వారి వాగ్దానాలు నమ్మొద్దు | BJP Leader Mayawati Fires On Congress Party | Sakshi
Sakshi News home page

వారి వాగ్దానాలు నమ్మొద్దు

Published Fri, Nov 24 2023 4:29 AM | Last Updated on Fri, Nov 24 2023 4:29 AM

BJP Leader Mayawati Fires On Congress Party - Sakshi

సాక్షి, పెద్దపల్లి: బీఆర్‌ అంబేడ్కర్‌కు భారతరత్న ఇవ్వకుండా అడ్డుకున్న పార్టీ కాంగ్రెస్‌ అని, కాన్షీరాం చనిపోతే కనీసం సంతాపదినం ప్రకటించని ఆ పార్టీని ఓడించాలని బీఎస్పీ జాతీయ అధ్యక్షురాలు మాయావతి అన్నారు. అంబేడ్కర్‌ రాసిన రాజ్యాంగంతోనే అణచివేతకు గురైన వర్గాలకు విద్య, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో అవకాశాలు వచ్చాయని చెప్పారు. మండల్‌ కమిషన్‌ సిఫారసులు అమలు చేయాలని దేశవ్యాప్తంగా కాన్షీరాంఉద్యమం చేయడంతోనే ఓబీసీలకు విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్లు దక్కాయని గుర్తుచేశారు. గురువారం పెద్దపల్లిలో నిర్వహించిన ఘీంకార బహిరంగ సభలో ఆమె మాట్లాడారు. సీఎం కేసీఆర్‌ దళిత వ్యతిరేకి అని, దళితులను కేసీఆర్‌ ప్రభుత్వం చిన్నచూపు చూస్తోందని మండిపడ్డారు.

వారిని ఓటు బ్యాంకుగానే గుర్తిస్తూ రాజకీయంగా అణచివేస్తోందని దుయ్యబట్టారు. 1989లో తాను తొలిసారి ఎంపీగా గెలిచాక నాటి వీపీ సింగ్‌ ప్రభుత్వం తనకు కేంద్ర మంత్రి పదవి ఇస్తానంటే వద్దని చెప్పానని, మండల్‌ కమిషన్‌ సిఫారసులు అమలు చేయాలంటూ పట్టుబట్టి ప్రభుత్వం మెడలు వంచానన్నారు. దేశంలో బీఎస్పీ అధికారంలోకి వస్తేనే ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు న్యాయం జరుగుతుందన్నారు. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో ఏ వర్గానికీ న్యాయం జరగలేదన్నారు. రాష్ట్రంలో కేసీఆర్‌ నియంతలా పాలిస్తూ ప్రజల హక్కులు కాలరాస్తున్నారని విమర్శించారు.

చట్టసభల్లో మహిళలకు కల్పించిన 33 శాతం రిజర్వేషన్లలో ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు ప్రత్యేక రిజర్వేషన్లు కల్పించాలని ఆమె డిమాండ్‌ చేశారు. దళితుల అణచివేతలో భాగంగానే ప్రవీణ్‌ కుమార్, ఆయన కుమారుడు పునీత్‌పై పోలీసులు అక్రమంగా హత్యాయత్నం కేసులు నమోదు చేశారని ఆరోపించారు. ఉత్తరప్రదేశ్‌లో బీఎస్పీ నాలుగుసార్లు అధికారంలోకి వచ్చి పేదలకు భూములు పంచి, లక్షలాదిమంది యువతకు ఉపాధి అవకాశాలు కల్పించిందని చెప్పారు. తెలంగాణలో కూడా బీఎస్పీ అధికారంలోకి వస్తే అలాంటి పథకాలు అమలు చేసి బహుజనుల రాజ్యాన్ని నిర్మిస్తామని హామీ ఇచ్చారు. 
 
బీఆర్‌ఎస్‌ను ఓడించాలి: ప్రవీణ్‌ కుమార్‌ 
రాష్ట్రాన్ని దోచుకుంటున్న బీఆర్‌ఎస్‌ను ఓడించాలని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌ కుమార్‌ పిలుపునిచ్చారు. అమరుల త్యాగాలతో ఏర్పడ్డ తెలంగాణలో బహుజనుల ఓట్లతో గద్దెనెక్కిన కేసీఆర్‌ దోపిడీకి పాల్పడుతున్నారని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో పార్టీ పెద్దపల్లి అభ్యర్థి దాసరి ఉష, రామగుండం అభ్యర్థి అంబటి నరేశ్‌యాదవ్, మంథని అభ్యర్థి చల్లా నారాయణరెడ్డి తదితరులు పాల్గొన్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement