న్యూఢిల్లీ: వలస కూలీలు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై చర్చించేందుకు ప్రతిపక్షాలు నిర్వహించనున్న వీడియో కాన్ఫరెన్స్‌ను ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రులు మాయావతి, అఖిలేశ్ యాదవ్ సహా ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ బహిష్కరించినట్లు తెలుస్తోంది. రాజకీయపరంగా కాంగ్రెస్ పార్టీతో తమకు ఉన్న విభేదాల నేపథ్యంలో వీరు ఈ మేరకు కాన్ఫరెన్స్‌లో పాల్గొనకూడదని నిర్ణయించుకున్నట్లు సమాచారం. కాగా కరోనా వ్యాప్తి నేపథ్యంలో దేశవ్యాప్తంగా విధించిన లాక్‌డౌన్ వల్ల వలస కూలీలు దుర్భర పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. ఉన్నచోట ఉపాధి లేక సొంతూళ్లకు వెళ్లే మార్గం తెలియక పడరాని పాట్లు పడుతున్నారు. ఈ క్రమంలో అనేక మంది ప్రాణాలు సైతం కోల్పోతున్నారు. వలస కార్మికులను స్వస్థలాలకు తరలించేందుకు కేంద్రం శ్రామిక్ రైళ్లను ఏర్పాటు చేసినప్పటికీ వారి కష్టాలు తీరడం లేదు. (వలస కూలీలపై భారం మోపుతారా’)
ఈ నేపథ్యంలో వలస కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలు- పరిష్కారాలపై చర్చించేందుకు కాంగ్రెస్ పార్టీ అధినేత సోనియాగాంధీ ఆధ్వర్యంలో ప్రతిపక్షాల నేతలు శుక్రవారం సమావేశం కానున్నారు. మధ్యాహ్నం మూడు గంటలకు ప్రారంభం కానున్న ఈ భేటీలో వివిధ పార్టీలకు చెందిన 20 మంది నేతలు పాల్గొననున్నట్లు సమాచారం. వలస కూలీల సమస్యలను పరిష్కరించే విషయంలో అనుసరించాల్సిన ఉమ్మడి వ్యూహంపై చర్చించనున్నట్లు తెలుస్తోంది. అదే విధంగా లాక్‌డౌన్ అమల్లో ఉన్న నేపథ్యంలో పలు రాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక చట్టాలను నీరుగారుస్తుండడంపైనా చర్చించే అవకాశం ఉంది. కాగా ఈ సమావేశంలో పాల్గొనేందుకు 17 ప్రతిపక్షాలు అంగీకారం తెలిపాయి. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రే, జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్, డీఎంకే చీఫ్ స్టాలిన్, ఎన్సీపీ అధినేత శరద్ పవార్ సహా వామపక్ష నేతలు, యూపీఏ భాగస్వామ్య పక్షాలు ఈ కాన్ఫరెన్స్‌లో పాల్గొననున్నారు.
Comments
Please login to add a commentAdd a comment