారం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా నవీన్ మాట్లాడుతూ మారుతీరావు భార్య సుందరి ఆర్ట్స్ కళాశాలలో తమతో పాటు కలిసి చదువుకున్నారని.. ఆయన తనకు మంచి మిత్రుడని తెలిపారు. తరుచూ ఫోన్‌లో మాట్లాడుకునేవారమని, తన కథలు, నవలలు చదివి అభిప్రాయాలు చెప్పేవారని గుర్తు చేసుకున్నారు. కాళోజీ ఫౌండేషన్ అధ్యక్షుడు నాగిళ్ల రామశాస్త్రి మాట్లాడుతూ గొల్లపూడి మారుతీరావు వందేళ్ల తెలుగు కథ కార్యక్రమంలో భాగంగా కాళోజీ కథను చదవడానికి తనను పిలిచారని చెప్పారు. ప్రముఖ సాహితీవేత్త
గిరిజామనోహర్‌బాబు మాట్లాడుతూ పదేళ్లుగా గొల్లపూడితో తనకు అనుబంధం ఉందని.. 2008లో తాను తీవ్ర అనారోగ్యానికి గురైనప్పుడు కన్నీటిపర్యంతమయ్యారని గుర్తు చేశారు. 2012లో తన షష్టిపూర్తి అభినందన సభ నిర్వహించినప్పుడు హాజరయ్యారని చెప్పారు. ఇటీవల విశాఖపట్నంలో జరిగిన గొల్లపూడి 80 ఏళ్ల ఉత్సవంలో పాల్గొనాల్సిందిగా ఫోన్ చేసి ఆహ్వానించారని తెలిపారు. అలాగే, సహృదయ సాహిత్య సాంస్కృతిక సంస్థ ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఎన్వీఎన్.చారి, వనం లక్ష్మీకాంతారావు, శేషాచారి, డాక్టర్ కేఎల్వీ.ప్రసాద్, కుందావజ్జుల కృష్ణమూర్తి, లయన్స్‌క్లబ్ డిస్ట్రిక్ట్ గవర్నర్ పొట్లపల్లి శ్రీనివాస్‌రావు, డాక్టర్ వి.వీరాచారి, డాక్టర్ కందాళ శోభారాణి తదితరులు కూడా ప్రగాఢ సంతాపం తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment