సంస్కారం వారసత్వం
జీవన కాలమ్
ముత్తయ్య చెప్పిన మరొకమాట. గేల్ పెంకితనానికి పెద్దలూ, సీనియర్లూ సరిదిద్దకపోవడం మరొక కారణమని. అస్తు. కానీ మనకి ‘పెద్దరికం’ ఎక్కడ చచ్చింది? కాల్‌మనీ రాకెట్లు నడుపుతున్న పెద్దవారా?
ప్రపంచ ప్రఖ్యాత శ్రీలంక క్రికెట్ బౌలర్ ముత్తయ్య మురళీధరన్‌ని ఒక పాత్రికేయుడు అడిగాడు, ‘‘ఆటలో వెస్టిండీస్ ఆటగాడు క్రిస్ గేల్ పెంకిగా ప్రవర్తించడం మీద మీ అభి ప్రాయమేమిటి?’’ అని. సమాధానం ఆశ్చర్యాన్ని కలిగించింది. ‘తల్లిదండ్రుల పెంపకం సరిగా లేకపోవడం కారణం’ అన్నది మురళీధరన్ సమాధానం. ఈయన ఈతరం ఆటగాడు. బొత్తిగా కిందటి శతాబ్దపు దిక్కుమాలిన కారణం చెప్పాడేమిటి! మరో కారణం- తన కంటే సీనియర్స్ (పెద్దలు) అతన్ని సరిదిద్దకపోవడం. ఇదీ ఆశ్చర్యకరమైన సమాధానమే.
నేను విజయవాడలో ఆంధ్రప్రభలో పనిచేసే రోజుల్లో ఓసారి నీలంరాజు వేంకటశేషయ్య గారింట్లో విందుకి వెళ్లాను. ఆచార్య పింగళి లక్ష్మీకాంతం గారు, కాటూరి, రావూరి వెంకటసత్యనారాయణరావు గారూ- ఇలాంటి పెద్దలు ఉన్నారు. మాలాంటి కుర్రాళ్లం ఉన్నాం. మమ్మల్నందరినీ పేరు పేరునా పలకరించారు పింగళి.
‘పేరు?’ మొదటి ప్రశ్న. రెండో ప్రశ్న, ‘ఎవర బ్బాయి తమరు!’
‘ఫలానా పురాణం వెంకయ్యగారి కొడుకుని’
‘అంటే రామయ్య మీకేమవుతారయ్యా?’
‘తాతగారండి!’
వెంటనే ఆయన కళ్లలో మెరుపు. ‘నువ్వు మా రామయ్య మనవడివిరా!’ ఆనందం.
అందరినీ ఇలా పేరుపేరునా పలకరించి, ‘ఏమండీ!’ అని ప్రారంభించి, ‘ఏమోయ్!’ దాకా ప్రయాణించి, ‘నువ్వుట్రా!’ అని ఆత్మీయంగా గుండెలకు హత్తుకునే దాకా ప్రశ్నలు సాగేవి. నేను చదువుకున్న చదువు, సాధించిన విజయాలూ కాదు, తెచ్చుకున్న వారసత్వం నా బ్యాంకు ఎకౌంట్. మరి నా ప్రతిభ? నా పరపతి? - నా ముందు తరానికి.
ఆ కాలంలో కొత్త మనిషిని చూస్తే అడిగే మొదటి ప్రశ్న, ‘ఎవరబ్బాయివి బాబూ!’ అని. నా పరపతి నా తల్లిదండ్రులు నాకిచ్చిన వైభవం. దాదాపు 66 ఏళ్ల కిందట- మా పెత్తండ్రి కొడుకు- నాకు అన్నయ్య- పెళ్లి సంబంధం చూడడానికి మా అమ్మ, పిన్నితో వెళ్లాను. నాకప్పుడు పదేళ్లు. పెళ్లి కూతురుని కూర్చోపెట్టారు. పక్కనే ఎవరో అమ్మలక్కలు, తల్లి వగైరాలున్నారు. మా అమ్మ, పిన్ని పెళ్లికూతురుని చూశారు. తర్వాత ప్రశ్న, ‘తల్లి ఎవరు?’ ఆవిడ చిరునవ్వు నవ్వింది. ‘మీకెంత మంది పిల్లలు?’ పురుళ్లు ఎక్కడ పోసుకున్నారు? ఆరోగ్యం బాగుందా? చక్కెర, రక్తపోటు ఏమైనా ఉన్నాయా? మీ నాన్నగారేం చేసేవారు? - ఇవీ ప్రశ్నలు. ఇదేమిటి? ఎదురుగా పెళ్లి కూతురు కూర్చుంటే ముసలా విడతో పలకరింతలేమిటి? అని నాకు విచికిత్స.
కాని పలకరించాల్సింది ఆవిడనే అని పాతికేళ్ల తర్వాత తెలిసివచ్చింది. వయసు గడిచి, పిల్లలు పుట్టాక- ఈ అమ్మాయి అక్షరాలా తల్లి రూపునీ, ఆరోగ్యాన్నీ, స్వభా వాన్నీ పుణికి పుచ్చుకుంటుంది. ఆవిడకి రక్తపోటు ఉందా? కీళ్ల నొప్పులు ఉన్నాయా? పురుళ్లు అయ్యాక ఒళ్లు వచ్చిందా? అక్షరాలా యథాతథంగా పిల్లకీ ఉంటుంది. అది జెనిటిక్ వారసత్వం. ఇది ఒక పార్శ్వం. వాళ్ల నాన్నగారు, ఆమె పుట్టింటినుంచి తెచ్చిన వారస త్వం. సామాజిక వారసత్వం. ఇవి ఎదురుగా కూర్చున్న పిల్లకి భవిష్యత్తులో పెట్టుబడులు. ఇది శాస్త్రీయమైన పరిణామం. హిరణ్యకశిపుడుకి ప్రహ్లాదుడు పుట్టడం, లీలావతి గర్భంతో ఉన్నప్పుడు చేసుకున్న పుణ్యం. అది మినహాయింపు. తర్వాత పెళ్లి జరిగింది. ఇద్దరూ 54 ఏళ్లు కాపురం చేశారు. మా అన్నయ్య వెళ్లిపోయాడు. ఇప్పటికీ 85 ఏళ్ల వదినెగారు పిల్లలతో, మనుమలతో, మునిమ నుమలతో నిక్షేపంగా ఉంది.
పార్కుల్లో ప్రేమించి, ప్రేమ తమ హక్కని భావించి, ఆఫీసులలో కలసి పనిచేయడానికి ప్రేమని గుర్తు పెట్టుకున్న నేటి తరం యువత చాలా సందర్భా లలో పప్పులో కాలేయడం- సంవత్సరం తిరగకుండానే విడిపోవడం మనం చూస్తున్నాం. పెళ్లిలో ఇది ఒక పార్శ్వం. అమ్మాయి అందం, స్వభావం, దృక్పథం - ఇవన్నీ ఇద్దరూ ఒకటైతే మార్చుకోవచ్చు. కానీ సంప్రదా యం - అనుభవంతో రంగరించిన, తరతరాలు అందిం చిన వారసత్వానికి ప్రత్యామ్నాయం లేదు. దగ్గరతోవ లేదు. అదే క్రిస్ గేల్‌కీ, ముత్తయ్య మురళీధరన్‌కీ తేడా. ఆ విలువలే ఇవాళ ఏ కాస్తో వివాహ వ్యవస్థకి గొడుగు పడుతున్నాయి.
ముత్తయ్య చెప్పిన మరొకమాట. గేల్ పెంకితనానికి పెద్దలూ, సీనియర్లూ సరిదిద్దకపోవడం మరొక కారణమని. అస్తు. కానీ మనకి ‘పెద్దరికం’ ఎక్కడ చచ్చింది? కాల్‌మనీ రాకెట్లు నడుపుతున్న పెద్దవారా? ఆస్తుల్ని దోచుకుంటున్న నాయకులా? మతాన్నీ, కులాన్నీ పణంగా పెట్టి రాజకీయ పబ్బాన్ని గడుపుకొంటున్న అవకాశవాదులా?
ఇవాళ యువతరంలోని ‘అవ్యవస్థ’కి పెద్ద లోపం- భ్రష్టుపట్టిన పెద్దల వారసత్వం. ఇంతకీ ముత్తయ్య మురళీధరన్ చేసిన అపకారం నా కాలమ్‌కి పెట్టుబడి.
- గొల్లపూడి మారుతీరావు