
ఒక మధురమైన జ్ఞాపకం
జీవన కాలమ్
1985లో మే 30 అర్ధరాత్రి మూర్ మార్కెట్‌లో నిప్పు చెలరేగింది. విద్యుచ్చక్తి వైర్లు కారణమన్నారు. 800 పుస్తకాల షాపులు, కొన్ని వందల పురావస్తువులు, విలువ కట్టలేని గ్రామఫోన్ రికార్డులు దగ్ధమయిపోయాయి. మద్రాసుకి నా జీవితంలో చాలా ఆలస్యంగా వెళ్లాను. నాకు పాతికేళ్లు దాటిన తర్వాత - గూడూరు సంస్కృతీ సమ్మేళనంలో కలసిన ‘మహతి’ అనే దర్శకుడి ఆహ్వానంతో మొదటిసారి. అప్పుడాయన జేవీ రమణ మూర్తి హీరోగా నటిస్తున్న ‘జన్మహక్కు’ అనే సినీమాని తీస్తున్న గుర్తు.
చిన్నప్ప ట్నుంచీ మద్రాసు సినీమా కారణంగా చాలా ఆసక్తిని కలిగించినా - నా మట్టుకు మద్రాసులో చూడాల్సిన స్థలాలలో ‘మూర్ మార్కెట్’ ఒకటి. సాహిత్యం, సైన్సు, హిస్టరీ, ఆర్కియాలజీ- మీ ఇష్టం- అక్కడ దొరకని సెకండ్‌హ్యాండ్ పుస్తకం లేదు. ఒక్క విశేషమేమంటే అక్కడ పుస్తకాల దుకాణాలను నడిపేవారంతా దాదాపు తమిళులు. వారు తెలుగు మాత్రమే కాక, తెలుగులో అపురూపమయిన గ్రంథాలను, వాటి వివరాలను ఒడిసి పట్టుకునేవారు కావడం.
ఎన్నడో ప్రభుత్వం నిషేధించిన ముద్దుపళని ‘రాధికా స్వాంతనము’ షాపుకి వచ్చిందని ఆ తమిళుడు మీకు చెవిలో చెప్తాడు. అంద రికీ చెప్పడు. ఎవరు దాని గురించి వెదుకుతారో అతనికి తెలుసు. ఆ పుస్తకాల షాపుల్లో అతి తరుచుగా నార్ల వెంకటేశ్వరరావుగారు, ఆరుద్ర, డి. ఆంజనేయులు, బులుసు వెంకటరమణయ్య, వేదం వెంకటరాయశాస్త్రి (మనుమడు) వంటి వారెందరో తారసపడేవారు.
అక్కడి వ్యాపారులకు వీరు తెలిసిన ముఖాలు. మించి- వారికేం కావాలో తెలుసు. వారి వారి అవసరాలను బట్టి, ఆ పుస్తకాల అరుదయిన విలువలను బట్టి షాపు వ్యాపారి వాటి ధరల్ని నిర్ణయించేవాడు. ముద్దుపళని ముద్రణ అయిన రోజుల్లో ఆరు అణాలు ఉండవచ్చు. ఇప్పుడు తేలికగా 60 రూపాయలు వసూలు చేస్తాడు. కొనే సాహితీప్రియుడు కృతజ్ఞతతో ఆ ధరని చెల్లిస్తాడు. కొన్ని అరుదయిన పుస్తకాలను ఇస్తే-అప్పుడప్పుడు బక్షీసు దక్కిన సంద ర్భాలూ ఉన్నాయి.
ఇది ప్రపంచం లోనే అరుదయిన సెకెండ్ హ్యాండ్ పుస్తకాల దుకాణం. అంత గొప్ప స్థలం ప్రపంచంలో - నాకు తెలిసి- మరొ కటి ఉంది. అది వేల్స్ (బ్రిటన్)లో హై-ఆన్‌వై అనే చిన్నగ్రామం. ఆంగ్లభాషలో అక్కడ దొరకని పుస్తకం ఉండదు. ఆ గ్రామమంతా పుస్తకాల దుకాణమే. పేవ్‌మెంట్ల మీదా, కిటికీల మీదా, చిన్నచిన్న గొందుల్లో వేలవేల పుస్తకాలు, పత్రికలు. అక్కడి షాపు కీపరు షేక్‌స్పియర్ ‘సింబర్లిన్’ ఎప్పుడు రాశాడో వివరంగా చెప్తాడు. 1920లో ప్రచురితమయిన మొదటి కాలికో బైండ్ కాపీని- 20 డాలర్లకు అమ్ముతాడు. 1914లో ‘టైమ్స్’ ఫలానా రోజు దినపత్రిక కావాలా? షాపు కీపరు నవ్వి, ‘మొదటి ప్రపంచయుద్ధంలో పాల్గొన్న పింపర్నల్ కథని వెతుకుతున్నారా సార్! ’ అని ఆ మధ్య వచ్చిన మరో గ్రంథాన్ని చూపిస్తాడు. అక్కడ మీకు కనిపించే ముఖాలు అరుంధతీరాయ్, సాల్మన్ రష్దీ వంటివారు.
సరే, మళ్లీ మూర్ మార్కెట్‌కి వస్తే-1890-1893 మధ్య మద్రాసు కార్పొరేషన్ అధ్యక్షుడిగా ఉన్న కల్నల్ సర్ జార్జ్ మాంట్‌గోమరీ జాన్ మూర్ ఈ భవనాన్ని - ఒక వ్యాపార సముదాయంగా నిర్మింపచేశాడు. ఇంతకు ముందు బ్రాడ్వేలో పూఫమ్ మార్కెట్ ఉండేది. తర్వాత వచ్చిన ఈ మార్కెట్ పాత గ్రామఫోన్ రికార్డులకు, పాత పుస్తకాలకు, అలనాటి పురావస్తువులకి, బట్టల దుకాణాలకి ప్రసిద్ధి. నేను ‘వందేమాతరం’ అనే నాటికని 1962లో రాసినప్పుడు - అలనాటి లతామంగే ష్కర్ ‘ఆనందమఠ్’లో పాడిన వందేమాతరం పాట దొరికింది ఇక్కడే.
ఇంతేకాదు - ప్రత్యేకమైన రకర కాల పెంపుడు జంతువులను అక్కడ అమ్మేవారు- కుక్క పిల్లలు, చిలకలు, పిచ్చుకలు, తాబేళ్లు, ప్రేమ పక్షులు, చిన్నసైజు నక్కలు- ఇలా. అదొక సుందర దృశ్యం. 1902లో ప్రముఖ చిత్రకారుడు రాజా రవివర్మ వేసిన మూర్ దొరగారి నిలువెత్తు పెయింటింగ్ ఇప్ప టికీ మద్రాసు కార్పొరేషన్ కార్యాలయంలో ఉంది. దానికి రవివర్మగారికి ఇచ్చిన పారితోషికం 3 వేల రూపాయలు. 1902లో ఈ పైకం ఇప్పటి 30 లక్షలు అనుకోవచ్చు.
1985 ప్రాంతంలో రాజకీయ ప్రలోభాలు, చరిత్ర మీద ఖాతరు లేని నాయకమ్మన్యుల పాలన వచ్చింది. పక్కనున్న సెంట్రల్ స్టేషన్‌కి కారు పార్కింగు సౌకర్యం కోసం మూర్ మార్కెట్టుని అక్కడినుంచి లేపేసే ప్రయత్నాలు సాగాయి. కళాప్రియులు హాహా కారాలు చేశారు. చరిత్రకారులు ముక్కు మీద వేలేసు కున్నారు. పత్రికలకు ఎక్కారు. ప్రభుత్వం ఒక్క క్షణం వెనుకంజ వేసింది. కాని వారి కిటుకులు వారికి ఉన్నాయి. 1985లో మే 30 అర్ధరాత్రి మూర్ మార్కెట్‌లో నిప్పు చెలరేగింది. విద్యుచ్చక్తి వైర్లు కారణమన్నారు. 800 పుస్తకాల షాపులు, కొన్ని వందల పురావస్తువులు, విలువ కట్టలేని గ్రామఫోన్ రికార్డులు దగ్ధమయిపోయాయి. ఒక చరిత్ర నేలమట్టమయి పోయింది.
- గొల్లపూడి మారుతీరావు