‘కళ్లు’ సినిమా రిలీజై 30 సంవత్సరాలు అయిన సందర్భంగా కలుసుకున్న చిత్ర బృందం. శివాజీరాజా, ఎం.వి.రఘు, ఉత్తేజ్, బిక్షు
గొల్లపూడి మారుతీరావు రచించిన కథ ఆధారంగా ఎం.వి. రఘు దర్శకత్వంలో వచ్చిన చిత్రం ‘కళ్లు’. కె. విశ్వనాథ్ దర్శకత్వంలో వచ్చిన ‘సిరివెన్నెల’ చిత్రానికి ఎం.వి.రఘు ఛాయాగ్రాహకుడిగా, సీతారామశాస్త్రి గీతరచయితగా పనిచేశారు. అప్పటి నుంచి సీతారామశాస్త్రితో ఎం. వి. రఘు స్నేహం పల్లవించి, సౌరభాలు వెదజల్లింది. ‘కళ్లు’ నాటకాన్ని చిత్రంగా మలచాలనుకున్న ఆలోచన మనసులో మెదలగానే, ఆ చిత్రంలో పాటలను సీతారామశాస్త్రి చేత రాయించాలనుకున్నారు రఘు. ఆగస్టు 12కు ‘కళ్లు’ సినిమా 30 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆ చిత్రంలో సీతారామశాస్త్రి రచించి, గానం చేసిన ‘తెల్లారింది లెగండోయ్ కొక్కొరోకో’ పాటకు సంబంధించిన అంశాలను ‘సాక్షి’తో పంచుకున్నారు చిత్ర దర్శకుడు ఎం.వి. రఘు.
ఒక కన్ను ఎస్.డి. బర్మన్
‘‘కాలేజీలో చదువుకునే రోజుల్లో హిందీ చలన చిత్ర సంగీత దర్శకుడు ఎస్. డి.బర్మన్ పాటలు వింటుండేవాడిని. ఆయన చేసిన పాటలలో ఆయనే స్వయంగా పాడిన పాటలలో ఏదో ఒక అనుభూతి కలిగేది నాకు. ఇటువంటి పాటలను ఫిలసాఫికల్‌గా, మనసు పెట్టి వినాలి, అనుభూతి చెందాలి. అదే అనుభవం సీతారామశాస్త్రి అప్పుడప్పుడు వాడుకలో ఉన్న పల్లెపదాలను బల్ల మీద డప్పులా వాయిస్తూ పాడుతున్నప్పుడు కలిగేది. ఆయన పాట పాడే విధానంలో వినిపించిన వేదాంతం, నా మనసులో చిత్తరువులా నిలిచిపోయింది.
ఇంకో కన్ను సీతారామశాస్త్రి
‘కళ్లు’ చిత్రం తీయాలనుకున్నప్పుడు, అటువంటి పాటను రాయించి, పాడించాలని మనసులో అనుకున్నాను. ఈ చిత్రానికి ఎస్.పి. బాలు సంగీతం సమకూర్చారు. ఈ పాటను సీతారామశాస్త్రితో పాడించాలనుకుంటున్న నా ఆలోచనను బాలుతో చెప్పగానే, తన మనసులో మాట కూడా అదేనని ఆయన అనడంతో ఆ పాటను సీతారామశాస్త్రితో పాడించాం. ఈ పాట ఉద్దేశం.. ‘కళ్లు వచ్చిన తరవాత కళ్లతో కాకుండా మనసుతో చూడండి’ అని ఒక వేదాంతం చెప్పడం. ‘తెల్లారింది లెగండోయ్ కొక్కొరోకో.. మంచాలింక దిగండోయ్ కొక్కొరోకో.. ముడుసుకున్న రెక్కలిడిసి పిట్ట సెట్టు ఇడిచింది.. మూసుకున్న రెప్పలిడిసి సూపులెగరనీయండి..’ అంటూ సాగుతుంది ఈ పాట.
