
ఓటమి వైభవం
జీవన కాలమ్
ఓటమికి ఉదాత్తత కావాలి. విజయానికి వినయం కావాలి. ఆ రెంటినీ పుష్కలంగా ప్రదర్శించిన టెన్నిస్ దిగ్గజాలు వారిద్దరూ. ప్రపంచమంతా ఏకమయి ముందు నాడాల్‌కీ, తర్వాత ఫెడరర్‌కీ జేజేలు పలికింది.
కవి కవిత్వం చెప్తాడు. కాని వాల్మీకి ఋషి. శ్రీరాముడు అలవోకగా, క్రీడ లాగా బాణాలు సంధిస్తే శత్రువులు పిట్టల్లాగ కూలిపోయేవారని రాస్తే కవి కనుక, చెప్పింది శ్రీరాముడి గురించి కనుక అలా వ్రాసి ఉంటాడనిపించేది. లేకపోతే అయన క్రీడ లాగా బాణాలు వేయడమేమిటి? శత్రువులు పిట్టల్లాగ కూలిపోవడమేమిటి?
కాని ఒక క్రీడాకారుడిని చూశాక నా అభిప్రాయం మార్చుకున్నాను. అయన పేరు రోజర్ ఫెడరర్. వింబుల్డన్ రోజుల్లో రోలెక్స్ వాచీ కోసం వచ్చే ప్రకటన నాకు చాలా ఇష్టం. అతి లాఘవంగా, హుందాగా, ఒక కళలాగ తను కదులుతూ, ముఖంలో ఏమాత్రం ఆవేశం లేకుండా బంతిని కొట్టే ఫెడరర్ నైపుణ్యం, తన ప్రతిభ మీద తనకు గల అధికారాన్ని ప్రతీ అవయవంలోనూ ప్రతిఫలించగా ప్రత్యర్థి గుండెల్లో రైళ్లు పరిగెత్తించడం వాల్మీకిని గుర్తు చేస్తుంది నాకు. ఆ వ్యాపార ప్రకటన రోలెక్స్‌కి ఫెడరర్ చేస్తున్నట్టుకాక, ఫెడరర్ జీనియస్‌కి రోలెక్స్ చేస్తున్నట్టు అనిపిస్తుంది.
కాగా ఫెడరర్ ఒక మాట అన్నాడు, ‘నేను నాడాల్‌కి నంబరు వన్ ఫ్యాన్‌ని’’ అని. ఇద్దరూ ప్రపంచాన్ని ఉర్రూతలూగించిన గొప్ప ఆటగాళ్లు. కాగా నాడాల్ ఆట ఒక ప్రభంజనం. ఒక హుద్ హుద్. ఫెడరర్ ఆట కళ. ఒక విన్యాసం. రెండూ ప్రత్యర్థిని మట్టికరిపించే ఆటలే. ఫెడరర్, నాడాల్ ఇంతవరకూ 35 సార్లు ఆడగా నాడాల్ ఫెడరర్ మీద 23 సార్లు గెలిచాడు. కాని ఇటీవలి ఆస్ట్రేలియా ఓపెన్లో ఫెడరర్ నాడాల్‌ల ఆట అద్భుతం. రూఢిగా జయించగల నాడాల్‌ని అయిదు సెట్లలో ఫెడరర్ జయించడం కాదు, నాడాల్ ఓటమిని అంగీకరించక తప్పనట్టు చేసిన పోరాటం అపూర్వం. అయితే ఆ అద్భుతం అక్కడితో ముగియలేదు. నాడాల్ అన్నాడు, ‘‘ఇలాంటి సందర్భాలలో నేను చాలాసార్లు ఫెడరర్‌ని ఓడించాను. కాని ఇవాళ నన్ను జయించడానికి ఆతను చేసిన కృషి స్పష్టంగా తెలుస్తోంది. ఇవాళ నాకంటే బాగా ఆడాడు. ఈసారికి కప్పుని ఆయన దగ్గర ఉంచుకోనిస్తాను. నేను మళ్లీ వస్తాను’’ అన్నాడు. ఫెడరర్ అన్నాడు, ‘‘ఓటమి, విజయాలను పక్కన పెట్టి ఇద్దరినీ సరిసమానంగా తూకం వేస్తే ఇవాళ ఈ కప్పుని మేం ఇద్దరం పంచుకోవాలి’’ అంటూ నాడాల్ వైపు తిరిగి ‘‘ఆటమానకు రాఫా, ప్లీజ్. టెన్నిస్ ఆటకి నీ అవసరం చాలా ఉంది’’ అంటూ ‘‘‘రాఫా ప్రతిసారీ నాఆటని మెరుగు దిద్దుతున్నాడు’’ అన్నాడు.
ఓటమికి ఉదాత్తత కావాలి. విజయానికి వినయం కావాలి. ఆ రెంటినీ పుష్కలంగా ప్రదర్శిం చిన టెన్నిస్ దిగ్గజాలు వారిద్దరూ. ప్రపంచమంతా ఏకమయి ముందు నాడాల్‌కీ, తర్వాత ఫెడరర్‌కీ జేజేలు పలికింది.
ఎన్నో కారణాలకి ఈ ఫైనల్స్ ఒక చరిత్ర. ఈ ఆటగాళ్లిద్దరినీ దాటి టెన్నిస్ అప్పుడే చాలా దూరం ప్రయాణం చేసింది. ఆండీ ముర్రే, డోకోవిచ్ ఇప్పుడు బరిలో ఉన్న యోధులు. కాగా ఫెడరర్ ఆరు నెలల కింద ఆటలో గాయపడి చికిత్స తీసుకుంటున్నాడు. అతని వయస్సు 35. నాడాల్ వయస్సు 30. గాయం, ఆట నుంచి విశ్రాంతి కారణంగా ఫెడరర్ ‘‘అలసిన’ యోధుడు కింద లెక్క. కాని నిన్నటి ఆట బరిలో వయస్సుని జయించి ఇద్దరు ఆటగాళ్లు ఏడేళ్ల కిందటి వారి ఆటని గుర్తు చేశారు. ప్రతిభకీ, జీనియస్‌కీ వయస్సు లేదని మరోసారి నిరూపించారు.
ఆటలో ఆఖరి బంతితో విజయాన్ని సాధించిన ఫెడరర్ గురించి ఒక పాత్రికేయుడు కేవలం కవిత్వమే రాశాడు, ‘‘ఆనందమూ, ఆవేశమూ కట్టలు తెంచుకోగా ఆర్టూ, హార్టూ ఊదారంగు బూట్లమీదికి జారిన ఫెడరర్ 18వ గ్రాండ్ స్లామ్ విజయాన్ని పొదివి పట్టుకుని అయిదేళ్ల పసిబిడ్డలాగ భోరుమన్నాడు.’’ ఇది ఇంగ్లిష్ వాక్యానికి భయంకరమైన అనువాదం. క్షమించాలి.
శ్రీరాముడు అవలీలగా, క్రీడగా బాణాలు వర్షించడం నాకిప్పుడు అర్థమవుతోంది. అపూర్వమ యిన ప్రతిభ, సామర్ధ్యం పట్ల చెరిగిపోని అత్మ విశ్వాసం, పట్టుదల, తన కళ పట్ల ఆరాధనాభావం ఉన్న ప్రతిభావంతుడు చెలరేగితే విరుచుకుపడే ఉప్పెన అయినా అవుతాడు, విప్పారే కలువపువ్వ యినా అవుతాడు. ఇందుకు నిదర్శనం మొన్న మెల్బోర్న్ రాడ్ లీవర్ స్టేడియంలో అవిష్కృతమైన మహా దృశ్య కావ్యం.
- గొల్లపూడి మారుతీరావు