సాక్షి, హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో సోమవారం రాత్రి గాలివాన సృష్టించిన బీభత్సానికి సుమారు 600 ఫీడర్ల పరిధిలో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. పలు ప్రాంతాల్లో సోమవారం అర్ధరాత్రి నుంచి మంగళవారం ఉదయం 10 గంటల వరకు కరెంటు లేదు. బంజారాహిల్స్ ఎమ్మెల్యే కాలనీలో మాజీ చీఫ్ విప్ గండ్ర వెంకటరమణారెడ్డి నివాస ప్రాంగణంలో చెట్ల కొమ్మలు విరిగిపడి విద్యుత్ తీగలు తెగిపోవడంతో ఈ ప్రాంతంలో రాత్రి ఒంటిగంట నుంచి ఉదయం 6 గంటల వరకు కరెంటు లేదు.
గాజుల రామారం ప్రధాన రహదారిలోని అంగడిపేట వద్ద విద్యుత్ వైర్లు తెగిపడటంతో గుడిసె కాలిపోయింది. అందులో ఉంటున్నవారికి అదృష్టవశాత్తు ముప్పు తప్పింది. మణికొండ, పుప్పాల్‌గూడ, శివరాంపల్లి, నార్సింగి, హైదర్షాకోట్, అత్తాపూర్, బండ్లగూడ, రాజేంద్రనగర్, మైలార్‌దేవ్‌పల్లి, బాలాపూర్ ప్రాంతాల్లోనూ కరెంట్ సరఫరా నిలిచిపోయింది. ఉదయం విద్యుత్ సరఫరా పునరుద్ధరించినా.. అంతరాయం కలుగుతూనే ఉంది.
ఆస్మాన్‌గఢ్, చార్మినార్, డబీర్‌పురా, ఛత్రినాక, ఫలక్‌నుమా, సంతోష్‌నగర్, గచ్చిబౌలి, మదాపూర్ పరిధిలోనూ తరచూ విద్యుత్ అంతరాయం ఏర్పడింది. చంపాపేట, నందనవనం, ఆర్.ఎన్.రెడ్డి, సరూర్‌నగర్ ప్రాంతాల్లో మంగళవారం ఉదయం 10 గంటలకు సరఫరా పునరుద్ధరించారు. ఇటీవల ఎండల తీవ్రతకు పలు ప్రాంతాల్లో విద్యుత్ తీగలు సాగిపోయాయి. ఈ నేపథ్యంలో సోమవారం రాత్రి వీచిన ఈదురుగాలులు, వర్షాలకు అవి మెలికలు పడి పలుచోట్ల తెగిపోయాయి. దీంతో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగింది. కాగా, పలు ప్రాంతాల వినియోగదారులు సీపీడీసీఎల్‌కు చెందిన కాల్‌సెంటర్, టోల్‌ఫ్రీ నంబర్లకు ఫోన్‌చేసినా స్పందన కరువైంది.