
నిశ్శబ్ద పథికుడు
జీవన కాలమ్
‘విజయం’ అనేది ఎవరిని వరిస్తుందో తెలియదు. తను నమ్మిన ఆదర్శాలకు రూపకల్పన చేసే మాధ్యమంలో విజయం కలిసి వస్తే ప్రకాశరావుగారు చాలామంది చెయ్యడానికి సాహసించని చిత్రాలు తీయగలిగేవారు.
కొందరు జీవితం నుంచి నిశ్శ బ్దంగా శెలవు తీసుకుంటారు. కొందరు దాశరథి మాటల్లో ‘నిశ్శబ్దం ఎరుగనట్టి నిమ్నగ’ లాగ ఝంకారం చేస్తూ నిష్క్రమిస్తారు. కొందరు విస్తృతమైన పరిధులకు చేతులు సాచి, తమదైన పోరాటాన్ని జరిపి నిశ్శ బ్దంగా వెళ్లిపోతారు. అలాంటి సాహితీ బంధువు పి. సూర్యప్రకాశరావు. అలా చెప్తే చాలామందికి తెలీదు. నవభారత్ ప్రకాశరావుగారు.
ఈనాటికీ వైభవోపేతంగా విజయవాడలో సాగే పుస్తక ప్రదర్శనోత్సవాలను ప్రారంభించిన వారిలో ప్రకాశరావుగారు ఒకరు. యుద్ధనపూడి సులోచనారాణి, కొమ్మూరి వేణుగోపాలరావు, మాదిరెడ్డి సులోచన రచనల్ని పాపులర్ చేసిన ఘనత ప్రకాశరావుగారిది. పుస్తక ప్రచురణలో చక్కని సంప్రదాయాన్ని నిలిపిన ప్రచురణకర్త.
మొదట్లో ప్రకాశరావుగారు నవోదయా నిర్వహించేవారు. నేను యూనివర్సిటీలో చదువుకునే రోజుల్లోనే (1959) నా మొట్టమొదటి పుస్తకం– ‘అనంతం’ నాటికని అచ్చువేసిన ప్రచురణకర్త ప్రకాశరావుగారు. ఆ ఆనందం వర్ణనాతీతం. అప్పటికి ప్రకాశరావుగారితో కేవలం ఉత్తరాల పరిచయమే. తర్వాత మా సాన్నిహిత్యం విచిత్రమైనది. నన్ను మొట్టమొదటి నవలకు పురికొల్పింది ఆయనే. ఆ నవల ‘చీకటిలో చీలికలు’. ఆనర్స్ అవుతూనే ఢిల్లీ వెళ్లి– విజయవాడలో ఆంధ్రప్రభ ఉద్యోగానికి నార్ల, కపిల కాశీపతి వంటి వారి ఉత్తరాల్ని పట్టుకుని విజయవాడలో పూర్ణానంద సత్రంలో రసన సమాఖ్యలో దిగాను. అప్పటికి వారికి ‘రాగరాగిణి’ రాశాను. వచ్చిన రోజు సాయంకాలమే నా జేబులో ఉన్న 15 రూపాయలు ఎవరో కొట్టేశారు. ప్రకాశరావుగారికి చెప్పాను. గల్లాపెట్టె తెరిచి 13 రూపాయలిచ్చి శాంతి కేఫ్‌లో నెలవారీ భోజనం టికెట్ల పుస్తకం తెప్పించారు. జైహింద్ రోడ్డులో ఆయనకి తెలిసిన ఓ టైర్ల దుకాణం వెనుక గదిని ఏర్పాటు చేశారు. 8 రూపాయలకి మడత కుర్చీ కొన్నారు. అది నాతో పెళ్లయి, పిల్లలు పుట్టేదాకా ఉంది. ఎప్పుడు డబ్బు అయిపోయినా స్వయంగా నవోదయా గల్లాపెట్టె తెరిచి 5 రూపాయలు తీసుకునేవాడిని. రోజూ షాపు మూశాక– ఆ రోజు నేను రాసిన ‘చీకటిలో చీలికలు’ నవల భాగాలు విని ఇంటికి వెళ్లేవారు. మరో ఆరు నెలలకి ఆంధ్రప్రభలో ఉద్యోగం వచ్చింది. మరో నెలలో చిత్తూరు బదిలీ. అప్పటికి నవోదయా నుంచి బయటికి వచ్చి నవభారత్ బుక్ హౌస్‌ని ప్రారంభించారు.
56 సంవత్సరాల కిందట– హన్మకొండలో ఓ తెల్లవారుఝామున మూడున్నరకి జరిగిన నా పెళ్లికి నా మిత్రులు ఇద్దరే హాజరయ్యారు– నవభారత్ ప్రకాశ రావు, నవోదయా రామమోహనరావు. అప్పటికి ప్రచురితమయిన నా రచనల్ని వెల్వెట్ బైండు చేయించి మా ఆవిడకి బహూకరించారు.
ఓసారి రాత్రి 11 గంటలకి హైదరాబాదులో తలుపుతట్టి– సరాసరి మద్రాసు తీసుకుపోయి– దర్శకుడు చాణక్యముందు కూర్చోపెట్టారు–కొత్త సినీమా చర్చలకి. ఆయన ఆలోచనలు విప్పి చెప్పగలిగింది ఒక్క నాకే. నేను ఆయన మౌత్ పీస్‌ని. నవభారత్ మూవీస్ పేరిట అక్కినేనితో తీసిన ‘రైతు కుటుంబం’ సినీమాకి నేను కథ, మాటల రచయితని. తాతినేని దర్శకుడు. పూర్ణచంద్రరావు, మేనేజరు (పీఏపీ) సుబ్బారావుగారు పార్ట్‌నర్స్. మంచి హిట్.
ఆయన వామపక్ష భావాలున్న మనిషి. వాటిని ప్రతిఫలించే ‘ముగ్గురమ్మాయిలు’ చిత్రాన్ని ప్రత్యగాత్మతో ప్రారంభించారు. పురాణం సుబ్రహ్మణ్య శర్మగారిచేత విజయవాడలో కూర్చుని సంభాషణలు రాయించారు. శర్మగారికి ఆ పనిలో అనుభవం లేదు. స్క్రిప్ట్ తిరగరాయాల్సిన పరిస్థితి. నేను రోజుకి 18 గంటలు పనిచేసే రోజులు. నా ఉద్యోగం, కథా చర్చలు– అన్నీ ముగించుకుని ఏ రాత్రి పదికో వచ్చేవాడిని. అప్పుడు ఆ సీన్ల రచన. ఓ మిత్రుడి కోసం భయంకరమైన ఒత్తిడి పడిన రోజులవి. తీరా సినీమాలో నా పేరు వేస్తానన్నారు. నేను సుతరామూ ఒప్పుకోలేదు. అది పద్ధతి కాదన్నాను. నెలల తర్వాత తమ్ముడు బోసుకిచ్చి నాకు నవరత్నాల ఉంగరం పంపారు. ఆ ఉంగరం నా చేతికి 45 సంవత్సరాల నుంచీ ఉంది– ఇప్పటికీ.
ఏడు సంవత్సరాల కిందట అనారోగ్యంతో మంచం పట్టారు. తరచూ వెళ్లి చూసేవాడిని. ఆఖరుసారి వెళ్లింది– జనవరి 2. మాటలో బొత్తిగా సమన్వయం పోయింది. విచిత్రంగా ‘మీరొచ్చాకే ఈ మాత్రం మాట్లాడారు’ అన్నారు ఆయన భార్య. నిన్న వారమ్మాయి ఫోన్. కొన్నాళ్ల కిందట మంచం మీద నుంచి లేవబోయి కిందపడ్డారు. తుంటి ఎముక విరిగింది. అది ముగింపుకి నాంది.
‘విజయం’ అనేది ఎవరిని వరిస్తుందో తెలియదు. తను నమ్మిన ఆదర్శాలకు రూపకల్పన చేసే మాధ్యమంలో విజయం కలిసి వస్తే ప్రకాశరావుగారు చాలామంది చెయ్యడానికి సాహసించని చిత్రాలు తీయగలిగేవారు. ఆయన అపజయాన్ని అంగీకరించని యోధుడు. అరుదైన మిత్రుడు.
- గొల్లపూడి మారుతీరావు