
చెవిలో పువ్వులు
రాబోయేకాలంలో దూడగడ్డికి తాడిచెట్లని వెతకాల్సిన పనిలేదు. కారణం– హార్వర్డ్ మేధావుల కొడుకుల కాలం చెల్లింది. ఎందుకంటే చెవులకీ, పువ్వులకీ గల సంబంధం రాను రాను తగ్గబోతోంది కనుక.
వెనకటికి–ఎవడో తాడిచెట్టు మీద కనిపించాడట– సీజన్ కాని సీజన్ లో. ‘ఏమయ్యా! ఇప్పుడు తాటిచెట్టు ఎందుకు ఎక్కావయ్యా?’ అని దారిన పోయేవాడు అడిగాడట.‘‘దూడ గడ్డికి గురువుగారూ!’’అన్నాడట ఈయన. మనదేశంలో బోలెడన్ని తాడిచెట్లు– దూడగడ్డికోసం వాటిని నిరంతరం ఎక్కే హార్వర్డ్ చదువుల మంత్రులు బోలెడంత మంది ఉన్నారు.
మాయావతిగారికి ఏ అన్యాయం జరిగినా– ఆమె సమాధానం ఒకటుంది– అది ప్రతిపక్షాలు తన మీద జరిపిన కుట్ర– అని. కేజ్రీవాల్ బాత్‌రూంలో కాలుజారి పడినా– అతనికో ఒడుపు ఉంది. నరేంద్ర మోదీగారు ప్రతిపక్ష నాయకులను వారి బాత్‌రూంలలోనయినా క్షేమంగా ఉండనీయడంలేదని. ఇవి ప్రతి పక్షాల ఆలోచనా సరళికి నమూనాలు.
ఆయన పార్టీలోనే ఆయన ఎంపిక చేయగా శాసనసభ్యుడయి, మంత్రి కూడా అయిన కపిల్ మిశ్రా ఏవో రాజకీయ కారణాలకి కేజ్రీవాల్ మీద కాలుదువ్వుతున్నారు. ఎన్నో రకరకాల అవినీతుల చిట్టా విప్పారు. కేజ్రీవాల్ వాటికేమీ సమాధానం చెప్పకపోగా బీజేపీ కపిల్ మిశ్రాతో ఈ కుట్ర జరుపుతోందన్నారు. ఇంతకన్నా సరదా అయిన విషయం. ఒకప్పటి ఆర్థికమంత్రి చిదంబరంగారి అబ్బాయి కార్తీ చిదంబరం– తండ్రి పదవిని అడ్డం పెట్టుకుని కోట్ల వ్యాపారం చేసినట్టు నేర పరిశోధక శాఖ రుజువులతో సహా చిట్టా విప్పింది. హార్వర్డ్‌లో చదువుకుని, ఈ దేశానికే ఆర్థికమంత్రిగా ఉన్న చిదంబరంగారు ఏమన్నారు? తను పత్రికలలో పాలకవర్గం మీద రాసే వ్యాసాలకు భయపడి, తనని రాయకుండా చేయడానికి పాలకవర్గం తన మీద కుట్ర సాధిస్తోందన్నారు. ఇది ఓ గొప్ప మేధావి మాత్రమే గ్రహించగల రాజకీయ కుట్ర. కార్తీ చిదంబరం అవినీతికీ–అందుకు కావలసిన సాక్ష్యాధారాలు దొరకడానికీ–చిదంబరంగారి పత్రికా వ్యాసాలకీ ఏం సంబంధం?
గత 13 సంవత్సరాలుగా సోనియాగాంధీ వియ్యపురాలికి– అనగా రాబర్ట్ వాద్రా తల్లిగారి రక్షణకు ప్రభుత్వం ఖర్చు చేసిన కోట్ల ధనానికీ, ప్రస్తుత పాలకులకూ ఏమిటి సంబంధం? ఉంది బాబూ ఉంది. కేంద్రంలో కాంగ్రెస్ పదవిలో ఉంటే సోనియా గాంధీ వియ్యపురాలి మీద ఈగ వాలనిచ్చేవారా? మళ్లీ మాట్లాడితే ఆమె పక్కింటివారికి కూడా రక్షణ కల్పించేవారు. కారణం– వారి ఇంటి గోడలు పొట్టిగా ఉన్నాయి కనుక. పాక్ దౌర్జన్యకారులు పక్కింటి ద్వారా వీరి ఇంట్లో జొరబడి వియ్యపురాలిని ఎత్తుకుపోతే దేశానికి ఎంత ప్రమాదం? కనుక ఇందులో బీజేపీ కుట్ర బోలెడంత ఉంది.
ఇంతకీ ఓటరు చెవుల్లో పెట్టడానికి నాయకుల దగ్గర బోలెడన్ని పువ్వులున్నాయి కాని–దురదృష్టవశాత్తు చెవులు ఖాళీ లేవు.
అవినీతికి సాక్ష్యాలు గట్టిగా దొరికినప్పుడు తప్పించుకునే దారులు అన్నీ మూతపడతాయి. అప్పుడు ఇలాంటి అడ్డదారులు అవసరమౌతాయి. ఓటరుకి నిజంగా అర్థమౌతోందనీ, అయితే అతను నోరు విప్పడానికి ఎన్నికల దాకా అవకాశం రాదనీ ఈ నాయకులు గమనించరు. తీరా మాడు పగిలేటట్టు ఓటరు ఛీకొట్టాక అపజయానికి దొంగ కారణాలు వెతుకుతారు. ఒకనాడు ప్రతిపక్షాల మాడు పగులగొట్టి బేషరతుగా ఆమ్ ఆద్మీ పార్టీని ఓటరు అందలం ఎక్కించినప్పుడు ఓటింగ్ మెషీన్లు బాగా పనిచేశాయి. ఇప్పుడు తమ పార్టీని తిరస్కరించినప్పుడు మిషన్లలో తేడాలొచ్చాయి.
ఇదివరకు ఓటరు తన చెవుల్ని తడువుకుంటూ పువ్వుల్ని లెక్కపెట్టేవాడు. కానీ ఇప్పుడిప్పుడే వ్యవస్థ కళ్లు తెరిచింది. రోజు రోజుకీ ఆయా సిద్ధాంతాల ముసుగులు కప్పుకుని ‘పత్రికా స్వేచ్ఛ’ అని ఊదరగొట్టే ‘కొంగు’ పత్రికల చాకచక్యాన్నీ, జరిగే ప్రతిదానికి మతం, కులం రంగు పూసే కుహనా మేధావుల భాషణల్నీ దాటి కులాలు, మతాలకు అతీతంగా తన శ్రేయస్సుని కాపాడే నాయకత్వానికి ఓటరు బేషరతుగా నిర్దుష్టంగా పట్టం కడుతున్నాడు. నిన్న ఉత్తరప్రదేశ్‌లో బీజేపీ గెలుపుకి అర్థం కేవలం ఆ పార్టీ పరపతి మాత్రమే కాదు. ఇన్నాళ్లూ నాయకులు నమ్మించిన ‘సంకుచిత’ పరిధుల్ని దాటి తన మంచిచెడ్డల్ని ఆయా నాయకుల ‘మూస’లకి దూరంగా, భిన్నంగా, గంభీరంగా ఓటరు నిలవగలుగుతున్నాడనడానికి నిదర్శనం. ఆత్మవంచన చేసుకునే ప్రతిపక్షాల కుట్రల సాకు వెనుక – ఓటింగు మిషన్ల లోపం వెనుక – దాగొనే నాయకులకి ఈ హెచ్చరిక మనస్సుల్లోనయినా అంది ఉండాలి. వెన్నెముకల్లో చలి పుట్టించే ఉంటుంది. రేపు బీజేపీ తోక జాడించినా ఆ సమాధానం చెప్పగలడు. ఆ సంగతి ఆ పార్టీ పెద్దలకి ఈ పాటికి అర్థమయ్యే ఉంటుంది. ఇంతవరకూ ఎన్నికల్లో గెలిచాక ఆయా పార్టీలు తమ ఇళ్లు చక్కబెట్టుకున్నాయి. ఇప్పుడు అది కుదరదని తెలిసొచ్చే రోజులొచ్చాయి.
రాబోయేకాలంలో దూడగడ్డికి తాడిచెట్లని వెతకాల్సిన పనిలేదు. కారణం–హార్వర్డ్ మేధావుల కొడుకుల కాలం చెల్లింది. ఎందుకంటే చెవులకీ, పువ్వులకీ గల సంబంధం రాను రాను తగ్గబోతోంది కనుక.
- గొల్లపూడి మారుతీరావు