కీలెరిగిన మాంత్రికుడు
జీవన కాలమ్
ఈ మధ్య విజయ్ మాల్యా ఆర్థికమయిన అవినీతి మీద ఛానళ్లు, పత్రికలు హోరు పెడుతున్నాయి. కోట్ల రూపాయలు బ్యాంకులకూ, కింగ్ ఫిషర్ ఎయిర్‌లైన్స్ సిబ్బందికీ ఎగవేసిన కథలు పుంఖానుపుంఖాలుగా వెలుగులోకి వస్తున్నాయి. తీరా విజయ్ మాల్యాను ఈ దేశం విడిచిపోవడానికి చక్కగా అవకాశం కల్పించాక- దొంగలు పడిన ఆరు నెలలకి ఈ బ్యాంకులు సుప్రీం కోర్టుకెక్కాయని చానళ్లు చెబుతున్నాయి. ‘అవినీతి’కి అంతులేని గ్లామర్ ఉంది. ఈ దేశం వీరప్పన్ గురించి మాట్లాడుకున్నంత రుచిగా పరమాచార్య చంద్రశేఖరేంద్ర సరస్వతీ స్వామివారి గురించి మాట్టాడుకుని ఉండదు.
ఇన్ని రోజులు చానళ్లలో మాట్లాడుతున్నవారూ, ప్రభుత్వ ప్రతినిధులూ - సర్వే సర్వత్రా విజయ్ మాల్యాకు అధికార, బ్యాంకు యంత్రాంగం నుంచి అమోఘమైన సహకారం లభించిందనేవారే కానీ ఏ ఒక్కరూ కారణం చెప్పలేదు. నిజానికి చెప్పలేరు. ఆయా కీలక స్థానాలలో ఉన్న అధికారులు, బ్యాంకు ఆఫీసర్లను కూడగట్టుకోవడానికి శృంగారరాయుడు మాల్యాగారి దగ్గర ఎన్నో దగ్గర తోవలున్నాయి. 9000 కోట్ల పై చిలుకు మాల్యా అరాచకానికి పరోక్షంగా తోడ్పడిన- షరతుల్నీ, పద్ధతుల్నీ, రూల్సునీ తుంగలోకి తొక్కి - నిన్న మొన్నటిదాకా షష్టిపూర్తిని కూడా కోట్ల ఖర్చుతో జరుపుకున్న మాల్యాకు సహాయ పడడానికి వెనుక గల రహస్యం ఏమిటి?
మాల్యాగారి చుట్టూ డజన్ల సీతాకోకచిలుకల్ని చూస్తూ ఉంటాం. మాల్యాగారెప్పుడు కనీసం ఒక్కరు లేదా ఇద్దరు అందమయిన అమ్మాయిల భుజాల మీద చెయ్యి వేసుకుని దర్శనమిస్తూంటారు. వారు ఆయనకి పబ్లిగ్గా ముద్దులు కురిపిస్తూంటారు - చూపరులకి ఈర్ష్య కలిగేటట్టుగా. అతి తరచుగా వారు ఇచ్చే విందుల్లో ఎన్ని సుఖాలు దాగి ఉన్నాయో ఈ దేశంలో పెద్దలందరికీ - కనీసం మనస్సుల్లోనయినా తెలుసు. బ్యాంకులు రూల్సు మరిచిపోయినా, అధికారులు కోట్ల రుణాలకి సంతకాలు చేసినా - ఏ రాత్రి, ఏ సుఖం నీడలో జరిగిందో ఆ భగవంతుడికెరుక. అవినీతి వీధిన పడ్డాక అందరూ ‘మడి’ కట్టుకుని మాట్లాడుతున్నారు కానీ - మన యంత్రాంగంలో తేలుకుట్టిన దొంగలు చాలామంది ఉన్నారు. సుఖానికీ, డబ్బుకీ ఆ దుర్మార్గం ఉంది.
28వ ఏట కోట్లు విలువ చేసే వ్యాపారానికి వారుసుడైన శృంగార పురుషుడు - వ్యాపారానికి బలమైన దగ్గర తోవలు కనిపెట్టడంలో ఆశ్చర్యం లేదు. ఇది చానళ్లలో చెప్పుకునే, ఒప్పుకునే విషయం కాదు. ‘అవినీతి’ని చట్టం పొలిమేరల్లో నిలపగలిగే తెలివైన వాటాదారులూ ఈ గూడుపుఠాణీలో భాగం కావడం ఆశ్చర్యం కాదు.
చాలాయేళ్ల కిందట - తమిళనాడులో ఓ జాతీయ బ్యాంకు చైర్మన్, మేనేజింగ్ డెరైక్టర్ గారికి సినీమావారంటే మోజు ఉండేది. సినీమా సభల్లో తారల సరసన తరచూ కనిపించేవారు - పదిమందికీ తెలిసింది అంతమట్టుకే. అధికారాన్ని అతి ఉదారంగా దుర్వినియోగం చేసి - చీకటి ఒప్పందాలకు - సుఖం పెట్టుబడిగా దన్నుగా నిలిచి, వీధిన పడి జైలుకు వెళ్లారు. 1996 ప్రాంతాలలో అరెస్టయ్యారు. రెండు నెలల తర్వాత బెయిల్ మీద బయటకు వచ్చారు. సీబీఐ కోర్టు వారికి దరిమిలాను పదేళ్లు జైలు శిక్షని విధించింది. మనదేశంలో న్యాయ వ్యవస్థ ధర్మమా అంటూ తన 78వ ఏట వరకూ ఈ కోర్టు కేసులు సాగుతూనే ఉన్నాయి. ఆ రోజుల్లోనే కట్టడం ప్రారంభమైన పది అంతస్తుల భవనం ఇప్పటికీ అదే స్థితిలో, చెన్నై జెమిని సెంటర్లో దర్శనమిస్తుంది. అయితే ఇది కేవలం చిన్న చీమ కథ. మాల్యా గారిది జాతీయ స్థాయి గోమఠేశ్వరుడి కథ.
మొదటి నుంచీ ‘కింగ్ ఆఫ్ గుడ్ టైమ్స్’గా రొమాంటిక్ జీవనాన్ని కెమేరాల ముందు ఆవిష్కరించే శృంగార వ్యాపారి - ఆ శృంగారాన్ని ‘ఎర’గా చేయగలిగితే వ్యాపారానికి ఎల్లలు చెరిగిపోతాయని ఎరిగి, చెరిపేసిన కథని కాస్త ఆలస్యంగా దేశం వింటోంది. ఆయా దశలలో పెద్దల చీకటి కథల్లో అసలు రహస్యం ఉంది. కాని అక్కడంతా చీకటి. కన్నుపొడుచుకున్నా వినిపించడమే కానీ ఏమీ కనిపించదు.
నా మట్టుకు విజయ్ మాల్యా కీలెరిగిన మాంత్రికుడు. ఈ దేశానికి విస్కీ మత్తునీ, గుర్రాల పందాలనీ, కారు రేసుల్నీ , క్రికెట్ ఆటల జూదాన్నీ పంచిన తెలివైన వ్యాపారి - కీలక స్థానాలలో ఉన్న వ్యక్తుల బలహీనతలని - ఏ మనిషినయినా తల్లకిందులు చేయగల ‘ఆకర్షణ’ని పంచడాన్ని ప్రారంభిస్తే దేవుడు కూడా ఆ ఉచ్చు నుంచి తప్పించుకోలేడు. ఎందుకంటే దేవుడు సాక్షాత్తు మోహినీ అవతారంలో ఆ పని చేశాడు కనుక. అయితే ఆనాడు ఆకర్షితులని రాక్షసులన్నాం. ఇప్పుడు చట్టాన్ని అటకెక్కించిన ‘అధికార, బ్యాంకింగు యంత్రాంగం’ అనుకుంటే మర్యాదగా ఉంటుంది.
- గొల్లపూడి మారుతీరావు