
సాక్షి, మహబూబ్ నగర్ : కాంగ్రెస్, బీజేపీ రెండు పార్టీలు కూడా రిజర్వేషన్ల అమలుకు వ్యతిరేకంగా తీవ్రంగా కృషి చేస్తున్నాయంటూ బీఎస్పీ జాతీయ అధ్యక్షురాలు మాయావతి మండి పడ్డారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా గురువారమిక్కడ మహబూబ్ నగర్‌లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాయావతి మాట్లాడుతూ.. తెలంగాణలో ఏ పార్టీతో సంబంధం లేకుండా బీఎస్పీ అన్ని స్థానాల్లో పోటీ చేస్తుందని తెలిపారు. టికెట్ల కేటాయింపులో అన్ని వర్గాల వారికి సమాన అవకాశం ఇచ్చామని వెల్లడించారు. దళిత, ఆదివాసీ, ముస్లిం, అగ్రవర్ణ పేదలకు అభివృద్ధి ఫలాలు అందడం లేదని ఆరోపించారు. కాంగ్రెస్, బీజేపీ రెండు కూడా రిజర్వేషన్లు అమలు కాకుండా కుట్ర చేస్తున్నాయంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. మండల్ కమిషన్ రిపోర్టు కోసం బీఎస్పీ ఎంతో పోరాటం చేసిందని గుర్తు చేశారు. ముస్లిం మైనారిటీలకు కూడా అవమానాలు జరుగుతున్నాయన్నారు. సచార్ కమిటీ రిపోర్టు అమలు చేయడం లేదని మాయావతి ఆరోపించారు.
తెలంగాణలో అన్ని వర్గాల ప్రజలు నిరాశలో ఉన్నారని పేర్కొన్నారు. తప్పుడు ఆర్థిక విధానాల వల్ల దేశంలో పేదరికం పెరిగిందన్నారు. పెట్రోల్, డీజిల్ రేట్ల పెరుగుదల.. నోట్ల రద్దు వల్ల దేశంలో అనిశ్చితి వచ్చిందని వ్యాఖ్యానించారు. పెట్టుబడిదారుల డబ్బుతో కాకుండా పేదల, కష్ట జీవుల కష్టార్జితంతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడమే తమ ధ్యేయమని తెలిపారు. యుపీలో ఇప్పటికే నాలుగు సార్లు అధికారంలోకి వచ్చామన్నారు. అక్కడ నిరుద్యోగ భృతి కాకుండా.. యువతకు అన్ని రంగాల్లో ఉపాధి కల్పించామని తెలిపారు. తెలంగాణలో బీఎస్పీ అధికారంలోకి వస్తే యూపీ మాదిరిగానే ఇక్కడ కూడా యువతకు ఉపాధి కల్పిస్తామని పేర్కొన్నారు. బీఎస్పీ బూటకపు మేనిఫెస్టోలు, హామీలు ఇవ్వదన్నారు. బీఎస్పీ అభ్యర్ధులను గెలిపించండంటూ మాయావతి ప్రజలను కోరారు.
Comments
Please login to add a commentAdd a comment