లాస్‌ఏంజెలిస్/డాలస్: అమెరికాలోని కాలిఫోర్నియాను వారం రోజులుగా భారీ మంచు తుపాను వణికిస్తోంది. కాలిఫోర్నియా, ఓరెగాన్‌లలో ఈ శతాబ్దంలోనే అత్యధికంగా ఏడడుగుల మేర మంచుకురిసింది. కొన్ని రిసార్టు ప్రాంతాల్లో 10 అడుగుల మేర మంచు పేరుకుపోయిందన్నారు. అనూహ్య మంచు తుపానుతో కాలిఫోర్నియాలోని శాన్ బెర్నార్డినో కొండ ప్రాంతాల్లో ప్రజలు అత్యవసరాలు, ఆహారం, మందులు, పాలు లేక ఇబ్బందులు పడుతున్నారు. రోడ్లన్నీ మంచుమయం కావడంతో బయటకు వచ్చే వీలులేకపోయింది. కొండప్రాంతాల నివాసితులు రోడ్లపైకి రావొద్దని హెచ్చరించారు. ఇళ్లు, వాహనాలు మంచు గుట్టల మధ్య కూరుకుపోయాయి.
రాకపోకలు పూర్తిగా స్తంభించిపోయాయి. రెండిళ్లలో పేలుళ్లు సంభవించినట్లు, మంచు భారంతో ఇళ్లపైకప్పులు కూలినట్లు, కొన్ని ఇళ్లలో గ్యాస్ లీకేజీ జరిగినట్లు సమాచారం ఉందని సిబ్బంది తెలిపారు. అత్యవసర వైద్య సాయం అవసరమైన వారిని రెడ్‌క్రాస్ షెల్టర్‌కు తరలించారు. కరెంటు తీగలు తెగి విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. నెవాడా సరిహద్దుల్లో ఉన్న సాక్రమెంటో, లేక్ టహో ప్రాంతాల్లో మంచుతుపాను శనివారం మరింత తీవ్ర మవుతుందని నిపుణులు హెచ్చరించారు. కాలిఫోర్నియాలోని 13 కౌంటీల్లో అత్యవసర పరిస్థితి ప్రకటించారు. అయితే, మంచు తుపాను కారణంగా కాలిఫోర్నియా ప్రాంతంలో దుర్భిక్ష పరిస్థితులు తొలిగినట్లేనని అధికారులు చెప్పారు.
పెనుగాలుల విధ్వంసం
టోర్నడో తుపాను దెబ్బకు టెక్సాస్, లూసియానాల్లో అంధకారం అలుముకుంది. టెక్సాస్‌లోని డాలస్, ఫోర్ట్ వర్త్ చుట్టుపక్కల ప్రాంతాల్లో గంటకు 145 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి. ప్రజలు ఇళ్లు వదిలి బయటకు రావొద్దని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. డాలస్‌లో భారీగా చెట్లు నేలకూలాయి. వాహనాలు పల్టీలు కొట్టాయి. ఇళ్ల పైకప్పులు ఎగిరిపోయాయని పోలీసులు తెలిపారు. డాలస్–ఫోర్ట్‌వర్త్, డాలస్ లవ్ ఫీల్డ్ విమానాశ్రయాల్లో 400 విమానాలు రద్దయ్యాయి. విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో టెక్సాస్‌లోని సుమారు 3.40 లక్షల వినియోగదారులు గురువారం రాత్రి చీకట్లోనే గడిపారు. వాతావరణ విభాగం హెచ్చరికలతో డాలస్, ఫోర్ట్‌వర్త్ తదితర ప్రాంతాల్లో విద్యాసంస్థలను మూసివేశారు.
Comments
Please login to add a commentAdd a comment