
ఫెడరర్ ‘హ్యాట్రిక్’
నాదల్‌పై మళ్లీ గెలుపు
కాలిఫోర్నియా: ఈ ఏడాది అద్భుతమైన ఫామ్‌లో ఉన్న స్విట్జర్లాండ్ టెన్నిస్ దిగ్గజం రోజర్ ఫెడరర్ మరోసారి సంచలన ఆటతీరును ప్రదర్శించాడు. తన చిరకాల ప్రత్యర్థి రాఫెల్ నాదల్‌పై స్పష్టమైన ఆధిపత్యాన్ని కనబరిచి మరో విజయాన్ని నమోదు చేశాడు. ఇండియన్ వెల్స్ ఓపెన్ మాస్టర్స్ సిరీస్ టోర్నీలో భాగంగా గురువారం జరిగిన పురుషుల సింగిల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో ఫెడరర్ 6–2, 6–3తో నాదల్‌ను చిత్తుగా ఓడించి క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించాడు.
నాదల్‌తో ముఖాముఖి రికార్డులో ఫెడరర్ 13–23తో వెనుకబడి ఉన్నా... తన కెరీర్‌లో ఈ స్పెయిన్ స్టార్‌పై వరుసగా మూడోసారి నెగ్గడం ఇదే తొలిసారి. ఈ జనవరిలో ఆస్ట్రేలియన్ ఓపెన్ ఫైనల్లో ఐదు సెట్‌ల పోరులో నాదల్‌పై చిరస్మరణీయ విజయాన్ని సాధించిన ఫెడరర్... 2015 బాసెల్ ఓపెన్ ఫైనల్లోనూ గెలిచాడు. తాజా విజయంతో నాదల్‌పై ఫెడరర్‌కు వరుసగా మూడో విజయం లభించినట్టయింది. నాదల్‌తో 68 నిమిషాలపాటు జరిగిన మ్యాచ్‌లో ఫెడరర్ ఐదు ఏస్‌లు సంధించడంతోపాటు తన ప్రత్యర్థి సర్వీస్‌ను నాలుగుసార్లు బ్రేక్ చేశాడు.
జొకోవిచ్‌కు షాక్
మరో ప్రిక్వార్టర్ ఫైనల్లో ఆస్ట్రేలియా వివాదాస్పద ఆటగాడు నిక్ కిరియోస్ 6–4, 7–6 (7/3)తో ప్రపంచ రెండో ర్యాంకర్, డిఫెండింగ్ చాంపియన్ నొవాక్ జొకోవిచ్ (సెర్బియా)ను బోల్తా కొట్టించి క్వార్టర్ ఫైనల్లో ఫెడరర్‌తో పోరుకు సిద్ధమయ్యాడు.