
నేరమూ - శిక్ష
జీవన కాలమ్
ఇకముందు మనదేశంలో పరిపాలన జైళ్లనుంచీ, వంటిళ్లనుంచీ జరగనుంది కనుక, కర్ణాటక ప్రభుత్వం అగ్రహారం జైలులో తమిళనాడు సీఎం తరచూ తమ నాయకురాలిని కలుసుకోడానికి ఒక ఆఫీసుని కడితే బాగుంటుంది.
బెంగళూరు పారప్పన్న అగ్రహారం జైలులో శశి కళకు అన్యాయం జరుగు తోందని నా గట్టి నమ్మకం. అలవాటుగా రెండోసారి అదే నేరానికి అదే జైలుకి వెళ్తున్న వ్యక్తిగా శశికళ కొన్ని సౌకర్యాలను కోర డం అనౌచిత్యం కాదు. లోగడ అక్కడ ఉన్నప్పుడు తన ‘అక్క’ జయలలితతో సమానంగా కొన్ని సౌకర్యాలను అనుభవించారు. కాగా కిందటిసారి ఆవిడ ఒక నేరస్తురాలికి సహాయకు రాలు. ఇవాళ ఒక మెజారిటీ పార్టీ ఎన్నుకున్న నాయ కురాలు. నిన్ననే ఆమె పార్టీ పదవిని చేపట్టింది. చక్కెర జబ్బు ఉన్నది కనుక–ఇంటినుంచి భోజనం, 24 గంటలూ వేడినీళ్లు, ‘బిస్లెరీ’ తాగే నీరు, పరి చర్యకు ఓ పనిమనిషిని కోరుకున్నారు. ముందు ముందు ఆ పార్టీ–ముఖ్యంగా తమిళనాడు రాష్ట్ర ముఖ్యమంత్రి తమ నాయకురాలికి అలాంటి సౌకర్యాలను డిమాండ్ చేసే అవకాశం ఉంది.
ఆమెది అవినీతి పాలన అని డీఎంకే వాపోయింది. ఒకవేళ వారు ప్రశ్నించాలనుకుంటే రాజ్యాంగాన్ని ప్రశ్నించాలి. ఏ విధంగా చూసినా ఆమె ప్రస్తుత నిర్ణయాలు చట్ట విరుద్ధం కాదు. మెజారిటీ పార్టీ నాయకురాలు, తనకిష్టమయిన నాయకుడిని– పార్టీని ఒప్పించే నిర్ణయించారు. ఆ పని కేంద్రంలో అల నాడు సోనియాగాంధీ కూడా చేశారు. ఇది సబబా అంటారా? రాజ్యాంగంమీద ప్రమాణం చేసిన ఏ మహానుభావులు ఆ ఆలోచనన యినా మనసులోకి రానిస్తున్నారు? ఇలాంటి పరిస్థి తిలో లాలూ గారు వంటింట్లోంచి తన భార్యని తీసు కొచ్చి కుర్చీలో కూర్చోపెట్టారు–తన్నుకు చావండని. మన అదృష్టం– ఈవిడ తోటపని చేసే మాలీని, అట్ల పిండి రుబ్బే ‘తమిళరసి’ని గద్దెమీద కూర్చోపెట్ట లేదు. తేలికగా నాలుగు దశాబ్దాలుగా రాజకీయ రంగంలో ఉంటున్న నాయకుడిని తన స్థానంలో నిలి పారు. జయలలితకు పన్నీర్‌సెల్వం ఎంతో, శశికళకు పళనిస్వామి అంత.
ఇకముందు మనదేశంలో పరిపాలన జైళ్లనుంచీ, వంటిళ్లనుంచీ జరగబోతోంది కనుక, కర్ణాటక ప్రభు త్వం సత్వరమే అగ్రహారం జైలులో తమిళనాడు సీఎం తరచూ తమ నాయకురాలిని కలుసుకోడానికి ఒక ఆఫీసుని నిర్మింపజేయాలని నా ఉద్దేశం.
అలాగే శశికళకి ముందు ముందు–పాండీ బజారు మెదువడ, అడయార్ ఊతప్పం, దిండివనం రసం వండిపెట్టే చిన్న వంటగదిని జైలులో ఏర్పాటు చేయాలని, చేస్తారని నా నమ్మకం. రోజుకి 50 రూపా యల కూలీ సంపాదించే పని– 30 సంవత్సరాలలో 3వేల కోట్లు సంపాదించిన ‘యోగ్యురాలి’ చేత చేయించడం హాస్యాస్పదం.
30 ఏళ్లపాటు ఒక నాయకురాలి విశ్వాసాన్ని సంపాదించుకుని కోట్ల ఆస్తితోపాటు, రాష్ట్ర సీఎం కాగలిగిన ఒక వీడియో టేపుల వ్యాపారిని జైలు దుర్వినియోగం చేసుకుంటోందని నాకనిపిస్తోంది.
న్యాయస్థానం న్యాయాన్ని ఎత్తి నిలుపుతుంది. చట్టం గుడ్డిగా శిక్షను అమలు జరుపుతుంది. ఈ రెంటికీ మధ్య– మారుతున్న పరిస్థితులూ, రాజకీయ వ్యవస్థని తమ వినియోగానికి మలచుకుంటున్న నాయకులూ– వీటన్నిటి దృష్ట్యా– శాసనసభలో చొక్కాలు చింపుకుని, మైకులు విరగ్గొట్టిన తెలివైన ప్రజా ప్రతినిధుల మనస్సుల్లో ‘గూండా’ మనస్త త్వాన్ని మేలుకొలిపి–అపశృతి ప్రస్తుతం రాజ్యమేలు తోంది. ప్రజాస్వామ్యాన్ని వెక్కిరిస్తోంది.
ప్రజాస్వామ్యానికి ఇంత కంటే మరో మార్గాంతరం లేదా అని–ఒక రబ్రీ దేవి, పది కోట్ల జరిమానాతో పదేళ్ల బహి ష్కరణను అనుభవిస్తూనే ఒక రాష్ట్ర పరిపాలనను తన గుప్పిట్లో పెట్టుకున్న నేరస్థు రాలు–ఈ వ్యవస్థను ప్రశ్ని స్తోంది. జయలలిత ఇవాళ బతి కుంటే పన్నీర్ సెల్వం మరొ కసారి పదవిలో కూర్చునే వారు. బిహారులో ఏ చదువు రాని ఇద్దరు లాలూ ప్రసాద్ కొడుకులు– ఆయన కొడుకుల యిన కారణానికే ప్రస్తుతం రాష్ట్రాన్ని పాలిస్తున్నారు.
ఒక పత్రికలో ఒక పాఠకుడు వెల్లడించిన అభి ప్రాయాలివి: 18 సంవత్సరాల కిందట కేవలం పదవి కారణంగా 86 కోట్ల ప్రభుత్వ ధనాన్ని దుర్విని యోగం చేసిన ఒక నాయకురాలు–కోర్టు తీర్పు ఆలస్యం అయిన కారణానికి ఈ రెండు దశాబ్దాలూ సమాజాన్ని నడిపించే స్థానంలో నిలిచి, కేవలం ‘మృత్యువు’ కారణంగా తీర్పును తప్పించుకున్న విలక్షణమైన స్థితికి ఎవరు కారణం? ఈ 18 సంవత్సరాలూ ఆమెతో కలిసి ఉంటూ– ఆమె కార్యక్రమాలలో జోక్యం ఉందన్న ఒక్క కారణానికే ‘చిన్నమ్మ’ అవతారం ఎత్తిన మరొక నేరస్తురాలు పరిపాలనను తన చేతుల్లోకి తీసుకోగలగడానికి బాధ్యత ఎవరిది?
ఇది బొత్తిగా లోకజ్ఞానం లేని పాఠకుడి మదన. ఏమైనా చేసిన నేరాలకు 20 సంవత్సరాల వ్యవధిని అతి సుళువుగా ఈ వ్యవస్థ ఇవ్వగలదనే ‘దమ్ము’ నేరస్తుడి మొండి ధైర్యానికీ, వ్యవస్థ బలహీనతకీ నిదర్శనం–అని ఈ అమాయకుడైన పాఠకుడు గింజు కున్నాడు. ఆయన్ని మనం తేలికగా క్షమించవచ్చు.
- గొల్లపూడి మారుతీరావు