స్వయంకృతం | self mistakes causes irresponsibility | Sakshi
Sakshi News home page

స్వయంకృతం

Published Thu, Dec 10 2015 8:57 AM | Last Updated on Sun, Sep 3 2017 1:47 PM

స్వయంకృతం

స్వయంకృతం

జీవన కాలమ్
 
బాధ్యతారాహిత్యంగా తనని దోచుకునే మానవాళిని ప్రకృతి ఎప్పటికప్పుడు నిశ్శబ్దంగా హెచ్చరిస్తూనే ఉంది. ఇటీవల దోపిడీ ఎక్కువయింది కనుక, హెచ్చరికలు తరుచుగా వినవస్తున్నాయి.  మనకి ధర్మం అంటే బూతు మాట. మన నైమిత్తిక జీవ నంలో ఒకరు చెప్ప కుండానే మనం పాటిం చాల్సిన విధి ధర్మం. మతం అంటే మరో పెద్ద బూతు. మానవుని జీవన సరళి సజావుగా సాగడానికి మానవుడే ఏర్పరచుకున్న ప్రణాళిక మతం. మనకు 33 కోట్ల మంది దేవతలు. ఎలుక, కుక్క, పాము, భూమి, చెట్టు, నీరు, వర్షం- అన్నీ మనకు దేవతలే. నేటి ఇంగ్లిష్ చదువులు చదువుకుంటున్న మీ అబ్బాయే ఈ మాట చెప్తే మిమ్మల్ని వెక్కిరిస్తాడు- మా నాన్న తరం మరీ ఇంత ఆటవిక సంస్కృతిలో జీవించారని. మనకి ఉపకారం చేసే ప్రతి ప్రాణినీ, శక్తినీ దేవతగా భావించడం ఆనాటి తరాల సంస్కారమని ఆ కుర్రాడికి ఎవరూ నేర్పలేదు.

ఇవాళ తమిళనాడులో గత శతాబ్దంలో ఎన్నడూ కురవనంత వర్షం కురిసింది. మరి శతాబ్దం కిందట ఇంత అనర్థం ఎందుకు జరగలేదు? 125 సంవత్సరాల కిందట ఉత్తరాంధ్రలో హుద్‌హుద్ వంటి తుపాను  వచ్చిందన్నారు చదువుకున్న పెద్దలు. అప్పుడు ఇంత అనర్థం ఎందుకు జరగలేదు? ఇప్పుడు వేల మంది చెన్నైలోనే చచ్చిపోయారు. మృతదేహాలను ఇంట్లో పెట్టుకుని, వాటికి సంస్కారం ఎలా చెయ్యాలో తెలీక గిజగిజలాడారు. కొన్ని వేల ఇళ్లు మునిగిపోయాయి. నదులు పొంగి వీధుల్లోకి, ఇళ్లల్లోకి దూకాయి. సమాచార సాధనాలు దెబ్బతిన్నాయి. ఆ మధ్య హైదరాబాద్‌లో, ఇటీవల ముంబైలో, మొన్ననే కేదార్‌నాథ్‌లో జరిగిన అనర్థాల గురించి మనం చదువుకున్నాం.

ఇప్పుడు టీవీలలో, చదువుకున్న చాలా గొప్పగొప్ప వారు- పర్యావర ణాన్ని గురించీ, మరి కొందరు నగరంలో అక్రమకట్టడాల గురించీ చాలా ఆవేశంగా ప్రసంగించారు. ఇవి కాలిన చేతులకి చాలనన్ని ఆకులు. ఆ రోజుల్లోనే- కేదార్ విలయం జరిగినప్పుడు ఒక చానల్ శివుడు మూడో కన్ను తెరిచాడని చాలా హృదయ విదారకమైన పాటను వేసి ఆ దృశ్యాల్ని రక్తి కట్టించింది. శివుడు మూడో కన్ను, ముప్పయ్యవ కన్ను తెరిచేంత మూర్ఖుడు కాదు- ఆయన దేవుడని కొందరయినా నమ్మితే. శివుడు లాలూప్రసాద్ యాదవ్ కాదు. సోనియాగాంధీ కాదు. ములాయంసింగ్ కాదు.

సంవత్సరాల తరబడి- తెలివైన స్వార్థపరులు- చెయ్యకూడని పనులు చేస్తూ, అక్రమంగా కట్టడాలను కట్టి డబ్బు చేసుకుంటూంటే- ధర్మానికీ, బాధ్యతకీ అర్థం తెలీని- నేలబారు ఉద్యోగులు, రాజకీయ నాయకులు, వ్యాపారులూ గడ్డికరుస్తూ ఉంటే- మానవాళిని కాపాడటానికి నీటి గమనానికి ఉద్దేశించిన ఆ స్థలాలలో భవనాలు లేస్తే- నూరేళ్ల తర్వాత మునిగిపోయాయని ఏడిస్తే ఏం లాభం? అడిగే నాథుడూ, సంజాయిషీ చెప్పే నాయకుడూ ఎక్కడ? ఎవరి హయాంలో ఎవరు గడ్డి తిన్నారు? మీనంబాక్కం విమానాశ్రయం, చెంబురు బాక్కం నదీ పరీవాహక ప్రాంతమట. ఇది నూరు సంవత్సరాలు మనకి తెలియని విషయం. చెన్నైలో కురిసిన 100 సెంటిమీటర్ల కనీవినీ ఎరుగని వర్షపు నీటిని అలవోకగా సముద్రానికి చేర్చగలిగిన కొన్ని వేల (కనీసం 2 వేలు!) నీటి మార్గాలలో ప్రస్తుతం భవనాలున్నాయని పెద్దలు నిన్న టీవీల్లో చెప్పారు. ఈ తిలాపాపం ఎవరిది?

ప్రకృతికి నోరులేదు. చెప్పదు. చేసి చూపుతుంది. హెచ్చరించదు. తిరగబడుతుంది. తలవొంచు కోదు. తలవొంచుతుంది - అది ప్రాథమిక శక్తి కనుక.18 సంవత్సరాల కిందట- నేను చెన్నైలో కొనాలనుకున్న స్థలంలో ఒక నుయ్యి ఉండేది. అది మూసివేస్తే కాని కుదరని పరిస్థితి. పెద్దలు నా చేత శాంతి చేయించి, నష్టపోతున్న నీటి వనరుకి ప్రత్యామ్నాయాన్ని నిర్దేశింపజేసి- అప్పుడు మూయనిచ్చారు. ఒక చిన్న నుయ్యి అవసరాన్ని గుర్తుపట్టి హెచ్చరించిన సంస్కృతి మనది. దీనికి మరో పేరుంది - ధర్మం.

ఈ సృష్టిలో భూమి మీద తిరిగే వానపాముకీ, పిచ్చుకకీ, పక్షికీ, సీతాకోకచిలకకీ, చెట్టుకీ, పుట్టకీ ఒక ప్రయోజనం ఉంది. మానవుడు నిస్వార్థంగా వాటిని కాపాడుతూ సహజీవనం చేశాడు. ఈ ప్రకృతిని దేవతలాగ భావించి, గౌరవించి, పూజించాడు. ఆ కారణానికే మానవుల శ్రేయస్సుని శతాబ్దాలుగా కాపాడింది ప్రకృతి. దీనికి మరో పేరుంది- మతం.

బాధ్యతారాహిత్యంగా తనని దోచుకునే మాన వాళిని ప్రకృతి ఎప్పటికప్పుడు నిశ్శబ్దంగా హెచ్చరిస్తూనే ఉంది. ఇటీవల దోపిడీ ఎక్కువయింది కనుక, హెచ్చ రికలు తరుచుగా వినవస్తున్నాయి. ప్రకృతిది మౌనశక్తి. మహా ప్రళయం. దానికి శివుడూ, కాకరకాయా అని పేరు పెట్టి ‘మెలోడ్రామా’ని చానళ్లు అమ్ముకుంటే- అది మరో ఆత్మవంచన అవుతుంది. సృష్టి ప్రాథమిక శక్తి. ఏ వంచనకూ లొంగదు. నిన్నటి చెన్నై అందుకు పెద్ద ఉదాహరణ.

- గొల్లపూడి మారుతిరావు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement