కింగ్‌ మేకర్‌ | Gollapudi Maruthi Rao Article On K Raghava | Sakshi
Sakshi News home page

కింగ్‌ మేకర్‌

Published Thu, Aug 16 2018 12:58 AM | Last Updated on Thu, Aug 16 2018 12:58 AM

Gollapudi Maruthi Rao Article On K Raghava - Sakshi

తన వ్యక్తిత్వంతో– చిత్తశు ద్ధితో, నిరంతర కృషితో, నిజాయితీతో– ఎన్ని సోపా నాలను అధిగమించవ చ్చునో–తను జీవించి నిరూ పించిన యోధుడు చలన చిత్ర నిర్మాత కె. రాఘవ.

ఆయన ఎక్కడ పుట్టాడో తెలీదు. ఎక్కడ పెరిగాడో అంతగా తెలీదు. తమిళుడు. చిన్నతనం నుంచీ సినీరంగంలోనే ఉంటూ బీఆర్‌ పంతులు, మీర్జాపురం రాజాగారి కంపెనీలలో ఆఫీసు బోయ్, ప్రొడక్షన్‌ మేనేజరు, అటెండర్, ఎక్స్‌ట్రా స్టంటు విభాగంలో పనులు చేసి– కాలు పెట్టిన ప్రతీచోటా తనదైన ప్రత్యేకతను నిలుపుకుని– నిర్మాత అయి– తెలుగు చలన చిత్ర రంగంలో ఎవరూ చెయ్యలేని, చెయ్యని సాహసాలను అధిగమించిన కార్యదక్షుడు రాఘవ. నాకు ఆయన 1968 నుంచీ తెలుసు. అప్పుడు విజయవాడ రేడియోలో పని చేస్తున్నాను. ‘జగత్‌ కిలాడీలు’ రిలీజుకి వచ్చి వెల్కం హోటల్లో ఉన్నారు ఆయన, ఆయన పార్టనర్‌ ఏకామ్రే శ్వరరావుగారు. జగత్‌ కిలాడీలు పెద్ద హిట్‌. అది ఇంగ్లిష్‌ నవల Crimson Circle స్ఫూర్తి.

మధ్య మధ్య ఆయన్ని చూస్తున్నా– నా అవ తారాలు మారి సినిమా రచన చేయడం ఆయనకి తెలుసు. 1981లో నాకాలూ చెయ్యీ విరిగి రాయ పేట ఆసుపత్రిలో ఉన్నప్పుడు ఓ సినిమా రచనకు ఏకామ్రేశ్వరరావుగారి ద్వారా కబురు పంపారు. పారి తోషికం ఎంత? 4 వేలు! ఆరునెలలు మంచానికి పరి మితమైన స్థితి. ఒప్పుకున్నాను. అప్పుడే కోడి రామ కృష్ణ పరిచయం. రాఘవ బొత్తిగా చదువుకోలేదు. కానీ ఏ చదువూ ఇవ్వని అరుదైన instinct ఆయన సొత్తు. ఒక ఇతివృత్తం మంచి చెడ్డలను బేరీజు వేసు కోవడం ఒక ఎత్తు అయితే ఒక కళాకారుడు, దర్శకుని ప్రతిభను– ఏ నేపథ్యం లేకుండా గుర్తుపట్టి– వారికి కూడా చాలని విశ్వాసాన్ని వారిపట్ల పెంచుకునే వేది కను కల్పించడం ఆయన చరిత్ర. బాగా చదువుకుని, మాధ్యమాన్ని ఆకళించుకున్న మాలాంటి వారినే నిర్ఘాంతపోయేటట్టు చెయ్యగల ఆత్మవిశ్వాసం ఆయన పెట్టుబడి. సినిమా షూటింగు మధ్యలో నేను జారిపోతున్నా– రాఘవ నవ్వి ‘మీరు సినిమా రంగంలో నలుగురిని కొట్టేస్తారు మారుతీరావు గారూ’ అనేవారు. నాకు సిగ్గుగా ఉండేది.

