Online Ticketing Service
-
‘ఆన్లైన్ టికెట్ విధానం మంచిదే’
‘‘ఏపీ ప్రభుత్వం ప్రవేశపెట్టనున్న ఆన్లైన్ టికెట్ విధానం వల్ల సినిమా వసూళ్ల విషయంలో మరింత పారదర్శకత వస్తుంది. కానీ ఈ విధానంపై ప్రభుత్వం మరింత అధ్యయనం చేసి లోపాలు ఉండకుండా చూడాలని కోరుకుంటున్నా’’ అన్నారు నిర్మాత నట్టి కుమార్. శుక్రవారం జరిగిన విలేకరుల సమావేశంలో నట్టి కుమార్ మాట్లాడుతూ – ‘‘పోసాని కృష్ణమురళి ఇంటిపై పవన్ కల్యాణ్ అభిమానులు దాడి చేయడాన్ని ఖండిస్తున్నాను. అలాగే పోసాని మాట్లాడిన తీరు కూడా కరెక్ట్ కాదు. ఇక గత నెల 20న ఏపీ మంత్రి పేర్ని నానీతో కొంతమంది ఇండస్ట్రీ విషయాలను చర్చించారు. ఈ సమావేశానికి వెళ్లొచ్చిన వారు పవన్ కల్యాణ్‌కు సరైన రీతిలో వివరించలేదు. అందుకే ఆ తర్వాత పవన్ మాట్లాడిన మాటలు (‘రిపబ్లిక్’ వేడుకలో) వివాదమయ్యాయని భావిస్తున్నాను. అయితే సినీ రంగం గురించి మాట్లాడేటప్పుడు పవన్ వాస్తవిక విషయాలను తెలుసుకుని మాట్లాడితే బాగుండేది’’అని అన్నారు. ఇదిలా ఉంటే... శుక్రవారం ఉదయం నిర్మాతలు దిల్ రాజు, డీవీవీ దానయ్య, నవీన్ ఎర్నేని, వంశీ రెడ్డి, సునీల్ నారంగ్, బన్నీ వాసులు పవన్ కల్యాణ్‌ని ఆయన నివాసంలో కలిశారు. చిత్రపరిశ్రమకు సంధించిన సమస్యల గురించి సహృద్భావ వాతావరణంలో వీరి మధ్య చర్చలు జరిగాయని తెలిసింది. -
ఆర్టీసీలో నగదు రహిత టికెటింగ్‌కు టెండర్లు
సాక్షి, అమరావతి: వచ్చే ఏడాది ప్రారంభం నుంచి ఆర్టీసీలో నగదు రహిత టికెటింగ్ విధానం అమలు కానుంది. ఆన్లైన్ టికెటింగ్ కోసం ఏపీఎస్ఆర్టీసీ యాప్ ప్రవేశపెట్టి ప్రయాణికులు సులువుగా ప్రయాణం చేసేలా వీలు కల్పించనుంది. దేశంలోనే మొబైల్ ఆధారిత టికెటింగ్ వ్యవస్థను ఒక్క ఏపీఎస్ఆర్టీసీ మాత్రమే ప్రవేశపెట్టనుంది. ఈ నెలాఖరున మొబైల్ ఆధారిత టికెటింగ్‌కు అధికారులు టెండర్లు నిర్వహించనున్నారు. తాజాగా ప్రీ బిడ్ సమావేశం నిర్వహించగా, 92 సాఫ్ట్వేర్ కంపెనీల ప్రతినిధులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. త్వరలో రిక్వెస్ట్ ఫర్ ప్రపోజల్స్‌ను ఆహ్వానించనున్నారు. ఇప్పటికే పైలెట్ ప్రాజెక్టుగా మచిలీపట్నం–అవనిగడ్డ రూట్‌ను ఆర్టీసీ అధికారులు సర్వే చేశారు. ఇందులో సానుకూల ఫలితాలు రావడంతో ఆర్టీసీలో ఆన్లైన్ టికెటింగ్‌ను దశల వారీగా ప్రవేశపెట్టేందుకు నిర్ణయించారు. ► ప్రస్తుతం 39 శాతం మంది మాత్రమే ఆర్టీసీలో ఆన్లైన్ టికెట్ విధానాన్ని అనుసరిస్తున్నారు. ► మిగిలిన 61 శాతం ఆఫ్‌లైన్‌లోనే టికెట్లు కొనుగోలు చేస్తున్నారు. మరింత మంది ఆన్లైన్ ద్వారా టికెట్లు పొందేలా ఆర్టీసీ ఈ ప్రయోగాన్ని చేపట్టింది. నగదు లావాదేవీలను తగ్గించేందుకు ఈ విధానాన్ని ప్రోత్సహిస్తోంది. ► ఆర్టీసీ సిబ్బంది తమ సొంత సెల్ఫోన్లతోనే టికెట్ జారీ, టికెట్ల వాలిడిటేషన్, టికెట్ చెకింగ్ చేసేలా యాప్‌ను అందుబాటులోకి తీసుకురానున్నారు. ► ఈ విధానంపై సాఫ్ట్వేర్ కంపెనీల నుంచి అనూహ్య స్పందన వచ్చింది. ► దేశంలో మిగిలిన ఆర్టీసీలతో పోలిస్తే ఏపీఎస్ఆర్టీసీకి ఆన్లైన్ టికెటింగ్‌లో ఆదరణ ఎక్కువగా ఉంది. -
వారం రోజుల్లో సినిమా షూటింగ్‌లకు పర్మిషన్
సాక్షి, హైదరాబాద్: నిర్మాతలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఎఫ్డీసీ నోడల్ ఏజెన్సీగా వారం రోజుల్లో సింగిల్ విండో విధానంలో సినిమా షూటింగ్‌లకు అనుమతులు ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అధికారులను ఆదేశించారు. సినిమా షూటింగ్‌ల అనుమతుల కోసం వివిధ శాఖల అధికారుల చుట్టూ రోజుల తరబడి తిరగాల్సి వస్తుందని, దీంతో ఎంతో సమయం వృథా అవుతుందని పేర్కొన్నారు. గురువారం మాసబ్‌ట్యాంక్‌లోని తన కార్యాలయంలో చలనచిత్ర రంగ అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో అమలు చేస్తున్న కార్యక్రమాలపై మంత్రి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ.. షూటింగ్‌ల నిర్వహణకు అవసరమైన సమాచారాన్ని కొన్ని శాఖలు అందజేశాయని, మరికొన్ని శాఖలు ఇవ్వాల్సి ఉందని, వీలైనంత త్వరగా ఆయా శాఖల సమాచారం కూడా సేకరించాలని ఆదేశించారు. రాష్ట్రంలో సుమారు 600 థియేటర్లు ఉన్నాయని, వీటిలో ఎఫ్డీసీ పోర్టల్ ద్వారా ఆన్లైన్ టికెటింగ్ విధానాన్ని వీలైనంత త్వరగా అమలు చేసేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. ఆర్టీసీ బస్టాండ్లలో మినీ థియేటర్ల నిర్మాణానికి కూడా అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ సమావేశంలో హోంశాఖ ఇన్చార్జి ప్రిన్సిపల్ సెక్రటరీ సునీల్ శర్మ, న్యాయశాఖ కార్యదర్శి సంతోష్‌రెడ్డి, పశుసంవర్థకశాఖ కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, ఎఫ్డీసీ సీఐవో కిషోర్‌బాబు,పలువురు నిర్మాతలు, ఫిల్మ్ ఛాంబర్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. గొల్లపూడి మృతి పట్ల తీవ్ర దిగ్భ్రాంతి సీనియర్ నటుడు గొల్లపూడి మారుతీరావు మృతిపట్ల సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. రచయిత, వ్యాఖ్యాత గా కూడా గొల్లపూడి రాణించారని గుర్తు చేశారు. సుమారు 250 కి పైగా చిత్రాలలో నటించిన ఆయన ఆ నంది అవార్డులు అందుకున్నారు. బహుముఖ ప్రజ్ఞాశాలి గా ఎంతో గుర్తింపు పొందారు. ఆయన మృతి తో చిత్ర పరిశ్రమ ఒక గొప్ప వ్యక్తిని కోల్పోయిందని పేర్కొన్నారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. -
బుక్–మైషోలో వాటా కోసం దిగ్గజాల క్యూ
ముంబై: ఆన్లైన్ టికెటింగ్ సంస్థ బుక్–మైషోలో వాటా కొనుగోలు కోసం పలు అంతర్జాతీయ దిగ్గజ సంస్థలు ఆసక్తి కనబరుస్తున్నట్లు తెలిసింది. బుక్–మైషోలో 10–12 శాతం వాటా కొనుగోలు కోసం ప్రైవేట్ ఈక్విటీ దిగ్గజం జనరల్ అట్లాంటిక్, సింగపూర్ సావరిన్ వెల్త్‌ఫండ్ టెమసెక్, ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ దిగ్గజం గోల్డ్‌మన్ శాక్స్ ప్రయత్నాలు చేస్తున్నట్లు ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న వర్గాలు వెల్లడించాయి. వాటా కొనుగోళ్లకు సంబంధించిన చర్చలన్నీ తుది దశకు చేరాయని, మరికొన్ని వారాల్లో ఖరారవుతాయని ఆ వర్గాలు పేర్కొన్నాయి. ఈ సంస్థల డీల్స్ ఖరారైతే, బుక్–మైషో విలువ వంద కోట్ల డాలర్లను (రూ.7,000 కోట్లు) దాటుతుందని అంచనా. గత ఏడాది జూలైలో బుక్‌మైషో సంస్థ టీపీజీ గ్రోత్ నుంచి 10 కోట్ల డాలర్లు సమీకరించింది. అప్పుడు ఈ కంపెనీ విలువను 80 కోట్ల డాలర్లుగా లెక్కగట్టారు. తాజా డీల్స్‌లో భాగంగా సైఫ్ పార్ట్నర్స్ తన మొత్తం 5.6 శాతం వాటాను విక్రయిస్తుందని, యాక్సెల్ ఇండియా తన వాటాలో కొంత భాగాన్ని అమ్మేస్తుందని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. 2016 వరకూ ఆన్లైన్ టికెటింగ్ సెగ్మెంట్లో బుక్–మైషో సంస్థదే గుత్తాధిపత్యం. ఆ తర్వాత పేటీఎమ్ రంగంలోకి రావడంతో బుక్–మైషో గట్టి పోటీని ఎదుర్కొంటోంది. పేటీఎమ్‌లో కూడా భారీగా పెట్టుబడులుండటంతో బుక్–మైషో నుంచి వైదొలగాలని సైఫ్ పార్ట్నర్స్ నిర్ణయించుకున్నట్లు తెలిసింది. నెలకు 2 కోట్ల టికెట్లు... 1999లో బిగ్‌ట్రీ ఎంటర్టైన్మెంట్ పేరుతో బుక్–మైషో తన కార్యకలాపాలు ప్రారంభించింది. ఆరంభంలో థియేటర్లలో సీట్ల మేనేజ్మెంట్ కార్యకలాపాలు చూసిన సంస్థ, ఆ తర్వాత ఆన్లైన్లో టికెట్లను అమ్మడం మొదలెట్టింది. ప్రస్తుతం నెలకు 2 కోట్ల వరకూ టికెట్లను అమ్ముతోంది. సినిమా టికెట్లనే కాకుండా సంగీత కచేరీలు, స్టాండ్–అప్ కామెడీ షోలు, స్పోర్ట్స్ ఈవెంట్లు తదితర కార్యక్రమాల టికెట్లను కూడా బుక్–మైషో విక్రయిస్తోంది. ఈ సంస్థ మొత్తం ఆదాయంలో ఈ సెగ్మెంట్ వాటా దాదాపు మూడోవంతు ఉంటుందని అంచనా. 2016–17 ఆర్థిక సంవత్సరంలో నిర్వహణ ఆదాయం 30 శాతం వృద్ధితో రూ.391 కోట్లకు పెరగ్గా, నికర నష్టాలు 17 శాతం పెరిగి రూ.162 కోట్లకు చేరాయి. -
కోటీశ్వరుడిని చేసిన ఐడియా!
విజయుడు మన దేశానికి తిరిగి వచ్చిన తరువాత తన ఉద్యోగానికి రాజీనామా చేసి ‘బుక్ మై షో’ ప్రారంభించారు. పదిహేను సంవత్సరాల ఈ ప్రయాణంలో ఎన్నో ఒడిదొడుకులను ఎదుర్కొన్నారు. అయితే ఎప్పుడూ నిరాశ పడలేదు. మనుషుల్లో రెండు రకాలు వారు ఉంటారు. విధిని నమ్ముకునే వాళ్లు. విధిగా ప్రయత్నం చేసి విజయం సాధించేవాళ్లు. ముప్పై తొమ్మిది సంవత్సరాల ఆశిష్ హేమ్రాజని రెండో కోవకు చెందిన వ్యక్తి. ‘‘ఓడిపోవడమే అంటే ఏమిటో కాదు...ప్రయత్నించకపోవడమే’’ అంటారు ఆయన.ఆన్లైన్ టికెటింగ్ సర్వీస్‌ను 1999లో ప్రారంభించారు ఆశిష్. పాతికవేలతో ప్రారంభించిన ఆ వ్యాపారం ఇప్పుడు కోట్లలోకి చేరుకుంది. మూవీ, ఈవెంట్ టికెటింగ్ పోర్టల్‌గా దేశంలోనే అగ్రగామిగా నిలచింది. ముంబయిలో బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ ఇన్ మార్కెటింగ్‌లో పట్టా పుచ్చుకున్న ఆశిష్ ఆ తరువాత ‘జె. వాల్టర్ థామ్సన్’ అడ్వర్వైజింగ్ కంపెనీలో చేరారు. ఆశిష్‌కు ప్రయాణాలంటే వల్లమాలిన ఇష్టం.ప్రయాణాలలో సృజనాత్మక ఆలోచనలు మొలకెత్తుతాయనేది ఆయన విషయంలో నిజమైంది. ఒకసారి దక్షిణాఫ్రికాలో ఉన్నప్పుడు రేడియో వింటున్నారు. రగ్బీ ఆటకు టికెట్లు అమ్మడానికి సంబంధించిన కార్యక్రమం అది. ఈ కార్యక్రమం తరువాత ఆశిష్ ఒక చెట్టు కింద నిల్చున్నాడు. అయితే పండేమీ రాలి పడలేదు. ఒక ఐడియా మాత్రం వచ్చింది. అదే ‘బుక్ మై షో’ రాబోయే రోజుల్లో ఇంటర్నెట్దే హవా అని గ్రహించిన ఆశిష్ ‘బుక్ మై షో’కు రూపకల్పన చేశారు. మన దేశానికి తిరిగి వచ్చిన తరువాత తన ఉద్యోగానికి రాజీనామా చేసి ‘బుక్ మై షో’ ప్రారంభించారు. పదిహేను సంవత్సరాల ఈ ప్రయాణంలో ఎన్నో ఒడిదొడుకులను ఎదుర్కొన్నారు. అయితే ఎప్పుడూ నిరాశ పడలేదు. ‘‘ఒడిదుడుకులు మనల్ని తిరుగులేని వ్యాపారవేత్తను చేస్తాయి’’ అంటారు ఆయన. ‘‘అనుభవాలే పాఠాలు నేర్పుతాయి. యూనివర్శిటీలు కాదు’’ అని నమ్మే ఆశిష్ అదృష్టాన్ని నమ్ముకోలేదు. కష్టాన్ని నమ్ముకున్నారు. అందుకే ఇంత పెద్ద విజయాన్ని సాధించారు.