గోదావరిఖని: రామగుండం నియోజకవర్గానికి చెందిన కీలక నేత, మాజీ ఎమ్మెల్యే సోమారపు సత్యనారాయణ కారెక్కనున్నట్లు తెలుస్తోంది. మంగళవారం హైదరాబాద్‌లో ఆయన మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావుతో వేర్వేరుగా భేటీ అయినట్లు సమాచారం. తనకు పార్టీ టికెట్ ఇస్తే కచ్చితంగా గెలుస్తానని.. ప్రస్తుతం పోటీలో ఉంటున్న నాయకుడికి ఎమ్మెల్సీ పదవి ఇవ్వాలని సోమారపు ప్రతిపాదించినట్లు తెలిసింది.
కొద్దిరోజుల క్రితం కాంగ్రెస్ ఎమ్మెల్యే టికెట్ కోసం ఢిల్లీ వెళ్లిన ఆయనకు.. పార్టీ అధిష్టానం నుంచి సానుకూల సాంకేతాలు రాలేదు. దీంతో నియోజకవర్గానికి చేరుకొని స్వతంత్ర అభ్యర్థిగా బరిలో దిగేందుకు సిద్ధమయ్యారు. అందుకు అనుగుణంగా ప్రచారం కూడా చేపట్టారు. ఆయన మంగళవారం అకస్మాత్తుగా ప్లేట్ ఫిరాయించినట్లు ప్రచారం జరుగుతోంది. అయితే బీఆర్‌ఎస్ మాత్రం ఆ నాయకుడికి ఎమ్మెల్సీ ఇచ్చేందుకు సుముఖత వ్యక్తం చేసినట్లు చెబుతున్నారు.
కాంగ్రెస్, టీడీపీ,బీఆర్‌ఎస్, బీజేపీ.. మళ్లీ బీఆర్‌ఎస్..
1998లో జరిగిన రామగుండం మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా రాజకీయ అరంగేట్రం చేసిన సోమారపు... ఆ తర్వాత 2004 అసెంబ్లీ ఎన్నికల్లో మంథని టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడారు. అటునుంచి తిరిగి కాంగ్రెస్‌లో చేరి 2009 అసెంబ్లీ ఎన్నికల్లో రామగుండం నుంచి గెలుపొందారు. తెలంగాణ రాష్ట్ర ఉద్యమ నేపథ్యంలో బీఆర్‌ఎస్ (నాటి టీఆర్‌ఎస్)లో చేరి 2014 అసెంబ్లీ ఎన్నికల్లో రామగుండం నుంచి మళ్లీ గెలిచారు.
కానీ 2018 ఎన్నికల్లో మాత్రం ఓటమిపాలయ్యారు. అనంతరం బీజేపీలో చేరారు. ఆ తర్వాత బీజేపీకి రాజీనామా చేసి ఇండిపెండెంట్‌గా బరిలో ఉంటానని ప్రకటించారు. ఆ తర్వాత కొద్దిరోజులకే ఢిల్లీకి వెళ్లి కాంగ్రెస్ నేతలను కలిశారు. ఎమ్మెల్యే టికెట్‌పై కాంగ్రెస్ నుంచి గ్రీన్‌సిగ్నల్ రాకపోవడంతో మళ్లీ ఇండిపెండెంట్‌గా బరిలో ఉంటూ ప్రచారం చేశారు. మంగళవారం అకస్మాత్తుగా హైదరాబాద్ వెళ్లి బీఆర్‌ఎస్ అధిష్టానంతో చర్చలు జరిపారు.
Comments
Please login to add a commentAdd a comment