
‘పిచ్చి’ వృత్తి
వెర్రి వెయ్యి విధాలని సామెత. ఎవడి వెర్రి వాడికి ఆనందం. కానీ దేశం పిచ్చిని తన పిచ్చిని చేసుకున్న ఒక క్రికెట్ అభిమాని ఉన్నాడు. అతని పేరు సుధీర్ గౌతమ్.
మీరు అతన్ని ప్రతీ క్రికెట్ ఆటలోనూ చూడకుండా ఉండరు. ఒంటినిండా జాతీయ జెండా రంగు రాసుకుని, చేతిలో పెద్ద జెండాతో –ప్రతీ భారత జట్టు పరుగులకీ జెండా ఎగరేస్తాడు. ‘జై భారత్!’ అని అరుస్తాడు. క్రికెట్ స్టేడియం అంతా మార్మోగుతుంది. ఆరోయేటి నుంచీ సచిన్ టెండూల్కర్‌కి వీరభక్తుడు. 2002లో సచిన్ పిచ్చి ప్రారంభమైంది. 2003లో ఇండియా, న్యూజిలాండ్, ఆస్ట్రేలియాలతో మూడు దేశాల కప్పు కోసం ఆడుతున్నప్పుడు 3 వారాలపాటు బిహార్‌లో ముజాఫర్‌పూర్ నుంచి బొంబాయికి 1,700 కిలోమీటర్లు సైకిల్ తొక్కుకుంటూ కేవలం సచిన్‌ని కలుసుకోడానికి వెళ్లాడు. ట్రైడెంట్ హోటల్లో సచిన్ పత్రికా సమావేశం జరుగుతోందని తెలిసి వెళ్లాడు. సచిన్ అతన్ని ఇంటికి భోజనానికి తీసుకెళ్లాడు. తర్వాతి మ్యాచ్‌కి సచిన్ టికెట్ ఇచ్చాడు. కటక్ ఆటలో సచిన్ కాళ్లమీద పడడానికి గ్రౌండ్ మధ్యకి పరిగెత్తాడు. పోలీసులు పట్టుకున్నారు. బయటికి తగిలేశారు.
హైదరాబాద్‌లో ఆస్ట్రేలియా మ్యాచ్‌లో సచిన్ సెంచరీ చేసినప్పుడు గ్రౌండులోకి పరిగెత్తి సచిన్ కాళ్లమీద పడ్డాడు. ఈసారి పోలీసులు తన్ని జైల్లో పడేశారు. ప్రతియేడూ తన ఊరిలో పండే లిచీపళ్లు తెచ్చి సచిన్‌కి ఇస్తాడు. సచిన్ ఇతనికి క్రికెట్ మ్యాచ్ టికెట్లు కొనిపెడతాడు. తన ఊళ్లో సుధా డెయిరీలో పనిచేసి విదేశాలకు వెళ్లడానికి పాస్ పోర్ట్‌కి కావలసిన డబ్బు సమకూడగానే ఉద్యోగం మానేశాడు. 2004లో పాకిస్తాన్‌లో మ్యాచ్ చూడడానికి సైకిలుమీద పాకిస్తాన్ వెళ్లిపోయాడు. 2009లో కాన్పూర్‌లో మ్యాచ్ చూడడానికి గేట్లు దూకే ఇతన్ని పోలీసులు చావగొట్టారు. సచిన్ అడ్డుపడ్డాడు. 2011లో ప్రపంచకప్ గెలిచినప్పుడు సచిన్ ఇతన్ని ఆటగాళ్ల గదిలోకి పిలిచి ప్రపంచకప్‌ని పట్టుకోనిచ్చాడు. అది గౌతమ్ జీవితంలో గొప్ప క్షణం.
సచిన్ ఆట ఆడే వరకూ అతని ఒంటిమీద జాతీయ జెండాతో పాటు ‘టెండూల్కర్’ అనే అక్షరాలు రాసుకునేవాడు. సచిన్ ఆట విరమించాక ‘మిస్ యూ సచిన్’ అని రాసుకుంటాడు. ఆస్ట్రేలియా వెళ్లడానికి ఒక రేడియో చానెల్ ఇతని ఖర్చులు భరించింది. అయితే మ్యాచ్‌నాడు ఆస్ట్రేలియా చేరడానికి వీసా దొరకలేదు. గౌతమ్ వెంటనే సచిన్‌కి ఫోన్ చేశాడు. సచిన్ ఢిల్లీలో ఆస్ట్రేలియా రాయబార ఉద్యోగులతో మాట్లాడాడు. ఒక్క రోజులో వీసా వచ్చేసింది. ఒంటినిండా రంగు వేసుకోడానికి రంగు డబ్బాలు తనతో తీసుకువెళ్తాడు. ఒకసారి న్యూజిలాండ్ అధికా రులు–విమానంలో రంగులు తీసుకువెళ్లినందుకు 65 వేల జరిమానా వేశారు. మళ్లీ సచిన్ రాయబార కార్యాలయానికి ఉత్తరం రాశాడు. జరిమానా రద్దయింది.
33 ఏళ్లొచ్చినా గౌతమ్ పెళ్లి చేసుకోలేదు. ‘నా పిచ్చితో మరో అమ్మాయి జీవితాన్ని ఎందుకు ఇబ్బంది పెట్టాలి’ అన్నది అతని సమాధానం. ఈ పిచ్చి మొదలయ్యాక తన తండ్రికి ఇష్టం లేదని తెలిసి ఆయనతో మాటలు మానుకున్నాడు. తల్లీ, చెల్లితో మాట్లాడడు. ‘నేను ఈ భూమిమీద ఉన్నంతకాలం భారత టీమ్ నా ప్రాణం. అయితే సచిన్ సార్ పేరే నా శరీరంమీద ఉంటుంది. కాళ్లలో శక్తి ఉండి నడవగలిగే వరకూ సచిన్ పేరే నాకు మంత్రం’ అన్నాడు గౌతమ్. ఇటీవల బంగ్లాదేశ్‌లో భారతదేశం ఆడుతుండగా సెహ్వాగ్ బంగ్లాదేశ్ బౌలర్‌ని నాలుగు ఆర్లు కొట్టాడు. గౌతమ్ జెండా రెపరెపలాడింది. స్టేడియం ‘జై భారత్!’ అంటూ ప్రతిధ్వనించింది. బంగ్లాదేశ్ అభిమానులు గౌతమ్‌ని చావగొట్టారు. జెండాని చింపేశారు.
అభిరుచి అభిమానమై, అభిమానం భక్తి అయి, భక్తి అంచులు తెంచుకుని పిచ్చిగా స్థిరపడి– ఆ పిచ్చిని వృత్తిని చేసుకున్న విచిత్రమైన వ్యక్తులు వీరు. ఆట ఆడేవారికి తృప్తి ఉంది. ఆదాయం ఉంది. కీర్తి ఉంది. భార్యలున్నారు. ప్రియురాళ్లున్నారు. రిటైరయ్యే వయస్సుంది. కానీ గౌతమ్‌కి తల్లినీ, తండ్రినీ, చెల్లినీ, ఉద్యోగాన్నీ, చదువునీ, భవిష్యత్తునీ, రేపునీ వదులుకున్న ‘పిచ్చి’ మాత్రమే ఉంది. ఆ పిచ్చి వృత్తిగా మారి వ్యాపకమైంది.
మంచి ఆటని చూసి ఆనందంగా చప్పట్లు కొడతాం. చప్పట్లకి అస్తిత్వం లేదు. ఆనందానికి ఉంది. గ్రౌండులో ఆట ఆడే ప్రతి ఆటగాడికీ ‘రేపు’ ఉంది. ఈ పిచ్చికి ఆ క్షణాన్ని పూరించే ‘మైకం’ మాత్రమే ఉంది. మైకానికి అస్తిత్వం లేదు. కానీ మైకానికి కారణానికి ఉంది. కొన్ని వందలమంది విశాఖ స్టేడియంలో నాతో ఫొటోకి వెంటబడ్డారు. గౌతమ్‌తో ఫొటో తీయించుకోడానికి నేను ఆహ్వానించాను. ఆనందంగా వచ్చాడు. నేనెవర్నో చెప్పాను. అతని ముఖంలో స్పందన లేదు. ఒకటే ఆవేశం. ఆటకి ఆనందించే మైకం. ‘విక్టరీ’ గుర్తు పెట్టి నిలబడ్డాడు సుధీర్ గౌతమ్ త్యాగి. నాకు జాలేసింది. ఏ కాస్తో అతనికంటే నేను చిన్నవాడిననిపించింది.
- గొల్లపూడి మారుతీరావు