లేకపోతే 42 సంవత్సరాల వయస్సున్న నన్ను, ఏనాడూ కెమెరా ముందు నిలబడని నన్ను, పొరపా టునయినా నటన గురించి ఆలోచించని నన్ను– ఓ సినిమా టైటిల్‌ పాత్రకి– 5 పాటలూ, దాదాపు 40 సీన్లూ ఉన్న పాత్రకి ఎంపిక చేసి, పట్టుబట్టి నాచేత వేయించడం రాఘవగారికే చెల్లును. అది ఆయన నిర్దుష్టమైన conviction, ఒక మూర్ఖపు పట్టుదలకీ నిదర్శనం. పైగా దర్శకుడు కోడికి అది మొదటి చిత్రం. అయితే అప్పటికే ‘తాత–మనుమడు’ అనే హిట్‌ ద్వారా దాసరిని పరిచయం చేసిన ఘనత ఆయనది. గేయ రచయిత రాజశ్రీని ఒక చిత్రం ద్వారా దర్శకుని చేసిన గుండె ధైర్యం ఆయనది. రావుగోపాలరావు, మాధవి వంటి నటీనటులను తెరకు పరిచయం చేసిన ‘దమ్ము’ ఆయనది. చాలా ఇబ్బందిగా, సగం మనస్సుతోనే పాలకొల్లు చేరాను. తన నిర్దుష్టమైన నిర్ణయంతో– నా రచనా వ్యాసం గాన్ని అటకెక్కించి, 38 సంవత్సరాల, 300 చిత్రాల నట జీవితానికి ఆరోజు నాందీ పలికారు. హ్యాట్సాఫ్‌.

ఆయన తన నిర్ణయాలను ఏ మాత్రమూ సడ లించేవారు కాదు. ఓ గొప్ప ఉదాహరణ. నేను నటిం చిన ‘ఇంట్లో రామయ్య...’కి చాలా కట్స్‌ ఇచ్చారు సెన్సారువారు. కొన్ని మళ్లీ షూటింగు చేశాం. ఒక షాట్‌ పది పన్నెండుసార్లు రిహార్సల్స్‌ చేయిస్తున్నాడు కోడి. విసుక్కున్నాను. దగ్గరికి వచ్చి చెవిలో చెప్పాడు: ‘మన దగ్గర 20 అడుగుల నెగిటివే ఉంది గురు వుగారూ’ అని. 500 రోజులు పోయిన ఆ చిత్రంలో ఇప్పటికీ ఒక షాట్‌ అలికినట్టు (ఫాగ్‌తో) ఉంటుంది. రెండో చిత్రం ‘తరంగిణి’ విజయవంతమై–ఒక సంవ త్సరం నడిచింది.

జీవితంలో– ముఖ్యంగా సినీ రంగంలో విజ యాన్ని వెంటపడి పట్టుకోవాలనే చాలామంది యావ. కానీ ఓ కొత్త దర్శకునికిచ్చే అవకాశానికి– 42 ఏళ్ల నటుడిని జతచేసి– భారతదేశంలో అన్ని భాష లలో ‘ఇంట్లో రామయ్య– వీధిలో కృష్ణయ్య’ చిత్రాన్ని ఆమోద యోగ్యం చేసిన ఘనుడు రాఘవ. ఆనాడు నా ‘సందేహాలను’ ఖాతరు చెయ్యక, విముఖత నుంచి నన్ను బయటికి లాగి మరో రంగానికి రాఘవ మళ్లించకపోతే– నా జీవితం వేరుగా ఉండేది. ఆ మాటకి వస్తే చాలామంది జీవితాలు మరోలా ఉండేవి. ఆనాడు రాఘవ లేకపోతే ఇప్పటి నా జీవితం ఇలా ఉండేది కాదు.

మంచి నిర్మాత విజయవంతమైన సినిమా తీస్తాడు. అభిరుచిగల నిర్మాత పదికాలాలపాటు నిలిచే చిత్రాన్ని నిర్మిస్తాడు. దమ్ము ఉన్న నిర్మాత మాధ్యమానికి కొత్త పుంతల్ని వేసి– కొత్తదనానికి ఊపిరి పోస్తాడు. తెలుగు సినీ పరిశ్రమ ఎందరో నిర్మాతలను దాటి వచ్చింది. కానీ ఎందరి జీవితా లనో మలుపు తిప్పగల ‘కొత్త’దనాన్ని పరిశ్రమకు పంచిన అరుదైన నిర్మాత రాఘవ.

గొల్లపూడి మారుతీరావు
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement