Ramagundam constituency
-
ప్రశ్నిస్తే.. గొంతు నొక్కారు!
సాక్షి, పెద్దపల్లి: చేనేత కార్మికులకు అన్యాయం చేస్తున్నారని తాను మాట్లాడితే, ప్రభుత్వ తీరును ప్రశ్నిస్తే.. తన గొంతు నొక్కేశారని బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కె.చంద్రశేఖర్‌రావు పేర్కొన్నారు. బీజేపీ, కాంగ్రెస్ వాళ్లు కుమ్మక్కై తన ప్రచారంపై నిషేధం పెట్టించారని ఆరోపించారు. అదే ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, సీఎం రేవంత్ ఎన్నికల నిబంధనలను ఉల్లంఘించి మాట్లాడుతున్నా ఎలాంటి చర్యలూ తీసుకోవడం లేదేమని నిలదీశారు.బీజేపీ, కాంగ్రెస్‌లలో ఎవరికి ఓటేసినా.. సింగరేణిని ముంచేసి, కార్మికుల నోట్లో మట్టికొడతాయని వ్యాఖ్యానించారు. లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా కేసీఆర్ చేపట్టిన బస్సుయాత్ర.. ఈసీ పెట్టిన 48 గంటల నిషేధం అనంతరం శుక్రవారం రాత్రి రామగుండం పట్టణంలో తిరిగి మొదలైంది. ఈ సందర్భంగా నిర్వహించిన రోడ్ షోలో కేసీఆర్ ప్రసంగించారు. వివరాలు ఆయన మాటల్లోనే.. ‘‘నిషేధించిన నా గొంతు 48 గంటల తర్వాత మాట్లాడుతోంది. నేను ఏం చేశానని నా గొంతును నొక్కేశారు. చేనేత కార్మికులకు ఆర్డర్స్ ఇవ్వడం లేదని, గత ప్రభుత్వం ఇచ్చిన ఆర్డర్ల బిల్లులు రూ.375 కోట్లు విడుదల చేయడం లేదని, ఆత్మహత్యలు చేసుకుంటున్నారని మా పార్టీ నేతలు ప్రశ్నిస్తే.. ఓ కాంగ్రెస్ నాయకుడు.. ‘ఇన్ని రోజులు దొబ్బితిన్నది చాలలేదా? పొయి నిరో«ద్లు, పాపడాలు అమ్ముకోండి’ అన్నడు. మీకు చేనేత కార్మికులు అంత చులకనగా కనపడుతున్నారా? అధికారంలో ఉన్న మీరు ఇలా మాట్లాడొచ్చా.. అని కోపంలో ఒక్కమాట మాట్లాడిన. వాళ్ల మాటలు ఈసీకి కనిపించవు కేసీఆర్ బస్సుయాత్ర చేపడితే కాంగ్రెస్, బీజేపీలకు గుండెలు వణుకుతున్నాయి. వాళ్లు కుమ్మకై నన్ను ఆగబట్టేందుకు నాపై నిషేధం పెట్టారు. రాజకీయాల్లో మతం గురించి మాట్లాడటం చాలా పెద్ద తప్పు. ఎన్నికల నిబంధనలకు విరుద్ధం. కేంద్ర మంత్రి అమిత్ షా రోజూ దేవుడి బొమ్మను చేతిలో, నెత్తిన పెట్టుకుని మాట్లాడితే ఎన్నికల సంఘానికి కనిపించదు. డైరెక్టుగానే హిందువులు, ముస్లింలని దేశ ప్రధాని మోదీ మాట్లాడినా కనిపించదు.రాష్ట్ర సీఎంని ప్రజ లకు ఇచ్చిన వాగ్ధానాల అమలు ఏదని మేం అడిగితే.. గుడ్లు పీకి గోళీలు ఆడుతం, పేగులు తీసి మెడలో వేసుకుంటం, పండబెట్టి తొక్కుతం అంటే సభ్యతగా ఉందా? కానీ చేనేత కార్మికులకు అన్యాయం చేస్తున్నారని నేను మాట్లాడితే.. నా గొంతు నొక్కేశారు. ప్రజలు ఈ విషయాన్ని గుర్తించారు. పంటలు ఎందుకు ఎండాయి? ఐదు నెలల కింద రాష్ట్రం ఎట్లా ఉండే.. ఇప్పుడు ఎట్లా ఉంది? ఎవరి చేతకానితనం దీనికి కారణం? ఒక్క పెద్దపల్లి జిల్లాలోనే 50వేల ఎకరాలకుపైగా పంటలు ఎండిపోయాయి. గత పదేళ్లలో ఎప్పుడైనా పంటలు ఎండాయా? గత తొమ్మిదేళ్లు కడుపు నిండా కరెంటు ఉండేది. ఇప్పుడు కరెంట్ కోతలు మొదలయ్యాయి.ఈ కోతలు ఎవరు పెట్టారో ప్రజలు ఆలోచించాలి. గతంలో గోదావరిలో పైసలు వేయాలంటే నీళ్లు వెతికేలా ఉండేది. అలాంటి గోదావరిని సజీవంగా చేశా. ప్రతి ఇంటికి నల్లా కనెక్షన్ ఇచ్చినం. ఇప్పుడు ఎందుకు రోజు తప్పి రోజు నీళ్లు వస్తున్నాయో ప్రజలు ఆలోచించాలి. హామీల అమలు ఏది? కాంగ్రెస్ హామీలు అమలు చేయకుండా తప్పించుకుంటోంది. రైతు రుణమాఫీ అయిందా? రైతు కూలీలకు రూ.15 వేలు ఎక్కడ? కల్యాణలక్ష్మి కింద తులం బంగారం ఎక్కడ? మహిళలకు నెలకు రూ.2,500 వస్తున్నాయా? మహిళలకు ఫ్రీ బస్ పెట్టారు. సంతోషమే. మరి ఆటో కార్మికులు నష్టపో యి ఆత్మహత్యలు చేసుకుంటుంటే.. ఆదుకోరా? ఆటోకార్మికులకు న్యాయం జరగాల్సిందే. వారి తరఫున బీఆర్ఎస్ పో రాడుతుంది. సీఎం ఏ ఊరికి పోతే ఆ ఊరి దేవుడి మీద ఒ ట్టేస్తున్నారు. పనిచేసేటోడు ఎవడైనా ఒట్టు పెట్టుకుంటడా? పెద్ద ప్రమాదం రాబోతున్నా.. సీఎం మాట్లాడట్లేదు.. ఇప్పుడున్న సీఎం కృష్ణా నదిని తీసుకెళ్లి కేఆర్ఎంబీకి అప్పజెప్పిండు. గోదావరి నీళ్లు ఎత్తుకుపోతా, తమిళనాడు, కర్ణాటకలకు ఇస్తానని ప్రధాని మోదీ అంటుంటే.. చప్పుడు చేయడం లేదు. నేను సీఎంగా ఉన్నప్పుడు ఇదే ప్రతిపాదన తెస్తే.. నా ప్రాణం ఉన్నంత వరకు నీళ్లు తీసుకుపోనివ్వనని చెప్పిన. మరి ఈ ముఖ్యమంత్రి మౌనం వెనుక మతలబేంటో ప్రజలు ఆలోచించాలి. కేంద్రంలో వచ్చేది సంకీర్ణమే.. దేశం అప్పుల పాలైంది. రూపాయి విలువ పడిపోయింది. మోదీ కంటే ముందున్న 14 మంది ప్రధానుల కాలంలో ఎన్నడూ ఇంత తక్కువకు పడిపోలేదు. పబ్లిక్ సెక్టార్ నాశనమైంది. అన్నీ ప్రైవేటీకరణ చేస్తున్నారు. కార్మికులు రోడ్డున పడుతున్నారు. కేంద్రంలో బీజేపీకి 200 సీట్లు కూడా వచ్చేలా లేవు. వచ్చేది సంకీర్ణ ప్రభుత్వమే. తెలంగాణలో 14 మంది బీఆర్ఎస్ ఎంపీలను గెలిపిస్తే.. మన హక్కులను, మన సింగరేణిని కాపాడుకోవచ్చు.అరచేతిలో వైకుంఠం చూపి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌కు కర్రువాల్చి వాత పెట్టాలి..’’ అని కేసీఆర్ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్, జడ్పీ చైర్మన్ పుట్ట మధు, మాజీ ఎమ్మెల్యేలు కోరుకంటి చందర్, దాసరి మనోహర్‌రెడ్డి, బాల్క సుమన్, ఎమ్మెల్సీ భానుప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. సింగరేణిని ముంచిందే కాంగ్రెస్ సింగరేణి కార్మికులు ఆలోచించాలి. మంచిగా ఉన్న సింగరేణిని ఒకప్పుడు నిండా ముంచిందే కాంగ్రెస్ పార్టీ. వాస్తవానికి సింగరేణి 100శాతం మన దగ్గరే ఉండే. కేంద్రం దగ్గర అప్పులు తెచ్చి, అది తీర్చలేక 49శాతం వాటాను అప్పజెప్పింది ఈ కాంగ్రెస్ పార్టీయే. మేం సింగరేణికి లాభాలు తేవడానికి, కార్మికుల కోసం ఎన్నో మంచి పనులు చేశాం. సీపీఐ, సీపీఎం నాయకులను ఒక్కటే ప్రశ్న అడుగుతున్నా.. ధైర్యముంటే సమాధానం చెప్పాలి, సీఎంతో సమాధానం చెప్పించాలి.నాడు నష్టాల్లో ఉన్న సింగరేణిని లాభాల్లోకి తెచ్చింది మేం కాదా? తెలంగాణ ప్రభుత్వం వచ్చాక 19వేల మంది కార్మికుల పిల్లలకు ఉద్యోగాలు ఇచ్చాం. మెడికల్ కాలేజీ పెట్టి కార్మికుల పిల్లలకు 5శాతం రిజర్వేషన్ కలి్పంచాం. సింగరేణిని లాభాల్లోకి తెచ్చేందుకు డైరెక్టర్లను ఆ్రస్టేలియా, ఇండోనేషియాలకు పంపి.. అక్కడ బొగ్గు గనులు తీసుకుని వెలికితీయాలనే ప్రయత్నం చేశాం. కానీ కేంద్ర ప్రభుత్వం సింగరేణిని అదానీకి అప్పజెప్పి మన కార్మికుల నోట్లో మట్టి కొట్టాలని చూస్తోంది. బీజేపీ, కాంగ్రెస్‌లలో ఎవరిని గెలిపించినా సింగరేణి ప్రాంతాలు బొగ్గు అయ్యే పరిస్థితి. మీరు లేని లోటు కనిపిస్తోందిసారూ మీరు సీఎంగా ఉన్నప్పుడు మంచిగుండె. ఇప్పుడు మీరు లేని లోటు కనిపిస్తోంది. పచ్చగా ఉండే పల్లెలు మళ్లీ ఎండిపోతున్నాయి. మాకు దిక్కు, దిశ మీరే.. మీరు మళ్లీ వస్తేనే మా బతుకులు మారుతాయి. – రేణుక, గృహిణిమళ్లీ కరువు వచ్చిందిమీ పాలనలో పచ్చని పొలాలు చూసినం. ఇప్పుడు ఎండిపోయిన పంటలు కనిపిస్తు న్నాయి. మీ పాలన లేని లోటు కనిపిస్తోంది. రైతుబంధు రాలే దు. నీళ్ల కరువు వచ్చింది. మీరు రావాలె. మునుపటిలా కావాలె.. – బొల్లెడ సడవలి, భూపాలజిల్లామాకు అండగా నిలవాలికొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో నేడు కరువు ప్రారంభమైంది. మీ పాలనలో కల్యాణలక్ష్మి, దళి త బంధు పథకాలు వచ్చినయి. ఇప్పుడు వాటిని నిలిపివేశారు. మీ పాలనలో అందరికీ న్యాయం జరి గింది. ఇప్పుడు కష్టాలు మొదలయ్యాయి. మాకు అండగా ఉండాలి.– కృష్ణప్రసాద్, యువకుడు -
కారెక్కనున్న సోమారపు?
గోదావరిఖని: రామగుండం నియోజకవర్గానికి చెందిన కీలక నేత, మాజీ ఎమ్మెల్యే సోమారపు సత్యనారాయణ కారెక్కనున్నట్లు తెలుస్తోంది. మంగళవారం హైదరాబాద్‌లో ఆయన మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావుతో వేర్వేరుగా భేటీ అయినట్లు సమాచారం. తనకు పార్టీ టికెట్ ఇస్తే కచ్చితంగా గెలుస్తానని.. ప్రస్తుతం పోటీలో ఉంటున్న నాయకుడికి ఎమ్మెల్సీ పదవి ఇవ్వాలని సోమారపు ప్రతిపాదించినట్లు తెలిసింది. కొద్దిరోజుల క్రితం కాంగ్రెస్ ఎమ్మెల్యే టికెట్ కోసం ఢిల్లీ వెళ్లిన ఆయనకు.. పార్టీ అధిష్టానం నుంచి సానుకూల సాంకేతాలు రాలేదు. దీంతో నియోజకవర్గానికి చేరుకొని స్వతంత్ర అభ్యర్థిగా బరిలో దిగేందుకు సిద్ధమయ్యారు. అందుకు అనుగుణంగా ప్రచారం కూడా చేపట్టారు. ఆయన మంగళవారం అకస్మాత్తుగా ప్లేట్ ఫిరాయించినట్లు ప్రచారం జరుగుతోంది. అయితే బీఆర్ఎస్ మాత్రం ఆ నాయకుడికి ఎమ్మెల్సీ ఇచ్చేందుకు సుముఖత వ్యక్తం చేసినట్లు చెబుతున్నారు. కాంగ్రెస్, టీడీపీ,బీఆర్ఎస్, బీజేపీ.. మళ్లీ బీఆర్ఎస్.. 1998లో జరిగిన రామగుండం మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా రాజకీయ అరంగేట్రం చేసిన సోమారపు... ఆ తర్వాత 2004 అసెంబ్లీ ఎన్నికల్లో మంథని టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడారు. అటునుంచి తిరిగి కాంగ్రెస్‌లో చేరి 2009 అసెంబ్లీ ఎన్నికల్లో రామగుండం నుంచి గెలుపొందారు. తెలంగాణ రాష్ట్ర ఉద్యమ నేపథ్యంలో బీఆర్ఎస్ (నాటి టీఆర్ఎస్)లో చేరి 2014 అసెంబ్లీ ఎన్నికల్లో రామగుండం నుంచి మళ్లీ గెలిచారు. కానీ 2018 ఎన్నికల్లో మాత్రం ఓటమిపాలయ్యారు. అనంతరం బీజేపీలో చేరారు. ఆ తర్వాత బీజేపీకి రాజీనామా చేసి ఇండిపెండెంట్‌గా బరిలో ఉంటానని ప్రకటించారు. ఆ తర్వాత కొద్దిరోజులకే ఢిల్లీకి వెళ్లి కాంగ్రెస్ నేతలను కలిశారు. ఎమ్మెల్యే టికెట్‌పై కాంగ్రెస్ నుంచి గ్రీన్‌సిగ్నల్ రాకపోవడంతో మళ్లీ ఇండిపెండెంట్‌గా బరిలో ఉంటూ ప్రచారం చేశారు. మంగళవారం అకస్మాత్తుగా హైదరాబాద్ వెళ్లి బీఆర్ఎస్ అధిష్టానంతో చర్చలు జరిపారు. -
బీఆర్ఎస్లో రసవత్తర రాజకీయం.. కందులకు కవిత అభయహస్తం!
స్వపక్షమా, ప్రతిపక్షమా అనవసరం. ఏ పార్టీ నుంచి గెలిచినా మనకు లాయల్‌గా ఉంటారా.. అవసరమైతే మనవైపు మొగ్గేవాళ్లేనా అనేదే కొత్త తరహా రాజకీయం. తెలంగాణాలో అలాంటి రాజకీయాలకు కేరాఫ్‌గా మారుతోంది రామగుండం. ఈ క్రమంలో గత ఎన్నికల తర్వాత జరిగిన సేమ్ సీనే మళ్లీ రిపీట్ అవుతుందా అన్నది రామగుండం రాజకీయాల్లో ఆసక్తికరంగా మారింది. తెలంగాణలో రామగుండం రాజకీయాలు కొద్దిగా భిన్నంగా కనిపిస్తాయి. అందుకు గత ఎన్నికలే ఓ ఉదాహరణ అయితే.. ఈ ఎన్నికల్లో కూడా అదే సీన్ పునరావృతమయ్యే అవకాశాలు కనిపించడమే అందుకు కారణం. గత ఎన్నికల్లో రామగుండం అధికార బీఆర్ఎస్ అభ్యర్థిగా సోమారపు సత్యనారాయణ బరిలోకి దిగినా.. ఏఐఎఫ్బీ నుంచి సింహం గుర్తుపై ప్రస్తుత సిట్టింగ్ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ పోటీలో ఉండి గెల్చారు. కానీ, ఆయన ఆ తర్వాత పూర్తిగా గులాబీ కండువా కప్పుకుని బీఆర్ఎస్ ఎమ్మెల్యే తరహాలో మారిపోయారు. అంతేకాదు, సోమారపుపై నాడున్న వ్యతిరేకత.. చందర్‌పై ఉన్న సానుభూతి పవనాల నేపథ్యంలో అధికార బీఆర్ఎస్ పెద్దలు కూడా రాజకీయంలో భాగంగా చందర్‌ను ఒకింత ప్రోత్సహించినట్టుగా కూడా వార్తలు గుప్పుమన్నాయి. ఈ విషయంలో ఇప్పటికీ ప్రస్తుత బీజేపీ నేత సోమారపు సత్యనారాయణలో ఒకింత బాధ కనిపిస్తూనే ఉంటుంది. కేసీఆర్ లిస్ట్ ఫైనల్ కాదు.. గత ఎన్నికల్లో సిట్టింగ్ ఉండగా.. బూమ్‌లో ఉన్న మరో నేతను ప్రోత్సహించినట్టే ఈసారి కూడా జరుగబోతుందా అన్నదే ఇప్పుడు ఉత్కంఠ రేపుతున్న అంశం. చాలామంది సిట్టింగ్ ఎమ్మెల్యేలనే మళ్లీ కేసీఆర్ అభ్యర్థులుగా ప్రకటించినా.. బీఫామ్ ఇచ్చేనాటికి పరిస్థితుల్లో మార్పు ఉండొచ్చన్న చర్చ జరుగుతోంది. ఈ క్రమంలో అభ్యర్థులుగా ప్రకటించినవారు.. గులాబీబాస్ ప్రకటన తర్వాత నియోజకవర్గాల్లో ఎలా ఉంటున్నారు.. అందరినీ కలుపుకుపోతున్నారా అనేది అంతర్గత సర్వేలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ఇప్పటికే రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్‌పై అసంతృప్త నేతలు పెద్దఎత్తున తిరుగుబావుటా ఎగురేయడం.. ఏకంగా రెండుసార్లు ఇద్దరు మంత్రులు కేటీఆర్, కొప్పుల ఈశ్వర్ చర్చలు జరిపితేనేగానీ.. ఓ కొలిక్కి రావడం జరిగింది. సింహం గుర్తు కలిసొచ్చేనా? అయితే, అదంతా తాత్కాలికమేనని.. ఇంకా నివురుగప్పిన నిప్పులాగా సిట్టింగ్ చందర్‌పై అసంతృప్తి అలాగే ఉందనే చర్చ ఉంది. అసంతృప్త నేతల వైఖరీ రామగుండంలో ఇంకా అలాగే కనిపిస్తోంది. ఈ క్రమంలో అసంతృప్త నేతల్లో కీలకంగా వ్యవహరిస్తున్న పాలకుర్తి జెడ్పీటీసీ కందుల సంధ్యారాణి ఈసారి చందర్‌కు సపోర్ట్ చేసే పరిస్థితే లేదని తేల్చేశారు. తాను ఇండిపెండెంట్‌గా లేకుంటే, అవకాశం దొరికితే గతంలో ప్రస్తుత సిట్టింగ్‌కు సెంటిమెంట్‌గా కలిసివచ్చిన సింహం గుర్తుపైనైనా పోటీ చేయాలని ఆమె ఉవ్విళ్లూరుతున్నారు. ఈ క్రమంలో అకేషన్నూ తనకనుకూలంగా మార్చుకుంటూ ముందుకెళ్తున్న కందుల సంధ్యారాణి.. రాఖీ పండుగ నేపథ్యంలో కార్మికసంఘాల నాయకులు, కార్మికులకు పెద్దఎత్తున రాఖీలు కట్టి సోదర భావం సెంటిమెంట్‌నూ రగిల్చారు. ఈ నేపథ్యంలో.. కందులకు కవిత అండదండలు కూడా ఉన్నట్టుగా ప్రచారం ఇప్పుడు ఊపందుకుంది. కందులకు కవిత హామీ.. రామగుండం వంటి కార్మిక క్షేత్రంలో అధికారాన్ని అస్సలు విడిచిపెట్టుకోవడానికి అధికారపార్టీ సిద్ధంగా లేనట్టే కనిపిస్తోంది. ఇప్పటికే కాంగ్రెస్‌లో రామగుండం కీలక నాయకులుగా వ్యవహరిస్తున్న బాబర్ సలీమ్ పాషా, హెచ్ఎమ్ఎస్ కీలక నేతైన రియాజ్ అహ్మద్ వంటివాళ్లనూ తమవైపు లాక్కోవడానికి అన్ని ప్రయత్నాలూ చేస్తోంది. మరోవైపు సిట్టింగ్ చందర్‌పై అసమ్మతి నేతలు వ్యక్తం చేసిన అసంతృప్తే ఇంకా కనిపిస్తే.. సమాంతరంగా అదే స్థాయిలో ప్రజామోదం ఉన్న నేతలను ప్రోత్సహించేందుకూ అధికార బీఆర్ఎస్ సిద్ధంగా ఉండి.. గత ఎన్నికల సీన్‌ను రిపీట్ చేసేందుకు యత్నిస్తోందనే టాక్ నడుస్తోంది. ఈ క్రమంలోనే ఇప్పుడు ఎమ్మెల్యేతో పోటీ పడుతూ సై అంటే సై అంటున్న కందుల సంధ్యారాణికి కవిత అభయహస్తమిచ్చిందని.. ఎక్కడా ఎమ్మెల్యేపైగానీ, పార్టీపైగానీ అనుచిత వ్యాఖ్యలు చేయకుండా నీ ప్రచారం నువ్వు చేసుకుపో అని భరోసా ఇచ్చినట్టుగా ఒక ప్రచారమైతే జరుగుతోంది. దీంతో రామగుండం రాజకీయం మొత్తం రాష్ట్రంలోనే ఓ భిన్నమైన ఒరవడితో సాగుతుండటం ఇప్పుడు ఆసక్తిని రేకెత్తిస్తోంది. -
భంగపడ్డ మహిళా నేత ‘రాఖీ’ అస్త్రం.. వర్క్‌వుట్ అవుతుందా?
ప్రతీ పండుగా ఓ సెంటిమెంటే.. ఎన్నికల కాలంలో ప్రతీ సెంటిమెంటూ ఓ రాజకీయాస్త్రమే. అలాంటి ఆసక్తికర సెంటిమెంట్ రాజకీయాలకు ఇప్పుడు రాఖీ పండుగా ఓ అస్త్రంగా మారుతోందక్కడ. బీఆర్ఎస్ టిక్కెట్ ఆశించి భంగపడటంతో పాటు.. సిట్టింగ్‌పై తిరుగుబావుటా ఎగరేసిన ఆ మహిళా నేత.. అవసరమైతే బీఆర్ఎస్ రెబల్‌గా.. ఇండిపెండెంట్‌గా బరిలో నిలవాలని యోచిస్తున్నారట. అందుకే.. ఇప్పుడక్కడ రాఖీలు కడుతూ.. కార్మిక క్షేత్రంలో సోదరభావాన్ని పెంచే యత్నం చేస్తోంది ఆ మహిళామణి. రామగుండంలో రాజకీయాలు చాలాకాలంగా హాట్ హాట్‌గా సాగుతున్నాయి. ప్రస్తుత సిట్టింగ్ ఎమ్మెల్యే చందర్‌కు టిక్కెట్ ఇవ్వొద్దని కొందరు అసమ్మతి నేతలు తిరుగుబాటు ప్రకటించినా.. మంత్రి కేటీఆర్ ఆశీస్సులతో గులాబీ బాస్ చందర్‌కే టిక్కెట్ కన్ఫర్మ్ చేశారు. అయితే, మంత్రుల బుజ్జగింపులతో కొంత సద్దుమణిగినట్టు తాత్కాలికంగా కనిపించినా.. అసమ్మతి నేతల్లో ఆ జ్వాలలు మాత్రం ఆరడం లేదు. అందులో పాలకుర్తి జెడ్పీటీసీ, బీఆర్ఎస్ ఆశావహ నేత కందుల సంధ్యారాణిది కూడా కీలకపాత్రే. అయితే, చందర్‌కు టిక్కెట్ కేటాయించాక.. ఆయన అనుచరులు ఆమెను కించపర్చే విధంగా పోస్టులు పెడుతున్నారంటూ వారం క్రితం సోషల్ మీడియాలో తన ఆవేదన వ్యక్తం చేస్తూ వీడియోస్ కూడా పోస్ట్ చేసిన సంధ్యారాణి.. ఇప్పుడు రామగుండంలో బీఆర్ఎస్ రెబల్‌గా బరిలోకి దిగేందుకు సిద్ధమయ్యారు. ( ఫైల్ ఫోటో ) అవసరమైతే ఇండిపెండెంట్‌గా కూడా బరిలో ఉండేందుకు సిద్ధపడుతున్న నేపథ్యంలో.. సంధ్యారాణి ఇప్పుడు రాఖీపండుగ సెంటిమెంట్‌ను ఉపయోగించుకుంటోంది. కార్మిక క్షేత్రమైన సింగరేణిలో వివిధ సంఘాలకు సంబంధించిన నాయకులతో పాటు.. ప్రతీ గనిలో పర్యటిస్తూ తనకు మద్దతు ప్రకటించాలంటూ రాఖీ కడుతూ సోదరభావంతో కూడిన సెంటిమెంట్ ను వారిలో తీసుకొస్తున్నారు సంధ్యారాణి. చదవండి: అత్తమీద కోపం.. అల్లుడిపై ప్రతాపం మొత్తంగా ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ రాజకీయాలు రంజుగా మారుతున్న క్రమంలో.. కొంత అసమ్మతి జ్వాలలు ఎగిసిపడుతున్న చోట అవి మరింత రక్తి కట్టిస్తున్నాయి. మరోవైపు నేతలు ఎవరికివారు ప్రజల మద్దతును కూడగట్టి వాటిని ఓట్లుగా మల్చుకునే క్రమంలో ప్రతీ అంశాన్నీ తమకనుకూలమైన అస్త్రంగా మల్చుకునే యత్నాలు చేస్తూనే ఉన్నారు. పైగా ఇండిపెండెంట్లకు కూడా పెద్దపీట వేస్తూ.. ఎమ్మెల్యేలను మార్చే సంప్రదాయాన్ని కొనసాగిస్తున్న కోల్ బెల్ట్ ఏరియా రామగుండంలో ఆ సెంటిమెంట్‌ను అందిపుచ్చుకునేందుకు.. ఇప్పుడు రాఖీ సెంటిమెంట్‌తో ముందుకొచ్చారు కందుల సంధ్యారాణి. -
గులాబీలో సీటు హీటు.. కేటీఆర్, కవిత మధ్య పొలిటికల్ పోరు!
కోల్ బెల్ట్ ఏరియా నుంచి ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత బరిలోకి దిగనున్నారా?. ఎమ్మెల్యేను మార్చాల్సిందే అంటున్న రామగుండం అసమ్మతి నేతలు కవితకు జై కొడుతున్నారా?. ఎమ్మెల్సీ కవితను బరిలో దించండి లేదా మాలో ఒకరికి సీటివ్వండని కోరుతున్న అసమ్మతి నేతల మాట కేసీఆర్ వింటారా?. సిట్టింగ్ ఎమ్మెల్యే మంత్రి కేటీఆర్‌ను నమ్ముకుంటే.. అసమ్మతి నేతలు ఆయన సోదరి కవితను నమ్ముకున్నారా?. బొగ్గుబావుల్లో పరోక్షంగా అన్నాచెల్లెళ్ల పోరుకు తెరలేవనుందా?. అసలు రామగుండం గులాబీ కోటలో ఏం జరుగుతోంది?.. రామగుండం అంటే నిప్పుల కొలిమిలా ఉంటుంది. అక్కడి రాజకీయాలు కూడా కొద్ది రోజుల నుంచి వేసవిని మించి మించి హీటెక్కుతున్నాయి. అధికార బీఆర్ఎస్ పార్టీలోని అంతర్గత సంక్షోభం తారాస్థాయికి చేరింది. సిట్టింగ్ ఎమ్మెల్యే కోరుకంటి చందర్‌పై.. అసమ్మతి వర్గం తిరుగుబాటు జెండా ఎగురేసింది. తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం ప్రధాన కార్యదర్శి మిరియాల రాజిరెడ్డి మరో నలుగురు నాయకులు ఈ ఎమ్మెల్యే మాకొద్దంటూ ఉద్యమం లేవదీసారు. ముచ్చటగా మూడోసారి కేసీఆర్‌నే సీఎం చేయాలంటూ ప్రజా ఆశీర్వాద యాత్ర చేపట్టిన అసమ్మతి నేతలు.. తమ యాత్రలో ఎక్కడా సిట్టింగ్ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ ఫోటో లేకుండా చేశారు. అదే సమయంలో జన చైతన్యయాత్ర పేరిట సిట్టింగ్ ఎమ్మెల్యే చందర్ కూడా పాదయాత్ర ప్రారంభించారు. ఇరువర్గాల మధ్య రామగుండం కేంద్రంగా బాహాబాహీకి తెరలేచి ఉద్రిక్తతకూ దారితీసింది. నేతలు ఫైర్.. పార్టీ అంతర్గత రాజకీయాలు అధిష్ఠానానికి తలబొప్పి కట్టిస్తున్నాయి. ఈ క్రమంలో మంత్రి కొప్పుల ఈశ్వర్ ఆధ్వర్యంలో.. పార్టీ నాయకత్వం అసమ్మతి నేతలతో ఓ సమావేశాన్ని నిర్వహించింది. కొప్పుల ఎంత నచ్చజెప్పినా చల్లబడని నేతలు.. మంత్రి కేటీఆర్‌తో సమావేశమయ్యేందుకు హైదరాబాద్ బాట పట్టారు. కానీ, అక్కడ కేటీఆర్ సమయం ఇవ్వకపోవడంతో ఆ భేటీ జరగలేదు. దీంతో మరోసారి అసమ్మతి నేతలంతా ఏకంగా రామగుండంలో ఓ ప్రెస్‌మీట్ పెట్టి.. ఈ ఎమ్మెల్యే మాకొద్దంటూ మీడియా ముఖంగా ప్రకటించేశారు. చందర్‌కు కేటీఆర్ అండ.. తెలంగాణ బొగ్గు గని సంఘం గౌరవ అధ్యక్షురాలిగా ఉన్న ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను రామగుండం నుంచి బరిలోకి దింపితే గెలిపించుకుంటామని అసమ్మతి నేతలు ప్రకటించారు. లేదంటే, తమలో ఎవరైనా ఒకరికి టిక్కెట్ ఇవ్వాలని అధిష్ఠానాన్ని డిమాండ్ చేశారు. అసమ్మతి నేతల్ని సిట్టింగ్ ఎమ్మెల్యే లైట్ తీసుకుంటున్నారు. మంత్రి కేటీఆర్ అండదండలున్న చందర్ ఆయన ఆశీస్సులతోనే ముందుకెళ్లాలని.. మళ్లీ టిక్కెట్ సాధించుకునేందుకు తన ప్రయత్నాలు తాను చేస్తున్నారు. మరోవైపు అసమ్మతి నేతలు మాత్రం మంత్రి కేటీఆర్ సోదరి ఎమ్మెల్సీ కవితను నమ్ముకున్నారు. కవిత సాహసం చేస్తారా?.. కేసీఆర్ తనయ ఎమ్మెల్సీ కవిత.. నిజామాబాద్ అర్బన్, బోధన్, కామారెడ్డి, జగిత్యాల నియోజకవర్గాల్లో ఎక్కడినుంచైనా బరిలోకి దిగొచ్చంటూ ఇప్పటికే ప్రచారం జరుగుతోంది. తాజాగా రామగుండం అసమ్మతి నేతల ప్రకటనతో.. కోల్ బెల్ట్ ఏరియా నుంచే ఎన్నికల బరిలోకి దిగుతారా అన్న చర్చ మొదలైంది. అయితే తెలంగాణ బొగ్గు గని సంఘంకు కూడా కార్మికుల నుంచి కొంత వ్యతిరేకత ఏర్పడిన నేపథ్యంలో.. అలాంటి సాహసం కవిత చేస్తారా అనే అనుమానం కలుగుతోంది. మొత్తంగా రామగుండం బరిలో నిలిచే అధికారపార్టీ అభ్యర్థి ఎవరనే ఉత్కంఠ కనిపిస్తోంది. సిట్టింగ్ ఎమ్మెల్యేకే సీటిస్తారా? లేక అసమ్మతి నేతల పంతం నెగ్గుతుందా అనే చర్చ సాగుతోంది. ఇది కూడా చదవండి: కేసీఆర్ సర్కార్‌పై బీజేపీ నేతల సంచలన ఆరోపణలు -
ఐదోసారికి కేటీఆర్ సిద్ధం.. వేములవాడ నుంచి బండి సంజయ్ బరిలోకి?
సాక్షి, పెద్దపల్లి: పెద్దపల్లి జిల్లా పారిశ్రామిక ప్రాంతం రామగుండంలో రాజకీయాలు రక్తి కట్టిస్తున్నాయి. ఎన్నికలకు ఇంకా సమయం ఉన్నా మూడు ప్రధాన పార్టీలు అప్పుడే నువ్వా నేనా అన్నట్టు ప్రచారబరిలోకి దిగాయి. వచ్చే ఎన్నికల్లో అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో సత్తా చాటేలా అన్ని పార్టీలు గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటున్నాయి. కారు జోరుకు బ్రేకులు వేయాలని కాంగ్రెస్, కమలం పార్టీలు ప్లాన్ చేస్తున్నాయి. సింగరేణి కార్మికులే ఇక్కడ గెలుపోటములు డిసైడ్ చేస్తారు. ఎత్తుకు పై ఎత్తులు రామగుండం నియోజకవర్గంలో మళ్లీ గులాబీ జెండా ఎగురవేసేలా టీఆర్ఎస్ పావులు కదుపుతోంది. మరోవైపు గులాబీ పార్టీ ఎత్తుకు బీజేపీ పై ఎత్తులు వేస్తోంది. కాంగ్రెస్ మాత్రం ఈ సారి ఎలాగైనా సత్తా చాటుతామని ధీమా వ్యక్తం చేస్తోంది. ఓటరు దేవుళ్ళను ప్రసన్నం చేసుకునేందుకు అప్పుడే ఇంటింటికి తిరుగుతూ ప్రచారం మొదలుపెట్టేశారు మూడు పార్టీల నాయకులు. టీఆర్ఎస్లో ఎమ్మెల్యే కోరుకంటి చందర్, బీజేపీలో మాజీ ఎమ్మెల్యే సోమారపు సత్యనారాయణ, కాంగ్రెస్‌లో రాజ్ ఠాగూర్ మక్కన్ సింగ్ రానున్న ఎన్నికలు సవాల్తీగాసుకుని తమ పంతం నెగ్గించుకునేలా పావులు కదుపుతున్నారు. సింగరేణి కార్మికులదే రామగుండం నియోజకవర్గంలో గోదావరిఖని పట్టణం, రామగుండం, పాలకుర్తి, అంతర్గాం మండలాలు ఉంటాయి. సింగరేణి కార్మికులు మొత్తం గోదావరిఖని 8 ఇంక్లైన్ కాలనీల్లో ఉంటారు. ఇక్కడ కార్మికుల కుటుంబాలు, మహిళా ఓటర్లు ఎక్కువ. సింగరేణి కార్మికులు యూనియన్ల పరంగా పోటాపోటీగా ఉంటాయి. కారుణ్య నియామకాలు, పేరు మార్పిడి జీఓ, బోనస్ లాంటి అంశాలు ఎన్నికలను ప్రభావితం చేస్తాయి. పింఛన్లు టీఆర్ఎస్కు అనుకూలమే. అయితే టీఆర్ఎస్ ఎమ్మెల్యే చందర్ అనుచరుల తీరు వల్ల కొంత ఇబ్బంది ఉంటుందనే చర్చ నడుస్తోంది. గతంలో ఎమ్మెల్యేగా తాను చేసిన అభివృద్ది కలిసి వస్తుందని బీజీపీ నేత సోమారపు భావిస్తున్నారు. చదవండి: పార్టీకి గుడ్‌బై! గులాం నబీ ఆజాద్‌పై కాంగ్రెస్ సీనియర్ నేతల సెటైర్లు ద్విముఖ పోటీనే మంథని నియోజకవర్గం పేరు వినగానే కాళేశ్వరం ప్రాజెక్టు గుర్తుకొస్తుంది. కాళేశ్వరం ప్రాజెక్టు ఈ నియోజక వర్గంలోనిదే. మహాదేవ్ పూర్ ప్రాంతం భూపాలపల్లి జిల్లాలోకి వెళ్లడంతో కాళేశ్వరం ఆలయం, మేడిగడ్డ బ్యారేజ్ లక్ష్మి పంపు హౌజ్ ఉన్న ప్రాంతాలు ఆ జిల్లా పరిధిలోకి వెళ్లాయి. పార్వతీ బ్యారేజ్ సరస్వతీ పంపు హౌజ్ మంథని నియోజక వర్గంలోనే ఉన్నాయి. ఎన్నికలు మరో ఏడాదిలో జరిగే అవకాశాలు కన్పిస్తుడంతో రాజకీయ నాయకులు ఇప్పటినుంచే సిద్ధమవుతున్నారు. అనేక ఏండ్లుగా ఇక్కడ ద్విముఖ పోటీనే ఎక్కువగా జరుగుతోంది. తెలంగాణ ఏర్పడిన తర్వాత టీఆర్ఎస్, కాంగ్రెస్ అభ్యర్థుల మధ్య గట్టి పోటీ కొసాగుతోంది. కానీ ఈసారి మారిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో త్రిముఖ పోటీ జరిగే అవకాశాలు కన్పిస్తున్నాయి. శ్రీధర్‌బాబుపై అసంతృప్తి మంథని నియోజకవర్గంలో శ్రీధర్ బాబు కాంగ్రెస్ తరపున మూడు సార్లు ఎన్నికయ్యారు. 2018 ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి పుట్ట మధుపై శ్రీధర్‌బాబు విజయం సాధించారు. నాటి నుంచి నియోజకవర్గంలో పర్యటిస్తూనే ఉన్నారు. అక్కడక్కడ అయనపై ఇంకా అసంతృప్తి కన్పిస్తోంది. కార్యకర్తల ఫోన్లు లిఫ్ట్ చేయరనే విమర్శలు ఎదుర్కొంటున్నారు శ్రీధర్‌బాబు. ఇక్కడ బీజేపీ అభ్యర్థిగా చందుపట్ల సునీల్ రెడ్డి పేరు ఖరారు చేసే అవకాశాలున్నట్లు చెబుతున్నారు. టీఆర్ఎస్ నుంచి బీజేపీలో చేరిన చందుపట్ల బీజేపీ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటూ అధిష్టానం దృష్టిలో వడినట్లు సమాచారం. పుట్టమధుపై ఆరోపణలు న్యాయవాది వామన్ రావు హత్య విషయంలో టీఆర్ఎస్నేత, జడ్పీ చైర్మన్ పుట్ట మధుపై తీవ్ర ఆరోపణలు వెల్లువెత్తాయి. తమ వద్దే ఉన్న కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల తమకు ఇబ్బందులే తప్ప ప్రయోజనం లేదని స్థానికులు భావిస్తున్నారు. ఈ రెండు అంశాలు గులాబీ పార్టీకి మైనస్‌అని భావిస్తున్నారు. పుట్ట మధు బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌కు సన్నిహితంగా ఉంటారనే టాక్ ఉంది. గులాబీ పార్టీ టికెట్ రాకపోతే పుట్ట మధు బీజేపీలోకి వెళ్ళవచ్చనే ప్రచారం కూడా జరుగుతోంది. రెండుసార్లు పట్టం వరుసగా రెండుసార్లు ఏ పార్టీని ఆదరించని పెద్దపల్లి ప్రజలు ఒక్క టీఆర్ఎస్కు మాత్రమే రెండుసార్లు పట్టం కట్టారు. టీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డికి కొంత ఇబ్బందికర వాతావరణం ఉన్నందున ఈసారి అధిష్టానం టికెట్ ఇవ్వదని కూడా జోరుగా ప్రచారం సాగుతోంది. టిక్కెట్ఇవ్వని పక్షంలో తాను ఇండిపెండెంట్‌గా బరిలో ఉంటానని మనోహర్ రెడ్డి చెబుతున్నట్లు సమాచారం. బండి సంజయ్ వర్గీయుడికి టికెట్? ఇక కాంగ్రెస్ నుంచి ఒకసారి గెలిచి రెండుసార్లు ఓడిపోయిన చింతకుంట విజయరమణారావు ఈసారయినా గెలిచి తీరాలనే పట్టుదలగా ఉన్నారు. అయితే ఆయనకు జిల్లా అధ్యక్షుడు ఈర్ల కొమురయ్య, ఓదెల ఎంపిపి గంట రాములు పక్కలో బల్లెంలా తయారయ్యారని టాక్. పెద్దపల్లిలో పోటీలో ఉండే కమలనాధులెవరనే ప్రశ్న వినిపిస్తోంది. మాజీ ఎమ్మెల్యే గుజ్జుల రామకృష్ణారెడ్డికి ఈసారి టికెట్ అనుమానమేనంటున్నారు. బండి సంజయ్ వర్గీయుడు ప్రదీప్ రావుకు పెద్దపల్లి టికెట్ ఇవ్వచ్చని సమాచారం. 100 కోట్ల ఆదాయం వస్తున్నా అభివృద్ధి సున్నా దక్షిణ కాశీగా పేరు గాంచిన వేములవాడ రాజ రాజేశ్వర స్వామి కొలువై ఉన్న నియోజక వర్గ కేంద్రం అది. ఏడాదికి 100 కోట్ల ఆదాయం వస్తున్నా రాజన్న ఆలయం అభివృద్ధి కాలేదు. నియోజక వర్గం కూడా ఆశించిన స్థాయిలో అభివృద్ధి చెందలేదు. స్వయానా సీఎం కేసీఆర్ ప్రకటించిన టెంపుల్ మాస్టర్ ప్లాన్ కూడా అమలుకు నోచుకోవడం లేదు. ఇక్కడ 2009 నుంచి చెన్నమనేని రమేష్ బాబు గెలుస్తూ వస్తున్నారు. రమేష్ బాబుకు జర్మనీ పౌరసత్వం ఉండేది. దీనిపై కాంగ్రెస్ నేత ఆది శ్రీనివాస్ ఫిర్యాదు చేయడంతో కోర్టులోను, కేంద్ర హోమ్ శాఖ ఆధ్వర్యంలో కూడా విచారణ జరుగుతోంది. పోటీలోకి మాజీ గవర్నర్ కొడుకు! సీనియర్ కాంగ్రెస్ నేత చల్మెడ లక్ష్మీ నరసింహా రావు టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. వచ్చే ఎన్నికల్లో వేములవాడ టీఆర్ఎస్ టికెట్ చల్మెడకే అనే టాక్ వినిపిస్తోంది. మున్నూరు కాపు రాష్ట్ర అధ్యక్షునిగా ఉన్న కొండ దేవయ్య కూడా టీఆర్ఎస్ టికెట్ ఆశిస్తున్నారు. ఇక బీజేపీ నుంచి మహారాష్ట్ర గవర్నర్‌గా పనిచేసిన సీహెచ్. విద్యాసాగర్ రావు కొడుకు వికాస్ పోటీకి రెడీ అవుతున్నట్టు తెలుస్తోంది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కూడా పోటీ చేయవచ్చని ప్రచారం జరుగుతోంది. కాంగ్రెస్ నుంచి ఆది శ్రీనివాస్ మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్ధం అవుతున్నారు. సిరిసిల్లలో నేత కార్మికులకు చేతి నిండా పని సిరిసిల్ల అనగానే చేనేత.. సీనియర్ ఎమ్మెల్యే చెన్నమనేని రాజేశ్వరావు గుర్తుకు వస్తారు. ఇప్పుడు మంత్రి కేటీఆర్ పేరు వినగానే సిరిసిల్ల గుర్తుకు వచ్చే పరిస్తితి వచ్చింది. చెన్నమనేని రాజేశ్వరావు లాగే కేటీఆర్ కూడా సిరిసిల్లలో నాలుగు సార్లు గెలుపొందారు. ఐదోసారి కూడా విజయకేతనం ఎగరేయడానికి సిద్ధంగా ఉన్నారు కేటీఆర్. కేటీఆర్ టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ కమిటీ ప్రెసిడెంట్‌తోపాటు మంత్రి కావడం, ముఖ్యమంత్రి కుమారుడు కావడం సిరిసిల్లకు కలిసి వచ్చింది. ఎన్నడూ లేని విధంగా సిరిసిల్లలో నేత కార్మికులకు చేతి నిండా పని దొరుకుతోంది. సిరిసిల్లలో చాలా అభివృద్ధి పనులు కేటీఆర్ ఆధ్వర్యంలో జరిగాయి. ఈసారి కూడా కేకేనే సిరిసిల్ల టీఆర్ఎస్ ద్వితీయ శ్రేణి నాయకుల్లో కుమ్ములాటలు జనాల్లో పార్టీకి చెడ్డపేరు తెస్తోంది.. నాయకుల మధ్య ఐక్యత లేకపోవడం ఇబ్బందికరంగా మారింది. 2009లో ఇండిపెండెంట్‌గా పోటీ చేసిన కకేకే మహేందర్‌రెడ్డి 171 ఓట్ల స్వల్ప తేడాతో కేటీఆర్ చేతిలో ఓడిపోయారు. 2014లో కాంగ్రెస్తరపున పోటీచేసినా ఓడారు. కేకేకు కాంగ్రెస్ నేతల నుంచి సహాయ నిరాకరణ కొనసాగుతూనే ఉంది. ఈసారి కూడా కేకే మహేందర్ రెడ్డినే పోటీకి సిద్ధం అవుతున్నారని తెలుస్తోంది. ఇక సిరిసిల్లలో బీజేపీ పుంజుకుంటోంది. ఈసారి బీజేపీ తరపున మృత్యుంజయం లేదా జిల్లా ఉపాధ్యక్షుడు రెడ్డబోయిన గోపి పోటీ చేస్తారని తెలుస్తోంది. -
ఎన్నికల నియమావళి పాటించాలి
జ్యోతినగర్: అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులు ఎన్నికల కమిషన్ విడుదల చేసిన నియమావళిని తప్పక పాటించాలని, లేనిచో చర్యలు తప్పవని రామగుండం అసెంబ్లీ నియోజకవర్గ ఎన్నికల రిటర్నింగ్ అధికారి కె.నర్సింహమూర్తి పేర్కొన్నారు. శుక్రవారం రామగుండం ఎన్టీపీసీ టెంపరరీ టౌన్‌షిప్‌లోని ప్రభుత్వ జిల్లా ప్రజా పరిషత్ హౌస్కూల్ ఆవరణలోని రిటర్నింగ్ కార్యాలయ హాలులో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల నియమావళి, నామినేషన్ సమర్పించే సమయంలో పాటించే నియమ, నిబంధనల గురించి వివరించారు. రిటర్నింగ్ అధికారి కార్యాలయం నుంచి వంద మీటర్ల పరిధిలోకి మూడు వాహనాలను మాత్రమే అనుమతించనున్నట్లు తెలిపారు. బీ–ఫాం, ఏ–ఫాం అందిస్తేనే పార్టీ చిహ్నం కేటాయిస్తామని స్పష్టం చేశారు. నామినేషన్ పత్రంలోని పార్ట్–1, 2, 3, 3ఏ, 4, 5, 6, అంశాలను పూర్తిగా చదివిన తర్వాతే దరఖాస్తు పూరించాలని చెప్పారు. అలాగే పార్ట్–ఏ, బీ ఫాంలోని ఖాళీలను క్షుణ్ణంగా చదువుకుని పూరించాలని, ప్రతీ ప్రశ్నకు సమాధానం ఇవ్వాలని, ఒకవేళ ఖాళీగా ఉంచితే దరఖాస్తులు తిరస్కరణకు గురయ్యే అవకాశాలు ఉన్నాయని స్పష్టం చేశారు. అభ్యర్థి నామినేషన్ వేసిన నాటి నుంచే అతని ప్రచార ఖర్చు లెక్కింపు జరుగుతుందని వెల్లడించారు. ఎన్నికల కమిషన్ నియమావళి ప్రకారం అసెంబ్లీ ఎన్నికల పోటీలో ఉండే అభ్యర్థి రూ.28 లక్షల లోపు ఖర్చు చేసేందుకు అనుమతులు ఉన్నాయన్నారు. ఎన్నికలు ముగిసిన నెలలోపు ఖర్చుల వివరాలను కలెక్టర్ కార్యాలయంలో అందించాలని వివరించారు. ప్రచారం ఉదయం 6 నుంచి రాత్రి 10 గంటల వరకు చేసుకోవాలని, మైక్ మాత్రం ఉదయం 8 నుంచి రాత్రి వరకు తక్కువ ధ్వనితో ప్రచారం చేసుకోవచ్చని అవగాహన కల్పించారు. సమావేశంలో రామగుండం తహశీల్దార్ హనుమంతరావు, డిప్యూటీ తహశీల్దార్ సురేశ్, ఆర్ఐ రాజేంద్రప్రసాద్, వీఆర్వోలు అజయ్, మల్లేశం, రాజకీయ పార్టీలకు చెందిన బల్మూరి అమరేందర్‌రావు, జక్కుల నరహరి, మహావాదా రామన్న, రాజేందర్, అశోక్, కోటేశ్వరరావు స్వతంత్ర అభ్యర్థులతోపాటు తదితరులు పాల్గొన్నారు. -
స్వతంత్రుల జోరు
ఆనవాయితీగా ఆ రెండు సెగ్మెంట్లలో ఇండిపెండెంట్లదే హవా కొనసాగుతోంది. ఈసారి కూడా అక్కడ బరిలో ఉన్న స్వతంత్రులు ప్రధాన పార్టీల అభ్యర్థులకు ముచ్చెమటలు పుట్టిస్తున్నారు. హోరాహోరీగా ప్రచారంలో తలపడుతున్నారు. జిల్లాలోని మొత్తం అసెంబ్లీ స్థానాల్లో 60 మంది ఇండిపెండెంట్లు, లోక్‌సభ స్థానాల్లో 11 మంది ఇండిపెండెంట్లు పోటీలో ఉన్నారు. వీరిలో ఎక్కువ మంది నామ్‌కే వాస్తేగా బరిలో నిలిచినప్పటికీ... రామగుండం, కోరుట్ల నియోజకవర్గాల్లో స్వతంత్రుల పోరు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. సాక్షి ప్రతినిధి, కరీంనగర్ : రామగుండం నియోజకవర్గంలో ప్రధాన పార్టీలకు మించి ఇండిపెండెం ట్ల ప్రచారం హోరెత్తుతోంది. ప్రధాన పార్టీ ల టిక్కెట్లు ఆశించి భంగపడ్డ నేతలు నలుగురు అక్కడ ఇండిపెండెంట్లుగా పోటీలో ఉండటం గమనార్హం.కాంగ్రెస్ రెబల్‌గా కౌశిక హరి, టీఆర్ఎస్ టిక్కెట్టు ఆశించిన కోరుకంటి చందర్, ఇటీవలే టీడీపీని వీడిన గోపు ఐలయ్యయాదవ్, వైఎస్సార్సీపీని వీడిన మక్కాన్‌సింగ్ అక్కడ ప్రధాన పార్టీలకు ధీటుగా ఎన్నికల్లో తలపడుతున్నారు.ఈ నియోజకవర్గంలో ఇండిపెండెంట్లను గెలిపించే ఆనవాయితీ ఉండటంతో.. ఇక్కడి పోటీ ఉత్కంఠ రేపుతోంది. 2009 ఎన్నికలోనూ ఇక్కడి ఓటర్లు ఇండిపెండెంట్ అభ్యర్థికి పట్టం కట్టారు. ఆఖరి నిమిషంలో టీడీపీ టిక్కెట్టు తెచ్చుకున్న సోమారపు సత్యనారాయణ గడువులోగా బీ ఫారమ్ సమర్పించకపోవటంతో టీవీ గుర్తుపై ఇండిపెండెంట్‌గా పోటీలో నిలిచి విజయం సాధించారు. పునర్విభజనకు ముందు ఉన్న మేడారం (ఎస్సీ), కొత్తగా ఏర్పడ్డ రామగుండం నియోజకవర్గానికి ఇప్పటివరకు మొత్తం 12సార్లు ఎన్నికలు జరిగితే మూడుసార్లు స్వతంత్ర అభ్యర్థులు విజయం సాధించారు. 1962లో స్వతంత్ర అభ్యర్థి ఎం.రాంగోపాల్‌రెడ్డి, 1994లో టీడీపీ టిక్కెట్ దక్కకపోవటంతో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన గని కార్మికుడు మాలెం మల్లేశంను ఇక్కడి ఓటర్లు గెలిపించారు. దీంతో ఇక్కడ ఇండిపెండెట్ల పోటీ ప్రధాన పార్టీలకు సవాలు విసురుతోంది. తెలంగాణ ఉద్య మ సమయంలో టీఆర్ఎస్లో చేరిన సి ట్టింగ్ ఎమ్మెల్యే సోమారపు సత్యనారాయణ ఈసారి పార్టీ అభ్యర్థిగా బరిలో ఉన్నారు. గత ఎన్నికల్లో ఆయనతో పోటాపోటీ పడ్డ ప్రత్యర్థులిద్దరూ ఈసారి ఇండిపెండెట్లుగా బరిలో నిలువటం గమనా ర్హం. అప్పటి పీఆర్పీ ప్రత్యర్థి కౌశికహరి, టీఆర్ఎస్ అభ్యర్థి కోరుకంటి చందర్ ఈ సారి ఇండిపెండెంట్లుగా పోటీలో ఉన్నా రు. వీరికి తోడు కాంగ్రెస్ అ భ్యర్థి బాబ ర్‌సలీంపాషా, బీజేపీ తరఫున గుజ్జుల రామకృష్ణారెడ్డి తలపడుతున్నారు. కోరుట్లలోనూ ఇండిపెండెంట్ల ప్రభావం ఆసక్తి రేపుతోంది. పునర్విభజనకు ముందు మెట్పల్లి అసెంబ్లీ సెగ్మెంట్ పరిధిలో 1952 నుంచి 13సార్లు, కోరుట్ల సెగ్మెంట్లో రెండుసార్లు ఎన్నికలు జరిగాయి. మెట్పల్లి సెగ్మెంట్లో రెండుసార్లు స్వతంత్ర అభ్యర్థులు ఎన్నికయ్యారు. బుగ్గారం సెగ్మెంట్లో 12సార్లు ఎన్నికలు జరిగితే నాలుగుసార్లు ఇండిపెండెంట్ అభ్యర్థులు గెలుపొందారు. మెట్పల్లిలో 1952లో స్వతంత్ర అభ్యర్థి గంగుల భూమయ్య, 1967లో సీహెచ్.సత్యనారాయణరావు ఇండిపెండెంట్‌గా పోటీ చేసి గెలుపొందారు. బుగ్గారం నియోజకవర్గంలో 1957లో ఇండిపెండెంట్‌గా పోటీ చేసిన మోహన్‌రెడ్డి, 1962లో ఏనుగు నారాయణరెడ్డి, 1972లో గెలిచిన జె.