ఫాంహౌస్‌లో కేటీఆర్, హరీశ్‌తో భేటీలో కేసీఆర్
లోక్‌సభ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై దిశానిర్దేశం
సాక్షి, హైదరాబాద్: లోక్‌సభ ఎన్నికల్లో 9 నుంచి 12 స్థానాల్లో బీఆర్‌ఎస్ గెలుస్తుందని పార్టీ అధినేత కేసీఆర్ ధీమా వ్యక్తం చేశారు. ఇందుకోసం వ్యూహాత్మకంగా ముందుకు సాగాలని ఆయన స్పష్టం చేశారు. శనివారం ఎర్రవల్లిలోని ఫాంహౌస్‌లో కేసీఆర్‌తో మాజీ మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావు సమావేశమై కవిత అరెస్టు, ఢిల్లీ పరిణామాలను వివరించారు. దీంతో పార్టీపరంగా చేయాల్సిన న్యాయ, రాజకీయ పోరాటంపై కేసీఆర్ వారికి దిశానిర్దేశం చేశారు. అనంతరం రాష్ట్రంలోని రాజకీయ పరిస్థితులు, కాంగ్రెస్, బీజేపీ ఎత్తుగడలపై చర్చించారు.
పోటీ చేసే పార్టీ అభ్యర్థుల ఎంపిక పూర్తయినందున అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించారు. బీఆర్‌ఎస్ లక్ష్యంగా కాంగ్రెస్, బీజేపీ అమలు చేస్తున్న ఎత్తుగడలను విశ్లేషించారు. ప్రస్తుత పరిస్థితుల్లో కనీసం 12 నుంచి 14 స్థానాల్లో బీఆర్‌ఎస్ ప్రధాన ప్రత్యర్థిగా ఉంటుందని అంచనా వేసిన కేసీఆర్.. 9 నుంచి 12 స్థానాల్లో బీఆర్‌ఎస్‌కు గెలుపు అవకాశాలు ఉన్నాయని ధీమా వ్యక్తం చేశారు. సామాజిక కోణంలో అభ్యర్థుల ఎంపిక సంతృప్తికరంగా ఉందని, ఈ పరిస్థితుల్లో పార్టీ యంత్రాంగం పకడ్బందీగా పనిచేసేలా ప్రణాళికలతో ముందుకు వెళితే విజయం సాధించవచ్చని నేతలు భావించినట్లు సమాచారం.
బహిరంగ సభలకు కేసీఆర్..
లోకసభ నియోజకవర్గాలవారీగా రెండు లేదా మూడు బహిరంగ సభలకు కేసీఆర్ హాజరు కావాలని ఈ భేటీలో నిర్ణయించారు. బస్సు యాత్ర సాధ్యాసాధ్యాలపై చర్చ జరిగింది. సభలు, సమావేశాల షెడ్యూల్, ఇన్‌చార్జిల నియామకంపై కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. మీడియా, సోషల్ మీడియా వ్యూహంపైనా పలు సూచనలు చేశారు. ఎమ్మెల్యేలు, కీలక నేతలు పార్టీని వీడిన చోట ఇన్‌చార్జీలను నియమించాలని నిర్ణయించారు. పార్టీ సమన్వయ బాధ్యతలను కేటీఆర్, హరీశ్‌లకు అప్పగించారు. స్వయంగా వివిధ మీడియా మాధ్యమాల్లో కేసీఆర్‌తో ప్రత్యక్ష ప్రసారాలు ఏర్పాటు చేయాలని కూడా నిర్ణయించారు. సిర్పూర్ కాగజ్‌నగర్ నియోజకవర్గ ఎన్నికల సమన్వయకర్తగా ఎమ్మెల్సీ దండే విఠల్‌ను బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నియమించారు.
రాబోయే కాలంలో ప్రాంతీయ పార్టీలదే హవా..
లోక్‌సభ ఎన్నికల తర్వాత కేంద్రంలో కాంగ్రెస్ పని అయిపోతుందని.. కేంద్రంలో బీజేపీకి కూడా ఈసారి చివరి అవకాశం ఉండొచ్చని... భవిష్యత్తులో ప్రాంతీయ పార్టీలదే హవా అని బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ అభిప్రాయపడ్డారు. శనివారం ఎర్రవెల్లి ఫాంహౌస్‌లో సికింద్రాబాద్ పార్లమెంట్ ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలతో భేటీలో కేసీఆర్ మాట్లాడుతూ రాష్ట్ర కాంగ్రెస్‌లో తన్నులాటలు మొదలయ్యాయని ఎద్దేవా చేశారు.
ఇచ్చిన హామీలు అమలు చేయకపోవడంతో ప్రజల్లో వ్యతిరేకత మొదలైందని... కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇతరులు కూల్చే అవసరం లేదని, వాళ్లకు వాళ్లే కూల్చుకుంటారని వ్యాఖ్యానించారు. బీఆర్‌ఎస్ నుంచి పోయేవాళ్లను పోనివ్వాలని.. బీఆర్‌ఎస్‌లో జెండా మోసిన వారికే ప్రాధాన్యత ఇస్తామన్నారు. ఖైరతాబాద్ అసెంబ్లీ బాధ్యతలను మన్నె గోవర్ధన్ చూసుకోవాలని కేసీఆర్ సూచించారు. ఈ సమావేశంలో కేటీఆర్, ఎమ్మెల్యేలు తలసాని, మాగంటి గోపీనాథ్, ముఠాగోపాల్, కాలేరు వెంకటేష్, నాయకులు దాసోజు శ్రవణ్, మన్నెగోవర్ధన్‌రెడ్డి, కార్పొరేటర్ మన్నె కవిత తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment