
జీవన కాలమ్
ఎబ్బెట్టుతనం లేని ఠీవయిన సౌందర్యం శ్రీదేవిది. నాటకాన్ని పండించడంలో ఏ గొప్ప నటుడితోనయినా దీటుగా నిలబడగల టైమింగ్. బాలనటి నుంచి ప్రౌఢ నటిగా సజావయిన పరిణామాన్ని దేశంలో చూపించిన ఒకే ఒక్క తార –శ్రీదేవి.
సినిమాల్లో పాత్ర ఇమేజ్‌ని మార్చుకోవడం చాలా కష్టం. ఒకప్పుడు అసాధ్యం కూడా. ‘షోలే’ సినిమాలో గబ్బర్ సింగ్ పాత్రను ధరించి కొన్ని సంవత్సరాల పాటు ప్రేక్షకుల హృదయాల్లో నిలిచిపోయిన గొప్ప నటుడు అంజాద్ ఖాన్ తన జీవితకాలంలో ఆ ఇమేజ్‌నుంచి బయటపడలేకపోయాడు. ‘శంకరాభరణం’లో శంకరశాస్త్రి పాత్ర ద్వారా దేశస్థాయిలో ప్రాముఖ్యాన్ని సాధించిన జె.వి. సోమయాజులు గారు ఇక మరే పాత్రలోను వేరేగా రాణించలేకపోయారు.
కృష్ణగారి ‘అల్లూరి సీతారామ రాజు’ని చూశాక చక్రపాణి గారు.‘ఇంక ఓ సంవత్సరం పాటు నీ చిత్రాలన్నీ ప్లాఫ్ అవుతాయి’ అన్నారట. తర్వాత 20 సినిమాలు వరసగా లేచి పోయాయని కృష్టగారే మాకు చెప్పేవారు. ఇది శ్రుతి మించిన గొప్ప ప్రాచుర్యానికి పట్టే అనర్ధం. పాత్ర ఇమేజ్ ఏనాడు తలకు మించిపోరాదు. నాకూ అలాంటి గతి పట్టేదే. ‘ఇంట్లో రామయ్య–వీధిలో కృష్ణయ్య’ 500 రోజులు నడిచి సుబ్బారావు పాత్ర దుమ్ము దులిపింది. అదే ప్రమాదం.
శ్రీదేవి బాలనటిగా ముద్దుగా , అమాయకంగా, అయినా చిలిపిగా ఊలుపిల్లిలాగ ఉండేది. ఆమె మీద ఆమె నటన మీద నిర్మాతల ‘విశ్వాసం’ ఎంతటిదంటే ‘బడిపంతులు’లో ఆమె మీద పూర్తి పాటనే తీశారు. ఏ పాత్రలోనయినా ఆమె పసితనం ఆమె నటనకి పెద్ద ఇన్సులేషన్. తీరా ప్రౌఢ వయస్సు వచ్చాక ఆమె కేరీర్ ఏమిటీ? సెక్స్, చిన్న వగలు, మురిపించే యవ్వనం– ఇవన్నీ హీరోయిన్ల పెట్టుబడి.
హఠాత్తుగా ఈ మూసలోకి శ్రీదేవి రాగలదా? ఆ సంధి కాలంలో ఆమె మొదటిసారిగా హీరోయిన్‌గా చేసిన సినిమాని నేను రాశాను. శక్తి సామంత ‘అనురాగ్’ అనే చిత్రాన్ని నిర్మించాడు. మౌసమీ చటర్జీ హీరోయిన్. ఆమెకి అది మొదటి సినిమా. ఆ పాత్రని తెలుగులో శ్రీదేవి చేసింది. సినిమా పేరు ‘అనురాగాలు’. మిత్రుడు పి.యస్.రామిరెడ్డి దర్శకుడు. శ్రీదేవి తన శరీరంలో, వయస్సులో పరిణామాన్ని ప్రదర్శించాలని ప్రయత్నం చేసింది. ఆమె ప్రతిభ. కథలో పాత్ర ఆమెని కాపాడాయి. అయినా చిత్రం బాగా పోలేదు.
పాత ఇమేజ్‌ని ఆమె మరిపించగలదా? నిన్నటి పసిపిల్ల నేటి ప్రౌఢ అని ఒప్పించగలదా? విచిత్రం! ఒప్పించింది. ఎబ్బెట్టుతనం లేని ఠీవయిన సౌందర్యం శ్రీదేవిది. నాటకాన్ని పండించడంలో ఏ గొప్ప నటుడితోనయినా దీటుగా నిలబడగల టైమింగ్. బాలనటి నుంచి ప్రౌఢనటిగా సజావయిన పరిణామాన్ని భారత దేశంలో చూపించిన ఒకే ఒక్క తార –నాకు తెలిసి –శ్రీదేవి. అలాంటి పని మరొక్కరే– అంతే ప్రొఫెషనల్‌గా చేశారు.
‘కళత్తూర్ కన్నమ్మ’తో కెరీర్ ప్రారంభించి ‘ విశ్వరూపం’ దాకా తనదైన జీనియస్‌ని చూపిన నటుడు కమల్‌హాసన్. మరి వీరిద్దరూ ఒకే సినిమాలో కలిస్తే? ఆ వైభవాన్ని చరితార్ధం చేసిన సందర్భం బాలూ మహేంద్ర ‘‘మూండ్రాం పిరై’’. అపూర్వం. అద్భుతం. నేను మిత్రులు కమల్‌తో ఒకసారి అన్నాను: ‘‘మీరు ఆ సినిమాలో చూపిన వైదుష్యం ఏ సినిమాలో ఏ పాత్రలోనయినా అవలీలగా చూపగలరు.
ఇది హీరో ప్రాధాన్య ప్రపంచం కనుక. కాని హీరోయిన్‌కి అంత రేంజ్ ఉన్న పాత్ర దొరకదు. ఆమె నటన నభూతో నభవిష్యతి. నేనయితే మీకు జాతీయ ఉత్తమ నటుడి బహుమతి ఇవ్వను. ఆమెకి జాతీయ బహుమతి – రెండు సార్లు ఇస్తానని.’’ మేమిద్దరం తక్కువ సినిమాల్లో కలిసి నటించాం. కాని మంచి జ్ఞాపకం– ‘త్రిశూలం’లో నా కూతురు. ఎదురెదురుగా నిలిచి counter shot చేస్తున్నప్పుడు – ‘మీరు బాగున్నారా?’ అనే వాక్యాన్ని పదిమంది నటీమణులు పది రకాలుగా చెప్తారు. ఆమె తప్పనిసరిగా పదకొండో రకంగా చెబుతుంది. ఇంతకంటే రాతలో ఈ విషయాన్ని నిరూపించలేను.
‘త్రిశూలం’లో ఒక సీను గొప్పది. ఈ సీనుని కోరి రాఘవేంద్రరావు నాచేత రాయించారు. రాధిక మా యింట్లో పనిమనిషి. అవసరానికి డబ్బుకోసం వస్తుంది. ధాన్యం గోదాంకి రమ్మన్నాడు హిట్లర్ రాఘవయ్య. తను వచ్చాడు. ఆమెను పట్టుకోబోగా తప్పించుకుని గోదాంలోకి పారిపోయింది. ఇచ్చకాలు చెప్పి పైకి రమ్మని చెయ్యి జాచాడు. ఆడపిల్ల చెయ్యి అందింది. లాగాడు. తన ముందుకు కూతురు శ్రీదేవి వచ్చింది. బిక్కచచ్చిపోయాడు.
అప్పుడు డైలాగు– శ్రీదేవిది–:‘‘ఏం నాన్నా! నేనూ యాదీ (రాధిక) చిన్నప్పట్నుంచి నీ కళ్ల ముందే పెరిగాం. యాదిలో నువ్వు కేవలం ఆడదాన్ని చూడగలిగితే నేనూ ఆడదాన్నే కద నాన్నా?’’ ఆ డైలాగు అనితరసాధ్యంగా చెప్పింది శ్రీదేవి. రాఘవేంద్రరావు, విన్సెంట్‌వంటి మంత్రగాళ్లుండగా ఎవరయినా అలవోకగా ‘ అతిలోక సుందరి’ పాత్రని చెయ్యగలరు. కాని ‘మూండ్రా పిరై’ శ్రీదేవి ఒక్కరే చెయ్యగలరు.
ఇక డాన్స్ టైమింగ్. పరాకాష్ట ‘మిష్టర్ ఇండియాలో’ ‘హవా హవాయీ’ పాట. దయచేసి ఈ దృష్టితో మరొ కసారి చూడండి. మంచి వంకాయకూర అతిథిగా తినడం వేరు. వంటవాడుగా తినడం వేరు. ఒక్కసారి వంటవాడు కాండి. శ్రీదేవి ఈ తరం ప్రతిభకు పరాకాష్ట. "last word. she is the ultimate complete artist''
గొల్లపూడి మారుతిరావు
Comments
Please login to add a commentAdd a comment