బీజేపీ, కాంగ్రెస్ కుమ్మక్కై నా ప్రచారంపై నిషేధం పెట్టాయి
పెద్దపల్లి జిల్లా రామగుండం రోడ్ షోలో కేసీఆర్ ఫైర్
చేనేత కార్మికుల కోసం మాట్లాడటం తప్పా?
నా బస్సుయాత్రతో బీజేపీ, కాంగ్రెస్‌లలో వణుకు పుట్టింది
అందుకే నన్ను ఆపేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయి
ఎలా ఉండే రాష్ట్రం ఐదు నెలల్లో ఎలా అయిపోయింది?
కేంద్రంలో వచ్చేది సంకీర్ణమే.. బీఆర్‌ఎస్ గెలిస్తే హక్కులను కాపాడుకోవచ్చని వ్యాఖ్య
సాక్షి, పెద్దపల్లి: చేనేత కార్మికులకు అన్యాయం చేస్తున్నారని తాను మాట్లాడితే, ప్రభుత్వ తీరును ప్రశ్నిస్తే.. తన గొంతు నొక్కేశారని బీఆర్‌ఎస్ అధినేత, మాజీ సీఎం కె.చంద్రశేఖర్‌రావు పేర్కొన్నారు. బీజేపీ, కాంగ్రెస్ వాళ్లు కుమ్మక్కై తన ప్రచారంపై నిషేధం పెట్టించారని ఆరోపించారు. అదే ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, సీఎం రేవంత్ ఎన్నికల నిబంధనలను ఉల్లంఘించి మాట్లాడుతున్నా ఎలాంటి చర్యలూ తీసుకోవడం లేదేమని నిలదీశారు.
బీజేపీ, కాంగ్రెస్‌లలో ఎవరికి ఓటేసినా.. సింగరేణిని ముంచేసి, కార్మికుల నోట్లో మట్టికొడతాయని వ్యాఖ్యానించారు. లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా కేసీఆర్ చేపట్టిన బస్సుయాత్ర.. ఈసీ పెట్టిన 48 గంటల నిషేధం అనంతరం శుక్రవారం రాత్రి రామగుండం పట్టణంలో తిరిగి మొదలైంది. ఈ సందర్భంగా నిర్వహించిన రోడ్ షోలో కేసీఆర్ ప్రసంగించారు. వివరాలు ఆయన మాటల్లోనే..
‘‘నిషేధించిన నా గొంతు 48 గంటల తర్వాత మాట్లాడుతోంది. నేను ఏం చేశానని నా గొంతును నొక్కేశారు. చేనేత కార్మికులకు ఆర్డర్స్ ఇవ్వడం లేదని, గత ప్రభుత్వం ఇచ్చిన ఆర్డర్ల బిల్లులు రూ.375 కోట్లు విడుదల చేయడం లేదని, ఆత్మహత్యలు చేసుకుంటున్నారని మా పార్టీ నేతలు ప్రశ్నిస్తే.. ఓ కాంగ్రెస్ నాయకుడు.. ‘ఇన్ని రోజులు దొబ్బితిన్నది చాలలేదా? పొయి నిరో«ద్‌లు, పాపడాలు అమ్ముకోండి’ అన్నడు. మీకు చేనేత కార్మికులు అంత చులకనగా కనపడుతున్నారా? అధికారంలో ఉన్న మీరు ఇలా మాట్లాడొచ్చా.. అని కోపంలో ఒక్కమాట మాట్లాడిన.
వాళ్ల మాటలు ఈసీకి కనిపించవు
కేసీఆర్ బస్సుయాత్ర చేపడితే కాంగ్రెస్, బీజేపీలకు గుండెలు వణుకుతున్నాయి. వాళ్లు కుమ్మకై నన్ను ఆగబట్టేందుకు నాపై నిషేధం పెట్టారు. రాజకీయాల్లో మతం గురించి మాట్లాడటం చాలా పెద్ద తప్పు. ఎన్నికల నిబంధనలకు విరుద్ధం. కేంద్ర మంత్రి అమిత్ షా రోజూ దేవుడి బొమ్మను చేతిలో, నెత్తిన పెట్టుకుని మాట్లాడితే ఎన్నికల సంఘానికి కనిపించదు. డైరెక్టుగానే హిందువులు, ముస్లింలని దేశ ప్రధాని మోదీ మాట్లాడినా కనిపించదు.
రాష్ట్ర సీఎంని ప్రజ లకు ఇచ్చిన వాగ్ధానాల అమలు ఏదని మేం అడిగితే.. గుడ్లు పీకి గోళీలు ఆడుతం, పేగులు తీసి మెడలో వేసుకుంటం, పండబెట్టి తొక్కుతం అంటే సభ్యతగా ఉందా? కానీ చేనేత కార్మికులకు అన్యాయం చేస్తున్నారని నేను మాట్లాడితే.. నా గొంతు నొక్కేశారు. ప్రజలు ఈ విషయాన్ని గుర్తించారు.
పంటలు ఎందుకు ఎండాయి?
ఐదు నెలల కింద రాష్ట్రం ఎట్లా ఉండే.. ఇప్పుడు ఎట్లా ఉంది? ఎవరి చేతకానితనం దీనికి కారణం? ఒక్క పెద్దపల్లి జిల్లాలోనే 50వేల ఎకరాలకుపైగా పంటలు ఎండిపోయాయి. గత పదేళ్లలో ఎప్పుడైనా పంటలు ఎండాయా? గత తొమ్మిదేళ్లు కడుపు నిండా కరెంటు ఉండేది. ఇప్పుడు కరెంట్ కోతలు మొదలయ్యాయి.
ఈ కోతలు ఎవరు పెట్టారో ప్రజలు ఆలోచించాలి. గతంలో గోదావరిలో పైసలు వేయాలంటే నీళ్లు వెతికేలా ఉండేది. అలాంటి గోదావరిని సజీవంగా చేశా. ప్రతి ఇంటికి నల్లా కనెక్షన్ ఇచ్చినం. ఇప్పుడు ఎందుకు రోజు తప్పి రోజు నీళ్లు వస్తున్నాయో ప్రజలు ఆలోచించాలి.
హామీల అమలు ఏది?
కాంగ్రెస్ హామీలు అమలు చేయకుండా తప్పించుకుంటోంది. రైతు రుణమాఫీ అయిందా? రైతు కూలీలకు రూ.15 వేలు ఎక్కడ? కల్యాణలక్ష్మి కింద తులం బంగారం ఎక్కడ? మహిళలకు నెలకు రూ.2,500 వస్తున్నాయా? మహిళలకు ఫ్రీ బస్ పెట్టారు. సంతోషమే. మరి ఆటో కార్మికులు నష్టపో యి ఆత్మహత్యలు చేసుకుంటుంటే.. ఆదుకోరా? ఆటోకార్మికులకు న్యాయం జరగాల్సిందే. వారి తరఫున బీఆర్‌ఎస్ పో రాడుతుంది. సీఎం ఏ ఊరికి పోతే ఆ ఊరి దేవుడి మీద ఒ ట్టేస్తున్నారు. పనిచేసేటోడు ఎవడైనా ఒట్టు పెట్టుకుంటడా?
పెద్ద ప్రమాదం రాబోతున్నా.. సీఎం మాట్లాడట్లేదు..
ఇప్పుడున్న సీఎం కృష్ణా నదిని తీసుకెళ్లి కేఆర్‌ఎంబీకి అప్పజెప్పిండు. గోదావరి నీళ్లు ఎత్తుకుపోతా, తమిళనాడు, కర్ణాటకలకు ఇస్తానని ప్రధాని మోదీ అంటుంటే.. చప్పుడు చేయడం లేదు. నేను సీఎంగా ఉన్నప్పుడు ఇదే ప్రతిపాదన తెస్తే.. నా ప్రాణం ఉన్నంత వరకు నీళ్లు తీసుకుపోనివ్వనని చెప్పిన. మరి ఈ ముఖ్యమంత్రి మౌనం వెనుక మతలబేంటో ప్రజలు ఆలోచించాలి.
కేంద్రంలో వచ్చేది సంకీర్ణమే..
దేశం అప్పుల పాలైంది. రూపాయి విలువ పడిపోయింది. మోదీ కంటే ముందున్న 14 మంది ప్రధానుల కాలంలో ఎన్నడూ ఇంత తక్కువకు పడిపోలేదు. పబ్లిక్ సెక్టార్ నాశనమైంది. అన్నీ ప్రైవేటీకరణ చేస్తున్నారు. కార్మికులు రోడ్డున పడుతున్నారు. కేంద్రంలో బీజేపీకి 200 సీట్లు కూడా వచ్చేలా లేవు. వచ్చేది సంకీర్ణ ప్రభుత్వమే. తెలంగాణలో 14 మంది బీఆర్‌ఎస్ ఎంపీలను గెలిపిస్తే.. మన హక్కులను, మన సింగరేణిని కాపాడుకోవచ్చు.
అరచేతిలో వైకుంఠం చూపి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌కు కర్రువాల్చి వాత పెట్టాలి..’’ అని కేసీఆర్ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్ ఎంపీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్, జడ్పీ చైర్మన్ పుట్ట మధు, మాజీ ఎమ్మెల్యేలు కోరుకంటి చందర్, దాసరి మనోహర్‌రెడ్డి, బాల్క సుమన్, ఎమ్మెల్సీ భానుప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
సింగరేణిని ముంచిందే కాంగ్రెస్
సింగరేణి కార్మికులు ఆలోచించాలి. మంచిగా ఉన్న సింగరేణిని ఒకప్పుడు నిండా ముంచిందే కాంగ్రెస్ పార్టీ. వాస్తవానికి సింగరేణి 100శాతం మన దగ్గరే ఉండే. కేంద్రం దగ్గర అప్పులు తెచ్చి, అది తీర్చలేక 49శాతం వాటాను అప్పజెప్పింది ఈ కాంగ్రెస్ పార్టీయే. మేం సింగరేణికి లాభాలు తేవడానికి, కార్మికుల కోసం ఎన్నో మంచి పనులు చేశాం. సీపీఐ, సీపీఎం నాయకులను ఒక్కటే ప్రశ్న అడుగుతున్నా.. ధైర్యముంటే సమాధానం చెప్పాలి, సీఎంతో సమాధానం చెప్పించాలి.
నాడు నష్టాల్లో ఉన్న సింగరేణిని లాభాల్లోకి తెచ్చింది మేం కాదా? తెలంగాణ ప్రభుత్వం వచ్చాక 19వేల మంది కార్మికుల పిల్లలకు ఉద్యోగాలు ఇచ్చాం. మెడికల్ కాలేజీ పెట్టి కార్మికుల పిల్లలకు 5శాతం రిజర్వేషన్ కలి్పంచాం. సింగరేణిని లాభాల్లోకి తెచ్చేందుకు డైరెక్టర్లను ఆ్రస్టేలియా, ఇండోనేషియాలకు పంపి.. అక్కడ బొగ్గు గనులు తీసుకుని వెలికితీయాలనే ప్రయత్నం చేశాం. కానీ కేంద్ర ప్రభుత్వం సింగరేణిని అదానీకి అప్పజెప్పి మన కార్మికుల నోట్లో మట్టి కొట్టాలని చూస్తోంది. బీజేపీ, కాంగ్రెస్‌లలో ఎవరిని గెలిపించినా సింగరేణి ప్రాంతాలు బొగ్గు అయ్యే పరిస్థితి.
మీరు లేని లోటు కనిపిస్తోంది
సారూ మీరు సీఎంగా ఉన్నప్పుడు మంచిగుండె. ఇప్పుడు మీరు లేని లోటు కనిపిస్తోంది. పచ్చగా ఉండే పల్లెలు మళ్లీ ఎండిపోతున్నాయి. మాకు దిక్కు, దిశ మీరే.. మీరు మళ్లీ వస్తేనే మా బతుకులు మారుతాయి. – రేణుక, గృహిణి
మళ్లీ కరువు వచ్చింది
మీ పాలనలో పచ్చని పొలాలు చూసినం. ఇప్పుడు ఎండిపోయిన పంటలు కనిపిస్తు న్నాయి. మీ పాలన లేని లోటు కనిపిస్తోంది. రైతుబంధు రాలే దు. నీళ్ల కరువు వచ్చింది. మీరు రావాలె. మునుపటిలా కావాలె.. – బొల్లెడ సడవలి, భూపాలజిల్లా
మాకు అండగా నిలవాలి
కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో నేడు కరువు ప్రారంభమైంది. మీ పాలనలో కల్యాణలక్ష్మి, దళి త బంధు పథకాలు వచ్చినయి. ఇప్పుడు వాటిని నిలిపివేశారు. మీ పాలనలో అందరికీ న్యాయం జరి గింది. ఇప్పుడు కష్టాలు మొదలయ్యాయి. మాకు అండగా ఉండాలి.– కృష్ణప్రసాద్, యువకుడు
Comments
Please login to add a commentAdd a comment