దివంగత రచయిత సిరివెన్నెల సీతారామ శాస్త్రితో క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీకి ప్రత్యేకమైన అనుబంధం ఉంది. శాస్త్రిని ఆయన గురువుగా చెప్పుకుంటారు. శాస్త్రి కూడా కృష్ణవంశిని దత్త పుత్రుడు అని సంభోధించేవాడు. కృష్ణవంశీ దర్శకత్వం వహించిన సినిమాలన్నింటికి శాస్త్రి లిరిక్స్ అందించాడు. కొన్ని పాటలు అయితే ఇప్పటికీ మర్చిపోలేం. అందులో ‘అర్ధశతాబ్దపు అజ్ఞానాన్నే స్వతంత్రమందామా’ అనే పాట ఒకటి. ఆ పాట అప్పుడే కాదు ఇప్పుడు విన్నా గూస్‌బంప్స్ వచ్చేస్తాయి. ఇంత గొప్ప పాటను రాయడానికి సీతారామ శాస్త్రి కేవలం గంట సమయం మాత్రమే తీసుకున్నాడట. ఈ విషయాన్ని తాజాగా ఓ ఇంటర్వ్యూలో కృష్ణవంశీ తెలిపాడు. అంతేకాదు ఆ పాటని రోడ్డు మీద పడేసిన సిగరేట్ పెట్టమీద రాశాడట.
‘ఆర్జీవీ తెరకెక్కించిన ‘శివ’, ‘క్షణ క్షణం’, ‘అంతం’ సినిమాల ద్వారా శాస్త్రితో నాకు స్నేహం ఏర్పడింది. ఆ తర్వాత నేను దర్శకత్వం వహించిన సినిమాలన్నింటికి శాస్త్రిగారితో లిరిక్స్ రాయించుకున్నాను. నా ప్రతి సినిమా కథను ముందుగా శాస్త్రికి చెప్పడం అలవాటు. అలాగే కాపీ వచ్చిన తర్వాత కూడా ఆయనకే చూపించేవాడిని.
అలా సింధూరం సినిమా కాపీని ఆయనకు చూపించాను. అది చూసిన తర్వాత శాస్త్రి రోడ్డు మీద అటు ఇటు తిరుగుతున్నాడు. ‘ఏంటి గురువుగారు’ అంటే ‘పేపర్ ఏదైనా ఉందా?’అని అడిగాడు. అప్పుడు నా దగ్గర పేపర్ లేదు. దీంతో రోడ్డు మీద సిగరెట్ పెట్టె పడి ఉంటే తీసి ఇచ్చాను. దాని మీద లిరిక్స్ రాసుకొని..వెంటనే ఇంటికెళ్లి గంటలో పాట రాసిచ్చాడు. అంతేకాదు ‘నువ్వు ఏం చేస్తావో తెలియదు.. సినిమాలో ఫలాన చోట ఈ పాట రావాలి’అని చెప్పారు. ఇదంతా సినిమా విడుదలకు రెండు రోజుల ముందు జరిగింది. ఏం చేయాలో అర్థం కాక..బాలు దగ్గరికి వెళ్లి చెప్పాను. చివరకు రికార్డు చేసి విడుదల చేశాం. రిలీజ్ తర్వాత సినిమాకు అదే కీలకం అయింది’ అని కృష్ణవంశీ చెప్పుకొచ్చాడు.
‘నిన్నే పెళ్లాడతా సినిమాలో ‘కన్నుల్లో నీ రూపమే’ పాట సందర్భం వివరిస్తూ.. ‘హీరో హీరోయిన్ల ఇళ్లల్లో పెద్దవాళ్లు లేరు. వారిద్దరు కలవాలి.ఎంతైనా చెప్చొచ్చు.. కానీ ఏమి చెప్పకూడదు’అని చెబితే.. ‘నువ్వు నాశనం.. నేను నాశనం’ అని వ్యంగ్యంగా నన్ను తిడుతూ శాస్త్రిగారు ‘కన్నుల్లో నీ రూపమే’ పాట రాశారు’అని కృష్ణవంశీ చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment