చాపకింద నీరు | gollapudi maruthi rao write about Ice age | Sakshi
Sakshi News home page

చాపకింద నీరు

Published Thu, Aug 10 2017 12:41 AM | Last Updated on Sun, Sep 17 2017 5:21 PM

చాపకింద నీరు

చాపకింద నీరు

విశ్లేషణ
జీవన కాలమ్‌

మానవాళి ప్రకృతిపై చేస్తున్న జులుంకి ప్రకృతి చాలా క్రూరంగా సమాధానం చెప్పబోతోంది. దానికి సూచనే ఈ మంచు శకలం విడివడటం. ఇది మానవుడు తెలిసి తెలిసి– తనకు తానే తవ్వుకుంటున్న భయంకరమైన గొయ్యి.

మన చాపకిందకి నీరు వస్తేగాని మనం చెమ్మని గుర్తుపట్టం. ఈ దేశం మీద పరాయిదేశం దండయాత్ర చేసినా దక్షిణాదివారికి అది కేవలం వార్తే. కశ్మీర్‌ పొలిమేరల్లో పాకిస్తాన్‌ కాల్పులు జరుపుతూంటే– తమ జీవితాల్ని ప్రశాంతంగా గడిపే ఎన్నో సరిహద్దు కుటుంబాలను సైనిక దళాలు అప్పటికప్పుడు కదుపుతూంటాయి. పాక్‌ కాల్పులు మనకి వార్త. వారికి ప్రాణ సంకటం. అలాగే డోక్లాంలో చైనా దళాల మోహరింపు మనకు కేవలం వార్త. సరిహద్దు పల్లెలకు జీవన్మరణ సమస్య. యుద్ధం పంజాబ్‌లో ఎన్నో కుటుంబాలను పునాదులతో కదుపుతుంది. యుద్ధం కారణంగా సరిహద్దులో పుట్టిన తెలివైన కుర్రాడు చదువుకోలేక కేవలం కారు మెకానిక్‌ కావచ్చు. కాని అమలాపురంలో, త్రివేండ్రంలో యుద్ధం కేవలం పేపరు చెప్పిన సంఘటన.
నా చిన్నతనంలో ఇప్పటి విశాఖపట్నం పోర్టు ఉన్న చోట రెండు ఫర్లాంగుల దూరంలో సముద్రపు నీరు ఉండేది. ఇప్పుడు రోడ్డుదాకా వచ్చేసింది. ఇటీవల రామకృష్ణా బీచ్‌ దగ్గర సముద్రం దాదాపు రోడ్డుని కొట్టేసింది. ఎందుకని? ఏమో. అది మన చాపకాదు.

మరో ముపై్ఫ ఏళ్లకు ఇప్పటి జలాంతర్గామి మునిగిపోవచ్చు. కొత్తగా పెడుతున్న విమానం నీటిలోకి పోవచ్చు. ఈ విషయం ఏ కలెక్టరూ చెప్పలేడు. కొన్ని లక్షల సంవత్సరాల కింద దక్షిణ ధ్రువం నుంచి విడిపోయిన గోండ్వానా భూమి ఖండాలయింది. దేశ పటాలను చూస్తే పశ్చిమ భారతం సరిగ్గా తూర్పు ఆఫ్రికా తీరానికి అతుక్కుపోతుంది. కొన్ని లక్షల సంవత్సరాలలో రెండు వేర్వేరు సంస్కృతులు ఆయా దేశాలలో నిలదొక్కుకున్నాయి. ఇప్పటికీ తూర్పు ఆఫ్రికా దేశాలలో గోపాలురు ఉన్నారు. వారి అష్ట భార్యలున్నారు. నేను చూశాను. అందరూ కలసి ఒకచోటే జీవిస్తారు. వారు నల్లనివారు. పద్మనయనమ్ములవారు. సింహబలురు. ఆఫ్రికాలో సింహాలు ఒక్క ఈ గోపాలురను చూస్తేనే పారిపోతాయి! ఏమయినా ఇది ఆంత్రోపాలజిస్టులు తేల్చవలసిన కథ.

ఇప్పుడీ కథకు పెట్టుబడి– ఇటీవల అంటార్కిటిక్‌ ధ్రువంలో మంచు గడ్డ నుంచి 12 ట్రిలియన్‌ టన్నుల ముక్క విడిపోయి భూమి వేపు ప్రయాణం చేస్తోంది అని చదివాం. ఇది బొత్తిగా పొరుగువాడి చాప.

ట్రిలియన్‌ అంటే? ఒకటి తరువాత 12 సున్నాలు. ఇలా చెప్పినా మన మనస్సుల్లో ఒక దృశ్యం రాదు. దాదాపు మన హర్యానా రాష్ట్రం కన్నా పెద్దది– కది లింది. ఇప్పుడేమవుతుంది? ఈ గ్రహం మీద మూడు వంతులు నీరు. ఒక వంతే నేల. నీరు కొన్ని కోట్ల మైళ్ల మేరకు అంటార్కిటిక్‌ ప్రాంతంలో ఘనీభవించి ఉండ డం వల్ల– మన దేశాలను అంటిపెట్టుకుని ఉన్న సముద్ర మట్టాలు ఇలా స్థిరంగా ఉన్నాయి. మరి రామకృష్ణా బీచ్‌ దగ్గర సముద్రం వెర్రితలలు వేయడానికీ, ఈ హరియాణా పరిమాణంలో మంచు తెగిపడడానికీ సంబంధం ఉందా? ఉంది బాబూ ఉంది. భూమి ఉపరితలం నానాటికీ వేడెక్కి– మంచు కరిగి– ఈ గ్రహం మీద మిగిలిన ఆ కాస్త భూమినీ ఆక్రమించుకుం టోంది. నేను  ఆ మధ్య నార్వేలో ‘‘అరోరా బోరియాలిస్‌’ అనే ప్రకృతి వైభవాన్ని చూడడానికి వెళ్లాను. ట్రోమ్సో అనే ఊరు భూమికి కొన. అక్కడికి 2,500 మైళ్ల వరకూ సముద్రమూ, మంచూ ఉంది. అంటే  ‘‘కరగని’ మంచు ఈ భూమిని ఎంత కాపాడుతోందో ఊహించవచ్చు. మరి ఈ నీరు తిరగబడితే? కరిగితే? అదిన్నీ– ఓ హరియాణా అంత మంచు ముక్క విరిగి భూమిని ఆక్రమించుకుంటే?

ఇంత పెద్ద విషయాన్ని పామర జనానికి–అంటే మీకూ నాకూ అర్థమయ్యేటట్టు చెప్పడానికి తంటాలు పడుతున్నాను. మొన్న పారిస్‌ పర్యావరణ సమావేశంనుంచి ట్రంపు దొరగారు– ఈ పర్యావరణ కాలుష్యానికి మా ప్రమేయం లేదు అని సెలవు తీసుకున్నారు కానీ– రేపు తడిసే చాపల్లో వారి చాప పెద్దది.

వాతావరణ నిపుణుల మాటల్ని వీలయినంత చిన్న పదాలలో చెప్పడానికి ప్రయత్నిస్తాను:
మానవాళి ప్రకృతిపై చేస్తున్న జులుంకి ప్రకృతి చాలా క్రూరంగా సమాధానం చెప్పబోతోంది. దానికి సూచనే ఈ మంచు శకలం విడివడటం.

మానవుడు చేస్తున్న అనర్థాన్ని సామూహిక చర్య ద్వారా సవరించవలసిన ఆవశ్యకత ఎంతయినా ఉంది. పర్యావరణం వేడెక్కడం ఒక నమూనా అనర్థం. ఈ అనర్థానికి పెద్ద వాటా అమెరికాది. కళ్లుమూసుకుని ‘‘నన్ను ముట్టుకోకు’’ అని పెదవి విరిస్తే మన చేతల్తో మనమే మన వినాశనాన్ని కొని తెచ్చుకుంటున్నట్టు. ఇందులో తిలాపాపం తలా ఒక్కరిదీ ఉంది.

రాబోయే దశాబ్దాలలో ఉత్తర హిందూదేశం, దక్షిణ పాకిస్తాన్, బంగ్లాదేశ్‌లోని 1.5 బిలియన్ల ప్రజలు భరించలేని వడగాడ్పులకు లోనవుతారని శాస్త్రజ్ఞులు తేల్చి చెప్పారు. అప్పుడు జనాభా 70 శాతం పెరుగుతుంది. కనీసం రెండు శాతం ఈ వేడికి ఆహుతయిపోతారు. అయితే మన అదృష్టం – మనం అప్పటికి ఉండం. కాకపోతే– మనం మన పిల్లల సంక్షేమాన్ని పూర్తిగా ధ్వంసం చేసి నిష్క్రమిస్తాం.

అంటార్కిటిక్‌ ప్రాంతంలో ఈ మంచు శకలం విరిగిపడడం– మానవుడు తెలిసి తెలిసి– తనకు తానే తవ్వుకుంటున్న భయంకరమైన గొయ్యి. సర్వనాశనానికి సూచన. ‘‘ప్రళయం’’ వస్తుందని మన పురాణాలు చెప్తున్నాయంటారు.

గొల్లపూడి మారుతీరావు

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement