సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ శాసనసభ ఎన్నికలకు సంబంధించి ఇక ప్రచారం ఊపందుకోనుంది. సోమవారం ఎన్నికల నోటిపికేషన్ జారీతో నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమవుతుండగా, అన్ని ప్రధాన పార్టీల నాయకులు ప్రచారం ప్రణాళికను సిద్ధం చేసుకుంటున్నాయి. టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆదివారం రోజున తాను పోటీ చేయనున్న గజ్వేల్ నియోజకవర్గంలో ముఖ్యనాయకులతో సమావేశం కావడంతో ప్రారంభించి ఆ మరుసటి రోజు నుంచి అన్ని నియోజకవర్గాల్లో ప్రచారం నిర్వహించాలని భావిస్తున్నారు. కాంగ్రెస్ తరఫున ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ మరో రెండు దఫాలుగా ఎన్నికల ప్రచార సభల్లో పాల్గొంటారని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. ఈ నెల 22, 23 తేదీల్లో కాంగ్రెస్ నాయకురాలు సోనియాగాంధీ ప్రచారం నిర్వహించనున్నారు. ఇకపోతే, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా మరోదఫా ఎన్నికల ప్రచారానికి రానుండగా, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రచారానికి వస్తారా లేదా అన్నది ఇంకా ఖరారు కాలేదు. వీరికి తోడు వామపక్ష పార్టీలకు చెందిన జాతీయ నాయకులు కూడా పలు సభల్లో పాల్గొనడానికి ఆయా పార్టీలు రంగం సిద్ధం చేసుకుంటున్నాయి.
ఇలావుండగా, కూటములకు సంబంధం లేకుండా అభ్యర్థులను రంగంలోకి దింపనున్న బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ), ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) తరఫున అభ్యర్థులను రంగంలోకి దింపనున్న నేపథ్యంలో ఆ పార్టీలకు చెందిన ముఖ్యనేతలు ప్రచారంలో పాల్గొంటారని తెలుస్తోంది. ఈరెండు పార్టీలు ఇప్పటికే స్టార్ కాంపేయినర్స్ జాబితాలను ఎన్నికల సంఘానికి సమర్పించాయి. ఆమ్ ఆద్మీ పార్టీ తరఫున నేతలు సోమనాథ్ భారతీ, అల్కాలాంబా, షహనాజ్ హిందుస్థానీ, సంజయ్ సింగ్, సుషీల్ గుప్తా, మనిష్ సిసోడియా. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ పేర్లను కూడా పేర్కొన్నారు. సందర్భానుసారంగా ఆ నేతలు ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారని ఆ పార్టీ రాష్ట్ర నేతలు చెప్పారు. ఇకపోతే, బీఎస్పీ తరఫున ఆ పార్టీ జాతీయ అధ్యక్షురాలు మాయవతితో పాటు పార్టీ ప్రధాన కార్యదర్శి సతీష్ చంద్ర మిశ్రా, ఆ పార్టీ రాజ్యసభ సభ్యుడు వీర్ సింగ్, ఉపాధ్యక్షుడు రామ్ జీ గౌతమ్ తదితరులు ప్రచారం నిర్వహించడానికి వీలుగా వారి పేర్లను స్టార్ కాంపేయినర్ల జాబితాలో చేర్చి ఎన్నికల సంఘానికి సమర్పించింది.
Comments
Please login to add a commentAdd a comment