దామోదర్‌రావు ఇండిపెండెట్లుగా పోటీ చేసినవారే. 1989లో కాంగ్రెస్ టికెట్ ఆశించి భంగపడ్డ జువ్వాడి రత్నాకర్‌రావు స్వతంత్రునిగా పోటీకి దిగి.. టీడీపీ అభ్యర్థి వెంకటేశ్వరరావుపై విజయం సాధించారు. తండ్రి తరహాలోనే ఈసారి కాంగ్రెస్ టిక్కెట్టు ఆశించి భంగపడ్డ జువ్వాడి తనయుడు నర్సింగరావు ఇండిపెండెంట్‌గా పోటీకి నిలిచారు. అక్కడ పోటీలో ఉన్న ప్రధాన అభ్యర్థులతో సమ ఉజ్జీగా ఎన్నికల్లో తలపడుతున్నారు. కోరుట్లలో కాంగ్రెస్ నుంచి కొమిరెడ్డి రాములు, టీఆర్ఎస్ అభ్యర్థిగా సిట్టింగ్ ఎమ్మెల్యే విద్యాసాగర్‌రావు, బీజేపీ అభ్యర్థి సురభి భూంరావు పోటీలో ఉన్నారు. -
తిరుగుపోట్లు
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: సార్వత్రిక ఎన్నికల పోటాపోటీ ముఖచిత్రం ఆవి ష్కృతమైంది. నామినేషన్ల ఘట్టం ముగియటంతో ఎక్కడెక్కడ ఎవరెవరు తలపడుతున్నారో తేలిపోయింది. జిల్లాలోని రెండు లోక్‌సభ స్థానాలకు 34 మంది పోటీలో మిగిలారు. కరీంనగర్, పెద్దపల్లి లోక్‌సభ స్థానాల్లో చెరి స మంగా 17 మంది పోటీలో ఉన్నారు. జిల్లాలోని 13 అసెంబ్లీ నియోజకవర్గా ల్లో 168 మంది అభ్యర్థులు అమీతుమీకి సిద్ధమయ్యారు. అత్యధికంగా రామగుండం నియోజకవర్గంలో 27 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. అతి తక్కువగా మంథని, హుజూరాబాద్‌లో తొమ్మిది మంది చొప్పున బరిలో ఉ న్నారు. ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, టీఆర్ఎస్ అన్ని స్థానాల్లో పోటీ పడుతున్నాయి. పొత్తులో భాగంగా బీజేపీ, టీడీపీ చెరో ఆరు స్థానాల్లో బరిలో నిలి చింది. తొలిసారిగా వైఎస్సార్సీపీ పదకొండు అసెంబ్లీ స్థానాల్లో తలపడుతోం ది. మంథని, రామగుండం మినహా అన్ని చోట్ల పార్టీ అభ్యర్థులు పోటీలో ఉ న్నారు. అన్ని సెగ్మెంట్లలో మేమున్నాం.. అన్నట్లుగా స్వతంత్య్ర అభ్యర్థులు సై తం హడలెత్తిస్తున్నారు. అసెంబ్లీ స్థానాల్లో 60 మంది ఇండిపెండెంట్లు, లోక్‌సభ స్థానాల్లో 11 మంది ఇండిపెండెంట్లు పోటీలో ఉన్నారు. నోటాతో పాటు 15మందికి మించి అభ్యర్థులు పోటీపడుతున్న నియోజకవర్గాల్లో పోలింగ్ ని ర్వహణకు రెండు ఈవీఎంలు వాడాల్సి ఉంటుంది.కరీంనగర్, పెద్దపల్లి ఎంపీ ఎన్నికలతో పాటు చొప్పదండి,రామగుండంలో ఈ పరిస్థితి అనివార్యమైంది. బుజ్జగింపులు ఫలించక పోవటంతో నాలుగు సెగ్మెంట్లలో తిరుగుబాటు అభ్యర్థులు ప్రధాన అభ్యర్థులకు పక్కలో బల్లెంలా మారారు. కోరుట్లలో కాంగ్రెస్ రెబెల్‌గా మాజీ మంత్రి జువ్వాడి రత్నాకర్‌రావు కుమారుడు నర్సింగరావు, మంథనిలో టీఆర్ఎస్ రెబెల్‌గా సునీల్‌రెడ్డి పోటీకి నిలిచారు. కోరుట్లలో టీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యే విద్యాసాగర్‌రావు, కాంగ్రెస్ అభ్యర్థి కొమ్‌రెడ్డి రాములు, బీజేపీ అభ్యర్థి సురభి భూంరావు, వైఎస్సార్సీపీ అభ్యర్థి సంతోష్‌రెడ్డితోపాటు జువ్వాడి బరిలో ఉండటంతో పంచముఖ పోటీ నెలకొంది. మంథనిలో మాజీ మంత్రి, కాంగ్రెస్ అభ్యర్థి శ్రీధర్‌బాబు, టీఆర్ఎస్ అభ్యర్థి పుట్ట మధు, రెబెల్ అభ్యర్థి సునీల్‌రెడ్డి, టీడీపీ అభ్యర్థి కర్రు నాగయ్యల మధ్య చతుర్ముఖ పోటీ నెలకొంది. రామగుండంలో రెండు పార్టీలకు తిరుగుపోటు తప్పలేదు. కాంగ్రెస్ రెబెల్‌గా కౌశిక హరి, టీఆర్ఎస్ రెబెల్‌గా కోరుకంటి చందర్ పోటీలో నిలిచారు. దీంతో రామగుండంలో బహుముఖ పోటీ అనివార్యమైంది. మానకొండూరులో టీడీపీ-బీజేపీ పొత్తు చిత్తయింది. సర్దుబాటులో ఈ సీటు టీడీపీకి అప్పగించినప్పటికీ.. బీజేపీ తరఫున ఆ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జీ గడ్డం నాగరాజు రెబెల్‌గా పోటీకి నిలిచారు. నామినేషన్ల సమయంలో జరిగిన పొరపాటుతో హుస్నాబాద్‌లో మిత్రపక్షాలు పోటీకి దూరమయ్యాయి. అక్కడ కాంగ్రెస్, టీఆర్ఎస్, వైఎస్సార్సీపీల మధ్య త్రిముఖ పోటీ నెలకొంది. కాంగ్రెస్ సిట్టింగ్ ఎమ్మెల్యే అల్గిరెడ్డి ప్రవీణ్‌రెడ్డి, టీఆర్ఎస్ తరఫున సతీష్‌బాబు, వైఎస్సార్సీపీ నుంచి పార్టీ జిల్లా అధ్యక్షుడు సింగిరెడ్డి భాస్కర్‌రెడ్డి తలపడుతున్నారు. కరీంనగర్, పెద్దపల్లి లోక్‌సభ స్థానాల్లో సిట్టింగ్ ఎంపీలు పొన్నం ప్రభాక ర్, డాక్టర్ వివేక్ కాంగ్రెస్ తరఫున మరోసారి పోటీకి దిగారు. టీఆర్ఎస్ అ భ్యర్థి బోయినపల్లి వినోద్‌కుమార్, బీజేపీ నుంచి మాజీ మంత్రి విద్యాసాగర్‌రావు,వైఎస్సార్సీపీ అభ్యర్థి మీసాల రాజిరెడ్డి పొన్నంతో తలపడుతున్నారు.పెద్దపల్లిలో టీఆర్ఎస్ అభ్యర్థి బాల్క సుమన్, టీడీపీ అభ్యర్థి డాక్టర్ శరత్ తొలిసారి ఎన్నికలు ఎదుర్కుంటున్నారు. వివేక్‌తో త్రిముఖ పోటీ అయింది.