దేవుడిని మనలో ఒకడిగా చేసుకుని ఆయనా మనలాంటి ఇబ్బందులు పడుతుంటే ఆనందించటం మనకి అలవాటు. దేవుడు మనకి సఖుడు, నెచ్చెలి, భర్త– ఇలా ఎన్నో విధాలుగా మనం సినిమాల్లో పురాణాలను మన స్థాయికి లాక్కొచ్చాం.
ఇటీవల ‘పద్మావతి’ చిత్రం మీద చెలరేగిన వివాదం విచిత్రమైనది, విభిన్నమైనది, విలక్షణమైనది, వికారమైనది.
పాపం, దర్శక నిర్మాత సంజయ్‌లీలా భన్సాలీగారు 1540లో–అంటే దాదాపు 500 సంవత్సరాల కిందట సూఫీ కవి మాలిక్ మహ్మద్ జయసీ అనే ఆయన రాసిన ఒక పద్యాన్ని ఆధారం చేసుకుని క«థని అల్లుకున్నానని ఇల్లెక్కి కేకలు వేస్తున్నాడు. అయితే పాత్రలు చరిత్రకు సంబంధించినవి. కథనం– కల్పితం. మన సినీమాల్లో ఇలాంటి కల్పితాలు కోకొల్లలు. మాయాబజారు, గయోపాఖ్యానం, కృష్ణార్జున యుద్ధం, రామాంజనేయ యుద్ధం, నారద నారది– ఇలాగ. అయితే ‘పద్మావతి’ పాత్ర గౌరవాన్ని మంటగలిపితే రాజపుత్రుల గౌరవ మర్యాదలు మంట గలుస్తాయని కర్ణీసేన అనే ఒక ప్రైవేటు రాజపుత్ర సేన కత్తిగట్టింది.
అల్లావుద్దిన్ ఖిల్జీ అనే ఢిల్లీ చక్రవర్తి – మహర్‌వాల్ రతన్ సింగ్ అనే రాజుగారి భార్య గొప్ప అందగత్తె అని విని ఆమెను చూడాలని పట్టుబట్టాడు. పరాయి పురు షుని ముందు నిలవడం రాజపుత్ర స్త్రీలకు నిషిద్ధం. కాని బలవంతుడయిన ఖిల్జీ కోరికకు ఎదురు చెప్పలేక రతన్ సింగ్ ఒక మార్గాంతరాన్ని ఆశ్రయించారు. అంతఃపు రంలో ఆమె ముఖాన్ని ఒక అద్దంలో ఖిల్జీ చూసేటట్టు చేశారని కథ. చిత్తూరు దుర్గంలో ఈ కథకు బాసటగా ఏర్పాటు చేసిన అద్దాలను 50 ఏళ్ల కిందట ఉద్యమకా రులు బద్దలుకొట్టారు.
ఇప్పుడు–అంటే జనవరి 2017లో ‘పద్మావతి’ సెట్టుని కర్ణీ సేన ధ్వంసం చేసి, దర్శకుడు భన్సాలీని చావగొట్టింది. ఆ పాత్రలో నటించిన దీపిక పదుకునే ముక్కునే కోసేస్తా మని హెచ్చరిక చేసింది. ఒకాయన సంజయ్‌లీలా భన్సాలీ తలని తెస్తే 10 కోట్లు ఇస్తానని ప్రకటించారు. రాజ పుత్రుల పరువు మర్యాదలు మంటగలవడం ఇష్టంలేని ఒకాయన ఆత్మహత్య చేసుకున్నాడు. ఆయన శవాన్ని ఈ సేన నెత్తిన పెట్టుకుని ఊరేగించింది.
తీరా సుప్రీంకోర్టుకి ఈ చిత్రాన్ని బహిష్కరించ మని అర్జీ పెట్టగా–చిత్రం మంచి చెడ్డల్ని సెన్సారు వారు నిర్ణయిస్తారని న్యాయస్థానం తీర్పు ఇచ్చింది. ఈ లోగా చిత్రాన్ని లండన్‌లో ప్రదర్శనకి లండన్ సెన్సారు వారికి దరఖాస్తు చెయ్యగా ‘మాదేశంలో య«థాతథంగా ప్రద ర్శించడానికి ఎట్టి అభ్యంతరము లేద’ని ఇంగ్లండ్ సెన్సారు వారు సర్టిఫికెట్ ఇచ్చారు. కొన్ని బీజేపీ ప్రభుత్వాలు తమ తమ రాష్ట్రాలలో ఈ చిత్ర ప్రదర్శనను బహిష్కరించాయి.
ఇంతకీ అసలు విషయం– ఈ కర్ణీ సేన కానీ, ఈ ప్రభుత్వ నాయకులు కానీ ఈ చిత్రాన్ని చూడలేదు. ప్రభుత్వాల భయమల్లా తమ రాష్ట్రంలో ఈ చిత్రం కారణంగా అల్లర్లు జరగకూడదని. సబబైన న్యాయానికి నిలబడవల్సిన ప్రభుత్వాలు చేయవలసిన పని ఇది కాదు కదా.
ఇందులో చిత్ర నిర్మాణ స్వాతంత్య్రం, ‘బాజీరావు మస్తానీ’ వంటి ముందు చిత్రాలలో భన్సాలీ వేసిన కుప్పి గంతులు గురించి పత్రికలలో పుంఖానుపుంఖా లుగా కథనాలు వస్తున్నాయి. ఎల్‌కే అద్వానీ, రాజ్ జబ్బర్, అనురాగ్ ఠాకూర్‌లతో ఏర్పడిన 30 మంది సభ్యుల పార్లమెంటరీ బృందంతో ‘‘అయ్యా, నా ఉద్దేశం ఎవరి మనస్సునీ నొప్పించడం కాదు’’ అని భన్సాలీ గారు మొరపెట్టుకున్నారట. ఏమైనా కర్ణీ సేన ముక్కులు కోసి, పీకలు కోసే పనికి పూనుకుంది కానీ మనం అలాంటి పనులు చెయ్యం.
మనం మన సినీమాల్లో బ్రాహ్మణులు వేదం వర సల్లో అడ్డమైన మాటలు మాట్లాడుతూ, పేడ తింటుంటే కడుపారా నవ్వుకున్నాం కానీ ఏమైనా అభ్యంతరం చెప్పగలిగామా? యముడూ, చిత్రగుప్తుడూ నడిరోడ్డు మీద ఐస్ క్రీం తింటూ మనల్ని కడుపారా నవ్విస్తూ ఉంటే చీమ కుట్టినట్టయినా బాధపడ్డామా?
దేవుడిని మనలో ఒకడిగా చేసుకుని ఆయనా మనలాంటి ఇబ్బందులో, ఇక్కట్లో పడుతూంటే ఆనం దించడం మనకి అలవాటు. దేవుడు మనకి సఖుడు, సేవకుడు, నెచ్చెలి, ప్రియుడు, భర్త– ఎన్నో విధాలుగా మనం పురాణాలను మన స్థాయికి లాక్కొచ్చాం. ఏసు ప్రభువుని, అల్లానీ ఎప్పుడైనా చిత్రాల్లో, నాటకాల్లో చూశామా? చూపడం జరిగిందా?
ఏమైనా చిత్రాన్ని చూడకుండా తిరగబడటం, ఎదురు తిరగడం ఈ దేశంలో కొత్త కాదు. ప్రకాష్ ఝా ‘అరక్షణ్’ (2011) వెనుకబడినవారి ఆత్మగౌరవాన్ని, కుల ప్రాతిపదికన రిజర్వేషన్లను వ్యతిరేకిస్తుందనుకొని– చిత్రాన్ని చూడకుండానే ఎదురు తిరిగారు. ఉత్తరప్రదేశ్, ఆంధ్రా, పంజాబ్ ప్రభుత్వాలు బహిష్కరించాయి. తీరా వారిని చిత్రం సమర్థించిందని చిత్రాన్ని చూశాక అర్థమయింది. కమల్‌హాసన్ ‘విశ్వరూపం’ (2013)లో ముస్లింలను ‘దౌర్జన్యకారులు’గా చిత్రంలో చూపుతున్నా రని భావించి తమిళనాడులో ముస్లింలు వ్యతిరేకించారు. ఎవరూ చిత్రాన్ని చూడలేదు. తీరా ముస్లిం మతస్థుడు దౌర్జన్యకారులను వ్యతిరేకించడం కథ అని చూశాక తెలిసింది.
ఏతావాతా, చిత్రాన్ని చూడకుండా వీధిన పడే సంప్రదాయాన్ని కర్ణీ సేన నిలబెడుతున్నదని మనం గర్వపడవచ్చు.
- గొల్లపూడి మారుతీరావు
Comments
Please login to add a commentAdd a comment