ఉత్తరప్రదేశ్‌లో బలమైన రాజకీయశక్తిగా ఎదిగిన నాటినుంచి తెలుగునేలపై కాలు మోపాలని యత్నిస్తున్న బహుజన సమాజ్ పార్టీ ఈసారి మాత్రం ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకొంది. అందుకే ఏకంగా రాష్ట్రంలోని 119 నియోజకవర్గాలకు అభ్యర్థులను నిలిపింది. కేవలం ఎన్నికల సమయంలోనే వినిపించే బహుజనవాదాన్ని రెండేళ్లుగా జనాల్లోకి తీసుకెళ్లిన ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్‌ఎస్. ప్రవీణ్‌కుమార్ ఈ దఫా బీఎస్పీ సత్తా చూపాలని పట్టుదలతో ఉన్నారు. అభ్యర్థుల ఎంపిక నుంచి ప్రచారం వరకు వ్యూహాత్మకంగా ముందుకు సాగుతున్న ప్రవీణ్ కుమార్ స్వయంగా ఆసిఫాబాద్ జిల్లా సిర్పూరు నుంచి సీనియర్ ఎమ్మెల్యే కోనేరు కోనప్పను ఢీ కొంటున్నారు.
పటాన్‌చెరు, సూర్యాపేట, పెద్దపల్లి, అలంపూర్, జహీరాబాద్, నకిరేకల్, వర్ధన్నపేట, పాలేరు వంటి పలు నియోజకవర్గాల్లో ప్రధాన పార్టీలకు బీఎస్పీ అభ్యర్థులు సవాల్ విసురుతున్నారు. ప్రధాన పక్షాలుగా ఉన్న బీఆర్‌ఎస్, కాంగ్రెస్, బీజేపీలకు చెందిన అభ్యర్థుల అధికార, అర్ధబలం తట్టుకొని బీఎస్పీ అభ్యర్థులు చివరి వరకు ఎలా నిలబడతారన్నదే ప్రశ్న అని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు.
బీఎస్పీ అంటే దళితుల పార్టీ అనే ముద్రను చెరిపివేసేందుకు ఆ పార్టీ రాష్ట్ర సారథి ప్రవీణ్ కుమార్ భారీ కసరత్తు చేశారు. ఐపీఎస్‌గా, గురుకులాల కార్యదర్శిగా వ్యవహరించిన సమయంలో ఉన్న సంబంధాలు ఆయనకు రాజకీయంగా ఉపయోగపడ్డాయనే చెప్పాలి. అగ్ర కులాలు మొదలుకొని 60 శాతం మంది బీసీలకు సీట్లిచ్చారు. ప్రవీణ్‌కుమార్ జనరల్ సీటు అయిన సిర్పూరు నుంచి పోటీ చేస్తుండడం గమనార్హం.
బహుజన వాదమే ఎజెండాగా చెపుతున్న ఆయన అభ్యర్థుల ఎంపికలోనూ విలక్షతను చాటుకున్నారు. మంథనిలో చల్లా నారాయణరెడ్డి, నల్లగొండలో కోమటి సాయితేజ్ రెడ్డి, పెద్దపల్లిలో ఉష (పద్మశాలి), నిజామాబాద్‌లో షేక్ ఇమ్రాన్‌ఖాన్, సూర్యాపేటలో వట్టె జానయ్య (యాదవ), ఎల్‌బీనగర్– గువ్వ సాయి రామకృష్ణ ముదిరాజ్ ..ఇలా వివిధ వర్గాల వారికి సీట్లు ఇచ్చారు. వరంగల్ ఈస్ట్ నుంచి ట్రాన్స్‌జెండర్ చిత్రపు పుష్పిత లయకు సీటు కేటాయించడం ద్వారా రాష్ట్రంలో కొత్త సంప్రదాయానికి శ్రీకారం చుట్టారు.
1994 నుంచి బరిలో నిలుస్తున్నా...
రాష్ట్రంలో 1994 శాసనసభ ఎన్నికల సమయంలోనే అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో బీఎస్పీ వ్యవస్థాపకుడు కాన్షీరాం, అధ్యక్షురాలు మాయావతి తమ పార్టీ తరపున అభ్యర్థులను నిలబెట్టినా ఫలితం దక్కలేదు. అప్పటి నుంచి అడపాదడపా ఎన్నికల సమయంలో బీఎస్పీ పోటీలో నిలబడడం, ఏనుగు గుర్తుపై అభ్యర్థులు పోటీ చేయడం జరుగుతూ వచ్చింది. 2004 ఎన్నికల్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోని పాడేరు నుంచి లాకే రాజారావు బీఎస్పీ అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందారు.
తెలంగాణ ఏర్పాటైన తరువాత 2014లో అప్పటి రాజకీయ సమీకరణాల దృష్ట్యా ప్రస్తుత మంత్రి ఎ.ఇంద్రకరణ్‌రెడ్డి నేతృత్వంలో పలువురు అభ్యర్థులు వివిధ నియోజకవర్గాల్లో పోటీ చేశారు నిర్మల్ నుంచి పోటీ చేసిన ఇంద్రకరణ్‌రెడ్డి, సిర్పూరు నుంచి బరిలో నిలిచిన కోనేరు కోనప్ప మాత్రమే విజయం సాధించారు. కానీ గెలిచిన వెంటనే బీఆర్‌ఎస్ (అప్పటి టీఆర్‌ఎస్) అధినేత కేసీఆర్ పిలుపు మేరకు అధికార పార్టీలో చేరారు. 2018 ఎన్నికల్లో బెల్లంపల్లి నుంచి
పోటీ చేసిన ప్రస్తుత కాంగ్రెస్ అభ్యర్థి గడ్డం వినోద్ రెండోస్థానానికి పరిమితమయ్యారు.
రాష్ట్రంలో బీఎస్పీపై ప్రవీణ్ ముద్ర
ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా అలంపూర్‌కు చెందిన రేపల్లె శివ ప్రవీణ్‌కుమార్ 1995 బ్యాచ్ ఐపీఎస్ అధికారి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో పోలీస్ అధికారిగా వివిధ హోదాల్లో పనిచేసిన ఆయన 2013 నుంచి 2021 జూలై నెలలో వాలంటరీ రిటైర్‌మెంట్ తీసుకునేంత వరకు ప్రభుత్వ గురుకులాల సంస్థ (స్వేరోస్) కార్యదర్శిగా సేవలు అందించారు. ప్రవీణ్‌కుమార్ అదే సంవత్సరం ఆగస్టులో మాయావతి సమక్షంలో బీఎస్పీలో చేరారు.
ప్రభుత్వంలో లోటుపాట్లు, మంచి చెడులు తెలిసిన ఆయన బహుజనవాదం నినాదంతో బీఎస్పీని రాష్ట్రంలో బలమైన శక్తిగా తయారు చేసేందుకు తనవంతు ప్రయత్నం చేశారు. ఇందులో భాగంగా ఏడాది కాలం పాటు పాదయాత్ర జరిపి వేలాది గ్రామాలను చుట్టి వచ్చారు. సొంత నియోజకవర్గం అలంపూర్‌ను కాదని సిర్పూర్ నుంచి బీఎస్పీ అభ్యర్థిగా పోటీ చేస్తూ, మిగతా అన్ని నియోజకవర్గాలకు అభ్యర్థులను నిలిపారు.
-పోలంపల్లి ఆంజనేయులు
Comments
Please login to add a commentAdd a comment