Power interuption
-
మంచు తుపానులో కాలిఫోర్నియా విలవిల
లాస్ఏంజెలిస్/డాలస్: అమెరికాలోని కాలిఫోర్నియాను వారం రోజులుగా భారీ మంచు తుపాను వణికిస్తోంది. కాలిఫోర్నియా, ఓరెగాన్లలో ఈ శతాబ్దంలోనే అత్యధికంగా ఏడడుగుల మేర మంచుకురిసింది. కొన్ని రిసార్టు ప్రాంతాల్లో 10 అడుగుల మేర మంచు పేరుకుపోయిందన్నారు. అనూహ్య మంచు తుపానుతో కాలిఫోర్నియాలోని శాన్ బెర్నార్డినో కొండ ప్రాంతాల్లో ప్రజలు అత్యవసరాలు, ఆహారం, మందులు, పాలు లేక ఇబ్బందులు పడుతున్నారు. రోడ్లన్నీ మంచుమయం కావడంతో బయటకు వచ్చే వీలులేకపోయింది. కొండప్రాంతాల నివాసితులు రోడ్లపైకి రావొద్దని హెచ్చరించారు. ఇళ్లు, వాహనాలు మంచు గుట్టల మధ్య కూరుకుపోయాయి. రాకపోకలు పూర్తిగా స్తంభించిపోయాయి. రెండిళ్లలో పేలుళ్లు సంభవించినట్లు, మంచు భారంతో ఇళ్లపైకప్పులు కూలినట్లు, కొన్ని ఇళ్లలో గ్యాస్ లీకేజీ జరిగినట్లు సమాచారం ఉందని సిబ్బంది తెలిపారు. అత్యవసర వైద్య సాయం అవసరమైన వారిని రెడ్‌క్రాస్ షెల్టర్‌కు తరలించారు. కరెంటు తీగలు తెగి విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. నెవాడా సరిహద్దుల్లో ఉన్న సాక్రమెంటో, లేక్ టహో ప్రాంతాల్లో మంచుతుపాను శనివారం మరింత తీవ్ర మవుతుందని నిపుణులు హెచ్చరించారు. కాలిఫోర్నియాలోని 13 కౌంటీల్లో అత్యవసర పరిస్థితి ప్రకటించారు. అయితే, మంచు తుపాను కారణంగా కాలిఫోర్నియా ప్రాంతంలో దుర్భిక్ష పరిస్థితులు తొలిగినట్లేనని అధికారులు చెప్పారు. పెనుగాలుల విధ్వంసం టోర్నడో తుపాను దెబ్బకు టెక్సాస్, లూసియానాల్లో అంధకారం అలుముకుంది. టెక్సాస్‌లోని డాలస్, ఫోర్ట్ వర్త్ చుట్టుపక్కల ప్రాంతాల్లో గంటకు 145 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి. ప్రజలు ఇళ్లు వదిలి బయటకు రావొద్దని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. డాలస్‌లో భారీగా చెట్లు నేలకూలాయి. వాహనాలు పల్టీలు కొట్టాయి. ఇళ్ల పైకప్పులు ఎగిరిపోయాయని పోలీసులు తెలిపారు. డాలస్–ఫోర్ట్‌వర్త్, డాలస్ లవ్ ఫీల్డ్ విమానాశ్రయాల్లో 400 విమానాలు రద్దయ్యాయి. విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో టెక్సాస్‌లోని సుమారు 3.40 లక్షల వినియోగదారులు గురువారం రాత్రి చీకట్లోనే గడిపారు. వాతావరణ విభాగం హెచ్చరికలతో డాలస్, ఫోర్ట్‌వర్త్ తదితర ప్రాంతాల్లో విద్యాసంస్థలను మూసివేశారు. -
శరవేగంగా విద్యుత్ పునరుద్ధరణ
కడప కార్పొరేషన్: ఉమ్మడి వైఎస్ఆర్ జిల్లాలో పది రోజులుగా తీవ్ర పెనుగాలులు, వర్షాలకు విద్యుత్ శాఖకు తీవ్ర నష్టం ఏర్పడింది. గాలుల వల్ల విద్యుత్ సబ్స్టేషన్లు, ట్రాన్స్ఫార్మర్లు దెబ్బతినగా, విద్యుత్ స్తంభాలు, లైన్లు నేలకొరిగాయి. పెనుగాలులు, వర్షాల వల్ల 9 పట్టణాలు, 43 మండల కేంద్రాలు, 319 గ్రామాలు ప్రభావితమయ్యాయి. ఫలితంగా రూ. 5 కోట్లకు పైగా నష్టం వాటిల్లినట్లు తెలుస్తోంది. దీంతో ఆ శాఖ అధికారులు నష్ట నివారణ చర్యలకు ఉపక్రమించారు. 14 ప్రత్యేక బృందాల సాయంతో పునరుద్ధరణ పనులు చేపట్టారు. ఇప్పటికే దాదాపు 90 శాతం పనులు పూర్తికాగా, మరో నాలుగు రోజుల్లో మిగతా పనులు పూర్తి చేస్తామని అధికారులు చెబుతున్నారు. పెనుగాలులు, వర్షాల వల్ల రాయచోటిలో 2 ఈహెచ్‌టీ సబ్స్టేషన్లు దెబ్బతినగా, రెండింటినీ పునరుద్ధరించారు. రాజంపేట, రాయచోటి పరిధిలో 33 కేవీ సబ్స్టేషన్లు– 42, 33కేవీ ఫీడర్లు– 10, 33కేవీ స్తంభాలు–18, 33కేవీ లైన్లు 6.5 కి.మీల మేర దెబ్బతినగా వీటిని వందశాతం పునరుద్ధరించారు. అలాగే జిల్లా వ్యాప్తంగా 11కేవీ ఫీడర్లు–292 దెబ్బతినగా అన్నింటికీ మరమ్మతులు చేశారు. 11కేవీ స్తంభాలు 872 దెబ్బతినగా 812ని కొత్తవి అమర్చారు. మరో 60 అమర్చాల్సి ఉంది. 11కేవీ విద్యుత్ లైన్ 51.15 కి.మీల మేర దెబ్బతినగా 44.19 కి.మీ పునరుద్ధరించారు. ఎల్టీ లైన్లు 42.45 కి.మీ పాడవగా, 37.86 కి.మీ పనులు పూర్తయ్యాయి. ఎల్టీ స్తంభాలు 839 దెబ్బతినగా, 794 స్తంభాలు నెలకొల్పారు. 45 స్తంభాలను మార్చాల్సి ఉంది. మొత్తం 344 ట్రాన్స్ఫార్మర్లు దెబ్బతినగా 297 ట్రాన్స్ఫార్మర్లను మార్చారు, 47 పెండింగ్‌లో ఉన్నాయి. జిల్లా వ్యాప్తంగా వర్షాలు, గాలులకు 44772 వ్యవసాయేతర సర్వీసులు, 3894 వ్యవసాయ సర్వీసులకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ఇందులో వ్యవసాయేతర సర్వీసులన్నింటికీ విద్యుత్ పునరుద్ధరించగా, వ్యవసాయ సర్వీసులు 3539ని పూర్తి చేశారు. మరో 355 సర్వీసులకు విద్యుత్ ఇవ్వడానికి పనులు జరుగుతున్నాయి. 24 గంటల్లోనే విద్యుత్ సరఫరా జిల్లాలో తీవ్రమైన గాలులు, వర్షాల వల్ల విద్యుత్ శాఖకు చెందిన స్తంభాలు, ట్రాన్స్ఫార్మర్లు, లైన్లు దెబ్బతిన్నాయి. 24 గంటల్లోనే అన్ని కేటగిరీల వారికి విద్యుత్ సరఫరా పునరుద్ధరించాము. పునరుద్ధరణ పనుల కోసం 14 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశాము. ఇంకా కొన్ని పనులు జరుగుతున్నాయి. మరో నాలుగు రోజుల్లో అన్ని పనులు పూర్తయ్యే అవకాశం ఉంది. ఎక్కడైనా విద్యుత్ సమస్యలు ఉంటే 9440817440 నంబర్‌కు ఫోన్ చేయవచ్చు. –ఎన్.శోభా వాలెంటీనా, పర్యవేక్షక ఇంజినీరు, ఏపీఎస్ పీడీసీఎల్ కడప సర్కిల్ -
గ్రేటర్ పరిధిలో చీకట్లు
గాలివాన బీభత్సంతో తెగిపోయిన విద్యుత్ తీగలు సోమవారం అర్ధరాత్రి నుంచి పలు ప్రాంతాల్లో నిలిచిన సరఫరా నగరవాసికి నరకం సాక్షి, హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో సోమవారం రాత్రి గాలివాన సృష్టించిన బీభత్సానికి సుమారు 600 ఫీడర్ల పరిధిలో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. పలు ప్రాంతాల్లో సోమవారం అర్ధరాత్రి నుంచి మంగళవారం ఉదయం 10 గంటల వరకు కరెంటు లేదు. బంజారాహిల్స్ ఎమ్మెల్యే కాలనీలో మాజీ చీఫ్ విప్ గండ్ర వెంకటరమణారెడ్డి నివాస ప్రాంగణంలో చెట్ల కొమ్మలు విరిగిపడి విద్యుత్ తీగలు తెగిపోవడంతో ఈ ప్రాంతంలో రాత్రి ఒంటిగంట నుంచి ఉదయం 6 గంటల వరకు కరెంటు లేదు. గాజుల రామారం ప్రధాన రహదారిలోని అంగడిపేట వద్ద విద్యుత్ వైర్లు తెగిపడటంతో గుడిసె కాలిపోయింది. అందులో ఉంటున్నవారికి అదృష్టవశాత్తు ముప్పు తప్పింది. మణికొండ, పుప్పాల్‌గూడ, శివరాంపల్లి, నార్సింగి, హైదర్షాకోట్, అత్తాపూర్, బండ్లగూడ, రాజేంద్రనగర్, మైలార్‌దేవ్‌పల్లి, బాలాపూర్ ప్రాంతాల్లోనూ కరెంట్ సరఫరా నిలిచిపోయింది. ఉదయం విద్యుత్ సరఫరా పునరుద్ధరించినా.. అంతరాయం కలుగుతూనే ఉంది. ఆస్మాన్‌గఢ్, చార్మినార్, డబీర్‌పురా, ఛత్రినాక, ఫలక్‌నుమా, సంతోష్‌నగర్, గచ్చిబౌలి, మదాపూర్ పరిధిలోనూ తరచూ విద్యుత్ అంతరాయం ఏర్పడింది. చంపాపేట, నందనవనం, ఆర్.ఎన్.రెడ్డి, సరూర్‌నగర్ ప్రాంతాల్లో మంగళవారం ఉదయం 10 గంటలకు సరఫరా పునరుద్ధరించారు. ఇటీవల ఎండల తీవ్రతకు పలు ప్రాంతాల్లో విద్యుత్ తీగలు సాగిపోయాయి. ఈ నేపథ్యంలో సోమవారం రాత్రి వీచిన ఈదురుగాలులు, వర్షాలకు అవి మెలికలు పడి పలుచోట్ల తెగిపోయాయి. దీంతో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగింది. కాగా, పలు ప్రాంతాల వినియోగదారులు సీపీడీసీఎల్‌కు చెందిన కాల్‌సెంటర్, టోల్‌ఫ్రీ నంబర్లకు ఫోన్‌చేసినా స్పందన కరువైంది.