స్పీడందుకున్న కారు.. | KCR Focus on Lok Sabha Elections 2024 | Sakshi
Sakshi News home page

స్పీడందుకున్న కారు..

Published Sat, May 4 2024 4:43 AM | Last Updated on Sat, May 4 2024 4:43 AM

KCR Focus on Lok Sabha Elections 2024

కేసీఆర్‌ బస్సుయాత్ర, రోడ్‌ షోలతో బీఆర్‌ఎస్‌లో జోష్‌ 

ఉద్యమకాలం నాటి ఉత్సాహం కనిపిస్తోందని నేతల వెల్లడి 

గణనీయ స్థాయిలో ఎంపీ సీట్లు సాధించగలమనే ధీమా  

సాక్షి, హైదరాబాద్‌:  అసెంబ్లీ ఎన్నికల తర్వాత కాస్త వెనుకంజగా కనిపించిన కారు పార్టీలో తిరిగి కొత్త జోరు కనిపిస్తోంది. పార్టీ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌ నేరుగా రంగంలోకి దిగడం బీఆర్‌ఎస్‌ శ్రేణుల్లో జోష్‌ నింపుతోంది. కేసీఆర్‌ చేపట్టిన బస్సుయాత్ర, రోడ్‌ షోలకు ప్రజల నుంచి వస్తున్న స్పందనతో పార్టీకి పునరై్వభవం వస్తుందన్న ధీమా కనిపిస్తోందని బీఆర్‌ఎస్‌ వర్గాలు చెప్తున్నాయి. 

అసెంబ్లీ ఎన్నికల్లో గణనీయమైన సీట్లు సాధించినా.. కొందరు నేతలు పార్టీని వీడటం, ఎంపీలు కూడా పార్టీని వీడి ఇతర పార్టీల తరఫున లోక్‌సభ అభ్యర్థులుగా బరిలోకి దిగడంతో పార్టీ శ్రేణుల్లో కొంత నిరుత్సాహం కనిపించిందని అంటున్నాయి. కానీ కేసీఆర్‌ చేపట్టిన బస్సుయాత్ర, తన ప్రసంగాల్లో కాంగ్రెస్, బీజేపీలపై సంధిస్తున్న విమర్శనా్రస్తాలు.. ఉద్యమకాలం నాటి  సభలను తలపిస్తున్నాయని నేతలు చెప్తున్నారు.

 కేసీఆర్‌ ఎక్కడికి వెళ్లినా, ఎవరితో మాట్లాడినా.. మళ్లీ మీరే సీఎంగా రావాలని ప్రజలు కోరుకుంటున్నారని అంటున్నారు. ఈ క్రమంలో బీఆర్‌ఎస్‌ గణనీయమైన స్థాయిలోనే లోక్‌సభ స్థానాలను గెలుచుకుంటుందన్న నమ్మకం వస్తోందని కార్యకర్తలు ఆశావహంగా ఉన్నారు. 

జనం నుంచి మంచి స్పందనతో..  
లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భారీ బహిరంగ సభలకు బదులు క్షేత్రస్థాయి కార్యక్రమాలకే కేసీఆర్‌ మొగ్గుచూపారు. ఈ మేరకు ఏప్రిల్‌ 24 నుంచి మే 10 వరకు 17 రోజులపాటు బస్సుయాత్ర, రోడ్‌ షోలకు ప్రణాళిక రూపొందించారు. కేసీఆర్‌ చేపట్టిన బస్సుయాత్రకు ప్రజల్లో మంచి స్పందన కనిపించడం పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపింది.

కేసీఆర్‌కు మహిళలు మంగళ హారతులు, డప్పులు, బతుకమ్మలు, బోనాలతో స్వాగతం పలుకుతున్నారని.. బస్సుయాత్ర సాగే మార్గంలో రైతులు, యువకులు కేసీఆర్‌ను చూసేందుకు, కలిసేందుకు ఆసక్తి చూపుతున్నారని పార్టీ వర్గాలు చెప్తున్నాయి. రోడ్‌ షోలు, కార్నర్‌ మీటింగ్‌ల కోసం పార్టీపరంగా జన సమీకరణ చేస్తున్నా.. అంచనాలకు మించి జనం కూడా వస్తున్నారని అంటున్నాయి. 

స్థానికులతో మమేకం.. రాత్రి బసతోనూ.. 
బస్సుయాత్రలో భాగంగా మార్గమధ్యలో రైతులతో, వివిధ వర్గాలతో కేసీఆర్‌ భేటీ అవుతున్నారు. రోడ్డు పక్కన హోటళ్ల వద్ద ఆగి చాయ్‌ తాగుతూ, స్థానికులతో మాట్లాడుతున్నారు. స్థానిక సమస్యలపై ఆరా తీస్తున్నారు. రైతులతో ముచ్చటిస్తూ, వారి సమస్యలను తెలుసుకుంటూ.. తాను చేస్తున్న పోరాటంలో కలసి రావాలని పిలుపునిస్తున్నారు. మరోవైపు రోడ్‌ షోలు ముగిసిన తర్వాత కేసీఆర్‌ స్థానికంగా బస చేస్తున్నారు.

ఆ సమయంలో, మరుసటి రోజు ఉదయం.. స్థానిక నేతలు, న్యాయవాదులు, వైద్యులు, వివిధ రంగాలకు చెందిన వారితో మాట్లాడుతున్నారు. స్థానికంగా ముఖ్య నేతల నివాసానికి వెళ్లి కలుస్తున్నారు. ఇలాంటివన్నీ ప్రజలను మరింతగా ఆకట్టుకుంటున్నాయని పార్టీ నేతలు చెప్తున్నారు. 

పార్టీలో సమన్వయం.. ప్రచార వ్యూహాలు కూడా
రాత్రి బస వద్ద సంబంధిత లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్‌చార్జులు, ముఖ్య నేతలతో కేసీఆర్‌ భేటీ అవుతున్నారు. ప్రచార తీరుతెన్నులపై సమీక్షిస్తున్నారు. బూత్‌ స్థాయి వరకు ప్రచారంతోపాటు గెలుపు వ్యూహాలపై దిశానిర్దేశం చేస్తున్నారు. కేసీఆర్‌ నేరుగా కలసి చేస్తున్న సూచనలతో పార్టీ శ్రేణుల్లో ఉత్సాహకం కనిపిస్తోందని అంటున్నారు.

ఈ క్రమంలోనే బస్సుయాత్ర, రోడ్‌ షోలను విజయవంతం చేసేందుకు సర్వశక్తులూ ఒడ్డుతున్నారని.. నియోజకవర్గాల్లో తమ సత్తా చూపాలని ఎమ్మెల్యేలు, ఇన్‌చార్జులు భావిస్తున్నారని చెప్తున్నారు. 

కాంగ్రెస్, బీజేపీపై విమర్శనా్రస్తాలతో.. 
జాతీయ పార్టీలు కాంగ్రెస్, బీజేపీలను లక్ష్యంగా చేసుకుని కేసీఆర్‌ విమర్శనాస్త్రాలు సంధిస్తుండటం.. తన ప్రసంగాల్లో వ్యవసాయం, రైతుల సమస్యలను ప్రస్తావిస్తుండటం ఆకట్టుకుంటోందని బీఆర్‌ఎస్‌ వర్గాలు చెప్తున్నాయి. రుణమాఫీ, రైతుబంధు, వరికి రూ.500 బోనస్, విద్యుత్, తాగునీరు, సాగునీటి సమస్యలను ఎత్తిచూపుతూ.. బీఆర్‌ఎస్‌ హయాంలో తాము చేపట్టిన చర్యలను వివరిస్తూ.. కేసీఆర్‌ చేస్తున్న ప్రసంగాలు జోష్‌ నింపుతున్నాయని అంటున్నాయి. ముఖ్యంగా బీఆర్‌ఎస్‌కు ఎక్కువ ఎంపీ సీట్లు ఇస్తే.. రాష్ట్రంలోని కాంగ్రెస్‌ సర్కారు మెడలు వంచి హామీలు అమలు చేయిస్తామని చెప్పడం ప్రభావం చూపుతోందని చెప్తున్నాయి. 

