
జీవన కాలమ్
సత్యాల నిరూపణకు ఇంగ్లిష్‌లో మంచి మాట ఉంది. అది ‘సెర్చి’ కాదట. ‘రీసెర్చి’. కానీ మనవాళ్లకి మొదటి ‘సెర్చే’ విడ్డూరం. రెండో సెర్చికి వ్యవధి చాలదు. అదృష్టవంతులకి అజ్ఞానం శ్రీరామరక్ష. ప్రస్తుతం బొంబాయి ఐఐ టీలో పనిచేస్తున్న ప్రొఫెసర్ కె.రామసుబ్రమణ్యన్ ఈ కథ చెప్పారు.
లెక్కల్లో ‘పై’ అన్నది వృత్తం చుట్టుకొలతని నిర్ణ యించే సాధన. దీని అవ సరం ఏమిటి? యజ్ఞకుం డాల్ని తయారు చేయడానికి. వేలాది సంవత్సరాల కిందట ప్రతీ ఇంటిలో మూడు కుండాలు ఉండేవట. ఒకటి పూర్తి వర్తులం, రెండోది అర్ధ చంద్రాకారం, మూడోది చతురస్త్రం. ఇలా ఎందుకు? ఆ గొడవలోకి మనం వెళ్లొద్దు. ఈ మూడూ ఒకే కొలతలతో ఉండాలని నియమం. ఈ కొలతల్ని నిర్ణయించేది– పై. ఈ పేరు మనది కాదు. కానీ ఇంగ్లిష్ పేరు చెప్తే కానీ మనకి అర్థం కాదు గనుక ప్రస్తుతానికి ‘పై’ అనే చెప్పుకుందాం. ఈ కుండాలలో అగ్నిని త్రేతాగ్ని అనేవారు– ఇంకా స్పష్టంగా చెప్పాలంటే– ఆహవనీయ, దక్షిణ, గార్హపత్య. వీటి వివరణ శుల్బ సూత్రాలలో– 800 బీసీలో వివరించారు. తర్వాతి కాలంలో ఆర్యభట్ట ఒక శ్లోకంలో దీన్ని వివరించాడు. ఆ శ్లోకాన్ని ఈ శాస్త్రజ్ఞుడు వివరించాడు. ఇది 17వ శతాబ్దంలో గ్రిగరీ–లీవినిజ్ పేరిట చెల్లుతోంది. కానీ దీనిని మాధవ అనే ఒక గణాంకవేత్త 14వ శతాబ్ది లోనే ఒక శ్లోకంలో వివరించాడు. అంటే న్యాయంగా ఈ సూత్రం ‘మాధవ’ పేరుతో చెల్లుబాటు కావాలి. ఈ 'పై'ని transcendental number అన్నారు. అన్నట్టు– చాలా వేల సంవ త్సరాలపాటు చాలా దేశాలు ఆరు నుంచి, మరేవో అంకెలనుంచీ తమ గణాంకాలను లెక్కపెట్టుకునే వారు. గణితంలో ‘సున్నా’ని కనిపెట్టిన ఘనత భారతదేశానిది. ఈశావాశ్య ఉపనిషత్తు ‘‘పూర్ణమద పూర్ణమిదం...’’ అంటోంది– కొన్ని వేల సంవత్సరాల కిందటి మాట ఇది.
ఇటీవలి కథ ఒకటి చెప్పాలని ఉంది. ఇది కూడా 61 సంవత్సరాల నాటిది. పశ్చిమ గోదావరిలోని ఒక గ్రామంలో 1896లో ఒకాయన పుట్టాడు. ఆయన పేరు భూపతిరాజు లక్ష్మీనరసింహరాజు. నరసాపురం టేలర్ హైస్కూలులో చదువుకున్నాడు. వీరి నాన్నగారికి వేదాలు, తద్విజ్ఞానం అంటే ఇష్టం. 20వ యేట రాజు గారికి పెళ్లయింది. దరిమిలాను గౌతమ బుద్ధుడి ప్రభావంతో సర్వసంగ పరిత్యాగం చేసి హిమాలయా లకు వెళ్లిపోయాడు. 10 ఏళ్లు ఉన్నాడు. వేద శాస్త్రాలు, యోగ శాస్త్రాన్ని అక్కడ నేర్చుకున్నారు. అప్పుడు జర్మనీ వెళ్లి భౌతిక శాస్త్రాన్ని అభ్యసించారు. మనలాగ ఎస్సెల్సీ, ఇంటర్మీడియెట్‌లు చదవలేదు. ప్రాగ్ విశ్వ విద్యాలయంలో ఎక్స్‌రే భౌతిక శాస్త్రం మీద పరి శోధనలు చేశారు. తర్వాత స్వామి జ్ఞానానందగా మారి 1927లో జర్మనీ వెళ్లి ఆధ్యాత్మిక ప్రసంగాలు చేశారు. ఆ ప్రసంగాలలో లోతైన శాస్త్రీయ విజ్ఞానం డ్రెస్డన్ విశ్వ విద్యాలయం ప్రొఫెసర్ డెంబర్‌ని ఆకర్షించింది. ఈయ నని ఐన్‌స్టీన్ సాపేక్ష సిద్ధాంతం ఆకర్షించింది. డ్రెస్డన్ విశ్వవిద్యాలయంలో యోగా మీద 150 ప్రసంగాలు చేశారు. కథని కుదిస్తే– 1936 ప్రాంతంలో అణు శాస్త్రం మీదా, బీటా రేడియేషన్ మీదా పరిశోధన చేసి డిగ్రీ పుచ్చుకున్నారు.
1947లో భారతదేశంలో నేషనల్ ఫిజికల్ లేబరేటరీలో సీనియర్ సైంటిఫిక్ ఆఫీసరుగా పనిచేశారు. 1954లో గాయపడి విశాఖపట్నం కింగ్ జార్జ్ ఆసు పత్రిలో చేరారు. ఆయన్ని చూడడానికి వచ్చిన అప్పటి ఆంధ్రా విశ్వవిద్యాలయం వైస్ చాన్స్‌లర్ వీఎస్ కృష్ణ గారు వారిని విశ్వవిద్యాలయానికి ఆహ్వానించారు. నేనప్పుడు ఆనర్స్ చదువుకుంటున్నాను. తెల్లని పైజామా, కాషాయ రంగు లాల్చీతో ఉన్న స్వామీజీని ప్రత్యేకంగా అణు శాస్త్ర విభాగాన్ని (న్యూక్లియర్ ఫిజిక్స్) ప్రారంభించడానికి ఆహ్వానించడం మా అందరికీ ఆశ్చర్యకరం, చర్చనీ యాంశం. ఇప్పటి న్యూక్లియర్ ఫిజిక్స్ భవనాన్ని– (షష్టిపూర్తి మహల్ దాటాక) నిర్మించడం మా అందరికీ తెలుసు. 1965 వరకు స్వామీజీ ఉన్నారు. ఆ భవనానికి ‘స్వామి జ్ఞానానంద లేబరేటరీస్ ఆఫ్ న్యూక్లియర్ ఫిజిక్స్’ అని పేరు పెట్టారు.
విద్యార్థుల కోసం ఆయన చేసిన ప్రసంగాలు విన్న 84 ఏళ్ల ప్రొఫెసర్ పెమ్మరాజు సీతారామారా వుగారి జ్ఞాపకాలు: ఇంగ్లిష్ కాస్త తడుముకుంటూ మాట్లాడేవారట. కానీ అణు శాస్త్రాన్నీ, సౌరశక్తినీ సమ న్వయిస్తూ వారు చేసే ప్రసంగాలు– అపూర్వం, అని తరసాధ్యం. ఆయన విజ్ఞానం కాలేజీల్లో నేర్చు కున్నది కాదు. అబ్బినది.
ఒకనాటి ఆర్ష సంప్రదాయపు వైభవానికి ఈనాటి ఆధునిక శాస్త్ర పరిశోధనలకూ దగ్గర తోవ ఉందని– హిమాలయాలలో సర్వసంగ పరిత్యాగం చేసి బతికిన ఒక స్వామీజీ– విశ్వవిద్యాలయంలో అణుశాస్త్రాన్ని బోధించి నిరూపించారు. కొన్ని వేల సంవత్సరాల నాటి మనవారి పరిశో ధనలు– 17వ శతాబ్దంలో విదేశీయులకు పట్టుబడిన ‘పై’ గణితం, సౌర శక్తికీ, అణు శాస్త్రానికీ సశాస్త్రీయ మైన దగ్గర తోవని స్వానుభవంతో నిర్దేశించిన ఒక స్వామీజీ కథ ఇది. అందుకే ఈ సత్యాల నిరూపణకు ఇంగ్లిష్‌లో మంచి మాట ఉంది. అది ‘సెర్చి’ కాదట. ‘రీసెర్చి’. కానీ మనవాళ్లకి మొదటి ‘సెర్చే’ విడ్డూరం. రెండో సెర్చికి వ్యవధి చాలదు. అదృష్టవంతులకి అజ్ఞానం శ్రీరామరక్ష.
గొల్లపూడి మారుతీరావు
వ్యాసకర్త, ప్రముఖ సినీ నటుడు
Comments
Please login to add a commentAdd a comment