కళ్ల నిండా జ్ఞాపకాల తడి
ఈ చిత్రం షూటింగ్ 1988 జనవరి ఎనిమిదో తేదీన విశాఖపట్టణంలో పూర్తయింది. యూనిట్‌లో అందరినీ వెనక్కి పంపడానికి చేతిలో ఒక్క పైసా లేదు. మేం దిగిన హోటల్ యజమానితో అప్పటికే స్నేహం ఏర్పడింది. ఆయన దగ్గరకు వెళ్లి, ‘మా దగ్గర ఉన్న ఈ సామాను మీ దగ్గర ఉంచుకుని, పది వేలు ఇవ్వండి’ అని అడిగి తీసుకుని, అందరినీ రైలు ఎక్కించాను. నాటి సంఘటన నేటికీ నా మనసులో ఇంకా తడి జ్ఞాపకంగానే ఉంది. నా మనసు ఆర్ద్రతతో నిండిపోయింది. ఆ రోజున అత్తారింటికి కూతురిని పంపిస్తున్న తండ్రిలా నేను ఏడుస్తుంటే, తండ్రిని విడిచి వెళ్తున్న పిల్లల్లా వారంతా బాధపడ్డారు.
కంటికి కనిపించిన పాట
అందరూ వెళ్లాక... నేను, నా కెమెరా, సత్యానంద్, నా కో–డైరెక్టర్‌గా పనిచేసిన ఇవివి సత్యనారాయణ మిగిలాం. మేమంతా ఒక వ్యానులో బయలుదేరి, దారిలో చిన్న కుక్కపిల్ల, గట్ల వెంట ఆడపిల్లలు, గోతులలో లీకైన కుళాయిలు... ఇలా దైనందిన జీవితాన్ని ప్రతిబింబించేలా కనపడినవన్నీ నా కెమెరాతో బంధించాను. దారిలో పనిచేస్తున్న కార్మికులను చూడగానే ‘చెమట బొట్టు సమురుగా సూరీణ్ని ఎలిగిద్దాం / వెలుగు చెట్టు కొమ్మల్లో అగ్గిపూలు పూయిద్దాం’ అనే వాక్యానికి తగిన సన్నివేశం కనిపించిందని సంతోషపడ్డాను. ఆ వాక్యాలకు అనుకూలంగా అక్కడ పనిచేస్తున్న పనివారూ, ఆ సంధ్య ఎరుపు.. నూనె చారలాగ వచ్చింది.
కంటిని నడిపించిన పాట
మద్రాసులో ఉండే అనిల్ మల్నాడ్‌తో ఎడిటింగ్ చేయించేవరకు అసలు సినిమాలో ఏ సన్నివేశాలు ఉంటాయో ఎవరికీ తెలియదు. సినిమా పూర్తయ్యాక థియేటర్లలో విడుదలైంది. సినిమాకు పెద్దగా ప్రేక్షక ఆదరణ రాలేదు. అదేం చిత్రమో కాని, ఈ పాట ప్రారంభం కాగానే, ఆపరేటర్ సహా బయట ఉన్నవారంతా లోపలకు వచ్చేవారు. థియేటర్ ఫుల్ అయిపోయేది. పాట అయిపోగానే క్లాప్స్ కొట్టి వెళ్లిపోయేవారు.
ఇంతకాలం తర్వాత ఇటీవల ఈ పాటను యూ ట్యూబ్‌లో పెట్టాలనిపించింది. అలా పెట్టిన వారానికే ఐదు లక్షల హిట్స్ దాటాయి. ఈ చిత్రం విడుదలయిన 30 సంవత్సరాల తరవాత మళ్లీ ఈ చిత్రం గురించి మాట్లాడుతున్నారు. ఈ చిత్రంలో నటించిన చిదంబరం ‘కళ్లు చిదంబరం’గా తెలుగు సినీ ప్రేక్షకులకు పరిచితుడయ్యాడు.
(‘కళ్లు’ చిత్రంలోని ఓ దృశ్యం)
– సంభాషణ: వైజయంతి పురాణపండ
Comments
Please login to add a commentAdd a comment