సాక్షి, హైదరాబాద్: నిర్మాతలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఎఫ్‌డీసీ నోడల్ ఏజెన్సీగా వారం రోజుల్లో సింగిల్ విండో విధానంలో సినిమా షూటింగ్‌లకు అనుమతులు ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అధికారులను ఆదేశించారు. సినిమా షూటింగ్‌ల అనుమతుల కోసం వివిధ శాఖల అధికారుల చుట్టూ రోజుల తరబడి తిరగాల్సి వస్తుందని, దీంతో ఎంతో సమయం వృథా అవుతుందని పేర్కొన్నారు. గురువారం మాసబ్‌ట్యాంక్‌లోని తన కార్యాలయంలో చలనచిత్ర రంగ అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో అమలు చేస్తున్న కార్యక్రమాలపై మంత్రి సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ.. షూటింగ్‌ల నిర్వహణకు అవసరమైన సమాచారాన్ని కొన్ని శాఖలు అందజేశాయని, మరికొన్ని శాఖలు ఇవ్వాల్సి ఉందని, వీలైనంత త్వరగా ఆయా శాఖల సమాచారం కూడా సేకరించాలని ఆదేశించారు. రాష్ట్రంలో సుమారు 600 థియేటర్లు ఉన్నాయని, వీటిలో ఎఫ్‌డీసీ పోర్టల్ ద్వారా ఆన్‌లైన్ టికెటింగ్ విధానాన్ని వీలైనంత త్వరగా అమలు చేసేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. ఆర్టీసీ బస్టాండ్‌లలో మినీ థియేటర్ల నిర్మాణానికి కూడా అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ సమావేశంలో హోంశాఖ ఇన్‌చార్జి ప్రిన్సిపల్ సెక్రటరీ సునీల్ శర్మ, న్యాయశాఖ కార్యదర్శి సంతోష్‌రెడ్డి, పశుసంవర్థకశాఖ కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, ఎఫ్‌డీసీ సీఐవో కిషోర్‌బాబు,పలువురు నిర్మాతలు, ఫిల్మ్ ఛాంబర్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
గొల‍్లపూడి మృతి పట్ల తీవ్ర దిగ్భ్రాంతి
సీనియర్ నటుడు గొల్లపూడి మారుతీరావు మృతిపట్ల సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. రచయిత, వ్యాఖ్యాత గా కూడా గొల్లపూడి రాణించారని గుర్తు చేశారు. సుమారు 250 కి పైగా చిత్రాలలో నటించిన ఆయన ఆ నంది అవార్డులు అందుకున్నారు. బహుముఖ ప్రజ్ఞాశాలి గా ఎంతో గుర్తింపు పొందారు. ఆయన మృతి తో చిత్ర పరిశ్రమ ఒక గొప్ప వ్యక్తిని కోల్పోయిందని పేర్కొన్నారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment