సినీమా నోరిప్పిన రోజు
జీవన కాలమ్
అపూర్వమైన కారణంగా, పాట భారతీయ సినీమాలో తిష్ట వేసుకు కూర్చోగా - నాటకానికి విడాకులిచ్చి తెలుగు సినీమా సొంత గొంతుని అందుకునే ప్రయత్నా లకు గొప్ప శకునాలు ఇప్పుడిప్పుడు కనిపిస్తున్నాయి. ఉదాహరణ.. బాహుబలి.
సినీమా నోరు విప్పి 85 సంవ త్సరాలయింది. మరోమాట చెప్పాలంటే సినీమాలోకి నాటకం, పాట దొడ్డితోవన ప్రవేశించి 85 ఏళ్లయింది. ఏవో కొన్ని చిత్రాలని మిన హాయిస్తే - ఇప్పటికీ ఈ రెండు ప్రక్రియలనూ ప్రేక్ష కులు గుండెకు హత్తుకుంటు న్నారు. నాటకానికి దూరంగా వెళ్లాలన్న అవసరాన్ని గుర్తుపట్టి చాలా యేళ్లయింది. కాని ‘ప్రయత్నం’ ప్రారం భమై కొన్ని సంవత్సరాలే అయింది. ఒకాయన ఈ పరిస్థితిని ఇలా వివరించాడు - Indian cinema is an accident on screen.
.
1931లో హెచ్.ఎం. రెడ్డిగారు కలకత్తాలో కెమెరా ముందు ‘భక్త ప్రహ్లాద’ నాటకాన్ని ప్రదర్శింపజేశారు. ఎవరికీ ఏమీ ఇబ్బందిలేని పని అది. కెమెరా నడిచింది. బొమ్మ సెల్యులాయిడ్ మీదకి ఎక్కింది. డెరైక్టరుగారు ఎడిటింగ్ టేబుల్ ముందు కూర్చుని పాట తర్వాత పద్యం, పద్యం తర్వాత డైలాగు చేర్చుకుంటూ పోయారు. ప్రేక్షకులు తమకు తెలిసిన వినోదాన్ని తెలి యని ప్రక్రియలో చూసి - అబ్బురపడి, ఆనందించారు. ఇది కొత్త ప్లేట్లలో వడ్డించిన పాత భోజనం. ప్రేక్షకులకి అలవాటయిన, తృప్తినిచ్చే భోజనం.
తరువాత సి. పుల్లయ్యగారు ‘పాదుక’ తీశారు. ముందు సినీమా దీనికి వరవడి. చిత్రం విజయం సాధిం చింది. సాధించకుండా ఉండే మార్గం లేదు. దరిమిలాను తెలుగుదేశంలో ఉన్న అన్ని పౌరాణికాలూ తెరకెక్కాయి. లవకుశ, సీతా కళ్యాణం, ద్రౌపదీ వస్త్రాపహరణం, శ్రీవేంకటేశ్వర మహాత్మ్యం, గయోపాఖ్యానం, ధృవ, అనసూయ - ఇలాగ గమనించాలి. వీటితోపాటు సూత్ర దారుడు, కంచుకి, బృందగానం, కందార్థాలు, ద్విప దలు, స్రగ్ధరలు, కళ్యాణి, భీంపలాస్, భాగేశ్రీ, కానడ, కాపీ - అన్నీ వచ్చాయి. క్రమంగా కొత్త ప్లేటుకి అల వాటుపడ్డ ప్రేక్షకుడు - వడ్డించే భోజనంలో తప్పని సరిగా ఆకర్షించే ‘పాత’ రుచికీ అలవాటుపడ్డాడు. ఎందరో మహానుభావులు - పాట లేకపోతే ఎలా? అనిపించే అపూర్వమైన కృషి చేశారు.
నౌషద్, సి. రామచంద్ర, సాలూరు రాజేశ్వరరావు, షకీల్ బదా యునీ, ఘంటశాల, కేవీ మహాదేవన్, మల్లాది రామ కృష్ణ శాస్త్రి, ఆచార్య ఆత్రేయ, వేటూరి, సముద్రాల.. వంటివారు సినీమాలో ‘పాట’ని అజరామరమూ, నిర్వివాదాంశమూ చేశారు. మరోదేశం ప్రేక్షకుడు మన సినీమా చూసి - ఏమిటయ్యా, మీ హీరో మేఘాల్ని చూస్తూ నా ప్రేయసికి కబురు చెప్పమంటాడు -అని నవ్వుకోవచ్చుగాని-1951లో-అంటే సినీమా మాటని మరిగిన 20 సంవత్సరాలకు ‘మల్లీశ్వరి’ చూస్తూ మనం అదే పని చేశాం.
ఒక చిన్న ఉదాహరణ. ఈ దేశం గర్వించదగ్గ గొప్ప స్క్రీన్‌ప్లే రచయితలు సలీం-జావేద్ రాసిన ‘జంజీర్’ సినీమాని తెలుగులో ఎన్టీ రామారావుగారి ‘నిప్పులాంటి మనిషి’గా రాశాను. నాటకం పాలు ఎక్కువగా ఉన్నా కొద్దిలో కొద్దిగా సినీమా ప్రక్రియని పట్టుకున్న రచయితలు వీరు. అటు సమృద్ధిగా మెలోడ్రామాను, ఇటు సినీమా ప్రక్రియను సంధించిన అఖండులు వీరు. ఇందులో ఒక సీను. హీరోది dialectical పాత్ర. దుండ గుల లారీ కిందపడి చాలామంది పిల్లలు చచ్చిపో యారు. దుండగుడు దొరికాడు. పగ తీర్చుకోడాని కన్నట్టు హీరో అతన్ని చావబాదాడు. ఆఫీసరు ఆపాడు. హీరో గదిలోకి వచ్చి - ఆవేశాన్ని చల్లార్చుకుంటూ గ్లాసుతో నీళ్లు తాగాడు.
ఇప్పుడు హీరోయిన్ వచ్చింది. చూశాడు హీరో. ‘సాబ్.. పైసా’ అంది నోట్ల కట్ట చూపిస్తూ. అతని ముఖంలో ఆశ్చర్యం. ‘వాళ్లు ఇచ్చారు సార్! కాని.. వద్దుసార్’ అంది. హీరో దగ్గరకు వచ్చాడు. డబ్బు కట్టని చూశాడు. ఆమె గుండె ధైర్యాన్ని ప్రశం సించాలి? ‘నీలాంటి నిజాయితీపరులు పదిమంది ఉంటే ఈ దేశం ముందుకు పోతుందమ్మా’ అనాలా ‘నీ ధైర్యాన్ని మెచ్చుకోడానికి మాటలు లేవనాలా?’ ఇది మెలోడ్రామా. సన్నివేశాన్ని సాగదీసి చిలకడం. కాని గొప్ప స్క్రీన్‌ప్లే బెసకదు. ‘థాంక్స్’ అన్నాడు హీరో. ఆమె వెళ్లిపోయింది. దర్శకుడు ఎస్.డి. లాల్‌ని పిలిచి ‘ఇలాగే రాస్తాను. తీస్తావయ్యా’ అనడిగాను. ‘ఎందుకు తియ్యను గురువుగారూ’ అన్నాడు. మూల రచన ఉంది కదా? హీరోగారూ చేశారు.
Silence is the most powerful statement in a film. The visual is its strength. while the verbal is the backbone of theatre and weak ness of a film. ఏ విదేశీ సినీమా అయినా చూడండి. సంభాషణల రచయిత పేరు ఉండదు. స్క్రీన్‌ప్లే మాత్రమే ఉంటుంది. మన దేశంలోనే కాదు. మన భాషలోనే కాదు- 85 సంవత్సరాలపాటు ఈ రెండు ధోరణుల మధ్యా కొట్టు మిట్టాడుతున్న మాధ్యమం - సినీమా. అపూర్వై మెన కారణంగా - పాట - by default - భారతీయ సినీమాలో తిష్ట వేసుకు కూర్చోగా - నాటకానికి విడాకు లిచ్చి - తెలుగు సినీమా సొంత గొంతుని అందుకునే ప్రయత్నాలకు గొప్ప శకునాలు ఇప్పుడిప్పుడు కనిపిస్తు న్నాయి. ఉదాహరణ - బాహుబలి.