ఎక్కువ ఎంపీ సీట్లు సాధిస్తామనే ధీమా! 
లోక్‌సభ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌కు ఒక్క సీటు కూడా రాదంటూ కాంగ్రెస్, బీజేపీ రెండూ కూడా ప్రచార ఆరంభంలో విమర్శలు చేశాయి. కానీ కేసీఆర్‌ బస్సుయాత్ర, ప్రజా స్పందనతో ఆ అభిప్రాయాన్ని మార్చేశారన్న వాదన వినిపిస్తోంది. మొదట్లో బీఆర్‌ఎస్‌కు 8 సీట్లలో సానుకూలత ఉందని చెప్పిన కేసీఆర్‌.. ఇప్పుడు 12 సీట్ల వరకు వస్తాయని చెప్తుండటం గమనార్హం. ఈసారి కేంద్రంలో ఏ కూటమికీ స్పష్టమైన మెజారిటీ వచ్చే అవకాశం లేదని, బీఆర్‌ఎస్‌కు ఎక్కువ ఎంపీ సీట్లు ఇస్తే సంకీర్ణ ప్రభుత్వంలో కీలకపాత్ర పోషిస్తామని కూడా అంటున్నారు. ఈ క్రమంలో రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వంపై మొదలైన వ్యతిరేకత తమకు అనుకూలిస్తుందని బీఆర్‌ఎస్‌ నేతలు చెప్తున్నారు. కొన్ని సర్వే సంస్థలు బీఆర్‌ఎస్‌కు 8 నుంచి 12 సీట్లు వస్తాయని చెప్తున్నాయని ఉదహరిస్తున్నారు. 

ఈసీ నిషేధంతో కాస్త లాభమే! 
కేసీఆర్‌ ఎన్నికల ప్రచారంపై ఎన్నికల కమిషన్‌ విధించిన 48 గంటల నిషేధం కూడా బీఆర్‌ఎస్‌కు కాస్త అనుకూల పరిస్థితిని సృష్టించిందని ఆ పార్టీ వర్గాలు చెప్తున్నాయి. బీఆర్‌ఎస్‌ పట్ల, కేసీఆర్‌ పట్ల కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారనే అభిప్రాయాన్ని ఈ చర్య కలిగించిందని అంటున్నాయి. దీనిపై ప్రజల్లో బీఆర్‌ఎస్‌ పట్ల పెద్ద ఎత్తున సానుకూల చర్చ జరిగిందని.. పార్టీ శ్రేణుల్లోనూ పట్టుదలను పెంచిందని  వివరిస్తున్నాయి.  

ఈసీ నిషేధంతో కాస్త లాభమే! 
కేసీఆర్‌ ఎన్నికల ప్రచారంపై ఎన్నికల కమిషన్‌ విధించిన 48 గంటల నిషేధం కూడా బీఆర్‌ఎస్‌కు కాస్త అనుకూల పరిస్థితిని సృష్టించిందని ఆ పార్టీ వర్గాలు చెప్తున్నాయి. బీఆర్‌ఎస్‌ పట్ల, కేసీఆర్‌ పట్ల కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారనే అభిప్రాయాన్ని ఈ చర్య కలిగించిందని అంటున్నాయి. దీనిపై ప్రజల్లో బీఆర్‌ఎస్‌ పట్ల పెద్ద ఎత్తున సానుకూల చర్చ జరిగిందని.. పార్టీ శ్రేణుల్లోనూ పట్టుదలను పెంచిందని వివరిస్తున్నాయి.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement